ఎల్టీపీలకు భవన నిర్మాణ అనుమతుల మంజూరు అధికారం
ప్లాన్లు గీసేది వారే.. అనుమతులు ఇచ్చేదీ వారే
15 మీటర్ల ఎత్తు నిర్మాణాల వరకు లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్‌కే పూర్తి బాధ్యతలు.. ఈ ముసుగులో ఎమ్మెల్యేలు సొమ్ములు దండుకునేందుకే..
తద్వారా ‘ముఖ్య నేత’కు వాటా దక్కేలా ప్లాన్
టౌన్ ప్లానింగ్‌లో చట్టం మార్పునకు ఆమోదం
త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్న ప్రభుత్వం
ఇకపై అనుమతి లేని లే–అవుట్లలోనూ యథేచ్ఛగా అక్రమ కట్టడాలు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రణాళిక విభాగంలో భవన నిర్మాణ అనుమతుల మంజూరు బాధ్యతలు ప్రైవేటుపరం కానున్నాయి. ఇప్పటివరకు స్థల యజమానులకు ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా భవన నిర్మాణ ప్లాన్లు ఇచ్చే లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్టీపీలు) ఇకపై నిర్మాణ అనుమతులు కూడా మంజూరు చేయనున్నారు. ఇంటి నిర్మాణ ప్లాన్ల మంజూరు ముసుగులో ఎమ్మెల్యేలు సొమ్ములు దండుకునేందుకు వీలుగా ఈ మార్పు చేస్తున్నట్టు సమాచారం.
ఇలా దండుకున్న మొత్తంలో ‘ముఖ్య నేత’కు వాటాలు దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు భోగట్టా. ఇందుకోసం పురపాలక పట్టణాభివృద్ధి శాఖలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో మార్గదర్శకాలను మారుస్తున్నారు. ఇందుకోసం టౌన్‌ప్లానింగ్ చట్టాల్లో ప్రభుత్వం మార్పులు చేస్తోంది. 15 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు ప్లానింగ్‌తో పాటు నిర్మాణ అనుమతులనూ ఎల్టీపీలే జారీ చేసేలా అధికారం ఇవ్వనున్నారు.
ఇలాంటి నిర్మాణాలపై ఫిర్యాదు అందితేనే టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణాన్ని పరిశీలించి చర్యలకు సిఫారసు చేసేలా నిబంధనలు ఉండనున్నాయి. ఈ విధానంతో ప్రభుత్వ అనుమతిలేని లే–అవుట్లలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరగడంతోపాటు దురాక్రమణలకూ అస్కారం ఉంటుంది. ఇటీవల చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార లే–అవుట్‌లో ఓ మంత్రి చేపట్టిన భవన నిర్మాణానికి అక్కడి సిటీ ప్లానర్ అనుమతిచ్చేందుకు నిరాకరించారు.
దీంతో ఆగ్రహించిన మంత్రి, నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి తొలగించి, ఎల్టీపీలకు అప్పగించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఏపీ లో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న 4 వేల మంది వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో పాటు టీపీవోలు, ఏసీపీలు, సీపీల విధులు, బాధ్యతలను లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్లకు అప్పగించనున్నట్టు తెలిసింది.
అక్రమ నిర్మాణాలకు లైసెన్స్ ఇచ్చినట్టే..
ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతి తప్పనిసరి. ఇందుకోసం స్థల యజమానులు నిర్మాణ ప్లాన్‌తో పాటు నిర్ణీత రుసుం చెల్లించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఎల్టీపీ ద్వారా టౌన్ ప్లానింగ్ విభాగానికి పంపిస్తున్నారు. ఈ ప్లాన్‌ను టౌన్ ప్లానింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీవో) లేదా అసిస్టెంట్ సిటీ ప్లానర్ లేదా సిటీ ప్లానర్ పరిశీలించి అనుమతి ఇస్తారు. అంతకుముందు ఏపీడీఎంఎస్‌లో ఉన్న నిబంధనల మేరకు ప్లాన్ ఉందో లేదో సాఫ్ట్‌టెక్ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలిస్తారు.
సదరు ప్లాన్ నిబంధనల పరిధిలో ఉండి అన్ని ఫీజులు చెల్లించి ఉంటే ఆన్‌లైన్‌లో నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తారు. ప్లాన్ ఇచ్చేవారు, అనుమతి ఇచ్చేవారు ఒక్కరే అయితే నిబంధనలు అతిక్రమించే ప్రమాదముందన్న భావనతో గతంలో ఈ రెండు విధులు వేర్వేరుగా ఉంచారు. దీంతోపాటు ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించి నిర్మాణ ప్లాన్ మంజూరైతే దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకునేలా గత ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తప్పు చేసిన ఎల్టీపీ లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు అనుమతి మంజూరు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులపైనా చర్యలు తీసుకునేవారు.
కొత్త నిబంధనల ప్రకారం ప్లాన్ గీసేదీ, ప్రభుత్వానికి పంపేది.. వాటిని అనుమతి ఇచ్చేదీ ఎల్టీపీనే. 15 మీటర్ల ఎత్తు భవనాలకు అంటే ఐదు అంతస్తుల భవన నిర్మాణాల అనుమతులన్నీ పూర్తిగా ఎల్టీపీలకు ఇవ్వనున్నారు. ఇందులో ఎంత విస్తీర్ణం అనే చెప్పకపోవడంతో భారీగా అక్రమాలు చోటుచేసుకునే ఆస్కారముందని, అనధికార లే–అవుట్లలో ప్లాట్లకు కూడా అనుమతులు మంజూరు చేసే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.
పైగా ఇలాంటి నిర్మాణాలపై ఫిర్యాదు అందితేనే టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలన చేయాలన్న నిబంధన కూడా విధించినట్టు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ చట్టంలో మార్పులు చేయాలని ఆదేశించిన మంత్రి.. త్వరలో ఈ నిబంధనలు అమల్లోకి తేవాలని పట్టుదలతో ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment