స్థానికంగా ఉంటే అనుమతించండి | High Court directive to Telangana state govt on medical admissions | Sakshi
Sakshi News home page

స్థానికంగా ఉంటే అనుమతించండి

Published Fri, Sep 6 2024 5:04 AM | Last Updated on Fri, Sep 6 2024 5:04 AM

High Court directive to Telangana state govt on medical admissions

‘నివాసం’ మార్గదర్శకాలు రూపొందించండి 

వేరే రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదు 

వైద్యవిద్య అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

జీవో 33లోని ‘స్థానికత’నిబంధనను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన పిటిషనర్లు 85 శాతం స్థానిక కోటా కింద అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని.. అందువల్ల తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. 

వైద్యవిద్య ప్రవేశాల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్‌ చేస్తూ దాఖలైన 53 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం ఈ మేరకు తీర్పు చెప్పింది. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్ధికి స్థానిక కోటా వర్తింపజేయాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో దాదాపు 130 మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. 

టెన్త్, ఇంటర్‌ స్థానికంగా చదివి ఉండాలన్న నిబంధనతో.. 
‘జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ ప్రగతినగర్‌కు చెందిన కల్లూరి నాగనరసింహ అభిరామ్‌తోపాటు మరికొందరి తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. ఈ జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తోపాటు ఇంటర్‌ స్థానికంగా చదివి ఉండాలి. పరీక్షలు ఇక్కడే రాయాలి. ఏడేళ్లు స్థానికంగా ఉండాలి. ఇది చట్టవిరుద్ధం. లోకల్‌గా పరిగణించేందుకు కొత్త నిబంధనలు తెస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవోను కొట్టేయాలి’అని పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ చదివారని స్థానికులు కాదంటున్నారు.. 
‘చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్‌ చదివారు. వారంతా తెలంగాణలోనే పుట్టి టెన్త్‌ వరకు ఇక్కడే చదివినా జీవో ప్రకారం వారికి స్థానికత వర్తించదు. అదే తెలంగాణలో పుట్టకపోయినా ఆ నాలుగేళ్లు ఇక్కడే చదివిన వారికి స్థానికత వర్తిస్తుంది. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. ఫిబ్రవరి 9న నీట్‌కు నోటిఫికేష¯న్‌Œ వెలువడగా మే 5న పరీక్ష, జూలై 26 ఫలితాలు వెలువడ్డాయి. 

కానీ ఫలితాల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయడం చట్టవిరుద్ధం’అని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, డీవీ సీతారామమూర్తి వాదించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారున్నారని ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదించారు. నీట్‌ దరఖాస్తులో అభ్యర్థులే ఆ విషయాన్ని పేర్కొన్నారన్నారు. కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిబంధనలనే ఇక్కడ తీసుకొచ్చామని చెప్పారు. 

మార్గదర్శకాల మేరకు అనుమతించండి.. 
‘తెలంగాణకు చెందిన విద్యార్థులకే స్థానిక కోటా వర్తింపజేయాలని ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ) ఉద్దేశం మంచిదే. అయితే తెలంగాణకు చెందిన విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదు’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం రూపొందించే ‘నివాస’మార్గదర్శకాల మేరకు ప్రతి కేసును పరిశీలించాలని.. అర్హులైన పిటిషనర్లను స్థానిక కోటా కింద కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కాళోజీ వర్సిటీని ఆదేశించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement