మెడికల్, డెంటల్ కాలేజీల ఏకీకృత ఫీజుపై హైకోర్టు తీర్పు
కాలేజీల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజులు నిర్ణయించండి
ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీకి ఆదేశం
బ్యాలెన్స్ ఫీజును అభ్యర్థుల నుంచి వసూలు చేసుకోండి
కాలేజీలకు వెసులుబాటునిచ్చిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీలని్నంటిలో ఏకీకృత ఫీజు సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) సిఫారసుల మేరకు 2020–21 నుంచి 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం 2020 మే 29న జారీ చేసిన జీవో 56ను రద్దు చేసింది.
ఈ జీవో చట్టం ముందు నిలబడదని స్పష్టం చేసింది. ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ అన్నీ మెడికల్, డెంటల్ కాలేజీలను ఒకే గాటన కట్టి, ఏకీకృత ఫీజు నిర్ణయించడం చట్ట విరుద్ధమన్న కాలేజీల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజుల వివరాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి ఫీజు ఖరారు చేయాలని, ఆపైన రెండు నెలల్లో ఆదేశాలు జారీ చేయాలని కమిషన్‌ను ఆదేశించింది.
ఒకవేళ ప్రతిపాదించిన ఫీజుతో కాలేజీలు విభేదిస్తే, ఆ కాలేజీ యాజమాన్యం అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది. కమిషన్ ఫీజులను పెంచితే, పెంచిన మేర బ్యాలెన్స్ మొత్తాలను అభ్యర్థుల నుంచి వారిచి్చన హామీ మేరకు కాలేజీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అదనపు ఫీజు వసూలులో నిర్ణయం అంతిమంగా కాలేజీలదేనని స్పష్టం చేసింది. జీవో 56ను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విచారణ జరిపి, తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది.
ఏకీకృత ఫీజు వల్ల కొన్ని లాభపడుతూ ఉండొచ్చు..
ఏకీకృత ఫీజు విద్యార్థుల ప్రయోజనాలకు కూడా విరుద్ధం కావొచ్చునని హైకోర్టు తీర్పులో పేర్కొంది. తక్కువ ఫీజు ఉంటే మరింత ఎక్కువ చెల్లించాలని విద్యార్థులను కాలేజీలు బలవంతం చేయవచ్చునని తెలిపింది. ఏకీకృత ఫీజు వల్ల తగిన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది లేని కాలేజీలు లాభపడే అవకాశం ఉందని పేర్కొంది. మంచి సదుపాయాలు, నాణ్యమైన బోధనా సిబ్బంది కల్పిస్తున్న కాలేజీలకు ఇది నష్టం కలిగించవచ్చని తెలిపింది. ఇటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు కోరడంలో తప్పులేదని తెలిపింది.
ఫీజుల ఖరారుకు ముందు కాలేజీలు సమర్పించిన ఆదాయ, వ్యయాలు, మౌలిక సదుపాయాల వివరాలని్నంటినీ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదంది. ఆచరణ సాధ్యం కాని ఫీజును నిర్ణయించడం వల్ల ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులు అందించే విద్యా సంస్థలు మూతపడతాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఆయా కాలేజీల నాణ్యత, సమర్థత, ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment