ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్‌రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు.
స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్‌స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు.
బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్‌రైజర్స్‌కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు.
ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్‌లు, లిఫ్ట్‌లు, లాంజ్‌లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు.
జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్‌లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment