రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
తరచూ ఆందోళన కలిగిస్తూ భయంకర ఘటనలు
వీటిపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వం దృష్టి సారించి పరిస్థితులు మెరుగుపరచాలి
రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండాలి.. లేకపోతే విద్యాపరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత
హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.. హాస్టల్‌లోకి రాకపోకలను పర్యవేక్షించి వాటిని రిజిస్టర్ చేయాలి
అవసరమైన ప్రతి చోటా సీసీ కెమెరాలు పెట్టాలి.. హాస్టల్ సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలించాలి
ప్రభుత్వానికి పలు ప్రాథమిక మార్గదర్శకాలు సూచించిన హైకోర్టు
అన్ని హాస్టళ్లలో కఠినంగా అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం
ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాచ్‌మెన్ తొలగింపును సమర్థించిన కోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ‘వివిధ సామాజిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేశారు.
వీటిలో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్‌ది. రెసిడెన్షియల్ క్యాంపస్‌లో చదువుకునే అమ్మాయిలతో అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా అది పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. తద్వారా తమ పిల్లలను ఆ క్యాంపస్‌లో చేర్చడానికి వారు విముఖత చూపుతారు.
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని పేర్కొంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన కె.శంకరయ్య గుత్తిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్‌లో వంట మనిషిగా పని చేస్తూ 2011 జూలై 24న ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.
అధికారులు విచారించి అతన్నిసర్వీసు నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ 2014 ఫిబ్రవరిలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తుది విచారణ జరిపి.. శంకరయ్యపై తీసుకున్న చర్యలు సబబే అని మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై లోతుగా స్పందిస్తూ ప్రాథమిక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కఠినంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు.
కర్నూలు జిల్లా కోసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం
హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా..
⇒ హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి.
⇒ హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
⇒ హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.
⇒ మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి.
⇒ భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి.
⇒ సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది.
⇒ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి.
⇒ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి.
ఆత్మరక్షణకు వర్క్‌షాపులు నిర్వహించండి
⇒ హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి.
⇒ తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్‌షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది.
⇒ హాస్టళ్లలో సమ వయసు్కలతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి.
⇒ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి.
⇒ ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.
ఇప్పటికీ హాస్టళ్ల పరిస్థితిలో మార్పు లేదు
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీర్పు వెలువరిస్తూ, పిటిషనర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. శంకరయ్యది తీవ్ర దుష్ప్రవర్తన అని తేల్చారు. హాస్టల్‌లో నిద్రపోతున్న బాలికల పట్ల శంకరయ్య అనుచిత ప్రవర్తన గురించి ఓ టీచర్ అధికారులకు స్పష్టమైన స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. నిద్రపోయే సమయంలో తలుపులేసుకోవడంతో పాటు తాళం కూడా వేసుకోవాలని బాలికలకు ఆ టీచర్ చెప్పారంటే శంకరయ్యది ఎలాంటి అభ్యంతరకర ప్రవర్తనో అర్థం చేసుకోవచ్చన్నారు. శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఎలాంటి తప్పు లేదని, వాటిని సమర్ధిస్తున్నట్లు జస్టిస్ హరినాథ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment