సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో టికెట్లు ఇవ్వాలని హెస్‌సీఏ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత టికెట్లు ఇవ్వనున్నారు. అలాగే.. ఆఫ్‌లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు.
గురువారం నాటి తొక్కిసలాట, లాఠీఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. జింఖానా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ కో నిల్చోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే ఆన్‌లైన్ బుకింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే జింఖానాలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గ్రౌండ్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇక హెచ్‌సీఏ తీరుతో క్రికెట్ చూడటం అభిమానులకు అందని ద్రాక్షేనా అనే ప్రశ్న మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, లోగుట్టుగా నడిచిన మ్యాచ్ టికెట్ విక్రయాల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కాంప్లిమెంటరీ పాసుల కోసం బడాబాబులు, వీఐపీలు కక్కుర్తి పడుతున్నట్లు తేలింది.
అసలు ఆఫ్ లైన్ టికెట్లు సైతం ఎన్ని విక్రయించారో అజార్ క్లారిటీ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్‌ల నిర్వహణ సాఫీగా సాగుతున్న వేళ.. టికెట్ విక్రయాల కోసం హెచ్‌సీఏ సతమతం కావడంపై చర్చ నడుస్తోంది. ఒకరకంగా జింఖానా తొక్కిసలాట ఘటనతో నగర ఈమేజ్ దెబ్బతిందనే మాట సైతం వినిపిస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజార్ ఒంటెద్దు పోకడతోనే ఈ స్థితి కి కారణమంటున్నారు కొందరు.
ఇదీ చదవండి: జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
Comments
Please login to add a commentAdd a comment