పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..? | How To Tell If A Snake Is Potentially Venomous, More Details Inside | Sakshi
Sakshi News home page

పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?

Published Tue, Jun 18 2024 12:36 PM | Last Updated on Tue, Jun 18 2024 1:17 PM

How to Tell if a Snake is Potentially Venomous

వర్షాలతో పుట్టలోంచి బయటకు వస్తున్న పాములు 

పొలం గట్లపై తిరుగుతూ ప్రాణాంతకం 

జూన్‌ నుంచి పాముకాట్ల సీజన్‌ మొదలు 

పాముకాటు మరణాలను తగ్గించిన గత ప్రభుత్వ చర్యలు 

జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటి వరకు వంద కేసుల నమోదు 

అన్నీ పీహెచ్‌సీల్లో అందుబాటులో స్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్లు  

వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్‌ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్‌లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు.  

ఒంగోలు టౌన్‌: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి.

 పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు.

 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్‌ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్‌ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.  

ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు:  
జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీ

యంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్‌కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్‌ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్‌ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్‌ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మంది

మహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్‌ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.  

ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి:  
జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్‌ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్‌ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి.   

లక్షణాలను ఇలా గుర్తించాలి... 
పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డా.కళ్యాణి చెప్పారు.  

మూఢనమ్మకాలను నమ్మవద్దు:  
పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.

విష పాములను గుర్తించడం ఎలా...? 
పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి 
ఉంటుంది.

జిల్లాలో 72 పీహెచ్‌సీలు.. 
ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్‌ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్‌సీల ఒక ఎంబీబీఎస్‌ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. 
దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం 
ఏర్పడింది.

సకాలంలో వైద్యశాలకు తరలించాలి  
ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్‌ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది.  
–డాక్టర్‌ ఎన్‌.కళ్యాణి, జనరల్‌ ఫిజీషీయన్, హెచ్‌ఓడీ

ప్రజల్లో అవగాహన కలిగించాలి 
అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్‌లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు.  
– డాక్టర్‌ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement