
ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానికి ఎన్నికల సంఘం కసరత్తు
ఇప్పటివరకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు
ఆధార్ లింక్ చేస్తే భారీగా తొలగిపోనున్న మల్టిపుల్ ఓట్లు
దేశవ్యాప్తంగా 66 శాతం మందికిపైగా ఆధార్ అనుసంధానం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాపై పెద్దఎత్తున వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేస్తూ.. పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఓటరు కార్డుకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా బోగస్ ఓట్లతో పాటు ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటరుగా నమోదు కావడానికి అడ్డుకట్ట వేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగ, మల్టిపుల్ ఓట్లపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, మహారాష్ట్ర ఓటర్ల జాబితాపై పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ అనుమానాలు లేవనెత్తడంతో ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటోంది.
ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ దొంగ ఓట్ల నివారణే లక్ష్యంగా ఓటర్ల జాబితాకు ఆధార్‌ను అనుసంధానం చేయడానికి న్యాయ, సాంకేతికపరమైన ఇబ్బందులను పరిష్కరించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోలతో కీలక సమావేశం నిర్వహించారు.
» ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానించడం అనేది ఆరి్టకల్ 326లోని నిబంధనల ప్రకారం మాత్రమే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్ ఒక వ్యక్తికి గుర్తింపు ఇస్తుందని, ఓటరు కార్డు ద్వారా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తామంది. ఇంతకాలం ఆధార్ అనుసంధానం అనేది ఆప్షనల్‌గా ఉండగా ఇకమీదట తప్పనిసరి చేయనున్నారు.
2015లో శ్రీకారం
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం 2015లో మొదలుపెట్టినా సుప్రీంకోర్డు ఉత్తర్వులతో ఆగిపోయింది. ఒకే వ్యక్తి పలుచోట్ల ఓటు కలిగి ఉండడంతో వీటి ఏరివేతే లక్ష్యంగా 2015 ఫిబ్రవరిలో ఆధార్ అనుసంధానం చేపట్టింది. మూడు నెలల్లోనే 30 కోట్ల కార్డులను లింక్ చేసింది. కానీ, దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆధార్ అనుసంధానానికి అడ్డుకట్ట పడింది. తర్వాత ఎవరి ఇష్టాన్ని బట్టి వారు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే 66 శాతంపైగా ఓటరు కార్డులు అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
» ప్రస్తుతం రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లుండగా, 70 శాతంపైనే ఆధార్‌తో అనుసంధానం అయినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు.
» రాష్ట్ర విభజన తర్వాత చాలామంది అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఓటు కలిగి ఉంటూ రెండుచోట్లా హక్కును వినియోగించుకుంటుండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
» గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా
క్యాంపులు నిర్వహించి మరీ ఓటర్లుగా చేర్పించడంపై వైఎస్సార్‌సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనేక పార్టీల నుంచి ఇదే విధమైన విమర్శ వస్తుండటంతో పారదర్శక ఓటర్ల జాబితా తయారీ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది.
ఓటరు ఐడీ–ఆధార్ అనుసంధానంతో ప్రయోజనాలు
» ఓటరు జాబితాకు సంబంధించిన లోపాల పరిష్కారం
» ధ్రువీకృత ఓటర్ల జాబితాను దేశానికి సమర్పించడం
» ఓటరు జాబితాలో మోసపూరిత పేర్లను చేర్చడాన్ని నివారించడం
» రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదుల పరిష్కారం.
» వ్యక్తులు వేర్వేరుచోట్ల నమోదు చేసుకునే అవకాశాన్ని తొలగించడం
» ఎవరూ రెండు వేర్వేరు ప్రదేశాలలో నమోదు చేసుకోలేరని నిర్ధారించడం
Comments
Please login to add a commentAdd a comment