అను పెళ్లకూరు.. ఫ్యాషన్ రంగంలో బాగా వినబడే పేరు. ఫ్యాషన్‌పై ఆమెకున్న పిచ్చి పద్దెనిమిదేళ్ల వయసులోనే మిస్ యూఏఈ ఫైనలిస్ట్ కోసం దుస్తులను డిజైన్ చేసే కాంట్రాక్ట్‌ను తెచ్చిపెట్టింది. కేవలం రూ. పదిహేను వేలతో అద్భుతమైన మూడు డిజైన్స్‌ను అందించి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు, తన పేరును ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ జాబితాలో చేర్చుకుంది.
ఫ్యాషన్‌పై ఉన్న ప్యాషన్‌తో ఇంటర్ అయిపోయిన వెంటనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అయింది అను. కానీ, ఆ రంగంలో ఆచరణాత్మక అనుభవం చాలా ముఖ్యమని గ్రహించింది. దాంతో తరగతులకు హాజరవక.. కాలేజ్ డ్రాప్ అవుట్‌గా మిగిలింది. తన అభిరుచిని గైడ్‌గా తలచి, అనుభవాన్ని పాఠాలుగా మలచుకుంది. సోదరుడు సూర్య సహకారంతో ‘ఎస్ అండ్ ఏ (సూర్య అండ్ అను)’ పేరుతో ఓ మల్టీ డిజైనర్ స్టోర్‌ను ప్రారంభించింది. మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి దుస్తులను డిజైన్ చేయడం మొదలుపెట్టింది. అలా పాపులారిటీ సంపాదించుకోవడంతోపాటు తన డిజైన్స్ సెలబ్రిటీల కంట పడేలా చేసుకుంది. అది వర్కవుట్ అయి.. సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసే చాన్స్ కొట్టేసింది.
నిహారిక కొణిదెల, రుహానా శర్మ, వితికా షేరు, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బ, వైష్ణవి చైతన్య వంటి సెలబ్రిటీలందరికీ అను పెళ్లకూరు ఫేవరిట్ డిజైనర్ అయింది. ఆ ప్రోత్సాహంతోనే ‘తనాషా’ పేరుతో సొంత బ్రాండ్‌ను స్థాపించింది. అంతేకాదు, ఇటీవల ప్రతిష్ఠాత్మక బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో ‘స్వర్ణిరహ’ పేరుతో తన లేటెస్ట్ కలెక్షన్స్‌ను ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంది. ఆ ఈవెంట్‌కు గ్లామర్‌ను జోడిస్తూ ప్రఖ్యాత నటీమణులు శ్రియా సరన్, మృణాల్ ఠాకూర్ షో స్టాపర్స్‌గా ర్యాంప్ వాక్ చేశారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి రెండింటి మేళవింపుగా ఉండే ఆమె డిజైన్స్‌కు స్థానికంగానే కాదు, అంతర్జాతీయంగానూ గుర్తింపు లభించింది. దుబాయ్, శ్రీలంక, సింగపూర్ దేశాల్లో జరిగిన పలు ఫ్యాషన్ షోస్‌లో అను తన డిజైన్స్‌ను ప్రదర్శించింది.
అనుభవాన్ని మించిన గురువు ఉండరు. అది నాకు చాలా నేర్పింది. మొదట్లో ఎన్నో సవాళ్లను, ఇంకెన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని నమ్మాను. అదే నిజమైంది.
– అను పెళ్లకూరు.
Comments
Please login to add a commentAdd a comment