Professor Posts
-
వైద్య కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,356 అధ్యాపక పోస్టులను కాంట్రాక్టు, గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. 3,155 పోస్టులను కాంట్రాక్టు, 1,201 పోస్టులను గౌరవ వేతనం పద్ధతిలో భర్తీ చేయనుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్ 412, సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 1,201 భర్తీ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఏడాది కాలానికి వీరిని నియమిస్తారు. మెడికల్ కాలేజీల్లో జాతీ య మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు చేయనున్నందున పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయా లజీ, ఫోరెన్సిక్ మెడిసిన్,కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, ఆర్ధోపెడిక్స్, గైనకాలజీ, రేడియాలజీ, అనెస్థీషియా, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. స్థానికులకు ప్రాధాన్యత ఈ నెల 16వ తేదీన ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ప్రొఫెసర్ పోస్టుకు 8 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెల వేతనం రూ.1.90 లక్షలు కాగా, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీనియర్ రెసిడెంట్‌కు రూ.92,575, ట్యూటర్కు రూ.55 వేలు ఇవ్వనున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చు. అయితే స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులు లేనప్పుడు ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయస్సు ఈ నెల 31వ తేదీ నాటికి 69 ఏళ్లకు మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాహసోపేత నిర్ణయం: మంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, సిబ్బంది కొరతను తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఏటా రూ.634 కోట్ల అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. -
త్వరలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతంగా తీర్చిదిద్ది, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టుల భర్తీకి కూడా సంకల్పించారు. ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండేలా ఏకీకృత హేతుబద్ధీకరణ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం 16 వర్సిటీల్లో 3,480 పోస్టులను మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 474 ప్రొఫెసర్, 859 అసోసియేట్ ప్రొఫెసర్, 2,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్సిటీల్లో 2,635 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ల పోస్టుల భర్తీని ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టనుంది. ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు కూడా వర్సిటీలు ఇంటర్వ్యూలు చేసి, ఎంపిక చేస్తాయి. త్వరలోనే ప్రత్యేక పోర్టల్‌లో వర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అభ్యర్థులు వాటిని చూసుకొని నచ్చిన వాటికి పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా సమయం ఆదాతో పాటు దరఖాస్తు రుసుము తగ్గుతుంది. వర్సిటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వెయిటేజీనీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని చంద్రబాబు చంద్రబాబు పాలనలో ఏనాడూ వర్సిటీలను పట్టించుకోలేదు. ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోగా వర్సిటీల్లో కుల రాజకీయాలను ప్రోత్సహించి భ్రష్టుపట్టించారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా పోస్టుల హేతుబద్ధీకరణకు కమిటీని నియమించారు. యూజీసీ నిబంధనలను గాలికొదిలేసి, అనుయాయులకు మేలు చేసేలా అశాస్త్రీయ పద్ధతిలో హేతుబద్ధీకరణ చేశారు. వర్సిటీలను సంప్రదించకుండా, వాటి అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. కొన్ని చోట్ల అవసరానికి మించి ఎక్కువ పోస్టులు చూపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు పోస్టుల స్థాయి తగ్గించేశారు. వర్సిటీ యూనిట్‌గా కాకుండా సబ్జెక్టులవారీగా పోస్టులను హేతుబద్ధీకరించడంతో చాలా మంది నష్టపోయారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పూర్తిగా విస్మరించారు. ఈ అవకతవకలతో నష్టపోయిన వారు కోర్టుల్లో కేసులు వేశారు. పనిభారం, కేడర్ నిష్పత్తి ప్రకారం.. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్సిటీల పునరుజ్జీవానికి చర్యలు చేపట్టారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేశారు. అనంతరం వర్సిటీల్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున శాశ్వత పోస్టుల భర్తీని చేపట్టారు. వర్సిటీల్లో పని భారం, కేడర్ నిష్పత్తికి అనుగుణంగా ఫ్యాకల్టీని ప్రభుత్వం హేతుబద్ధీకరించింది. ఇందుకోసం జేఎన్టీయూ–అనంతపురం మాజీ వీసీ ప్రొఫెసర్ కె.లాల్ కిషోర్ అధ్యక్షతన ఐదుగురితో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీల్లో అన్ని విభాగాల పనితీరును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, యూజీసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పోస్టులపై మార్గదర్శకాలను రూపొందించింది. వర్సిటీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం విభాగాలవారీగా పోస్టుల హేతుబద్ధీకరణకు సిఫారసు చేసింది. ఈ పోస్టులు తప్పనిసరి బోధన పోస్టులతోపాటు ప్రతి వర్సిటీలో అకడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ డైరెక్టర్/డిప్యూటీ డైరెక్టర్/ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్, అసిస్టెంట్ లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్/వర్శిటీ లైబ్రేరియన్, ప్లేస్మెంట్ ఆఫీసర్, నాక్ గుర్తింపులో కీలక భూమిక పోషించే ఐక్యూఏసీ డైరెక్టర్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ పోస్టులు తప్పనిసరిగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
3,295 ప్రొఫెసర్ పోస్టులు 3 నెలల్లో భర్తీ ‘ఉన్నత’ అధ్యాయం
ఇంటర్వ్యూలో వారికి వెయిటేజీ ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో 51 వేల పోస్టుల భర్తీతోపాటు అంతకు ముందు 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తి చేసిన విషయాన్ని సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఇదే తరహాలో వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలను కూడా వేగంగా, సమర్థంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూటికి నూరుశాతం మెరిట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించగా ఇంటర్వ్యూ సమయంలో కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోద ముద్ర వేశారు. ఉన్నత విద్యలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉత్తమ ఫలితాల సాధనకు వర్సిటీల్లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు అధ్యాపక సిబ్బంది నియామకాల్లో అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో అధ్యాపకుల నియామకాలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్సిటీల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులతో పాటు ట్రిపుల్ ఐటీల్లో 660 లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదించగా ఒకే రిక్రూట్మెంట్లో చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ఆగస్టు 23వ తేదీన ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుండగా నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. ఏపీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా.. వర్సిటీల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి షెడ్యూల్, పరీక్షా విధానంపై అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ఆగస్టు 23వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబరు 3, 4వ వారాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 10వతేదీ నాటికి ఫలితాలను ప్రకటించి ఆ తర్వాత నెల రోజుల్లోగా ఇంటర్వ్యూలు చేపట్టాలని నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి మొత్తం నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సెక్రటరీ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల్లో 147 ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 147 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ మెడికల్ కమి షన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు.. 69 ఏళ్ల వయసున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి నోటిఫికే షన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అదే రోజున తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపికైనవారు ఈ నెల 23వ తేదీ నాటికి ఆయా చోట్ల చేరాల్సి ఉంటుంది. ఏడాది పాటు ఆయా కాలేజీలు, ఆస్పత్రుల్లో ప్రొఫె సర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికలో తెలంగాణకు చెందినవారికి ప్రాధాన్యమిస్తారు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థుల వయసు 69 ఏళ్లు దాటకూడదు. రూ. లక్షా 90 వేల వరకు వేతనం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.50 వేలు వేత నం ఇస్తారు. మిగతా విభాగాల అసోసియేట్ ప్రొఫె సర్లకు రూ.లక్షన్నర, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు ఇస్తారు. ఇవి కాంట్రాక్టు నియామకాలు కావడం వల్ల.. ఆయా పోస్టులకు ప్రమోషన్లు, రెగ్యులర్ నియామకాలు జరిగితే వీరిని తొలగిస్తారు. అనాట మీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున భర్తీ చేస్తారు. ఫిజియాలజీలో 9 ప్రొఫె సర్, ఏడు అసోసియేట్ ప్రొఫెసర్.. బయోకెమి స్ట్రీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున.. ఫార్మకాలజీలో ఏడు అసోసియేట్, పాథాలజీలో 9 అసోసియేట్, మైక్రోబయాలజీలో ఏడు అసోసియేట్, జనరల్ మెడిసిన్‌లో 9 ప్రొఫె సర్, డెర్మటాలజీలో 4 అసోసియేట్, సైకియాట్రీలో 9 అసోసియేట్, రెస్పిరేటరీ మెడిసిన్‌లో ఐదు అసోసియేట్, జనరల్ సర్జరీలో 9 ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్‌లో 9 అసోసియేట్, గైనకాలజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 9 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో ఏడాదిపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకోసం ఈ నెల 9వ తేదీన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. ఎంపికైనవారి జాబితాను 12వ తేదీన విడుదల చేస్తారు. 19వ తేదీన వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ పోస్టులకోసం దేశంలోని ఏ ప్రాంతంలోవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. 17 విభాగాలకు సంబంధించిన స్పెషలిస్టులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. మొత్తం పోస్టుల్లో అనాటమీ ప్రొఫెసర్ ఒకటి, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఆరు ఉన్నాయి. ఫిజియాలజీలో ప్రొఫెసర్ మూడు, అసోసియేట్ 10 పోస్టులు ఉన్నాయి. ఫార్మకాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్లకు 10 పోస్టులున్నాయి. పాథాలజీలో 13 అసోసియేట్, మైక్రోబయాలజీలో ప్రొఫెసర్ 7, అసోసియేట్ 10 ఉన్నాయి. ఫోరెన్సిక్లో ప్రొఫెసర్ 7, అసోసియేట్ 16, కమ్యూనిటీ మెడిసిన్‌లో ప్రొఫెసర్ 4, అసోసియేట్ ప్రొఫెసర్ 15 పోస్టులు ఉన్నాయి. ఈఎన్టీలో ప్రొఫెసర్ 4, ఆప్తమాలజీ ప్రొఫెసర్ 7, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ 8, రెస్పిరేటరీ మెడిసిన్‌లో ప్రొఫెసర్ 7, అసోసియేట్ 4 ఉన్నాయి. జనరల్ సర్జరీలో ప్రొఫెసర్ 7, డెర్మటాలజీ ప్రొఫెసర్ 6, సైకియాట్రీ ప్రొఫెసర్ 5, అసోసియేట్ 8 ఉన్నాయి. ఆర్థోపెడిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ 1, రేడియో డయోగ్నసిస్ ప్రొఫెసర్ 7, ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ 8, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 8 ఉన్నాయి. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల అభ్యర్థులను తీసుకుంటారు. నోటిఫికేషన్ విడుదల తేదీనాటికి దరఖాస్తుదారు వయసు 69 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. ఏదైనా ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న అభ్యర్థులు అదే కేడర్‌లోని కాంట్రాక్టు పోస్టుకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు ఇస్తారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ. 50 వేలు వేతనం ఇస్తారు. -
జేఎన్టీయూహెచ్లో అధ్యాపకుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో 186 అధ్యాపకుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాగా, మిగిలిన 154 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ కానున్నాయి. జేఎన్టీయూహెచ్ హెడ్‌క్వార్టర్స్‌తోపాటు హైదరాబాద్, జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ లో భాగంగా ఈ నియామకాలను చేపట్టను న్నారు. జేఎన్టీయూహెచ్లో మొత్తం 410 అధ్యాపక పోస్టులుండగా, తాజాగా ఖాళీల సంఖ్య 260కు పెరిగిందని జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఖాళీలు 186గా ఉన్నప్పుడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఆ తర్వాత జరిగిన పదవీ విరమణలతో ఈ సంఖ్య 260కు పెరిగిందన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఈ ఖాళీలు భర్తీ చేస్తా మన్నారు. ఈ నెల 26న జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియంలో సాయంత్రం 3 గంటలకు వర్సిటీ స్నాతకోత్సవం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. స్నాతకోత్సవంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ యూబీ దేశాయ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు 721 మంది ఎంపికయ్యారన్నారు. మైక్రోసాప్ట్, ఐబీఎం వంటి 52 కంపెనీలు క్యాంపస్ నియామకాల్లో పాల్గొన్నాయని చెప్పారు. -
ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై నీలినీడలు
–పొంతన లేని అంశాలతో చిక్కులు వేసే యత్నంలో ప్రభుత్వం - జేఎన్టీయూ పరిధిలో తాత్కాలికంగా నిలుపుదల జేఎన్టీయూ : వర్సిటీల పరిధిలో బోధన పోస్టుల భర్తీకి నీలినీడలు కమ్ముకున్నాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తీర్మానాల ప్రతులు వర్సిటీకి అందాయి. అయితే ప్రొఫెసర్ పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలుపదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో భర్తీ ఆగిపోయింది. పొంతన లేని అంశాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్, అసోసియేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ రోస్టర్ పాయింట్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు వేర్వేరు రోస్టర్ పాయింట్లు నిర్ధారించాల్సి ఉంది. అయితే ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎలాంటి రోస్టర్ పాయింట్లు అవసరం లేదు. ఆయా వర్సిటీలే నేరుగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసుకునే వీలుది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్సిటీలు ఇదివరకే ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నవంబర్ 2న జరిగిన పాలకమండలి సమావేశంలో ప్రతిపాదన తెచ్చారు. ఇందుకు పాలకమండలి సైతం ఆమోదం తెలిపింది. తీర్మానాలు (రిజల్యూషన్స్) వచ్చాక నోటిఫికేషన్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ప్రతిబంధకంగా మారాయి. కామన్ రిక్రూట్మెంట్ (అసిస్టెంట్, అసోసియేట్ పోస్టుల భర్తీ) కు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ అనివార్యంగా ఉద్యోగాల భర్తీకి కాలయాపన చేయడానికి ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 10 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రత్యేకంగా విన్నవించాం ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి అనుమతివ్వాలని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరాం. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో నెలకొన్న బోధన సిబ్బంది కొరతను తీర్చాలని విన్నవించాం.– ఆచార్య ఎస్ కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ అనంతపురం -
త్వరలో వర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ
నిబంధనలపై కసరత్తు చేస్తున్న అధికారులు వర్సిటీల వారీగా ఖాళీలపై ప్రతిపాదనల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇటీవల వైస్ చాన్స్లర్లను నియమించిన ప్రభుత్వం.. వాటిలో అధ్యాపక పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,528 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నియామక నిబంధనలు ఎలా ఉండాలన్న అంశాలపై దృష్టి సారించింది. అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన నిబంధనలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటికి అనుగుణంగా రాష్ట్రంలో అధ్యాపకుల నియామకాల నిబంధనలను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై చర్చించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు నియామకాల కోసం కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,528 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 323 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా, 687 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 518 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో యూనివర్సిటీల్లో విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డాయి. అయితే అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలంటే కచ్చితంగా వైస్ చాన్స్‌లర్ ఉండాల్సిందే. ఇటీవల 10 వర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం ఇపుడు అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. డైరెక్టు రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయాల్సిన పోస్టులపై ఆయా యూనివర్సిటీల వీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. వర్సిటీల, కేటగిరీల వారీగా ఖాళీలు యూనివర్సిటీ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం ఆర్జీయూకేటీ 23 41 61 125 శాతవాహన 9 16 15 40 మహాత్మాగాంధీ 10 15 9 34 అంబేడ్కర్ ఓపెన్ 8 12 10 30 కాకతీయ 53 88 69 210 తెలుగు 9 9 14 32 జేఎన్ఏఎఫ్ఏయూ 0 7 22 29 పాలమూరు 13 21 50 84 ఉస్మానియా 147 397 138 682 తెలంగాణ 11 25 23 59 జేఎన్టీయూహెచ్ 40 56 107 203 మొత్తం 323 687 518 1528 -
పోస్టులు భర్తీ అయ్యేనా!
మెడికల్ కళాశాలకు సంబంధించి పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 9న జీఓ నెం. 150 విడుదల చేశారు. ఇందులో పరిపాలన విభాగం, పారా మెడికల్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వీటిని 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామని అధికారులు చెప్పారు. జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి కూడా నవంబర్ 27 లోపు పోస్టుల భర్తీ చేస్తామని జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన ఒక సమావేశంలో ప్రకటించారు. కానీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వలేదు. నిధులు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం చేశారు. డిసెంబర్లో జరిగిన రాష్ట్ర మంత్రి వర ్గసమావేశంలో మెడికల్ కళాశాలలో 810 కొత్త పోస్టులకు ఆమోదముద్ర వేశారు. జనవరి 6వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిం ది. దీంతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశా రు. కానీ ఇంతవరకూ ఆర్థిక శాఖ నిధులు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో పోస్టుల భర్తీపై సందిగ్ధత నెల కొంది. ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఉత్తర్వులు మాత్రం ఇవ్వలేదు. 20 తరువాత రానున్న ఎంసీఐ మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరం అనుమతి కోసం ఈ నెల 20వ తేదీ తరువాత ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) బృందం వస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కానీ కళాశాలలో ఏర్పాట్లు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. మొదటి సంవత్సరం అనుమతికి ఎంసీఐ బృందం గతేడాది ఏప్రిల్ 15,16,17వ తేదీల్లో వచ్చినప్పుడు పోస్టుల భర్తీ, పరిపాలన విభాగం ఏర్పాటు తక్షణం చేయాలని ఆదేశించింది. కా నీ నేటివరకు ఈ ప్రక్రియ పూర్తికాలేదు. ప్రస్తుతం ఎంసీఐ ఈ వ్యవహారం పై ఎలా స్పందిస్తుందోనని మెడికల్ కళాశాల అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ ఏడాది కొత్తగా పీజీ కోర్సులను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున ఖాళీల కొరత అడ్డంకిగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం పోస్టుల భర్తీకి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కళాశాలలో జూలై వరకు పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోనుంది. ఫలితంగా కళాశాలలో, ఆస్పత్రిల్లో తీ వ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎంసీఐ మాత్రం తన పర్యటనను కొనసాగించనుంది. -
బోధన లేదు..శోధనా లేదు !
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిధిలోని కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్‌కు మంజూరైన శాశ్వత అధ్యాపకుల పోస్టుల భర్తీలో తాత్సారం జరుగుతోంది. యూనివర్సిటీ స్థాయిలో నాణ్యమైన ఉన్నత విద్య, పరిశోధనలు జరగటానికి అధ్యాపకులు కీలకం. ఇక్కడ రెగ్యులర్ అధ్యాపకులు సరిపడా లేరని వర్సిటీ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏఎన్‌యూ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, సైన్స్ కళాశాలల్లో ఏడు ప్రొఫెసర్, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 30న అనుమతినిచ్చింది. వీటితో పాటు ఏఎన్‌యూ ఆర్ట్స్ , సైన్స్ కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 20 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం 2011లోనే అనుమతినిచ్చింది. అయితే అప్పట్లో ఈ పోస్టులు భర్తీ చేయలేదు. వీటితోపాటు మరికొన్ని బ్యాక్లాగ్ అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి మేరకు పోస్టుల భర్తీకోసం రిజర్వేషన్ ఖరారు చేసేందుకు గత ఏడాది నవంబర్ 14న వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు రోస్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాది డిసెంబర్ మూడో తేదీన జరిగిన యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో మొత్తం 88 శాశ్వత రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. వెంటనే భర్తీకి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు ప్రకటించారు. అయితే నేటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. సమీపిస్తున్న ఎన్నికల గడువు సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరు తరువాత ఏ నిమిషమైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అధ్యాపక పోస్టుల భర్తీకి అడ్డంకి కాగలదు. అధ్యాపక పోస్టుల భర్తీలో తాత్సారం చోటుచేసుకోవడంతో అభ్యర్థుల్లో నిరుత్సాహం నెలకొంటుంది. ఇటీవల ఏఎన్‌యూతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని యూనివర్సిటీలకు కూడా ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేసింది. ఆ యూనివర్సిటీల కంటే పోస్టుల భర్తీలో ఏఎన్‌యూ వెనుకబడింది. ఒత్తిళ్ళు రావడమే కారణమా .. యూనివర్సిటీ అధికారులపై వస్తున్న తీవ్ర ఒత్తిళ్ళు, సిఫార్సులే పోస్టుల భర్తీలో జాప్యం జరగటానికి కారణాలనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం పోస్టులకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలతో సిఫార్సులు చేయించటం అధికారులకు తలనొప్పిగా మారినట్లు సమాచారం. మరోపక్క పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని అంతర్గతంగా కూడా తీవ్ర ఒత్తిళ్ళు వస్తుండటంతో అధికారులు కొంతకాలం తరువాత పోస్టుల భర్తీ చేపడితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై వీసీ ఆచార్య కె. వియ్యన్నారావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ముందుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తరువాత మిగిలిన అధ్యాపక పోస్టులకు రోస్టర్ రూపొందించి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.