ఇంటర్వ్యూలో వారికి వెయిటేజీ
ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో 51 వేల పోస్టుల భర్తీతోపాటు అంతకు ముందు 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తి చేసిన విషయాన్ని సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఇదే తరహాలో వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలను కూడా వేగంగా, సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూటికి నూరుశాతం మెరిట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా ఇంటర్వ్యూ సమయంలో కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోద ముద్ర వేశారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు అధ్యాపక సిబ్బంది నియామకాల్లో అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అధ్యాపకుల నియామకాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదించగా ఒకే రిక్రూట్‌మెంట్‌లో చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుండగా నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది.
ఏపీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా..
వర్సిటీల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి షెడ్యూల్, పరీక్షా విధానంపై అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆగస్టు 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబరు 3, 4వ వారాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 10వతేదీ నాటికి ఫలితాలను ప్రకటించి ఆ తర్వాత నెల రోజుల్లోగా ఇంటర్వ్యూలు చేపట్టాలని నిర్ణయించారు.
నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఆర్) చిరంజీవి చౌదరి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సెక్రటరీ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment