
13 మొబైల్‌ఫోన్లు సీజ్.. వాట్సాప్ గ్రూప్‌లో చేరవేత
కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్, ఒడిశాకు చెందిన ఏడుగురు అదుపులోకి
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడి
నగరంపాలెం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) బీఈడీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పది మందిని అరెస్టుచేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లీకేజీకి వినియోగించిన 13 మొబైల్‌ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉత్తర డీఎస్పీ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
వినుకొండ కాలేజీలో లీక్..
ఏఎన్‌యూ పరిధిలో గత శుక్రవారం (ఈనెల 7న) మ.2 గంటలకు బీఈడీ పరీక్ష ప్రారంభం కావల్సి ఉండగా మ.1.22కు ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని ఏఎన్‌యూ ఉప కులపతి (వీసీ), పరీక్ష కేంద్రం సమన్వయకర్త గుర్తించారు. లీకేజీ వ్యవహారంపై ఏఎన్‌యూ పీజీ, వృత్తి విద్య కోర్సుల పరీక్ష కేంద్రం సమన్వయకర్త మన్నవ సుబ్బారావు పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పల్నాడు జిల్లా వినుకొండ టౌన్‌లోని శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థలోని కంప్యూటర్ గది నుంచి లీకైనట్లు తేల్చారు. దీంతో కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ రఫిక్ అహ్మద్, ప్రిన్సిపాల్ దుపాటి సురేష్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ ధార స్వర్ణరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ నిర్వాకం
ఇక పరీక్ష ప్రారంభమయ్యే నలభై నిమిషాల ముందు ఆయా పరీక్ష కేంద్రాలకు పాస్‌వర్డ్ పంపిస్తారు. తద్వారా పాస్‌వర్డ్ కొట్టి, ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది. కానీ, ఈ పాస్‌వర్డ్‌ను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, కంప్యూటర్ ఆపరేటర్‌లు దుర్వినియోగం చేసి, వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారు. తద్వారా ఒడిశాకు చెందిన సంతోష్‌కుమార్ సాహు, బిష్ణుప్రసాద్ పాత్రో, సుకాంత్, విద్యార్థులు పురుషోత్తం ప్రధాన్, ధీరేన్‌కుమార్ సాహులకు చేరింది.
వీరు ప్రియబత్రో గోడయ్, మిలాన్ తృష్టిలకు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ పదిమందినీ అరెస్టుచేసి వీరి నుంచి 13 మొబైల్‌ఫోన్లను స్వా«దీనం చేసుకుని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఒడిశా నిందితులు తమ రాష్ట్రంలో విద్యార్థులతో బీఈడీ పరీక్షలు రాయించి వారు ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతయ్యేందుకు ఈ లీకేజీకి శ్రీకారం చుట్టారు.
అలాగే, శ్రీ వివేకానంద కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వాహకులు కూడా ఇదే పద్ధతి అవలంబించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక కేసుని త్వరితగతిన ఛేదించిన ఉత్తర డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామిలను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment