గుట్టుచప్పుడు కాకుండా ఇసుక టెండర్లు టీడీపీ నేతలకు ధారాదత్తం
ప్రభుత్వ ఆదాయానికి గండి.. నేతల జేబులు నింపే కార్యక్రమం
టెండర్లు రద్దు చేయకపోతే పోరాటం తప్పదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ హెచ్చరిక
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఖనిజ సంపద దోపిడీకి మాస్టర్ స్కెచ్ వేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఇసుక దోపిడీని వ్యవస్థీకృతం చేసి ప్రత్యక్ష దోపిడీకి దిగారని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ అనుమానం రాకుండా కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రజలంతా దసరా సందడిలో ఉంటే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసుక, మద్యం టెండర్ల పండుగలో ఉన్నారని చెప్పారు. ఎవరూ పాల్గొనే అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీచ్‌ల టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ.. దోపిడీకి తెరలేపిందన్నారు.
ఆ బిడ్‌ల వెనుక మర్మమేమిటి?
టన్ను ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120గా బేస్ ధరగా టెండర్లలో నిర్ణయించి, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ.50 నుంచి రూ.60కి తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం వెనుక మర్మమేంటని టీజేఆర్ నిలదీశారు. ఇసుక టెండర్లలో అక్రమాలకు ఈ ధరలే నిదర్శనమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 రీచ్‌లకు 48 గంటల్లో టీడీపీ నేతల నుంచి బిడ్‌లు స్వీకరించి ఖరారు చేసేశారని, కర్నూలులో అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఒకే టెండర్ వస్తే బిడ్‌ను ఆమోదించారన్నారు.
వైఎస్సార్, పల్నాడు, ఉభయ గోదావరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చిత్తూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో బీజేపీ, జనేసేన నేతలతో కలసి టీడీపీ నాయకులు బ్లాక్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, ఇసుక టెండర్లను రద్దు చేయాలని, లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment