
జింఖానా మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయం, గ్రౌండ్
30 ఏళ్లుగా ఆక్రమించడంపై సీరియస్
రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలంటూ డిమాండ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు కంటోన్మెంట్ బోర్డు అధికారులు షాక్ ఇచ్చారు. బోర్డుకు ఎలాంటి లీజు చెల్లించకుండానే సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని 30 ఏళ్లుగా ఆక్రమించడాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణించారు. తక్షణమే ఆ స్థలాన్ని ఖాళీ చేయడంతోపాటు రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే హెచ్‌సీఏ నుంచి స్థలం స్వాధీనానికి ఏర్పాట్లు చేస్తున్నామని బోర్డు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ జనరల్ ల్యాండ్ రికార్డ్స్(జీఎల్‌ఆర్) సర్వే నెంబర్ 713లోని 23 ఎకరాల సీ కేటగిరీకి చెందిన జింఖానా మైదానం (gymkhana ground) ఉంది. 1992లో ఈ స్థలంలోని 7.9 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(సాప్)కు, 5.71 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లీజు కింద కేటాయించారు. మిగిలిన 9.59 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. 1996 ఫిబ్రవరి 23న కేంద్ర ప్రభుత్వం హెచ్‌సీఏ లీజును రద్దు చేసింది. అయితే ఆ స్థలాన్ని మాత్రం కేంద్రం స్వాధీనం చేసుకోలేదు. తిరిగి 2010లో సికింద్రాబాద్ సర్కిల్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ తన అధికార పరిధిని దాటి మరో ఏడు ఎకరాల స్థలాన్ని హెచ్‌సీఏకు లీజు కింద ఇచ్చారు. ఈ లీజు కూడా చెల్లదంటూ 2013లో రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్‌సీఏ రక్షణ శాఖకు ఎలాంటి లీజు రుసుం చెల్లించకుండానే సుమారు 14 ఎకరాల స్థలాన్ని వినియోగించుకుంటోంది. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన కంటోన్మెంట్ అధికారులు 2021లో తొలిసారిగా పబ్లిక్ ప్రిమిసెస్ (ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్‌డ్ ఆక్యుపెంట్స్) యాక్ట్, 1971 ప్రకారం హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేశారు. 5.71 ఎకరాల లీజుకు సంబంధించిన స్థలంపై తమకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చినట్లు హెచ్‌సీఏ స్పందించింది. అయితే మిగిలిన 9.59 ఎకరాలకు మాత్రం ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కంటోన్మెంట్ అధికారులు పీపీ(ఈ) యాక్ట్ 1971, సెక్షన్ 4(1) ప్రకారం మరోసారి నోటీసు జారీ చేశారు.
చదవండి: ఇక RRR వరకు హెచ్ఎండీ అనుమతులే!
హెచ్‌సీఏ నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా స్వాధీనానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. దాదాపు 30 ఏళ్లుగా హెచ్‌సీఏ తమ స్థలాన్ని కబ్జాలోకి తీసుకుని వినియోగించుకున్నందుకు రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ నోటీసు (Demand Notice) కూడా పంపారు.
ఆక్రమిత స్థలంలోనే గ్రౌండ్..
లీజు ద్వారా పొందామని పేర్కొంటున్న హెచ్‌సీఏ జింఖానా మైదానంలోని 5.71 ఎకరాల స్థలాన్ని మాత్రం ఖాళీగానే ఉంచింది. మిగిలిన 9.59 ఎకరాల స్థలంలోనే హెచ్‌సీఏ (HCA) కార్యాలయ నిర్మాణంతోపాటు క్రికెట్ గ్రౌండ్, నెట్స్ వేశారు. ఈ మైదానంలోనే క్రీడాకారులు శిక్షణతోపాటు ప్రాక్టీస్ చేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment