ఉచిత ఇసుక పథకంలో మెలికలు
ఇప్పటికే రీచ్‌ల నిర్వహణ పూర్తిగా ప్రైవేటు ఏజెన్సీలకు
ఎవరూ సొంతంగా తవ్వుకోలేరని తెలిసే తాజా నిబంధన
రీచ్‌కు లేబర్‌ను తీసుకెళ్లి తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలి
అక్కడున్న ప్రైవేటు వారితో తవ్వించుకోవాలంటే డబ్బు కట్టాలి
తాజా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి : ఉచిత ఇసుక పథకంలో ప్రభుత్వం మరో కొత్త మెలిక పెట్టింది. వినియోగదారులే రీచ్‌లకు కార్మికులను తీసుకెళ్లి, తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని తెలిపింది. అలా తవ్వించుకోలేకపోతే అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు వారికి డబ్బు చెల్లించి తవ్వించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇలా ఉచిత ఇసుక పథకంలో పలు మార్పులు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇసుక రీచ్‌లను ఇప్పటికే ప్రైవేటు వారికి అప్పగించిన ప్రభుత్వం.. వారు ఇసుక సరఫరా చేయాలంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు ఇతర రుసుములు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా చెల్లించిన వాటికి రశీదులు కూడా ఇస్తారని తెలిపింది. ఒకవేళ వారితో పని లేదనుకుంటే సొంతంగా రీచ్‌కు లేబర్‌ని తీసుకువెళ్లి ఇసుకను తవ్వించి, రవాణా వాహనాల్లోకి లోడ్ చేయించుకుని తీసుకెళ్లాలని తెలిపింది. ఇలా చేయడం ఏ వినియోగదారుడికీ సాధ్యమయ్యే పరిస్థితి ఉండదని తెలిసి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇవ్వడం గమనార్హం.
అంటే ఎవరైనా తప్పనిసరిగా ప్రైవేటు వారిపై ఆధారపడాల్సిందే. వారికి డబ్బు కట్టాల్సిందే. అందుకే ఇసుక రీచ్‌లన్నింటినీ ప్రైవేటు ఏజెన్సీలే నిర్వహిస్తాయని మార్గదర్శకాల్లో తెలిపింది. ఒకవేళ ఎవరైనా లేబర్‌ను తీసుకెళ్లి తవ్వుకోవాలని ప్రయత్నించినా, అక్కడున్న ప్రైవేటు ఏజెన్సీల నిర్వాహకులు అంగీకరించరన్నది సుస్పష్టం.
ఏతావాతా ఉచితం పేరుకే కానీ, నయా పైసలతో సహా వసూలు చేయాలన్నది చంద్రబాబు సర్కారు వ్యూహంలా ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇసుక తవ్వకాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే జరుగుతాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. బల్క్ వినియోగదారుల కోసం ఇసుక కమిటీలు ప్రత్యేకంగా ఇసుక వనరులను రిజర్వు చేయవచ్చని తెలిపింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం ఇసుక ఇలా తీసుకెళ్లాలి
» అనుమతించిన రీచ్‌లు, డీసిల్టేషన్ పాయింట్ల (సరఫరా ప్రదేశాలు) నుంచి మాత్రమే ఇసుక సరఫరా అవుతుంది.
» ఇసుక కోసం ఆన్‌లైన్‌లో లేదా సరఫరా పాయింట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి
» రిజిస్టర్ చేసుకున్నాక జారీ అయ్యే ఈ–ట్రాన్సిట్/పర్మిట్ ద్వారా వినియోగదారుడు సొంత వాహనం లేదా మైనింగ్ శాఖ రిజిస్టర్ చేసిన వాహనాన్ని ఎంపిక చేసుకోవాలి
» ఆ వాహనం ఖర్చును వినియోగదారులు నేరుగా రవాణాదారులకే చెల్లించాలి
» ఆ తర్వాత రవాణాదారు లేదా వినియోగదారు ఇసుక పాయింట్ వద్ద ఉన్న ఇన్‌ఛార్జి వద్దకు వెళ్లి డెలివరీ తేదీ, టైమ్ స్లాట్ తెలుసుకోవాలి
»టైమ్ స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయానికి రవాణాదారు రీచ్‌కు వెళ్లి అక్కడ ఉన్న ప్రైవేటు ఏజెన్సీ ద్వారా గానీ, సొంత కార్మికుల ద్వారా గానీ ఇసుకను తవ్వించుకుని వాహనంలో లోడ్ చేయించుకోవాలి
» లేబర్‌ను తీసుకెళ్లలేక అక్కడ ప్రభుత్వం నియమించిన ప్రైవేటు ఏజెన్సీ సహాయాన్ని పొందాలనుకుంటే జిల్లా ఇసుక కమిటీలు నిర్ణయించిన రేట్లు చెల్లించాలి
» అలా డబ్బు కట్టి తీసుకెళ్లే వాహనానికి ‘ఉచిత ఇసుక రవాణా వాహనం’ అనే పేరుతో ఉన్న బ్యానర్‌ను తప్పనిసరిగా ఉండాలి.
» స్థానికంగా ఉన్న ఇసుకను ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యక్తిగత, కమ్యూనిటీ పనుల కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లలో మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అలా తీసుకెళ్లే ఇసుకను యంత్రాలతో కాకుండా మనుషులతో మాత్రమే తవ్వించుకొని తీసుకెళ్లాలి. ఈ తవ్వకాలు, తరలింపు సమాచారాన్ని ఆన్‌లైన్‌లో లేదా స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో ముందుగానే ఇవ్వాలి.
» ప్రభుత్వం, మైనింగ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం ఇసుక రీచ్‌లలో మిగిలిన ఇసుకను జిల్లా కమిటీలు ఇసుక రీచ్‌లు లేని జిల్లాల కోసం రిజర్వు చేస్తాయి. ఇందుకోసం ఇసుక రీచ్‌లు లేని జిల్లాల కమిటీలు వాటి జిల్లాల్లో ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసి, వాటికి మినరల్ డీలర్ లైసెన్సులు (ఎండీఎల్) జారీ చేయాలి. లైసెన్సు పొందిన ఏజెన్సీలు నిర్దేశించిన రీచ్ నుంచి, నిర్దేశించిన ధరకు ఇసుకను తెచ్చి వినియోగదారులకు సరఫరా చేయాలి. ఇందులోనే రవాణా, ఆపరేషన్, నిర్వహణ ఛార్జీలు ఉంటాయి.
సీనరేజికి మాత్రమే మినహాయింపు.. జీఎస్టీ చెల్లించాల్సిందే..
ఇసుకకు సీనరేజితోపాటు జీఎస్టీ కూడా రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటికీ, మార్గదర్శకాల్లో మాత్రం సీనరేజిని మాత్రమే మినహాయించారు. టన్నుపై రూ.88గా వసూలు చేస్తున్న సీనరేజి ఫీజును మాత్రమే వసూలు చేయకుండా మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రద్దు గురించి ప్రస్తావించలేదు. అంటే ఆపరేషనల్ ఖర్చులు, నిర్వహణ ఛార్జీలతోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment