● చికిత్స అందిస్తున్న డాక్టర్లు
నెల్లూరు(అర్బన్): నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో రత్నమ్మ అనే అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికురాలిని అత్యంత విషపూరితమైన రక్తపింజరి పాము కాటేసింది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. సిబ్బంది కథనం మేరకు.. రోజులాగే రత్నమ్మ సోమవారం విధులకు వచ్చింది. సంబంధిత సూపర్‌వైజర్ మెడికల్ కళాశాల ఆవరణలో గడ్డిని తొలగించే పనిని ఆమెకు అప్పగించారు.
దీంతో గడ్డిని తొలగిస్తుండగా పాము ఆమె చేతి వేలిపై కాటువేసింది. రత్నమ్మ కేకలు వేయగా సహచర సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. డాక్టర్ ప్రాథమిక వైద్యం అనంతరం ఐసీయూకి తరలించారు. ఈసీజీ తీశారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అయిన ఎజైల్ గ్రూపు మేనేజర్ కొండయ్య మరికొన్ని రక్తపరీక్షలను బయట ల్యాబ్‌లో చేయించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలో ఓ కార్మికురాలి మృతి
గతంలో ఓపారిశుద్ధ్య కార్మికురాలు పెద్దాస్పత్రి ఆవరణలో గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. తర్వాత భయాందోళనకు, ఒత్తిడికి లోనైంది. రెండో రోజు మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో ఆస్పత్రిలో సంచలనం రేకెత్తించింది. ఆమె మృతితో కుటుంబం వీధిన పడింది. ఏజెన్సీ ఎజైల్ సంస్థ తదితరులు సుమారు రూ.లక్ష సాయం అందించారు.
పెస్ట్ కంట్రోల్ వైఫల్యం
ఆస్పత్రిలో పాములు లేకుండా, చెదపురుగులు పట్టకుండా, ఎలుకలు లేకుండా చూసే బాధ్యత పెస్ట్ కంట్రోల్‌ది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్‌ను పొందిన వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి సుమారు రూ.50 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఆ సంస్థ నిబంధనలు గాలికొదిలేశారని ఆరోపణలున్నాయి. మందును స్ప్రే చేయడం మినహా మిగతా పనులు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలుకలు పట్టేందుకు బోనులు పెట్టాలి. పాములు నివసించేందుకు అనువైన పుట్టలు, బొరియలుంటే తొలగించాలి. బొద్దింకలు, ఇతర చెదపురుగులు చేరకుండా మందులు వాడాలి. ప్రతి నెలా రూ.లక్షలో బిల్లులు తీసుకుంటున్నా నిబంధనల మేరకు పని చేయడంలేదని విమర్శలున్నాయి. సరిపడా ఉద్యో గులను నియమించలేదని తెలుస్తోంది. అయినా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆ ఏజెన్సీకి ఫుల్ మార్కులు వేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లోపాలు సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment