దంత వైద్య విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి | Dr Satish Kumar Reddy interview with sakshi | Sakshi
Sakshi News home page

దంత వైద్య విద్యలో ప్రమాణాల పెంపునకు కృషి

Published Mon, Dec 2 2024 5:17 AM | Last Updated on Mon, Dec 2 2024 5:19 AM

Dr Satish Kumar Reddy interview with sakshi

రోగుల కొరతతో విద్యార్థులు ఎక్కువగా నేర్చుకోలేకపోతున్నారు

ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేస్తా

ప్రైవేట్‌ కాలేజీల్లో చికిత్సలకు యూజర్‌ చార్జీలపై మార్గదర్శకాలు రూపొందిస్తాం

అందుబాటు ధరల్లో సామాన్యులకు దంత వైద్యం అందేలా చర్యలు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీసీఐ నూతన అధ్యక్షుడు డాక్టర్‌ సతీశ్‌కుమార్‌రెడ్డి  

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా దంత వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత చికిత్సలు అందించడానికి కృషి చేస్తానని డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) నూతన ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కె.సతీశ్‌కుమార్‌రెడ్డి అన్నారు. డీఐసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు వైద్యుడైన డా.సతీశ్‌కుమార్‌  నెల్లూరు జిల్లాకు చెందినవారు. స్కూల్, కాలేజీ విద్యను నెల్లూరు జిల్లాలోనే పూర్తి చేసిన ఆయన.. హైదరాబాద్‌లోని ఉస్మానియాలో బీడీఎస్, ఎండీఎస్‌ విద్యనభ్యసించారు. ఉమ్మడి ఏపీ డెంటల్‌ కౌన్సిల్‌కు రెండు సార్లు, విభజిత ఏపీ కౌన్సిల్‌కు ఒకసారి చైర్మన్‌గా వ్యవహరించారు. ఇటీవల డీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డా.సతీశ్‌కుమార్‌రెడ్డి తన భవిష్యత్‌ కార్యాచరణను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

యూజర్‌ చార్జీలపై మార్గదర్శకాలు..
వైద్య విద్యార్థులకు శిక్షణ సమయంలో ఎంత ఎక్కువ క్లినికల్‌ ఎక్స్‌పోజర్‌ ఉంటే వారు అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఆ మేర సామర్థ్యాలు పెరిగి.. భవిష్యత్‌లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల కల్పనకు వీలవుతుంది. డీసీఐ నిబంధనల ప్రకారం ప్రతి కాలేజీకి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో రోజుకు నిర్దేశించిన స్థాయిలో ఓపీలు, ఐపీలు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలోని దంత వైద్య కళాశాలల్లో రోగుల కొరత ఉంటోంది.

దీంతో విద్యార్థులు శిక్షణ సమయంలో ఎక్కువగా నేర్చుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడంతో పాటు సామాన్యులకు ఉచితంగా, అందుబాటు ధరల్లో దంత వైద్య కళాశాలల ద్వారా చికిత్సలు అందించేందుకు ప్రయత్నిస్తాం. ప్రైవేట్‌ కళాశాలల్లో చికిత్సలకు యూజర్‌ చార్జీలపై మార్గదర్శకాలను రూపొందించాలని యోచి­స్తున్నాం. ప్రజలు కూడా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికి­త్సల కోసం రూ.వేలల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా.. దంత వైద్య కళాశాలల్లోని ఆస్పత్రులకు వెళ్లాలి. అక్కడ నిపుణులైన సీనియర్‌ వైద్యులుంటారు. 

ఇబ్బడిముబ్బడిగా దంత వైద్య కళాశాలలు..
దేశంలో దంత వైద్య కళాశాలలు ఎక్కువయ్యాయి. దీంతో కోర్సులు పూర్తి చేసిన వారందరికీ బయట ఉపాధి దొరకడం లేదు. ఇబ్బడిముబ్బడిగా కళాశాలల ఏర్పాటుతో విద్యా ప్రమాణాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కళాశాలలకు ప్రతిపాదనలు పంపొద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు డీసీఐ స్పష్టం చేసింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల నుంచి కొత్త కళాశాలల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. కొత్త కళాశాలలు నెలకొల్పకుండా నియంత్రించే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల మేరకు ఆమోదించడం, తిరస్కరించడం మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. డెంటల్‌ ఎడ్యుకేషన్‌లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంపైనా దృష్టి సారిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement