
కూటమి ప్రభుత్వంపై పెల్లుబికిన అసంతృప్తి
పది రోజులు వరుస ధర్నాలు, ఆందోళనలు
అంగన్‌వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీల నిరసనలు
కూటమి హామీల అమలుకు డిమాండ్
అసెంబ్లీ ఆత్మస్తుతి–పరనిందకు నిలయమైన నేపథ్యం
సాక్షి, అమరావతి: ప్రజాగళం వినిపించే ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసి ఆత్మస్తుతి–పరనింద ధ్యేయంగా మారిన అసెంబ్లీ సమావేశాలు ఒకపక్క జరుగుతుండగా, మరోపక్క కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు చేసిన ఆందోళనకు విజయవాడ ధర్నాచౌక్ కేంద్రంగా నిలిచింది.
ఉద్యోగ, అంగన్‌వాడీ, ఆశా, వ్యవసాయ కార్మిక, ఉపాధి హామీ కూలీలు సహా 20కిపైగా విభాగాలకు చెందిన సామాన్య ప్రజానీకం తమ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేలా పది రోజులకుపైగా మండుటెండను సైతం లెక్క చేయకుండా సాగించిన ఉద్యమ హోరు కూటమి ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే పెల్లుబికిన అసంతృప్తికి అద్దం పట్టింది. డిమాండ్లు నాలుగు నెలల్లోగా పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ప్రజానీకం అల్టిమేటం ఇచ్చింది.
వెల్లువెత్తిన ఆందోళనలు..
» అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాల పెంపు, గ్రాట్యుటీ, తదితర డిమాండ్స్ నెరవేర్చాలని మహాధర్నాను నిర్వహించారు.
» పెద్ద ఎత్తున ఫీజు పోరు, బకాయిల విడుదలకు
ఆందోళన జరిగింది.
» ఆశా వర్కర్లు కనీస వేతనం నెలకు రూ.26 వేలతోపాటు పలు డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు.
» వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, నెలకు రూ.10వేలు వేతనం హామీని నిలబెట్టుకోవాలని మహాధర్నా జరిగింది.
» రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఐదు నెలలుగా ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వీఓఏ) ధర్నా నిర్వహించారు.
» కనీస వేతనాలు వర్తింపజేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉద్యమించారు.
» గ్రామ, వార్డు సచివాలయాల్లోని హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూధర్నా జరిగింది.
» కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పొట్టగొట్టేలా.. ఆప్కాస్ విధానం రద్దును విరమించుకోవాలని ఉద్యమించారు.
» ఆరు నెలల్లో సమస్య పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అగ్రిగోల్డ్ బాధితులు అల్టిమేటం ఇచ్చారు.
» డప్పు కళాకారుల రిజిస్ట్రేషన్ పేరుతో పెన్షన్ తొలగించడంపై ధర్నా నిర్వహించారు.
» ఏపీఎస్‌ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు నెలవారి పెన్షన్ రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ధర్నా చేశారు.
» నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలంటూ కాటికాపరులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
» మిలియపుట్టి సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ధర్నా చేశారు.
» మెప్మా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, ఉపాధి హామీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు తదితర అనేక విభాగాలకు చెందిన వారు కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని ధర్నాచౌక్‌లో నినదించారు.
Comments
Please login to add a commentAdd a comment