సీఎం చంద్రబాబును సూటిగా నిలదీసిన వైఎస్ జగన్
ఎన్నికల ముందు ఉచితం అంటూ ఊరూరా డప్పుకొట్టారు
మా హయాంలో ఏటా రూ.750 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చేది
ఇప్పుడు ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రాకపోగా ప్రజలకు 2,3 రెట్లు ధర ఎందుకు పెరిగింది?
వర్షాకాలం అవసరాల కోసం మేం 80 లక్షల టన్నులు నిల్వ చేశాం
ఆ ఇసుకను టీడీపీ, కూటమి పార్టీల నేతలు దోచేయలేదా?
ఉచిత ఇసుక అంటూ సొంత మనుషులకు అప్పనంగా రీచ్‌లను కట్టబెట్టారు
రెండు రోజుల గడువుతో రీచ్‌లకు టెండర్లు పిలవడమే ఇందుకు నిదర్శనం
ఇసుక పేరిట దోపిడీకి ఎంత దారుణంగా స్కెచ్ గీశారంటే... అందరూ దసరా పండుగ హడావుడిలో ఉండగా 108 రీచ్‌లకు టెండర్లు పిలిచారు. బిడ్‌ల దాఖలుకు కేవలం రెండు రోజులే గడువు ఇచ్చారు.
రెండు రోజుల్లో టెండర్ దాఖలు చేయడం ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా? ఎందుకంటే అన్ని రీచ్‌లు టీడీపీ కూటమి మాఫియా సభ్యులకే కట్టబెట్టడం... ఆ తర్వాత నీకు ఇంతా.. నాకు ఇంతా.. అని పంచుకోవడమే వారి లక్ష్యం. ప్రభుత్వం దగ్గరుండి తమ వారితో కలిసి దోచేసే కార్యక్రమం చేస్తోంది. – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. మరి రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్కరికైనా ఉచితంగా ఇసుక ఇచ్చారా?’’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇసుక టెండర్లకు కేవలం రెండు రోజులే సమయం ఇచ్చారని.. అదీ దసరా పండుగలో అందరూ నిమగ్నమై ఉన్నప్పుడు తన మాఫియాకు ఇసుక రీచ్‌లను చంద్రబాబు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. అధిక ధరలకు ఇసుక అమ్ముకుంటూ ఎమ్మెల్యేలు, చంద్రబాబు నీకింత నాకింత అంటూ దోచేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
దోపిడీకి నిదర్శనం టెండర్ నోటిఫికేషన్
ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇసుక టెండర్ డాక్యుమెంటే నిదర్శనం. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందేమో మీరే పరిశీలించండి. దసరా పండుగ సమయంలో 108 రీచ్‌లకు టెండర్లు పిలిచారు. బిడ్డింగ్‌కు రెండే రెండు రోజులు గడువిచ్చారు. ఈనెల 8న టెండర్లు ఆహ్వానించారు. బిడ్ దాఖలుకు తుది గడువుగా పదో తేదీని నిర్ణయించారు. రెండు రోజుల్లో టెండర్ దాఖలు చేయడం ఎక్కడైనా చూశామా? ఎందుకంటే బయట వాళ్లెవరూ టెండర్లలో బిడ్‌లు వేయకూడదనే! ఒకవేళ ఇతరులు టెండర్‌లో బిడ్ దాఖలు చేస్తే వాళ్లను బెదిరించే మాఫియా తయారవుతుంది.
బయట వారికి చాన్స్ ఇవ్వకుండా అన్ని రీచ్‌లు తమ మాఫియా సభ్యులకే కట్టబెట్టడం, ఆ తర్వాత నీకు ఇంత.. నాకు ఇంత! అని పంచుకోవడం. ప్రభుత్వం దగ్గరుండి తమ వారితో కలిసి దోచేసే కార్యక్రమం చేస్తోంది. ఇదీ ఇసుక మాఫియా తీరు. 2014–19 మధ్య కూడా ఇదే రకమైన మోడస్ ఆపరండా సాగింది. అప్పట్లో ఇసుక మాఫియా గురించి చెప్పాలంటే... తొలుత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామని బిల్డప్ ఇచ్చారు.
ఆ తర్వాత ఉచిత ఇసుక అని మెమో ఇచ్చి తమకు కావాల్సిన మనుషులకు ఇసుక రీచ్‌లు అప్పగించారు. చంద్రబాబు ఇంటి పక్కనే పొక్లెయిన్లు పెట్టి యథేచ్చగా ఇసుకను తవ్వేయడం మనమంతా కళ్లారా చూశాం. ఈరోజు మళ్లీ సేమ్ టూ సేమ్.. అదే దోపిడీ పునరావృతమవుతోంది. ఇప్పుడు బీజేపీకి భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉండడంతో భయం.. భక్తి లేకుండా నిస్సిగ్గుగా బట్టలిప్పేసి మరీ దోచుకుంటున్నారు. టెండర్లకు 2 రోజులు గడువు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం.
లారీ ఇసుక రూ.60 వేలు
ఖజానాకు ఆదాయం సున్నా
ఉచిత ఇసుక పేరిట దోపిడీకి ఎంత దారుణంగా స్కెచ్ గీశారో చూడండి.. ఇసుక ధర చాలా ఎక్కువగా ఉందంటూ ఎన్నికలకు ముందు దుష్ప్రచారం చేశారు. మరి ఈరోజు అదే చంద్రబాబు.. కూటమి నేతలను అడుగుతున్నా. రాష్ట్రంలో దాదాపుగా 141 నియోజకవర్గాల్లో సగటున లారీ ఇసుక రూ.20 వేలకుపైగా ఉంది. 53 నియోజకవర్గాల్లో రూ.30 వేలు ఉంటే.. కొన్ని నియోజకవర్గాల్లో లారీ ఇసుక ఏకంగా రూ.60 వేలు పైగా ఉంది. ఒకవైపు ఇసుకేమో ఉచితం అంటారు.
మరోవైపున చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సున్నా అయిపోయింది. రేట్లు చూస్తే గతం కంటే రెండింతలు.. మూడింతలు పెరిగాయి. మరి ఉచిత ఇసుక అంటే ఇదేనా? వైఎస్సార్‌సీపీ హయాంలో వర్షాకాల అవసరాల కోసం మేం 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే అందులో సగానికిపైగా ఇసుకను దోచేయడం వాస్తవం కాదా? వాళ్ల దోపిడీకి స్టాక్ యార్డులన్నీ ఖాళీ అయిపోయాయి.
పారదర్శకంగా ఇసుక పాలసీ అమలు చేశాం
మా ప్రభుత్వంలో ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేశాం. ఎక్కడా దోపిడీకి అవకాశం లేకుండా మా పాలసీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ ఫారమ్ ద్వారా ఈ–టెండరింగ్ పిలిచాం. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకు ఆదాయం వచ్చేలా అధిక ధరకు కోట్ చేసిన బిడ్డర్లను ఎంపిక చేశాం. టన్ను ఇసుకకు రూ.475తో మైనింగ్ చేసే విధంగా కాంట్రాక్టు ఇచ్చి.. అందులో రూ.375 ప్రభుత్వానికి రాయిల్టీ రూపంలో చెల్లించేలా చేశాం. అలా సంవత్సరానికి రూ.750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేశాం.
కానీ.. ఈ రోజు పేరుకు మాత్రమే ఉచిత ఇసుక. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం సున్నా. ఎక్కడైనా, ఎవరికైనా ఉచితంగా ఇసుక ఇచ్చారా? గతంలో నియోజకవర్గాల వారీగా ఎంత రేటుకు ఇసుక అమ్మాలో ధరలు నిర్ణయించి ప్రతి వారం దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చాం. అంతకు మించి ఎక్కువకు అమ్మితే రూ.2లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష అని హెచ్చరిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాం. ఈరోజు ఇసుక కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment