బోధన లేదు..శోధనా లేదు !
Published Wed, Jan 29 2014 1:06 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిధిలోని కళాశాలలు, ఒంగోలు పీజీ సెంటర్‌కు మంజూరైన శాశ్వత అధ్యాపకుల పోస్టుల భర్తీలో తాత్సారం జరుగుతోంది. యూనివర్సిటీ స్థాయిలో నాణ్యమైన ఉన్నత విద్య, పరిశోధనలు జరగటానికి అధ్యాపకులు కీలకం. ఇక్కడ రెగ్యులర్ అధ్యాపకులు సరిపడా లేరని వర్సిటీ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ పోస్టుల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏఎన్‌యూ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా, సైన్స్ కళాశాలల్లో ఏడు ప్రొఫెసర్, 23 అసోసియేట్ ప్రొఫెసర్, 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 30న అనుమతినిచ్చింది. వీటితో పాటు ఏఎన్‌యూ ఆర్ట్స్ , సైన్స్ కళాశాలలు,
ఒంగోలు పీజీ సెంటర్, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 20 పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం 2011లోనే అనుమతినిచ్చింది. అయితే అప్పట్లో ఈ పోస్టులు భర్తీ చేయలేదు. వీటితోపాటు మరికొన్ని బ్యాక్‌లాగ్ అధ్యాపక పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతి మేరకు పోస్టుల భర్తీకోసం రిజర్వేషన్ ఖరారు చేసేందుకు గత ఏడాది నవంబర్ 14న వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు రోస్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. గత ఏడాది డిసెంబర్ మూడో తేదీన జరిగిన యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో మొత్తం 88 శాశ్వత రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. వెంటనే భర్తీకి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు ప్రకటించారు. అయితే నేటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
సమీపిస్తున్న ఎన్నికల గడువు
సాధారణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరు తరువాత ఏ నిమిషమైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అధ్యాపక పోస్టుల భర్తీకి అడ్డంకి కాగలదు. అధ్యాపక పోస్టుల భర్తీలో తాత్సారం చోటుచేసుకోవడంతో అభ్యర్థుల్లో నిరుత్సాహం నెలకొంటుంది. ఇటీవల ఏఎన్‌యూతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని యూనివర్సిటీలకు కూడా ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపక పోస్టులను మంజూరు చేసింది. ఆ యూనివర్సిటీల కంటే పోస్టుల భర్తీలో ఏఎన్‌యూ వెనుకబడింది.
ఒత్తిళ్ళు రావడమే కారణమా ..
యూనివర్సిటీ అధికారులపై వస్తున్న తీవ్ర ఒత్తిళ్ళు, సిఫార్సులే పోస్టుల భర్తీలో జాప్యం జరగటానికి కారణాలనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం పోస్టులకు అనుమతి ఇచ్చినప్పటి నుంచి అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలతో సిఫార్సులు చేయించటం అధికారులకు తలనొప్పిగా మారినట్లు సమాచారం. మరోపక్క పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని అంతర్గతంగా కూడా తీవ్ర ఒత్తిళ్ళు వస్తుండటంతో అధికారులు కొంతకాలం తరువాత పోస్టుల భర్తీ చేపడితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై వీసీ ఆచార్య కె. వియ్యన్నారావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ముందుగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఆ తరువాత మిగిలిన అధ్యాపక పోస్టులకు రోస్టర్ రూపొందించి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
Advertisement
Advertisement