
గత మూడేళ్లలో 2.69 లక్షల పాము కాటు కేసులు.. 600 మంది మృతి
కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో మరణాలు ఎక్కువ
పాముకాటు చికిత్సకు ఆరోగ్య వ్యవస్థ బలోపేతం
కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడి
దేశంలో మూడేళ్లుగా పాముకాట్లు పెరుగుతున్నాయి. పాము కాటుకు గురై మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. 2022 నుంచి 2024 వరకు గత మూడేళ్లలో దేశంలో 2.69 లక్షల పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాము కాటుకు మృతి చెందిన వారి సంఖ్య 600కు చేరింది.
పాము కాటు కేసులు అత్యధికంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. పాము కాటుకు గురై చనిపోయిన వారు కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో అత్యధికంగా ఉన్నట్లు వెల్లడించింది. – సాక్షి, అమరావతి
వైద్య వ్యవస్థ బలోపేతానికి చర్యలు
పాము కాటు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపింది. పాముకాటు నివారణకు మార్గదర్శకాలను కూడా జారీ చేసినట్లు పేర్కొంది. పాము కాటుకు చికిత్స అందించేందుకు వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అత్యవసర మందులు, పరికరాలు, రవాణా యంత్రాంగం, ఇతర సౌకర్యాలను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అందిస్తోందని తెలిపింది.
జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన ఔషధాల జాబితాలో పాలీవాలెంట్ యాంటీ స్నేక్ వెనంను చేర్చినట్లు పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉచిత ఔషధాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు ఇస్తున్నట్లు తెలిపింది. దేశంలో పాటుకాటు నివారణ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పాము కాటు నిర్వహణ, అత్యవసర సంరక్షణ తదితర అంశాలపై వైద్య నిపుణులకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా అన్ని ప్రజా వైద్య శాలల్లోని వైద్యులను పాము కాటు కేసుల అత్యవసర నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

Comments
Please login to add a commentAdd a comment