Town Planning
-
ఏసీబీకి దొరికిపోయారు
హైదరాబాద్: ఇంటి నిర్మాణ అనుమతికి లంచం తీసుకుంటున్న హయత్‌నగర్ టౌన్ ప్లానింగ్ అధికారితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం పట్టుకున్నారు. గుర్రంగూడకు చెందిన జక్కిడి సుధాకర్‌రెడ్డి బీఎన్‌రెడ్డి నగర్లో ఇంటి నిర్మాణ అనుమతి కోసం హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఉమను సంప్రదించారు. ఇంటి నిర్మాణ అనుమతికి రూ.2 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రూ.1.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని సుధాకర్‌రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్‌లోని హయత్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో సుధాకర్‌రెడ్డి నుంచి రూ.1.5 లక్షలు టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ ఉమ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మణ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ తదితరఅధికారులు పట్టుకున్నారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపర్చారు. -
ఏలూరులో ఏసీబీ సోదాలు.. టౌన్ ప్లానింగ్ లో రికార్డుల తనిఖీ
ఏలూరు టౌన్: ఏలూరు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఏలూరులో భవన నిర్మాణాలకు అనుమతులు, అపార్టుమెంట్లలో అనుమతులకు విరుద్ధంగా పెంట్‌హౌస్‌ల నిర్మాణం, ప్లాన్ల అనుమతులకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలు సాగుతున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ రంగంలోకి దిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్ విభాగాలను గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూ రు జిల్లా ఏసీబీ డీఎస్పీ పీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు ఎన్వీ భాస్కరరావు, కె.నాగేంద్రప్రసాద్, సిబ్బంది రికార్డులు తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి గత కొన్నేళ్లుగా ఉన్న రికార్డులన్నీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయంత్రం 8.30 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. శుక్రవారం కూడా సోదాలు ఉంటాయని డీఎస్పీ స్పష్టం చేశారు. భవన నిర్మాణ అనుమతుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా అవకతవకలు జరిగినట్టు తనిఖీల్లో గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని, అవినీతి, అవకతవకలు చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు చేపట్టామని, ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. -
ఫోనొచ్చింది ఆపండహో!
గచ్చిబౌలి: అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. నిర్మాణాలను కూల్చివేయకుండా తమ పలుకుబడిని ప్రదర్శిస్తున్నారు. సర్కారు స్థలాల్లో పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా తొలగించే బల్దియా యంత్రాంగం.. బడాబాబుల అక్రమాల జోలికి మాత్రం వెళ్లేందుకు సాహసించడంలేదు. ఒకవేళ వెళ్లినా వాటిని తూతూమంత్రంగా కూల్చేసి చేతులు దులుపుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణ ‘ఇన్ఫినిటీ’ నిర్మాణం కూల్చివేత. ‘ఈ అక్రమం ఇన్ఫినిటీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి సదరు కట్టడాన్ని కూల్చివేయాలని ఎన్ఫోర్స్మెంట్ డీఈ అనురాగ్, శేరిలింగంపల్లి సర్కిల్ టీపీఎస్ రమేష్‌ను ఆదేశించారు. దీంతో ఆగమేఘాల మీద మంగళవారం అక్కడికి వెళ్లిన యంత్రాంగం.. ఇన్ఫినిటీ నిర్మాణం కూల్చివేతను మొదలుపెట్టారు. దీని నిర్వాహకులు జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లామని కూల్చివేతలు ఆపాలని ఒత్తిడి చేశారు. వీటిని పట్టించుకోకుండా కూల్చివేతలు సాగుతుండగానే నిర్వాహకులు చెప్పినట్లు అటు వైపు నుంచి వెస్ట్ జోనల్ ఎన్ఫోర్స్మెంట్ నోడల్ అధికారి, చందానగర్ ఉప కమిషనర్ సుధాంశ్ ఫోన్ నుంచి రావడం.. కూల్చివేతలను అర్ధాంతరంగా నిలిపివేసి వెనుదిరిగారు. నేను ఎవరికీ ఫోన్ చేయలేదు ‘ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ కూల్చివేతలు ఆపాలని నేనెవరికీ ఫోన్ చేయలేదు’ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. మాట్లాడినట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. నియోజవర్గంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో ఎప్పుడు తాను జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఉప కమిషనర్ల కనుసన్నల్లోనే.. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్ నిర్మాణం చేపడుతున్న సమయంలో ఆరు నెలల క్రితం ‘న్యాక్ గా’ ‘సాక్షి’లో వచ్చిన కథనంపై శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసు సిద్ధం చేసినట్లు సమాచారం.. శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న నోటీసుపై సంతకం చేయకపోవడంతో నోటీసులు జారీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అయిదెకరాల సువిశాల విస్తీర్ణంలో చేపట్టిన ఇన్ఫినిటీకి ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాల ఆన్లైన్ జాబితాలో లేకుండా పోయింది. దీంతో ఎంచక్కా ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌కు చిక్కకుండా దర్జాగా నిర్మాణం పూర్తి చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. గోపన్‌పల్లిలోని పెద్ద చెరువు సమీపంలో ఓ గిరిజన వ్యక్తి వంద గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఎన్ఫోర్స్మెంట్ టీమ్ కూల్చివేసింది. అక్కడ కూల్చివేతలు జరపాలని ప్రజా ప్రతినిధుల జోక్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కూల్చివేతలు జరపాలన్నా, నిలిపివేయాలన్నా ప్రజాప్రతినిధులతోనే సాధ్యమని స్థానికులు పేర్కొంటున్నారు. (చదవండి: అన్నింటా అభివృద్ధి సాధిస్తూ..) -
ఇల్లు కట్టుకునేందుకు ఈజీగా అనుమతులు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా సులభరీతిలో వేగంగా పొందేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఉపాధి, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు పట్టణాల వైపు చూస్తున్నారని, వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలు, సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం బుద్ధభవన్‌లో జరిగిన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బందితో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. భవన నిర్మాణ అనుమతుల కోసం రూపొందించే నూతన విధానం ప్రకారం 75 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే వారు తమ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలని, 600 చదరపు గజాల్లోపు భవన నిర్మాణాలకు సెల్ఫ్ డిక్లరేషన్ విధానం అమలు చేస్తామన్నారు. (చదవండి : సీఎం పత్రికా ముఖంగా చెప్పగలరా?: ఇంద్రసేనారెడ్డి ) 600 చదరపు గజాలకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవన నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తామని ప్రకటించిన కేటీఆర్, పారిశ్రామిక అనుమతుల్లో సింగిల్ విండో విధానం విజయవంతంగా అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనుమతుల ప్రక్రియలో సమయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచేలా పనిచేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందికి సూచించారు. పాత అనుమతుల విధానాన్ని పూర్తిగా మార్చి నూతన విధానం ప్రవేశ పెట్టే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురైనా వెనక్కితగ్గేది లేదన్నారు. సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు ప్రజలు, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి మద్దతు లభిస్తుందనే నమ్మకంతోనే నూతన విధానం తెస్తున్నామని, ఈ విధానంలోని నిబంధనలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు అనుమతులు, అక్రమ నిర్మాణాలు చేపడితే ముందస్తు సమాచారం లేకుండానే కూల్చివేతలు చేపట్టే అధికారం నూతన పురపాలక చట్టంలో ఉందన్నారు. నూతన విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులపైనే ఉంటుందని, అక్రమ నిర్మాణాలకు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై వచ్చే అవినీతి ఆరోపణలపై కఠినంగా వ్యవహరించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం లేదని, నిజాయితీతో పనిచేసే సిబ్బందికి తమ సహకారం ఉంటుందన్నారు. హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ పద్ధతినే.. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ చెప్పారు. ఇక ప్రతీ మున్సిపాలిటీకి ఒక మాస్టర్‌ప్లాన్‌తో పాటు, మాస్టర్‌ప్లాన్ రూపకల్పన క్యాలెండర్‌ను తయారు చేయాలని డీటీసీపీ అధికారులను మంత్రి ఆదేశించారు. హెచ్ఎండీఏ అనుసరిస్తున్న ల్యాండ్ పూలింగ్ పద్ధతులనే రాష్ట్రంలోని ఆరు పట్టణాభివృద్ధి సంస్థలూ అనుసరించాలని సూచించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ సీపీపీ దేవేందర్ రెడ్డి, డీటీసీపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ. 2 కోట్ల స్థలం కబ్జా!
అది గూడూరు పట్టణంలో ఎంతో విలువైన స్థలం. అక్కడ అంకణం విలువ సుమారు రూ.20 లక్షలకు పైమాటే. అలాంటి ప్రాంతంలో సుమారు 10 అంకణాలకు పైగా రూ.2 కోట్ల విలువజేసే స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏకంగా ఆ స్థలంలో భవన నిర్మాణానికి అనుమతులిచ్చారు. సంబంధిత ఆర్అండ్బీ శాఖాధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి, గూడూరు: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఎదురుగా పురాతన గడియారం బిల్డింగ్ ఉండేది. అప్పట్లో వాహనాల పార్కింగ్ నిమిత్తం ఆ భవనానికి ముందుగా సుమారు 10 నుంచి 15 అంకణాల వరకూ ఆర్అండ్బీ అధికారులు స్థలాన్ని వదిలి ఉంచారు. కాలక్రమంలో ఆ గడియారం బిల్డింగ్ ఉన్న స్థలాన్ని ప్లాట్ల రూపంలో విభజించి విక్రయించారు. ఈ క్రమంలో ఆర్అండ్బీ పార్కింగ్ స్థలానికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తుల కన్ను పార్కింగ్ నిమిత్తం వదిలిన స్థలంపై పడింది. ఇదే అదనుగా ఆ దుకాణ సముదాయం నిర్మించే బిల్డర్, సేవ ముసుగులో అవినీతికి పాల్పడే ఎల్‌బీఎస్‌లు(లైసెన్స్డ్ బిల్డింగ్ సర్వేయర్) టౌన్ ప్లానింగ్ అధికారులతో మధ్యవర్తిత్వం నెరిపి, ఆ శాఖ అధికారులకు భవన నిర్మాణధారుల నుంచి భారీ స్థాయిలో ముడుపులు ఇప్పించారు. అలాగే ఆర్అండ్బీ శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూడకుండా వారికి కూడా నగదు ముట్టజెప్పినట్లు బిల్డర్, ఎల్‌బీఎస్‌లు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కొనుగోలు చేసిన స్థలంతోపాటు కబ్జా చేసిన స్థలాన్ని కలుపుకుని భారీ స్థాయిలో దుకాణ సముదాయ నిర్మాణానికి సన్నద్ధమవుతున్నారు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణం చేపట్టే స్థలానికి ముందుకు వచ్చి కనీసం సెట్ బ్యాక్‌లకు కూడా స్థలం వదలకుండా పెద్ద పిల్లర్‌ను ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలం నాడే ముందు చూపుతో ఆ శాఖాధికారులు పార్కింగ్ అవసరాల నిమిత్తం స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం పెరిగిన వాహనాల రద్దీతో ఆ స్థలం కూడా సరిపోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కొద్దిపాటి స్థలాన్ని కూడా ఆర్అండ్బీ అధికారులు కాపాడుకోవాల్సి ఉంది. అయితే దర్జాగా కబ్జా చేసేస్తుంటే పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హద్దులు చూపాలని తహసీల్దార్‌ను కోరాం మా శాఖకు చెందిన పార్కింగ్ స్థలం అక్కడ ఉందని మా దృష్టికి వచ్చింది. దీంతో గతంలోనే ఆ స్థలానికి సంబంధించిన హద్దులు చూపాలని తహసీల్దార్‌ను రాత పూర్వకంగా కోరాం. కబ్జాకు గురవుతుందని తెలిసింది కాబట్టి మా స్థలాన్ని కాపాడుకునేందుకు మళ్లీ హద్దులు చూపాలని అడుగుతాం. మా స్థలంలో నిర్మాణాలు చేపడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – వివేకానంద, ఈఈ, ఆర్అండ్బీ శాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటాం పట్టణంలో స్థలం ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. ఈ మేరకు పరిశీలిస్తున్నాం. కబ్జాకు గురైనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – ఓబులేశు, మున్సిపల్ కమిషనర్ -
ఎన్నికల వేళ.. అక్రమాల లీల!
సాక్షి, సిటీబ్యూరో: టౌన్ ప్లానింగ్ విభాగమంటేనే అక్రమాలకు పర్యాయ పదంగా పేరుంది. దీన్ని మార్చేందుకు, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు. భవననిర్మాణ అనుమతుల్లో లంచాలను అరికట్టేందుకు ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినా...చేయి తడపనిదే పనులు కావడం లేవు. ఇక అక్రమ నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అధికారులు, దిగువస్థాయి సిబ్బంది అక్రమనిర్మాణాలు అడ్డుకోవడం మాని అక్రమార్కులకు సహకరిస్తున్నారు. అందిన కాడికి దండుకుంటూ కళ్లు మూసుకొని చోద్యం చూస్తున్నారు. మరోవైపు కోర్టు స్టేలు తెచ్చుకోవాల్సిందిగా మార్గదర్శనం చేస్తున్నారు. ఇదంతా ఎంతోకాలంగా జరుగుతోన్న తంతు. ప్రస్తుతం ఎన్నికల పనులు జరుగుతుండటంతో ఎన్నికల విధుల్లోనూ పాల్గొనాల్సి ఉంది. దీన్ని సాకుగా చూపుతూ అక్రమ నిర్మాణాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదు. ఎన్నికల బిజీ అంటూ దాట వేస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణదారులను మరింత ప్రోత్సహిస్తున్నారు. ‘ఇదే సరైన అదను. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కూల్చివేసేందుకూ సమయముండదు. త్వరత్వరగా అక్రమ నిర్మాణాలు పూర్తిచేసుకోండంటూ’ తగిన సలహాలిస్తూ తమ వంతు సహాయం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని అక్రమ నిర్మాణం ఆలోచన లేని వారు సైతం అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. ప్రధాన మార్గాల్లో బహుళ అంతస్తుల భవనాలతో పాటు ఇరుకుగల్లీల్లో 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉన్న సందుల్లోనూ అదనపు అంతస్తులు వేసేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌తో సహ ఉన్నతాధికారులు సైతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో ఎవరూ పట్టించుకోరనే ధీమాతో అటుఅక్రమ అంతస్తులకు, ఇటు అధికారుల లంచాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కార్పొరేటర్ స్థాయి నేతలు సైతం ఈ సమయాన్ని సానుకూలంగా మలచుకొని తమ లాభం తాము చూసుకొని అక్రమ నిర్మాణాలకు తమవంతు సాయమందిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేసేవారు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు అందరూ దీన్నే తమకు ‘అనుకూల’ సమయంగా మలచుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా జోరుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాదు.. హెచ్ఎండీఏ పరిధిలోని శివార్లలోనూ ఇదే తీరు. జీహెచ్ఎంసీకి దాదాపు మూడేళ్లక్రితం బీఆర్ఎస్ కోసం అందిన దరఖాస్తులు 1.39 లక్షలు. ఆ గడువు ముగిశాక సైతం ఇప్పటి వరకు లక్షకు పైగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అంచనా. నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాల్లో కొన్ని... శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లలో... గచ్చిబౌలి: శేరిలింగంపల్లి , చందానగర్ సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని సిద్ధిఖీనగర్, అంజయ్యనగర్, శ్రీరాంనగర్ కాలనీ, రాఘవేంద్రకాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలో గోకుల్ ప్లాట్స్, మదీనాగూడ, చందానగర్, దీప్తీశ్రీనగర్, ఎంఏనగర్, హాఫీజ్పేట్, బీకే ఎన్క్లేవ్, న్యూ కాలనీ తదితర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ ఎస్ఈజడ్కు ఎదురుగా ఓ వ్యక్తి మూడు అంతస్తుల అనుమతి తీసుకొని ఐదు అంతస్తుల భవనం నిర్మించారు. ♦ మియాపూర్ న్యూ కాలనీలో మూడు భవనాలు రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని అదనంగా ఒక అంతస్తు నిర్మిస్తున్నారు. బీకే ఎన్‌క్లేవ్‌లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదని ఉన్నా ఎలాంటి అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నారు. ♦ హాఫీజ్పేట్ ఆర్టీసీ కాలనీలో రెండు అంతస్తులు నిర్మించేందుకు అనుమతి తీసుకొని అదనంగా మరో అంతస్తు నిర్మిస్తున్నారు టకారా బస్తీలో గాలిలో మేడలు.. రాంగోపాల్‌పేట్: మోండా డివిజన్లోని టకారాబస్తీలో గాలిలో మేడలు వెలుస్తున్నాయి. టకారాబస్తీలో జీ ప్లస్ రెండంతస్తులకు మాత్రమే అనుమతి పొందినప్పటికీ, పెంట్‌హౌస్‌తో సహ ఆరంతస్తుల భవనం వెలిసింది. రేతిఫైలి బస్టాండ్ ఎదురుగా రెజిమెంటల్ బజార్లో జీప్లస్ 2 అంతస్తులకు మాత్రం అనుమతి పొంది అదనంగా మరో అంతస్తు నిర్మాణం చేపట్టారు. నివాస భవనానికి అనుమతులు పొంది మూడంతస్తులతో లాడ్జి నిర్మాణం జరుగుతుండటంతో గుర్తించిన స్థానికులు ఫిర్యాదు చేసినా, నిర్మాణం పూర్తయ్యేంతదాకా మౌనం దాల్చారు. నిర్మాణం పూర్తయ్యాక మొక్కుబడి తంతుగా నోటీసిచ్చారు. లోపాయికారీ ఒప్పందాలతో జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు లెక్కేలేదు. అక్రమ నిర్మాణదారులకు అధికారులే తగిన అండదండలందిస్తారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అక్రమ నిర్మాణదారులకు తగిన సలహాలిచ్చి కోర్టు ద్వారా స్టే తెచ్చుకునే ఏర్పాట్లు చేస్తారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ తరపున పనిచేయాల్సిన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు సైతం అక్రమార్కులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే సర్కిల్లో 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అక్రమ నిర్మాణదారుల కోసం తన సహాయకుడి ద్వారా కోర్టు స్టే కోసం పిటిషన్ వేయిస్తారని, ఫైల్ బెంచి మీదకు వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ తరపున పనిచేసి స్టే రాకుండా చేయడానికి బదులు అక్రమార్కులకు సహకరిస్తారనే ప్రచారం ఉంది. ఎక్కడ పడితే అక్కడ... కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. షాపూర్‌నగర్ సంజయ్‌గాంధీనగర్ నల్లపోచమ్మ ఆలయం పక్కనే సుమారు 98 గజాల్లో ఏకంగా జీ ప్లస్ 3 నిర్మాణం జరుగుతోంది. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. అదే విధంగా జీడిమెట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ముందే ప్రధాన రోడ్డుకు ఆనుకుని 50 గజాల్లో జీప్లస్–3 నిర్మాణం, దాని పక్కనే పాత భవనాలపై కూడా కొత్త నిర్మాణాలు వెలవడం విశేషం. ఈ అక్రమ నిర్మాణాలపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసినా స్పందన లేదు... అమీర్‌పేట: .అమీర్‌పేట, సనత్‌నగర్ డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, అనుచరులు సైతం బిల్డర్ల అవతారమెత్తి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.100 నుండి 200 చదరపు అడుగుల గజాల్లో ఏకంగా 5 నుండి 6 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందిని, పైపెచ్చు ఫలానా వారు ఫిర్యాదు చేశారని అక్రమార్కులకు సమాచారమిస్తుండటంతో వారు ఫిర్యాదుదారులను బెదిరిస్తూ ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం ఉంది. అమీర్‌పేట శివ్‌భాగ్, వెంకటేశ్వర దేవాలయం, ఈడబ్ల్యూ కాలనీ,ఎస్ఆర్నగర్,బల్కంపేట బీకేగూడ, తదితర ప్రాంతాల్లో 60 అడుగుల రోడ్లలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. పాతబస్తీలో ఇష్టారాజ్యం.. దూద్‌బౌలి: పాతబస్తీలో అక్రమ నిర్మాణాల గురించి టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసినప్పటికీ, నిర్మాణదారులతో కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారు. సర్కిల్–9 పరిధిలోని 19, 20, 21 వార్డుల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మురళీనగర్‌లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఐదంతస్తుల భవననిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వార్డునెంబర్ 19లో సెల్లార్ తవ్వి నిర్మాణాలు చేపట్టారు. -
మూడు టౌన్ ప్లానింగ్ కార్యాలయాలు
భూపాలపల్లి, మానుకోట, హన్మకొండ జిల్లాల్లో ఏర్పాటు 12 జిల్లాలకు ఒక్కటే టీసీపీ ఆర్డీ ఆఫీస్! వరంగల్ అర్బన్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖలో విభజన కసరత్తు సాగుతోంది. వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ నాలుగు జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ సిటీప్లానర్ అధికారులు, సర్వేయర్లు, కంప్యూటర్ ఔట్సోర్సింగ్ ఆపరేటర్ల నియామకాలపై రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆనంద్‌బాబు వివరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో జీప్లస్ 2 భవనాల వరకు ఆయా పంచాయతీల కార్యదర్శులు అనుమతులు మంజూరు చేస్తారు. జీ ప్లస్2 ఆపై అంతస్తులకు, పరిశ్రమలకు జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి (డీటీసీపీఓ) నిర్మాణ అనుమతులు జారీ చేస్తారు. దీంతో డీటీసీపీవో పోస్టులు కీలకం కానున్నాయి. డీటీసీపీవోల విభజన ఇలా... ప్రభుత్వం నాలుగు జిల్లాలుగా విభజించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ప్రస్తుతం ఉన్న డీటీసీపీవో ఎ.కోదండరామిరెడ్డి కొనసాగనున్నట్లు సమాచారం. ఇక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ డీటీసీపీవోకు పదోన్నతి కల్పించి హన్మకొండ జిల్లా డీటీసీపీవోగా బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలిసింది. ఇక మహబూబాబాద్, జయశంకర్(భూపాలపల్లి) జిల్లాలకు ఇద్దరు డీటీసీపీవోలు నియమించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వీరిద్దరికే రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. వరంగల్ డీటీసీపీవో కార్యాలయంలో ఇద్దరు అసిస్టెంట్ డీటీసీపీవోలు కావాల్సి ఉంది. ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు ఇద్దరు ఏడీటీసీపీవోలతోపాటు మరో సర్వేయర్‌ను నియమించాల్సి ఉంది. ఆరుగురు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆపరేటర్ల నియామకానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు ఇద్దరి చొప్పన ఏడీటీసీపీవోలు, ఇద్దరు సర్వేయర్లను నియమించాల్సి ఉంది. అంతేకాకుండా ఔట్సోర్సింగ్ పద్ధతిలో జిల్లాకు ఆరుగురి చొప్పున విధుల్లోకి తీసుకోవాల్సి ఉందని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. ఒకే టీసీపీ ఆర్డీ ఆఫీస్ వరంగల్ రీజినల్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డైరెక్టర్(ఆర్డీ) పరిధిలో ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని మునిసిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో టౌన్‌ప్లానింగ్ కార్యకలాపాలను ఆర్డీ పర్యవేక్షిస్తారు. తాజాగా జిల్లాల పునర్విభజనతో నాలుగు జిల్లాలు కాస్త 12కు చేరాయి. ఖమ్మం, కొత్తగూడెం, మానుకోట, జయశంకర్ (భూపలపల్లి), వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, కొమురంభీం జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలుగా విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఒక ఆర్డీ కార్యాలయం ఏర్పాటు చేయాలనే భావనలో రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మరో ఆర్డీ కార్యాలయం ఏర్పాటుపై స్తబ్దత నెలకొన్నట్లు టౌన్ ప్లానింగ్‌లు అధికారులు చెబుతున్నారు. -
టౌన్‌ప్లానింగ్‌లో పేరుకుపోతున్న కేసులు
విధుల్లో చేరని ముగ్గురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్న వారిపైనే అధిక భారం నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో అధికారులకు పెండింగ్ కేసులు తలనొప్పిగా తయారయ్యాయి. నగరంలోని అనధికారిక, అక్రమ నిర్మాణల కూల్చివేతను చేపట్టిన అధికారులపై ఆయా భవన యజమానులు కోర్టును ఆశ్రయించారు. స్థలాలు, భవనాల విషయంలో ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 300కి పైగా కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు టౌన్‌ప్లానింగ్ అధికారులు కోర్టుకు కౌంటర్‌ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానిక టీపీఎస్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు చూస్తారు. ఫైళ్లను సమకూర్చి కోర్టుకు సమర్పించాలి. అయితే ఇటీవల మంత్రి నారాయణ ఆదేశాలతో ఏడుగురు టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇతర జిల్లాల నుంచి ఏడుగురు తాత్కాలిక ఉద్యోగులను నియమించినా వారిలో ఏసీపీ గంగరాజు, ముగ్గురు టీపీఎస్‌లే విధుల్లో చేరారు. మరో ముగ్గురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు విధుల్లో చేరలేదు. కృష్ణా పుష్కరాల అనంతరమే వారు విధుల్లో చేరతారని సమాచారం. దీంతో ఉన్న అధికారులపై భారం పడుతోంది. కోర్టును ఆశ్రయించిన 70 మంది కమిషనర్‌గా ఐఏఎస్ చక్రధర్‌బాబు ఉన్న సమయంలో మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేసేందుకు రోడ్డు విస్తరణకు రంగం సిద్ధం చేశారు. దీంతో శబరి శ్రీరామ క్షేత్రం వరకు రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేశారు. దీంతో అప్పట్లో భవన యజమానులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి భవనాలకు సంబంధించిన సర్వే జరుగుతోంది. ఈ కేసులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్ అధికారుల్లేక కొన్ని భవనాల మంజూరుకు సంబంధించిన ఫైళ్లు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. -
గ్రేటర్ ప్రక్షాళన
టౌన్‌ప్లానింగ్ ఏసీపీల బదిలీ కొత్తగా ఐదుగురికి పోస్టింగ్‌లు.. వెంటనే రిలీవ్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ‘సాక్షి’ కథనాలకు స్పందన సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో పారదర్శకత కోసం సమూల ప్రక్షాళన చేట్టారు. ఒకే చోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్‌లోని అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)లను బదిలీ చేశారు. వీరితోపాటు అవినీతి ఆరోపణలున్న వారికి సైతం స్థానచలనం కల్పించారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’లో వెలువడిన కథనాలతో గ్రేటర్ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి ప్రక్షాళన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేయగా, తాజాగా వారి పైస్థాయిలోని ఏసీపీలను బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్‌లో కీలకపాత్ర వీరిదే. భవన నిర్మాణ అనుమతుల్లో సాంకేతికంగా వీరిదే అధికారం కావడంతో వీరిపై భారీయెత్తున అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో 10 మంది ఏసీపీలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. డీటీసీపీ నుంచి వచ్చిన ఐదుగురికి కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. గతంలోనూ ఇదే స్టైల్.. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మరోమారు తనదైన శైలిలో బదిలీలకు శ్రీకారం చుట్టారు. బదిలీ అయిన వారు పైరవీలు చేసుకోకుండా వరుస సెలవుల రోజుల్లో ఏసీపీలకు స్థానచలనం కలిగించారు. పోస్టింగ్‌లు, బదిలీ ఉత్తర్వులు అందినవారు వెంటనే విధుల్లో చేరేలా వారిపై అధికారులు వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. గతంలో రవాణా విభాగంలో దీర్ఘకాలంగా పని చేస్తున్నవారిని బదిలీ చేసినప్పుడూ ఇదే సూత్రం పాటించారు. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను ఆగమేఘాల మీద బదిలీ, మాతృ సంస్థలకు సరెండర్ చేయడం తెలిసిందే. సీనియర్ అసిస్టెంట్లకు పోస్టింగ్‌లు.. బిల్కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి 2014 నవంబర్‌లో సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చారు. అయితే వారిని ఇంతవరకు పాత పోస్టుల్లోనే కొనసాగిస్తున్నారు. జనగణన, ఎన్నికలు, ఓటర్ల తొల గింపు.. ఇలా వరుస కార్యక్రమాలు వస్తుండటంతో వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం అలాంటి వారందరికీ సీనియర్ అసిస్టెంట్లుగా పోస్టింగ్ లిచ్చారు. ఇలా మొత్తం 320 మందిని సీనియర్ అసిస్టెంట్లుగా ప్రధాన కార్యాలయం, వివిధ జోన్లలో నియమించారు. ఈస్ట్‌జోన్‌లో 58 మందికి, సౌత్జోన్లో 50 మం దికి సెంట్రల్ జోన్లో 63 మందికి, వెస్ట్‌జోన్‌లో 48 మందికి, నార్త్‌జోన్‌లో 49 మందికి, ప్రధాన కార్యాలయంలో 52 మందికి పోస్టింగ్ వేశారు. అయితే ఈ పోస్టింగ్స్‌లో భారీగా పైరవీలు సాగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతులు పొందిన మొత్తం 320 మందిలో 160 మందికి పైగా రెవెన్యూ విభాగంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ఖాళీ చేసిన స్థానాలను భర్తీ చేసేందుకు దిగువ స్థాయిలో పనిచేస్తున్న వారికి త్వరలో పదోన్నతులిచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. -
దోపిడీకి ప్లానింగ్
అపరాధ రుసుం దందా రూ.20 కోట్లపైనే రెచ్చిపోతున్న అక్రమార్కులు పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ‘ఫైన్’ దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. అనధికారిక కట్టడాలపై ఎక్కు పెట్టిన జరిమానా అస్త్రం గురి తప్పుతోంది. నగరపాలక సంస్థ ఖాతాలో అరకొర ఆదాయం జమ అవుతుండగా అక్రమార్కుల పంటపండుతోంది. కొన్ని సందర్భాల్లో హద్దులు దాటడంతో ఫిర్యాదులు పోలీస్ స్టేషన్ల గడప తొక్కుతున్నాయి. విజయవాడ సెంట్రల్ : నగరంలో అక్రమ కట్టడాలు ఇబ్బడి ముబ్బడిగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గతంలో నిర్మాణం చేసిన అక్రమ కట్టడాల నుంచి మార్కెట్ విలువలో పదిశాతం మేర అపరాధ రుసుం వసూలు చేయాల్సిందిగా నాలుగు నెలల క్రితం కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. అందుకు పూర్తి విరుద్ధంగా టౌన్‌ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. తాజాగా 14వ డివిజన్ భూపేష్ గుప్తానగర్‌లో అక్రమ నిర్మాణం విషయమై బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఆషా, లక్ష రూపాయలు డిమాండ్ చేసిందని, అందులో కొంత మొత్తమే చెల్లించడంతో ఇంటిని కూల్చివేసిందని, అదేమని ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యం చేసిందని లక్ష్మీరాజ్యం ఫిర్యాదు చేసింది. తన విధులకు ఆటంకం కలిగించిందంటూ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కౌంటర్ కేసు పెట్టారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దోచేయ్.. భవానీపురం, పటమట, గవర్నర్‌పేట, సత్యనారాయణపురం, సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి టౌన్‌ప్లానింగ్ అధికారులు వసూలు చేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం పదిశాతం ఫీజు కట్టించాలనే ప్రతిపాదన పక్కన పెట్టేశారు. నామమాత్రంగా ఫైన్ కట్టించి భారీగా ముడుపుల తీసుకుంటున్నారు. భవానీపురం, సత్యనారాయణపురం, గవర్నర్‌పేట ప్రాంతాల్లో రూ.లక్షల మొత్తంలో బేరాలు సాగుతున్నాయనేది బహిరంగ రహస్యం. సింగ్‌నగర్‌లో 62 గజాల స్థలంలో రెండో అంతస్తు కావాలంటే ఫైన్ రూ.20 వేలు, మామూళ్ల కింద రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మూడు నెలలుగా అధికారులు వసూలు చేసిన అపరాధ రుసుం మొత్తం రూ.2 కోట్లు ఉంటే అవినీతి అధికారులు మాత్రం రూ.20 కోట్ల మేర వెనకేసుకున్నట్లు సమాచారం. నిఘా ఏది ? విజిలెన్స్, ఏసీబీ అధికారులు మూడు నెలలకోసారి టౌన్‌ప్లానింగ్‌పై మొక్కుబడి విజిట్లతో సరిపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమాలు పేట్రేగిపోతున్నాయని, దీనికి ఆన్‌లైన్‌తో కళ్లెం వేస్తానని మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆన్‌లైన్‌ను ప్రవేశపెట్టారు. దీంతో అవినీతి రాయుళ్లు ఆలోచలో పడ్డారు. వ్యూహాత్మకంగా తెరపైకి వచ్చిన ఫైన్ మంత్రంతో దోచేస్తున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఫైన్ వసూలు చేసినంత మాత్రన అవి రెగ్యులర్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. భవిష్యత్‌లో బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్) స్కీం అమలైతే మళ్లీ సొమ్ములు చెల్లించి రెగ్యులరైజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థలో సాగుతున్న దోపిడీపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
కార్పొరేషన్.. అవినీతికి అడ్డా
► ప్రభుత్వ ఆదాయానికి రూ.2 కోట్ల గండి ► టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల మాయాజాలం ► ఆన్లైన్ దరఖాస్తుల్లో కూడా చేతివాటం ► బిల్డింగ్ ప్లాన్ ఫీజు 14శాతంలో సగభాగం ► అధికారుల జేబుల్లోకి నెల్లూరు నగర పాలక సంస్థ అవినీతికి అడ్డాగా మారింది. ఇందులో ఆదాయ వనరుల్లో ఒకటైన టౌన్‌ప్లానింగ్ విభాగం ప్రథమస్థానంలో ఉంది. అయితే ఈ విభాగంలోని అధికారులు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ ఆదాయమే ముఖ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో టీపీఎస్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నెలకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు వరకు అక్రమం గా సమకూర్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. నెల్లూరు, సిటీ: భవన నిర్మాణాల అనుమతుల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. అయితే కొంత మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆన్లైన్లో ఉండే కొన్ని సాంకేతిక లోపాలను తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో బిల్డింగ్ప్లాన్ల కోసం గత రెండు నెలలు నుంచి 520 వరకు దరఖాస్తులు వచ్చాయి. 400 ప్లాన్లు మంజూరు చేశారు. వీటిలో 40శాతం భవనాలకు సంబంధించిన ఫీజులో ప్రభుత్వానికి 14 శాతం కట్టాల్సి ఉంది. కొంతమంది టీపీఎస్‌లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 14 శాతం ప్రభుత్వానికి కట్టాల్సి ఉండగా, అలా కట్టకుండా రెండు నెలల వ్యవధిలో రూ.2కోట్లు వరకు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని తెలుస్తోంది. 14 శాతం ఎందుకు కట్టాలంటే.. నగర పాలక సంస్థ పరిధిలో అనధికారిక లేఅవుట్లలో భవన నిర్మాణాలు చేపట్టాలంటే ప్రభుత్వానికి స్థలం ఖరీదులో 14 పర్సంట్ ఫీజు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. ఉదాహరణకు స్థలం ఖరీదు రూ.10 లక్షలు ఉంటే ప్రభుత్వానికి రూ.1.40లక్షలు కట్టాల్సి ఉంది. ఈ విధంగా కార్పొరేషన్‌కు కట్టాల్సిన 14పర్సంట్‌లో సగభాగాన్ని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తమ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే అంతా ఓ టీపీఎస్ ద్వారానే.. టౌన్‌ప్లానింగ్ విభాగంలో అక్రమ కట్టడాలకు ప్లాన్లు మంజూరు చేయాలన్నా,14 పర్సంట్ ఎగవేత వేయాలన్నా ఓ టీపీఎస్(టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్) ముఖ్య పాత్ర వహిస్తున్నారని కార్పొరేషన్ వర్గాలు అంటున్నాయి. ఆ టీపీఎస్ అనుకుంటే ఎంతటి అక్రమ కట్టడానికైనా అనుమతులు ఇవ్వడంలో సమర్థుడు. ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలకు ప్లాన్లు ఇవ్వడం, 14 శాతం ఫీజు ఎగవేత కు కావలసిన మార్గాలు అన్వేషించి భవన యజమానులకు సలహాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ టీపీఎస్ ఉన్నతాధికారులను తన ఆధీనంలో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా అధికార పార్టీలో మేయర్ షాడోగా వ్యవహరిస్తున్న కార్పొరేటర్‌కు అనుచరుడిగా ఉంటున్నారు. ఆ కార్పొరేటర్ చెప్పిన విధంగా నడుచుకుంటూ టౌన్‌ప్లానింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్నారు. మధ్యవర్తులుగా ఎల్‌బీఎస్‌లు అక్రమ భవన యజమానులకు, అధికారులకు మధ్య ఎల్బీఎస్(లెసైన్స్ బిల్డింగ్ సర్వేయర్లు)లు ఉన్నారు. బిల్డింగ్ప్లాన్లను ఆన్లైన్ పద్ధతిన జరుగుతుండడంతో కొంతమంది ఎల్బీఎస్లదే హవాగా మారింది. బిల్డింగ్ప్లాన్లను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అవినీతి తగ్గుతుందని, టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఇవ్వాల్సిన పని ఉండదని అందరూ అనుకున్నారు. అయితే కథ అడ్డం తిరిగింది. గతంలో కన్నా ఆన్లైన్ చేసిన తరువాతే అక్రమాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. కొన్ని సాంకేతిక లోపాలను ఉపయోగించుకుని ఆన్‌లైన్‌ను వారి ఆర్థిక ఆదాయం పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు.. ► నగరంలోని మాగుంట లేఅవుట్లోని నారాయణ స్కూల్‌కు సమీపంలో ఐదు అంతస్తుల ఓ భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. టౌన్‌ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు అందాయని సమాచారం. ► స్టౌన్‌హౌస్‌పేటలోని ఓ కమర్షియల్ భవనాన్ని రెసిడెన్షియల్‌గా చూపి నిర్మాణాలు చేపడుతున్నారు. సన్నటి వీధి కావడంతో నిర్మాణం రోడ్డు పైకి వచ్చింది. అనుమతులు తీసుకున్న విధంగా నిర్మాణం చేపట్టడం లేదు. ► వేదాయపాళెంలోని ఓ రెండు అంతస్తుల భవనానికి సంబంధించి 14 శాతం అంటే.. దాదాపు రూ.4 లక్షలు కట్టాల్సి ఉంది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఓ అధికారి రూ.2 లక్షలు తీసుకుని భవనానికి అనుమతులిచ్చారని ఆరోపణలున్నాయి. -
తాండూరు టీపీఓకు చుక్కెదురు
♦ ప్రభుత్వానికి సరెండర్ చేసిన కమిషనర్ ♦ టౌన్ ప్లానింగ్ విభాగం గదికి తాళం తాండూరు : స్థానిక మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి (టీపీఓ)కు చుక్కెదురైంది. పక్షం రోజుల అనంతరం తిరిగి విధుల్లో చేరాలనే టీపీఓ ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రితం రోజు విధులో చేరడానికి మున్సిపల్ మేనేజర్ శ్రీహరికి ఇచ్చిన లేఖను మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్ శనివారం తిరస్కరించడంతోఆమెకు భంగపాటు తప్పలేదు. ఏడాది క్రితం ఇక్కడ టీపీఓగా శైలజ విధుల్లో చేరారు. అయితే పట్టణంలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తుండడం, ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై గత నెల 30న మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు చర్యలకు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీపీఓను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ సంతోష్‌కుమార్ రెండు రోజుల క్రితం ఆమెను సరెండర్ చేస్తున్నట్లు డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీసీ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈనెల 3న టీపీఓ విధులు చేరేందుకు మున్సిపాలిటీకి వచ్చారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్‌కు లేఖ అందించారు. ఈ లేఖను కమిషనర్ తిరస్కరించారు. ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ డీటీసీపీకి ఇచ్చిన లేఖ ప్రతిని శనివారం కమిషనర్ టీపీఓకు అందించారు. దీంతో ఆమె కార్యాలయం నుంచి వెనుతిరిగారు. కొసమెరుపు ఏమిటంటే.. ముఖ్యమైన ఫైళ్లు గల్లంతు కావొద్దనే యోచనతో మున్సిపాలిటీలోని టౌన్‌ప్లానింగ్ విభాగం గదికి కమిషనర్ తాళం వేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కొత్తగా ఇద్దరు బీఐలు, ఒక టీపీఎస్‌లు వస్తున్నారని చెప్పారు. -
లంచావతారులకు కళ్లెం
‘టౌన్‌ప్లానింగ్’ సంస్కరణలు సాంకేతిక వినియోగంతో కొత్త విధానం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అనగానే గుర్తుకు వచ్చేది అవినీతి... ఫైలు కదలాల న్నా... ఫైలు చూడాలన్నా పైసలు. మనీ లేనిదే ఏపనీ జరగదనేది బహిరంగ రహస్యం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఆన్లైన్ ద్వారానే భవ న నిర్మాణ అనుమతులిచ్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు.. ఇదేతరుణంలో సాంకేతిక వినియోగంతో సిబ్బం దిలోని లంచావతారులకు చెక్ పెట్టాలని నిర్ణయించా రు. ప్రస్తుతం ఏ ప్రాంతంలోని భవన నిర్మాణ అనుమతులు ఎవరు చూస్తారో.. ఎవరు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారో తెలియడంతో వారిని కలిసి చేతులు తడిపితేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి లేకుండా ఉండేందుకు భవన నిర్మాణ అనుమతి కోసం ఒక దరఖాస్తు ఆన్లైన్లో నమోదు కాగానే.. దానిని ఎవరు పరిశీలించాలనేది కంప్యూటరే నిర్ణయిం చేలా ఏర్పాట్లు చేశారు. ఉదాహరణకు ఇప్పటి వరకు ఒక సర్కిల్లో ఏయే ప్రాంతాలను.. ఏయే సెక్షన్ ఆఫీసర్లు చూస్తారో తెలిసి నిర్మాణదారులు తమ పనులు కావడం కోసం వారితో చేతులు కలిపేవారు. దరఖాస్తు చేయడానికి ముందే వారితో మాట్లాడుకుంటేనే పనులయ్యేలా సంబంధిత అధికారులు వ్యవహరించేవారు. ‘ర్యాండమైజేషన్’తో చెక్.. కాగా, కొత్తగా అమల్లోకి తెస్తున్న ‘ర్యాండమైజేషన్’ విధానంతో తమ దరఖాస్తు ఎవరికి వెళ్తుందో నిర్మాణదారులకు తెలియదు కనుక వారు ముందుగానే సదరు అధికారితో మాట్లాడుకోవడానికి ఉండదు. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి కనుక కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే విధానాన్ని ప్రధాన కార్యాలయం స్థాయిలో ఏసీపీలకు వర్తింపచేయనున్నారు. తద్వారా ఏ ప్రాంతంలోని పనికి ఎవరికి ముడుపులు చెల్లించాలో నిర్మాణదారులకు తెలియదు. అంతేకాదు.. ఒక దరఖాస్తు ఆన్లైన్లో అందాక నిర్ణీత వ్యవధిలో పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ముడుపుల కోసం లేనిపోని సాకులతో దరఖాస్తును పెండింగ్‌లో ఉంచేందుకూ వీల్లేదు. క్షేత్రస్థాయి పరిశీలన ముగిశాక గరిష్టంగా 48 గంటల్లో ఫైల్ ను అప్లోడ్చేయాలి. ఈ విధానంలో సెక్షన్ ఆఫీసర్లకు కానీ, క్లర్కులకు కానీ, ఇతరత్రా ఎవరికీ ఎలాంటి లంచా లు ఇవ్వాల్సిన అవసరం రాదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే తేదీ నిర్మాణ దారుకు ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. అంతేకాదు.. ప్రస్తుతం మాదిరిగా అనుమతి ఇచ్చేంతవరకు ఒకసారి, ఫీజు చెల్లించాక మరోసారి వివిధ స్థాయిల్లోని వారి వద్దకు ఫైలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకేసారి అనుమతి పొందగానే ఫీజు కడితే వెంటనే అనుమతినిచ్చేలా విధానాలు రూపొందించారు. దీన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు. -
‘టౌన్’లో మాయామశ్చీంద్ర
► టీడీఆర్ బాండ్ల రీసైక్లింగ్ ► ఆన్లైన్లో వెలుగుచూసిన అక్రమాలు ► బాధ్యులపై క్రిమినల్ కేసుకు కమిషనర్ ఆదేశం ► అధికారులకు చార్జి మెమో టౌన్‌ప్లానింగ్ విభాగం అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. నకిలీ ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవపల్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్స్ హల్చల్ చేస్తున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా అధికారులు, దళారులు కుమ్మక్కై బాండ్ల కుంభకోణాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారులకు తెలియకుండానే బాండ్లు మారుబేరాలు సాగిపోవడం వివాదాస్పదమైంది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు నాటి అధికారులకు చార్జి మెమోలు ఇవ్వాల్సిందిగా కమిషనర్ ఆదేశాలివ్వడంతో అక్రమార్కులు హడలెత్తుతున్నారు -విజయవాడ సెంట్రల్ వెలుగు చూసిందిలా.. టౌన్‌ప్లానింగ్ సేవల్ని ఆన్లైన్ చేశారు. ఈక్రమంలో గతంలో టీడీఆర్ బాండ్లు పొందిన యజమానులు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుండగా కొన్ని బాండ్లు గతంలో వినియోగించినట్లు తేలింది. తమకు తెలియకుండా బాండ్లు ఎలా వినియోగించారో తేలాలంటూ భవన నిర్మాణ యజమానులు కమిషనర్‌ను కోరారు. ఈమేరకు ఆయన ఫైళ్లను పరిశీలించగా స్కాం బయటపడింది. బందరు రోడ్డు విస్తరణలో భాగంగా 2012లో డి.సతీష్‌బాబుకు 89.16 చదరపు గజాలకు టీడీఆర్ బాండ్‌ను టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసింది. సతీష్‌బాబుకు తెలియకుండానే సత్యనారాయణపురానికి చెందిన జి.రంగారావు (బీఏ నెంబర్ 1830/2015) జీప్లస్ 4కు వినియోగించారు. లబ్బీపేటకు చెందిన ఎం.తిరుపతికి 36.35 చదరపు గజాలకు బాండు మంజూరు చేయగా అయ్యప్పనగర్‌కు చెందిన ఎం.భవానీ (బీఏ నెంబర్ 2521/2013) వినియోగించినట్లు తేలింది. దీంతో బాండ్లు పొందిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. కేసులతో సరి గుణదల ఎల్ఐసీ కాలనీకి చెందిన టిపీసీహెచ్ కుమార్‌బాబు, శ్రీలక్ష్మి నాల్గోఅంతస్తు నిర్మాణా నిర్మాణానికి సంబంధించి ఉడా, నగరపాలక సంస్థ జారీ చేసిన రెండు టీడీఆర్బాండ్లను టౌన్‌ప్లానింగ్‌కు అందజేశారు. మండవ వెంకటేశ్వరరావు వద్ద వీరు ఆ బాండ్లను కొనుగోలు చేశారు. కార్పొరేషన్ ద్వారా 170.38 చదరపు అడుగుల బాండ్లు పొందిన ఎం. వెంకటేశ్వరరావు1299/2014, 2089/2014, 262/ 2014 బిల్డింగ్ అప్లికేషన్లకు 185.26 చదరపు అడుగు లు బాండ్లను వాడేశారు. అంతటితో ఆగకుండా కుమార్‌బాబు, లక్ష్మికి 170.38 చదరపు అడుగులకు విక్రయించారు. ఈ స్కాంపై సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్ ఎం.వెంకటేశ్వరరావుపై కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇంత వరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతా గుట్టు టీడీఆర్ బాండ్లు ఎవరికి మంజూరు చేశారు. వాటిని ఎక్కడెక్కడ వినియోగించారనే విషయాన్ని టౌన్‌ప్లానింగ్ అధికారులు గుట్టుగా ఉంచుతున్నారు. బాండ్ల జారీ పేరుతో టౌన్‌ప్లానింగ్, సర్వే విభాగాల్లోకి కొం దరు అధికారులు క్యాష్ చేసుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. సర్వే విభాగంలోని ఓ అధికారి చక్రం తిప్పారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. బాండ్లను విని యోగించిన వెంటనే టౌన్‌ప్లానింగ్ విభాగంలోని సూపరింటెండెంట్ స్థాయిఅధికారి క్యాన్సిల్డ్ అని బాండ్‌పై స్టాంప్ వేయాల్సి ఉంటుం ది. విచిత్రం ఏమిటంటే బాండ్లకు సంబంధించిన రికార్డు సైతం అధికారులు అందుబాటులో ఉంచడం లేదు. అధికారిపై మంత్రి గుర్రు టౌన్‌ప్లానింగ్‌లో కీలక అధికారి అవినీతికి అంతులేకుండా పోతుందన్న ఆరోపణలున్నాయి. కొన్ని ఆధారాలతో సహా ఇటీవలే మునిసిపల్ మంత్రి పి.నారాయణకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన ప్రాంతంలోనూ అయ్యగారి అక్రమాల చిట్టా కొండవీటి చాంతాడంత ఉందని తెలుసుకున్న మంత్రి అధికారిని బదిలీ చేయాల్సిందిగా టౌన్‌అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ రఘుకు సూచించినట్లు సమాచారం. కృష్ణా పుష్కరాలు పూర్తయ్యే వరకు అధికారిని ఇక్కడే కొనసాగిద్దామని డీటీసీపీ సర్ధిచెప్పినట్లు భోగట్టా. చెక్ చేసుకోండి టౌన్‌ప్లానింగ్ విభాగం ద్వారా టీడీఆర్ బాండ్లు పొంది ఇప్పటి వరకు వినియోగించుకోని వారు వెంటన్ ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సిందిగా కమిషనర్ జి.వీరపాండియన్ సూచించారు. ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చాక అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయన్నారు. బ్రోకర్ల ద్వారా టీడీఆర్ బాండ్లు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. -
ప్రక్షాళనకు శ్రీకారం!
గ్రేటర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పలువురిపై బదిలీ వేటు అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ‘సాక్షి’ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలైంది. పెచ్చుమీరిన అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు నడుం బిగించారు. బీఆర్ఎస్ దర ఖాస్తులకు నిర్ణీత గడువు ముగిశాక కూడా అనేక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండటం.. క్షేత్రస్థాయి సిబ్బంది వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం, టౌన్ ప్లానింగ్ విభాగంలోని అవినీతి, అక్రమాలపై ‘కాసులిస్తే .. సై’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో గురువారం టౌన్‌ప్లానింగ్ విభాగంలోని 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయినవారిని వెంటనే రిలీవ్ చేయాలని విభాగాధిపతులకు సూచించారు. సిటీబ్యూరో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అక్రమార్కులపై చర్యలకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. తొలిదశలో భాగంగా 33 మంది అధికారులు, ఉద్యోగులను బదిలీ చేశారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కమిషర్ డా.బి.జనార్దన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒకేసారి పెద్దఎత్తున ఇంతమందిని బదిలీ చేయడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. టౌన్‌ప్లానింగ్ విభాగంలో పెచ్చుమీరిన అవినీతిపై ‘సాక్షి’లో కథనం రావడంతో...ఇకనైనా ఇలాంటి అక్రమాలు జరుగకుండా ఉండేందుకుగాను టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్లు (టీపీఎస్)/ సెక్షన్ ఆఫీసర్లు, డ్రాఫ్ట్స్మన్లు, తదితరులను బదిలీ చేశారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పరిశీలించేది, ఉన్నతాధికారులకు, నిర్మాణదారులకు మధ్య వ్యవహారాలు నెరిపేది వీరే కావడంతో తొలిదశలో వీరిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో రెండేళ్ల పైబడిన వారి నుంచి 14 ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నవారు సైతం ఉన్నారు. ఆయా ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదులు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. టౌన్‌ప్లానింగ్ విభాగం వారికి ఎక్కువ ఆదాయ వనరులున్న సర్కిళ్లలో ఒకటైన ఖైరతాబాద్ సర్కిల్లో ఐదేళ్లుగా పనిచేస్తున్న శాంసన్‌ను పాతబస్తీకి బదిలీ చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లోనే నాలుగేళ్లుగా పనిచేస్తున్న నర్సింగ్రావును ఎల్బీనగర్ సర్కిల్‌కు బదిలీ చేశారు. జి.నరేష్‌ను కూకట్పల్లి సర్కిల్‌కు బదిలీ చేశారు. అలాగే నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి సర్కిళ్లలో పనిచేస్తున్న రాజేందర్, సురేందర్‌రెడ్డిలను ఖైరతాబాద్, ఉప్పల్ సర్కిళ్లకు బదిలీ చేశారు. అయితే వారు బదిలీ అయిన సర్కిళ్లు కూడా పెద్దవే కావడం గమనార్హం. రెండేళ్లకు పైగా జీహెచ్ఎంసీకి పాలకమండలి లేకపోవడం.. కార్పొరేటర్లు లేకపోవడంతో టౌన్‌ప్లానింగ్ లోని వారికి ఎలాంటి ఆటంకం లేకుండా పోయిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్ల రాకతో కొన్ని సర్కిళ్లలో వారికీ, వీరికీ పొసగడం లేదని తెలుస్తోంది. అలాంటి సర్కిళ్లలో ఉప్పల్ తదితరమైనవి ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ సర్కిల్లోని ఓ మహిళా ఉద్యోగి గత 14 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లో భాగంగా ఆమెను ఎల్బీనగర్కు పంపారు. ఇదే సర్కిల్‌కు చెందిన ఫిలిప్స్‌ను పాతబస్తీలోని సర్కిల్-5కు పంపించారు. కూకట్పల్లి సర్కిల్‌కు చెందిన రాజేశ్వర్‌ను పాతబస్తీ పరిధిలోని సర్కిల్-4కు బదిలీ చేశారు. అవినీతి ఆగేనా..? బదిలీల్లో భాగంగా కొందరిని మాత్రం ఆదాయం తక్కువగా ఉండే సర్కిళ్లకు బదిలీ చేసినప్పటికీ, ఎక్కువమందిని తిరిగి నిర్మాణ కార్యకలాపాలు ఎక్కువగా ఉండే సర్కిళ్లకే బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త సర్కిళ్లలో కొంతకాలం వరకైనా అక్రమాల్ని తగ్గింవచ్చుననేది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. దానికి తోడు ఉన్న సిబ్బందే తక్కువ కావడంతో ఎవరో ఒకరిని నియమించక తప్పదు కనుక వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బదిలీలు చేసినట్లు సమాచారం. మరో 40 రోజుల్లోగా 10 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిష్కరిస్తామని మునిసిపల్ మంత్రి కేటీఆర్‌కు హామీ ఇచ్చినందున ఆ అంశాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ దరఖాస్తులు ఎక్కువగా ఉన్న సర్కిళ్లకు వీరిని పంపించినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన వారిలో 11 మంది టీపీఎస్/సెక్షన్ ఆఫీసర్లు, 18 మంది డ్రాఫ్ట్స్మన్లు, ముగ్గురు ఏఏడీఎం, ఒక టీపీబీఓ తదితరులున్నారు. -
తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు.. అధికారులు సెలవు బాట
కార్పొరేషన్లో అధికారపార్టీ నేతల బెదిరింపులు ఏం నేనవరునుకున్నావ్... నేను చెప్పిన పని చేయవా... నీ అంతు చూస్తా.. అంటూ నగర పాలక సంస్థ అధికారులపై తెలుగు తమ్ముళ్లు బెదిరింపులకు దిగుతున్నారు. నాయ కుల అక్రమాలకు సహకరించలేక, బెదిరింపులు తట్టుకోలేక టౌన్‌ప్లానిం గ్లోని ఇద్దరు అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్ విభాగాలు ఉన్నాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాలు కార్పొరేషన్ రెవెన్యూకు ప్రధానమైనవి. ఈ విభాగాల్లో కార్పొరేషన్ ఆదాయానికి గండికొట్టి, జోబులు నింపుకోవడానికి అధికారులు, అధికార పార్టీ నేతలు దారులు వెతుకుతుంటారు. అయితే ఇటీవల కాలంలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అందినకాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి తాము చెప్పినట్టు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నాయకులు చెప్పిన పనులు చేస్తే తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొంత మంది అధికారులు ఒత్తిళ్లు తట్టుకోలేక ధీర్ఘకాలిక సెలవు పెట్టారు. సర్వేయర్ రెండు నెలల నుంచి సెలవు నగర పాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇద్ద రు అధికారుల్లో ఒకరు సర్వేయర్ మూర్తి. మరొకరు టీపీఓ సుధాకర్. వీరిలో మూర్తి రెండు నెలల నుంచి, టౌన్‌ప్లానింగ్ అధికారి సుధాకర్ నెల నుంచి సెలవులో ఉన్నారు. మూర్తికి నగర పాలక సంస్థ పరిధిలో కాలువల ఆక్రమణలు గుర్తించాలని గతంలో పాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలువల ఆక్రమణల్లో బడాబాబులు ఎక్కువగా ఉండడంతో సర్వే చేసే సమయంలో అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలి సింది. మా భవనాలను సర్వేలో చూపిస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని అధికారపార్టీ నేతలు హెచ్చరిం చినట్లు సమాచారం. దీంతో మూర్తి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు అంటున్నారు. టీపీఓ నెల నుంచి.. టీపీఓ సుధాకర్‌కు టౌన్‌ప్లానింగ్ అధికారిగా కొన్ని నెలల క్రితం ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో సుధాకర్ కొంతకాలం సజావుగా విధులు నిర్వహించారు. ఓ అధికార పార్టీ కార్పొరేటర్ తనకు ప్రతి నెలా లక్షల్లో మామూళ్లు ఇవ్వాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశా రు. అదేవిధంగా భారీ అక్రమాలకు సంబంధించిన ఫైల్స్‌పై సంతకాలు పెట్టాలని బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆయన నెల రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో అధికారులిద్దరూ బదిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్‌లో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫైల్స్ కదలడం లేదని పలువురు అంటున్నారు. ఇంజనీరింగ్ విభాగంలోనూ.. ఇంజనీరింగ్ విభాగంలోని ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గలేక సెలవు లేదా బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచా రం. ఇద్దరు డీఈలు, ముగ్గురు ఏఈలు ఇప్పటికే బదిలీ ప్రయత్నాలు చేశారు. నగర పాలక సంస్థ పరిధిలో అభివృ ద్ధి పనులు జరగనున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లతో అధికారులు సెలవులపై వెళుతుండడంతో ఆ పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
కాసులిస్తే..సై!
విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు నగరం నలుమూలలా ఇదే పరిస్థితి నిబంధనలు బేఖాతరు... టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి రాజ్యం అడ్డగోలుగా అనుమతుల మంజూరు ఈ మహానగరం వాతావరణంతో సహ అన్ని విధాలా అందరికీ అనుకూలమైన నగరం. అక్రమ నిర్మాణాలు జరిపే వారికి మరింత అనుకూల నగరం. ఎందుకంటే కాసులిచ్చి అడ్డగోలుగా నిర్మాణాలు జరిపినా పట్టించుకునే వారుండరు. అధికారుల చేతులు తడిపి.. నిబంధనలకు చెల్లుచీటీ చెప్పి...అంతస్తుల మీద అంతస్తులు వేసుకుంటూ పోయినా...కుప్పకూలితే తప్ప పట్టించుకోరు. నివాస భవనానికి అనుమతి పొంది, వాణిజ్య కాంప్లెక్సులు నిర్మించినా కళ్లు తెరచి చూడరు. చెరువుల ఎఫ్టీఎల్లో నిర్మాణాలు జరిపినా మనకెందుకులే అని మిన్నకుంటారు. స్థలం దరఖాస్తుదారుది అవునో కాదో చూడరు. సర్కారు స్థలంలో నిర్మించినా సర్వే నెంబరు ఒకటే కనుక కరెక్టేననుకుంటారు. భవనం కట్టకముందే కనికట్టుతో బీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చిక్కడ. ఆ తర్వాత తాపీగా నిర్మాణం పూర్తిచేసి క్రమబద్ధీకరణా పూర్తిచేసుకోవచ్చు. మూడు రకాల అనుమతులు పొంది...అన్నీ కలిపి క్లబ్ చేసి కట్టడాలు చేపట్టొచ్చు. ఇన్ని అనుకూలతలు ఉండగా.. అక్రమనిర్మాణం జరపకుండా ఉంటారా..?! మహానగరంలో అడ్డగోలు నిర్మాణాలు, జీహెచ్ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్వాకాలు..అవినీతి అక్రమాలు..పొంచి ఉన్న ప్రమాదాలపై ‘సాక్షి’ ఫోకస్... సాక్షి, సిటీబ్యూరో: గడచిన దశాబ్దకాలంలో నగర జనాభా, విస్తీర్ణం ఎంతో పెరిగినప్పటికీ, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది పెరగ లేదు. దీంతో ఉన్న కొద్దిమందే ఎక్కువమందికి సేవలందించాల్సిన పరిస్థితి. శివారు మునిసిపాలిటీల విలీనంతో నగర విస్తీర్ణం 170 చ.కి.మీల నుంచి రూ. 625 చ.కి.మీలకు పెరిగినప్పటికీ అందుకనుగుణంగా సేవలు పెరగలేదు. పనుల్లో జాప్యం పెరిగింది. నాణ్యత కొరవడింది. దీంతో తమ పని వేగంగా జరగడం కోసం ముడుపులివ్వడం ప్రజలకు అలవాటైంది. దాన్ని రుచిమరిగిన అధికారులు పైసలు లేనిదే ఫైలు చూడని పరిస్థితికి చేరుకున్నారు. దాదాపుగా జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, టౌన్‌ప్లానింగ్ విభాగంలో తీవ్రస్థాయికి చేరింది. లంచాలు తీసుకుంటూ పట్టుబడినవారిలో, అక్రమాస్తుల వలలో చిక్కిన వారిలో ఈ విభాగం వారే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. అక్రమాలపై చర్యల లేమిని తప్పుపడుతూ హైకోర్టు తీవ్రంగా మందలించిన ఘటనలకూ కొదవలేదు. అయినప్పటికీ ఈ విభాగం తీరు మారలేదు. జీహెచ్ఎంసీలో వారం వారం జరిగే ప్రజావాణికి అందుతున్న ఫిర్యాదుల్లో 75 శాతం ఈ విభాగానివే. గడచిన ఏడాది కాలంలో 800కు పైగా ఫిర్యాదులు దీనివే. సగం కూడా లేని సిబ్బంది... టౌన్‌ప్లానింగ్ విభాగానికి 412 మంది సిబ్బంది అవసరం కాగా... కేవలం 123 మంది మాత్రమే ఉన్నారు. 289 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 199 టీపీఎస్, 31 బిల్డింగ్ఇన్స్పెక్టర్, 30 టౌన్‌ప్లాన్ సూపర్వైజర్ పోస్టులున్నాయి. దీంతో ఉన్న కొద్దిమందికి పని ఒత్తిడి ఎక్కువ కావడంతో చేయి తడపనిదే పనిచేయని పరిస్థితికి చేరుకున్నారని, లంచాల రుచి మరిగి విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లు నటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్గడువు ముగిశాక కూడా నగరంలో ఏ దిక్కున చూసి నా లెక్కకు మిక్కిలిగా అక్రమ నిర్మాణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలివీ... ఈస్ట్‌జోన్‌లో బెస్ట్ సంపాదన.. కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్ చౌరస్తాలో 60 గజాల స్థలంలో ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేకుండా ఐదంతస్తుల్లో వాణిజ్య భవన నిర్మాణం జరుగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అన్నీ సవ్యంగా ఉన్నా జీ+1 ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, కమర్షియల్ భవనం అయితే రూ.2 లక్షలు, అపార్ట్మెంట్ అయితే రూ.3 లక్షలు, కమర్షియల్ అపార్ట్మెంట్ అయితే రూ.5 లక్షల వరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు, ప్లానర్స్ దండుకుంటున్నారని, లేకుంటే అడుగడుగునా కొర్రీవేస్తున్నారని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. వెస్ట్‌జోన్‌లో అడ్డే లేదు.. శేరిలింగంపల్లి-1 సర్కిల్ పరిధిలోని అంజయ్యనగర్‌లో యథేచ్చగాఅక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వంద గజాల ప్లాట్‌లో సెట్ బ్యాక్స్ లేకుండా ఐదంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు, ఇందిరానగర్, జేవీ కాలనీ, గఫూర్నగర్, దుర్గం చెరువు ఎఫ్టీఎల్, పత్రికానగర్, శ్రీరాంనగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, నల్లగండ్ల, తారానగర్లలో యాభైకి పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలోని చైన్మన్లు అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నల్లగండ్ల, తారానగర్‌లో ఓ మధ్యవర్తి రూ. 6 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. రెండు ఫ్లోర్లకు మాత్రం అనుమతులు పొంది అధికారుల అండతో మరో రెండు ఫ్లోర్లు అదనంగా నిర్మిస్తున్నారు. గుల్‌మోహర్‌పార్క్ కాలనీ ప్రధాన ముఖ ద్వారం సమీపంలో, భెల్ ఎంఐజీ కాలనీ, నల్లగండ్లలోని జరుగుతున్న నిర్మాణాలే ఇందుకు సాక్ష్యం. శేరిలింగంపల్లి -2 లో ఓల్డ్ ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. రెడ్డికాలనీ, చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట, మదీనాగూడ, కొండాపూర్, ఖానామెట్, అయ్యప్పసొసైటీ, రవీంద్ర సొసైటీలలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు దాదాపు 70 వరకు ఉన్నట్లు అంచనా. గోకుల్ ప్లాట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారినుంచి టౌన్‌ప్లానింగ్ అధికారులు కోటి రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీపీఎస్‌లు, ఏసీపీలు అక్రమ నిర్మాణదారులతో కుమ్ముక్కై అందినకాడికి దండుకుంటున్నారు. సౌత్‌లోనూ షరా ‘మామూలు’ రాజేంద్రనగర్ సర్కిల్లోని రాజేంద్రనగర్, గోల్డెన్ హైట్స్, ఫోర్ట్‌వ్యూ కాలనీ, హైదర్‌గూడ, అత్తాపూర్, శివరాంపల్లి, సులేమాన్‌నగర్, శాస్త్రీపురం, మైలార్‌దేవ్‌పల్లి, టీఎన్జీవోస్ కాలనీ, గగన్‌పహాడ్ ప్రాంతాల్లో సైతం అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ జోన్ పరిధిలోని పాతబస్తీలోనూ అక్రమ నిర్మాణాలు తక్కువేం లేవు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా కోర్టు నుంచి ఎలా స్టే తెచ్చుకోవాలో కూడా టౌన్‌ప్లానింగ్ వారే చెబుతున్నారని ఆరోపణలున్నాయి. ఉత్తరాన భారీగా.. వాణిజ్య సముదాయాలెక్కువగా ఉన్న నార్త్‌జోన్‌లోని సికింద్రాబాద్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదు. ప్రధాన రహదారులపైనే యధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు నామ్కేవాస్తేగా నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సికింద్రాబాద్ సర్కిల్లో గడచిన రెండేళ్లలోనే 1072 అక్రమ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. మోండా మార్కెట్, రాంగోపాల్‌పేట్ తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని ఇరుకు సందుల్లో వాణిజ్య భవనాలు వెలుస్తున్నాయి. అధికారులకు లంచాలిచ్చి.. స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతుతో నిర్మాణాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెంట్రల్ జోన్‌లోనూ అదే తీరు.. సంపన్నులుండే ఈ జోన్లో పైసలు ముడుతుండటంతో ఫైళ్లు చకచకా కదులుతాయనే ప్రచారం ఉంది. అదే వేగంతో అక్రమాలు సాగుతున్నాయి. రెంంతస్తులకు అనుమతి పొంది.. ఆరంతస్తులు నిర్మిస్తున్న భవనం గురించి కేంద్ర హోంశాఖ రిటైర్డు సెక్రటరీ ఫిర్యాదు చేసినా అధికారులు ఏమీ చేయలేకపోయారు. కడకు హైకోర్టు నాశ్రయించారు. నెల రోజుల్లో సదరు అక్రమ నిర్మాణానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. -
ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారికి 25 కోట్ల ఆస్తి
‘సీఆర్డీఏ’ అధికారి రెహ్మాన్ ఆస్తులపై ఏసీబీ దాడులు సాక్షి, విశాఖపట్నం / సాక్షి, విజయవాడ/ గుంటూరు (పట్నంబజారు): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి షేక్ ఫజలూర్ రెహమాన్ ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి ప్రాంతాల్లో 11 చోట్ల సోదాలు చేశారు. ఈ సోదాల్లో రెహ్మాన్‌కు చెందిన రూ.2 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి మార్కెట్ విలువ రూ.25 కోట్ల పైమాటేనంటున్నారు. ఆయన తన కుమారుడి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
చావనైనా చస్తాం.. కదిలేది లేదు
‘రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. ఉన్నపళంగా పొమ్మని గెంటేస్తే ఎక్కడికి పోతాం. మా తాతల కాలం నుంచీ ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరగా ఉన్నామన్న సాకుతో ఇక్కడ్నుంచి వెళ్లిపొమ్మనడం భావ్యమా..’ అంటూ బీసెంట్‌రోడ్డులోని 500 మంది హాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం వారిని ఖాళీచేయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన బాట పట్టిన వారికి వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది. బీసెంట్‌రోడ్డు హాకర్లు విజయవాడ సెంట్రల్ : ఆక్రమణల తొలగింపు ముసుగులో బీసెంట్‌రోడ్డులోని హాకర్లను ఖాళీ చేయించడం వివాదాస్పదంగామారింది. సుమారు 500 మంది హాకర్లు అక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. నలభైఏళ్ళ నుంచి బీసెంట్రోడ్డునే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్‌కు సమీపంలో ఉండడంతో హాకర్లను అక్కడ నుంచి ఖాళీ చేయించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు టౌన్‌ప్లానింగ్, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుపై వ్యాపారాలు చేసుకొనే చిన్నా చితక వ్యాపారుల్ని అక్కడ నుంచి గెంటేశారు. బుధవారం ఉదయం కూడా వ్యాపారాలు చేయకుండా పోలీసులు గస్తీకాశారు. హాకర్లు ఆందోళన బాట పట్టారు. ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి ముజ్ఫర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బాసట బాధిత హాకర్లకు వైఎస్సార్సీపీ బాసటగా నిల్చింది. వైఎస్సార్ సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ బీఎన్ పుణ్యశీల ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు హాకర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. పుణ్యశీల మాట్లాడుతూ పేదల పొట్టకొట్టే విధంగా టీడీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా గెంటేస్తే ఎక్కడిపోతారని ప్రశ్నించారు. దీనిపై ఈనెల 29న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అధికారపార్టీని నిలదీస్తామన్నారు. అండగా ఉంటాం అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పార్టీ కార్పొరేటర్లు షేక్‌బీజాన్‌బీ, పి.ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన పేదోళ్లు బతక్కూడదంటే ఎలా. మా తాతల కాలం నుంచి ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నాం. టీడీపోళ్లు ఓట్లు అడిగేటప్పుడు మీరు దర్జాగా ఇక్కడే వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. పోలీసోళ్లు, కార్పొరేషనోళ్లు వచ్చి జులుం చేస్తున్నారని ఫోన్ చేస్తే మాట్లాడటమే మానేశారన్నారు. చావనైనా చస్తాం కానీ బీసెంట్రోడ్డును వదిలేదిలేదని హాకర్లు స్పష్టం చేస్తున్నారు. -
‘స్పెషల్’ ఆఫీసర్
సోమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి సిటీబ్యూరో: సోమేశ్ కుమార్... జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్. అనుకున్న పనులు చేయడంలోనూ.. విమర్శలు ఎదుర్కోవడంలోనూ స్పెషలే. కమిషనర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న ఆయన స్పెషలాఫీసర్గానూ జీహెచ్ఎంసీ పాలనాపగ్గాలు చేపట్టి పది నెలలు దాటింది. రెండు హోదాల్లోనూ ‘అద్భుతాలు’ చేయాలని తలపోస్తున్నారు. రూ. 5కే భోజనం నుంచి ‘ఆకాశమార్గాల’ దాకా భారీ కలలతో వివిధ పథకాలకు రూపకల్పన చేశారు. అన్నింటినీ ఏకకాలంలో పూర్తి చేయాలని ఆరాట పడుతున్నారు. అనుకున్నదే తడవుగా పూర్తి కావాలని ఆదేశిస్తుండటంతో అధికారుల్లో ‘వణుకు’ ఎక్కువవుతోంది. ఫలితంగా పనులు తడబడుతున్నాయి. ఎన్ని ఆరోపణలు వస్తున్నా... తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను ఏడాదిలోనే పూర్తిచేసి అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఓవైపు కొన్ని రాజకీయ పక్షాలు ఆటంకాలు కల్పిస్తున్నా.. టీఆర్ఎస్ కార్యకర్త అని విమర్శలు గుప్పిస్తున్నా... దేనికీ వెనుకాడటం లేదు. క్యాడర్ కేటాయింపులపై ఓవైపు క్యాట్‌లో కేసు నడుస్తున్నప్పటికీ.. తన మానాన పని చేసుకుపోతున్నారు. రెండేళ్లలో వందకు పైగా ప్రకటనలు చేసినప్పటికీ పట్టుమని పది కూడా పూర్తికాకపోవడంతో విమర్శలు తప్పడం లేదు. పగలూ రాత్రీ తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ... పని రాక్షసుడనే ముద్రతోముందుకు సాగుతున్న సోమేశ్ కుమార్ పథకాలు.. పనుల్లో కొన్నింటిని అవలోకిస్తే.. ఇదీ పనుల తీరు ఎస్సార్డీపీ రూ.24 వేల కోట్లకు పైగా విలువైన పనులు. యాన్యుటీ విధానంలో పిలిచిన టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంతో తొందరగా మొదలు పెట్టాలనుకున్నా జాప్యం తప్పలేదు. ఈపీసీ పద్ధతిలో తిరిగి టెండర్లు పిలిచారు. ఈ-ఆఫీస్ ఏ ఫైలు ఎక్కడ ఉందో తెలిసేలా, పనుల్లో పారదర్శకతకు ఉద్దేశించినది. వీలైనంత త్వరితంగా అమలులోకి తెచ్చారు. టౌన్‌ప్లానింగ్‌లో పెండింగ్ తగ్గినప్పటికీ... ముడుపులు మాత్రం ఆగలేదు. ఆర్ఓ ప్లాంట్లు మురికివాడల పేదలకు శుద్ధ జలం అందించేందుకు ఈ ప్లాంట్లు 1500 ఏర్పాటు చేయాలనుకున్నారు. తొలిదశలో అందుబాటులోకి తేవాలనుకున్నవి సైతం సీఎం హామీతో మహబూబ్‌నగర్‌కు పంపాల్సి వచ్చింది. దాంతో పట్టుమని పది కూడా ఏర్పాటు కాలేదు. డ్రైవర్ కమ్ ఓనర్ సత్ఫలితమిచ్చిన స్కీమ్. తొలి రెండు దశల్లో 408 మందికి ఉపాధి లభించింది. మొత్తం 5వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నప్పటికీ, మలిదశల్లో జాప్యం జరుగుతోంది. ఆటో టిప్పర్లు చెత్త రవాణా కోసం నిరుద్యోగులకు 2,500 టిప్పర్లు అందించాలనుకున్నారు. వీరిలో దాదాపు 94 శాతం మంది తమవంతు వాటాలు చెల్లించి ముందుకొచ్చారంటే వారి నమ్మకం అర్థం చేసుకోవచ్చు. ఇంటింటికీ చెత్తడబ్బాలు సీఎం హామీ నేపథ్యంలో చెత్త తరలింపునకు ఇంటింటికీ రెండు రంగు డబ్బాలు అందించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. 45 లక్షల చెత్తడబ్బాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్వయం సహాయక మహిళా సంఘాల ఉపాధికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలనుకున్నప్పటికీ రూ.వంద కోట్లు కూడా ఇవ్వలేకపోయారు.ఈ-లైబ్రరీలు, జిమ్‌లు, మోడల్ మార్కెట్లు, బస్‌బేలు, బస్షెల్టర్లు, మల్టిపుల్ ఫంక్షన్ హాళ్లు, ఎఫ్ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ పనులు పూర్తి కాలేదు. మిగతా ప్రభుత్వ విభాగాలు శ్రద్ధ చూపకపోవడంతో పనులు కదల్లేదు. జీహెచ్‌ఎంసీవి దాదాపు 25 శాతం పూర్తయ్యాయి. గతంలో మాటలకే పరిమితమైన వైట్‌టాపింగ్ పనులు కార్యరూపం దాల్చాయి. త్వరలో మరిన్ని మార్గాల్లో రానున్నాయి. రూ. 5కే భోజనం అద్భుత విజయం సాధించింది. దాదాపు 50 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.ఇంటి నెంబర్లు, గౌరవ సదన్లు వంటివి అందుబాటులోకి రాలేదు. బతుకమ్మ ఘాట్, బతుకమ్మల నిమజ్జనాలకు మంచినీటి కొలను వంటి పనులు శీఘ్రంగా జరిగాయి. ‘మహాప్రస్థానం’ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వర్షాకాలం ముగిసిపోయినా ‘హరితహారం’ ప్రారంభం కాలేదు. సేవలపైనే పూర్తి దృష్టి అందరి సహకారంతోనే పథకాలు విజయవంతం జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సిటీబ్యూరో: ప్రజలకు సకాలంలో సేవలందితే అవినీతి క్రమేపీ తగ్గుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. గడచిన రెండేళ్లలో చేపట్టిన రూ.5కే భోజనం, డ్రైవర్‌కమ్ ఓనర్, ఎస్సార్డీపీ పథకాలు వేటికవే ప్రత్యేకత కలిగినవని చెప్పారు. వివిధ కారణాలతో కొన్ని పనుల్లో జాప్యం జరుగుతోంద న్నారు. దీనికి నిరుత్సాహపడాల్సిన పని లేదన్నారు. ప్రజలు, సిబ్బంది, ఇతరత్రా అందరి సహకారం వల్లే ఎన్నో పనులు చేయగలిగామన్నారు. ప్రజలకు మెరుగైనే సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. ‘ఎన్ని చేసినా అవినీతి తగ్గలేదన్న’ ప్రశ్నకు బదులిస్తూ... సకాలంలో పనులు జరిగితే అది కూడా క్రమేపీ సాధ్యమవుతుంద ని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రవేశపెట్టిన ఈ-ఆఫీస్ వల్ల టౌన్‌ప్లానింగ్‌లో పెండింగ్ దరఖాస్తులు తగ్గాయన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో నిర్మాణాలకు అనుమతి లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. త్వరలో అది అమలు చేస్తామన్నారు. ఏటా వెయ్యి కిలోమీటర్ల వంతున వైట్‌టాపింగ్ రోడ్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. అవి అందుబాటులోకి వస్తే రహదారుల మరమ్మతుల పేరిట నిధుల ఖర్చు, అవినీతి తగ్గుతుంద ని ఆయన అభిప్రాయపడ్డారు. మేమే పనులు చేస్తాం తాము ఎంతగా రహదారుల పనులు చేస్తున్నప్పటికీ... కొన్ని మార్గాల్లో అప్రదిష్ట వస్తోందని కమిషనర్ చెప్పారు. మెట్రో రైలు మార్గాల్లోనూ తామే పనులు పూర్తి చేసి, వాటి బిల్లులు మెట్ర రైలు వర్గాలకు అందజేస్తామని ‘సాక్షి’కి తెలిపారు. అన్ని పనుల్లోనూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యం పెంచుతామన్నారు. రహదారి మరమ్మతుల నుంచి చెత్త తరలింపు పనుల వరకు వారే చేస్తామని ముందుకొస్తే.. అప్పగిస్తామని తెలిపారు. దీనిపై సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులందరితో సోమవారం నుంచి సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే ఆటో ట్రాలీల నిర్వహణకు సంఘాలు ముందుకొస్తే వారికే కేటాయిస్తామని తెలిపారు. రూపాయికే టిఫిన్? రూ.5కే భోజన పథకానికి మంచి స్పందన వస్తున్న సంగ తి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోఒక రూపాయికే టిఫిన్ అందజేసే కార్యక్రమం అమలు చేయాలని కమిషనర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
సిలబస్-ప్రిపరేషన్ ప్రణాళిక
టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్‌లో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.మొత్తం ఖాళీలు: 123వేతన స్కేలు: రూ.22,460-రూ.66,330.అర్హత: డీసీఈ/ ఎల్సీఈ/ ఎల్ఏఏలో డిప్లొమా లేదా బీఆర్క్ లేదా బీఈ/ బీటెక్ (సివిల్) లేదా బీప్లానింగ్/బీటెక్ ప్లానింగ్.వయసు: 2015, జూలై 1 నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు. గరిష్ట వయసు 44 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.ఎంపిక విధానం: ఆన్లైన్ లేదా ఓంఎఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) {పశ్నలు సమయం మార్కులు పేపర్: 1 - జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 150 ని. 150 పేపర్: 2-ఇంటర్మీడియెట్ ఒకేషనల్ స్థాయి) 150 150 ని. 150 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 19, 2015 పరీక్ష తేదీ: నవంబరు 22, 2015. పరీక్ష కేంద్రం: హైదరాబాద్ వెబ్సైట్: www.tspsc.gov.in సిలబస్ వివరాలు అన్ని ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ ఉమ్మడిగా ఉంది. స్వల్ప మార్పులతో సిలబస్ ఒకే విధంగా ఉంది. వర్తమాన వ్యవహారాలు (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ) అంతర్జాతీయ వ్యవహారాలు జనరల్ సైన్స్, శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ విజయాలు పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ భారత, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి భారత జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ (ఫిజికల్, సోషల్, ఎకనమిక్) ఆధునిక భారతదేశ చరిత్ర (భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం) తెలంగాణ సామాజిక- ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్ర (తెలంగాణ ఉద్యమం, రాష్ర్ట ఏర్పాటుకు ప్రాధాన్యం) భారత రాజ్యాంగం; తెలంగాణ సమాజం-సంస్కృతి- వారసత్వం, సాహిత్యం; తెలంగాణ రాష్ట్ర విధానాలు; లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్.ఉంటుంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షకు పదో తరగతి స్థాయిలో ఉంటుంది.జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఉపయోగపడతాయి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలను రిఫరెన్స్‌గా ఉపయోగించుకోవచ్చు. పేపర్-2 అసిస్టెంట్ (ఫైనాన్స్, అకౌంట్స్): డిగ్రీ స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్‌లో అకౌంటింగ్ ప్రాథమిక భావనలు, బుక్ కీపింగ్, భాగస్వామ్య ఖాతాలు, కార్పొరేట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్‌కం ట్యాక్స్, వ్యాపార సంస్థ-ప్రాథమిక అంశాలు, వివిధ రకాల వ్యాపార చట్టాలు, ఆడిటింగ్ తదితర అంశాలుంటాయి. కంప్యూటర్స్‌కు సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్; ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్స్ఎల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్, ఈ-కామర్స్ అంశాలుంటాయి. టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్స్:ఇంటర్మీడియెట్ ఒకేషనల్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్‌లో ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నంబరింగ్, డ్రాయింగ్ (బ్రిక్ అరేంజ్మెంట్, ఫ్లోరింగ్ టైప్స్, ఎలివేషన్...), సర్వేయింగ్, ఫీల్డ్ బుక్ ఎంట్రీస్, ప్లాటింగ్, కాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్ వంటి అంశాలున్నాయి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి డిప్లొమా స్థాయిలో ప్రశ్నలుంటాయి. సిలబస్‌లో థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్, ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్, బేసిక్ హైడ్రాలిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ వంటి అంశాలుంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ (ఆబ్జెక్టివ్)- ఆర్.కె.జైన్, రాజ్పుట్, జైన్ అండ్ జైన్ పుస్తకాలు రిఫరెన్సుకు ఉపయోగపడతాయి. ప్రిపరేషన్ టిప్స్ ప్రిపరేషన్ సమయంలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సినాప్సిస్‌తో నోట్స్ రూపొందించుకోవాలి. ఇది చివరి దశలో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.క్లిష్టమైన అంశాలను చదివేటప్పుడు గ్రూప్ స్టడీ వల్ల ప్రయోజనం ఉంటుంది. వీలైనన్ని మోడల్ టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల పరీక్ష సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. పెద్ద నిర్వచనాలు, ఫార్ములాలు, స్టేట్మెంట్లను చిన్న కోడ్ల ద్వారా గుర్తుంచుకోవాలి.తెలిసిన అంశాల నుంచి కూడా ఊహించని విధంగా పరోక్షంగా ప్రశ్నలు ఎదురుకావొచ్చు. అందువల్ల ఇంపార్టెంట్ అనే దృక్పథాన్ని విడిచిపెట్టి, ప్రతి అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి.పరీక్షకు కనీసం వారం ముందు నుంచి రివిజన్ ప్రారంభించాలి. ఆ సమయంలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు ప్రయత్నించకకూడదు. -
అక్రమాల ఊడలు
బీపీఎస్ ముసుగులో యథేచ్ఛగా నిర్మాణాలు టౌన్‌ప్లానింగ్‌లో దళారీ దందా మాట వినని టీపీఎస్‌ను మార్చేందుకు కుట్ర ఉన్నతాధికారులు దృష్టిసారించాలి మరి.. బీపీఎస్ ముసుగులో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు అవినీతి మేడలు కట్టేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ముఖ్య అధికారిని గుప్పెట్లో పెట్టుకున్న ఓ దళారీ ఈ కథంతా నడిపిస్తున్నాడు. తన మాట వినని అధికారులను అంతర్గత బదిలీలు చేయించే స్థాయికి సదరు దళారీ ఎదగడం ఇప్పుడు కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. నిబంధనల ప్రకారం 1985 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్యకాలంలో నిర్మాణమైన భవనాలకు మాత్రమే ప్రభుత్వం బీపీఎస్‌కు అనుమతిచ్చింది. దీనిని సాకుగా తీసుకుని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గవర్నర్‌పేట మ్యూజియం రోడ్డులో టౌన్‌ప్లానింగ్ అనుమతులు లేకుండా మూడో అంతస్తు నిర్మాణం సాగుతోంది. విద్యుల్లత సిటీప్లానర్‌గా పనిచేసిన కాలంలో ఈ భవనంలో రెండో అంతస్తుకే అనుమతించలేదు. అన ధికారికంగా నిర్మించేందుకు ప్రయత్నించగా, రెండుసార్లు ఆమె కూలగొట్టారు. ఆమె బదిలీ అయిన మూడు నెలలకే రెండో అంతస్తు వెలిసింది. తాజాగా మూడో అంతస్తు నిర్మాణంలో ఉంది. దీనికి సంబంధించి భారీ డీల్ జరిగినట్లు సమాచారం. టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హస్తం ఇందులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తపేట అహ్మద్వీధిలో రెండో అంతస్తు నిర్మాణం జరుగుతోంది. అలాగే, బందరురోడ్డులోని ఒక ప్రముఖ హోటల్‌పై, మొగల్రాజపురంలోని మోడరన్ మార్కెట్ సమీపంలో అపార్ట్మెంట్ అనధికారిక కట్టడాలకు అనుమతిచ్చారు. వన్‌టౌన్, భవానీపురం, గవర్నర్‌పేట, సింగ్‌నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా నిర్మిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, బ్రోకర్లే డీల్స్ కుదురుస్తున్నారనేది బహిరంగ రహస్యం. బీపీఎస్‌కు ప్రభుత్వం అనుమతిచ్చాక నగరంలో సుమారు రెండువేల పైచిలుకు అక్రమ కట్టడాలు వెలిసినట్లు భోగట్టా. వీటిద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చక్కబెడుతున్నారు టౌన్‌ప్లానింగ్‌ను బ్రోకర్లు రాజ్యమేలుతుండటంపై మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్య అధికారిని బదిలీ చేయాల్సిందిగా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్‌ను రెండు నెలల కిందటే కోరారు. డీటీసీపీ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. సాయిబాబా అనే అధికారి ఇక్కడకు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాగూ బదిలీ అయిపోతున్నాం కాబట్టి చక్కబెట్టేద్దాం.. అనే ‘ప్లానింగ్ ’లో అధికారి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు భోగట్టా. టౌన్‌ప్లానింగ్‌పై అందుతున్న ఫిర్యాదులపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు తగని మొహమాటం ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే అక్రమాల లోగుట్టు బట్టబయలవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దళారీ దందా టౌన్‌ప్లానింగ్‌లో ఆ దళారీ రూటే సెప‘రేటు’. ముఖ్య అధికారిని గుప్పెట్లో పెట్టుకుని కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు టౌన్‌ప్లానింగ్ సెక్షన్లోనే ఆయన పనంతా. పై అధికారి పేరు చెప్పి కిందిస్థాయి ఉద్యోగుల్ని బెదరేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సర్కిల్-3లో ఓ భారీడీల్కు సంబంధించి సంతకం చేయాల్సిందిగా టీపీఎస్‌ను కోరగా, ఆయన నిరాకరించారు. దీంతో సదరు దళారీ వేరే సర్కిల్ టీ పీఎస్‌తో సంతకం చేయించి ముఖ్య అధికారితో ఆమోదముద్ర వేయించినట్టు భోగట్టా. ఈ విషయమై ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగిందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. సీన్‌కట్ చేస్తే.. సర్కిల్-3లో తాము చెప్పిన పనులు చేయడం లేదనే నెపంతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణను బదిలీ చేయించే కుట్ర సాగుతోంది. దీనికి సంబంధించి ఫైల్‌ను ముఖ్య అధికారి సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌కు స్క్రీన్‌ప్లే దళారీ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో టీపీఎస్ మార్పునకు సంబంధించిన ఫైల్ కమిషనర్ టేబుల్‌పైకి చేరనున్నట్లు సమాచారం. -
అసలేం జరుగుతోంది..!
- టౌన్‌ప్లానింగ్ తీరుపై డీటీసీపీ సీరియస్ - ప్రయివేటు దందా చెలాయిస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు - ఫిర్యాదులున్నా చర్యల్లేవు విజయవాడ సెంట్రల్ : టౌన్‌ప్లానింగ్ తీరుపై టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ తిమ్మారెడ్డి గుర్రుగా ఉన్నారు. ముఖ్య అధికారితో పాటు కొందరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల వ్యవహారంపై నేరుగా ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇటీవల నగరానికి విచ్చేసిన తిమ్మారెడ్డి ఒక ప్రముఖ హోటల్లో ముఖ్య అధికారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ‘కొందరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు దొరికితే దొంగలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలేం జరుగుతోంది ఇక్కడ? నా వరకూ ఫిర్యాదు వస్తే బాగోదు’ అంటూ సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రయివేటు దందా ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు సరెండరవగా, ఒకర్ని సస్పెండ్ చేశారంటేనే టౌన్‌ప్లానింగ్ పరిస్థితి బాగోలేదన్న విషయం అర్థమవుతోంది. ముఖ్య అధికారి పర్యవేక్షణ కొరవడటంతో కింది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు రూ.లక్షల మొత్తంలో వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. బినామీ పేర్లతో కోట్లు విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ చైన్మెన్లను పక్కన పెట్టి డివిజన్లలో అక్రమ కట్టడాలు, మామూళ్ల వసూళ్ల కోసం ప్రయివేటు వ్యక్తులను ముగ్గురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు నియమించుకున్నారు. వాళ్ల ద్వారానే మామూళ్ల మంత్రాగం నడుస్తోందనేది బహిరంగ రహస్యం. సాయంత్రమయ్యే సరికి టౌన్‌ప్లానింగ్‌లో వాలిపోయే బ్రోకర్లు గప్‌చుప్‌గా అక్రమ వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టేస్తున్నారు. బిల్డింగ్ ప్లాన్ దగ్గర నుంచి మార్ట్గేజ్ వరకు అంతా వారి కనుసన్నల్లోనే జరిగిపోతోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చెప్పినా జరగని పనులను సైతం వీళ్లు చక్కబెట్టేస్తున్నారు. పదోన్నతిపై బదిలీ అయిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఊపందుకోవడం వెనుక భారీ డీల్స్ నడిచినట్లు తెలుస్తోంది. రెచ్చిపోతున్నారు కర్ర ఉన్న వాడిదే గొర్రె అన్న చందంగా టౌన్‌ప్లానింగ్‌లో పరిస్థితి తయారైంది. చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒక పవర్ బ్రోకర్ ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లను బెదరేసి మరీ పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం విజిలెన్స్, ఏసీబీ పెద్దల పేర్లు ఉపయోగించినట్లు సమాచారం. మార్ట్గేజ్, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ బాండ్స్ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్‌ప్లానింగ్‌లో అవినీతిపై విజిలెన్స్, ఏసీబీలకు ఫిర్యాదులు అందినప్పటికీ చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సి‘ఫార్సు’పై సీరియస్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇటీవలే నలుగురు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు టీపీఎస్‌లను పదోన్నతిపై వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు చేశారు. బదిలీ అయిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల స్థానే కొత్తవారు వచ్చే వరకు రిలీవ్ చేయడం సాధ్యం కాదని కమిషనర్ జి.వీరపాండియన్ స్పష్టం చేశారు. టీపీవో (టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్)గా రంగప్రసాద్, రాంబాబు పదోన్నతి పొందారు. రాంబాబు రిలీవై నూజివీడు వెళ్లగా రంగప్రసాద్ డెప్యూటేషన్‌పై ఇంకా ఉయ్యూరులోనే టీపీఎస్‌గా కొనసాగుతున్నారు. ఎమ్మిగనూరులో పోస్టింగ్ చేపట్టేందుకు నిరాకరిస్తున్న రంగప్రసాద్ పలువురి పెద్దలతో సి‘ఫార్సు’లు చేయించడంపై డీటీసీపీ తిమ్మారెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. టీపీఎస్‌లుగా ఇద్దరు కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చినప్పటికీ ఎందుకు రిలీవ్ చేయడం లేదని ముఖ్య అధికారిని డీటీసీపీ గట్టిగా నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మొత్తం మీద టౌన్‌ప్లానింగ్ అక్రమాలు ముఖ్య అధికారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
మునిసిపల్ కమిషనర్లు కావలెను!
మొత్తం 166 పోస్టుల్లో పనిచేస్తున్నది 48 మందే ⇒ రాష్ట్రంలో మూడొంతులకు పైగా పోస్టులు ఖాళీలే ⇒ 48మంది కమిషనర్లతో సహా పురపాలికల్లో 333 పోస్టుల భర్తీ! ⇒ ప్రభుత్వానికి ప్రతిపాదించిన పురపాలక శాఖ ⇒ టౌన్ ప్లానింగ్‌లో మరో 138 పోస్టులకు ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడొంతులకు పైగా మునిసిపల్ కమిషనర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మొత్తం 166 మంది మునిసిపల్ కమిషనర్లు పనిచేయాల్సి ఉండగా, కేవలం 48 మంది మాత్రమే ఉన్నారు. సరిపడా సంఖ్యలో కమిషనర్లు లేకపోవడంతో ప్రభుత్వం చాలా మునిసిపాలిటీలకు మునిసిపల్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేనేజర్లను ఇన్చార్జి కమిషనర్లుగా నియమించింది. సమర్థులైన అధికారులు లేకపోవడంతో చాలా పురపాలికల్లో వ్యవహారాలు గాడితప్పాయి. మునిసిపల్ కమిషనర్ పోస్టులే కాదు.. అకౌంటెంట్లు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ తదితర కేటగిరీల పోస్టుల్లో సైతం సగానికి పైగా ఖాళీలే వున్నాయి. మునిసిపాలిటీల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో తొలి విడత కింద 48 కమిషనర్ పోస్టులతో సహా మొత్తం 333 ఇతర పోస్టులను భర్తీ చేయాలని పురపాలక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు అనుమతించాలని కోరుతూ ఆర్థిక శాఖకు పురపాలక శాఖ లేఖ రాసింది. ఆ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్‌లో 138 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు.. మునిసిపాలిటీల్లో ఖాళీగా వున్న 138 పట్టణ ప్రణాళికా విభాగం ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్(డీటీసీపీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అందులో 119 బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులుండగా.. మిగిలిన పోస్టులు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులున్నాయి. డీటీసీపీ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో వున్నాయి. -
అధికారులే టార్గెట్
పాలక, ప్రతిపక్షాల ముప్పేట దాడి పాత భవనాలు, పింఛన్లపై వాడీవేడి చర్చ మేయర్ తీరు మారింది విజయవాడ సెంట్రల్ : యూసీడీ, టౌన్‌ప్లానింగ్ విభాగాల పనితీరు అధ్వానంగా ఉందంటూ పాలక, ప్రతిపక్ష సభ్యులు కౌన్సిల్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నల వర్షంతో అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. ప్రశ్నోత్తరాల సమయంలో పురాతన భవనాలపై రసవత్తర చర్చ నడిచింది. నగరంలో పురాతన భవనాలు కూలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కో-ఆప్షన్ సభ్యుడు సిద్దం నాగేంద్రరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సభ్యురాలు సుభాషిణి మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న పురాతన భవనంపై రెండో అంతస్తు కొత్తగా నిర్మించినా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీని వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. సిటీప్లానర్ చక్రపాణి మాట్లాడుతూ నగరంలో 183 పురాతన భవనాలను గుర్తించామని, ఎనిమిది కూల్చివేశామని, మిగిలిన వాటికి సంబంధించి యజమానులు, అద్దెదారులు కోర్టులకు వెళ్లడంతో చర్యలు తీసుకోలేకపోతున్నామని వివరించారు. 2012 లో కోర్టులో కేసులు నమోదైతే ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదని కో-ఆప్షన్ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి ప్రశ్నించారు. త్వరలోనే స్టే వెకేట్ చేయిస్తామని సిటీ ప్లానర్ చెప్పారు. పురాతన భవనాలను గుర్తించేందుకు త్వరలోనే సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ్యులు ప్రశ్నిస్తే గానీ పురాతన భవనాల విషయాన్ని కౌన్సిల్‌కు చెప్పరా.. అని మేయర్ ప్రశ్నించారు. పనితీరు మార్చుకోవాలని సిటీప్లానర్‌ను హెచ్చరించారు. అధ్వానంగా యూసీడీ విభాగం తీరు అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగం పనితీరు అధ్వానంగా ఉందని పాలక, ప్రతిపక్ష సభ్యులు అధికారులపై విరుచుకుపడ్డారు. జనశ్రీబీమా యోజన, అభయహస్తం పథకాల కింద లబ్ధిదారులకు బీమా సొమ్ము అందడం లేదని సభ్యులు జాస్తి సాంబశివరావు, ముప్పా వెంకటేశ్వరరావు, బండినాగేంద్ర పుణ్యశీల, వీరమాచినేని లలిత, అవుతు శ్రీశైలజ ఆరోపించారు. యూసీడీ విభాగంలోకి సమాధానం చెప్పే అధికారి కరువయ్యారన్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీ ఇంతవరకు గాడిలో పడలేదని ఉమ్మడిశెట్టి బహుదూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పింఛన్ల కోసం తమ వద్దకు వచ్చే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని డెప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, కాకు మల్లికార్జున యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్లకు సంబంధించి పీవో కె.శకుంతల గణాంకాలను వివరించారు. కాకిలెక్కలతో పీవో గారడీ చేస్తున్నారని, కావాలంటే బాధితులను పిలిపిస్తానని బహుదూర్ అన్నారు. సభ్యుల వాదనతో ఏకీభవించిన మేయర్ కింది సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే యూసీడీ పనితీరు అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. ప్రక్షాళనకు త్వరలోనే చర్యలు చేపడతానని పేర్కొన్నారు. మేయర్ తీరు మారింది గత రెండు సమావేశాలకు భిన్నంగా మేయర్ కౌన్సిల్‌ను నిర్వహించారు. సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా సభను సజావుగా నడపగలిగారు. దీంతో ఒక్కరోజులోనే 238 అంశాలపై చర్చ ముగిసింది. దండం పెట్టి అడుగుతున్నా.. కొందరు అధికారులు సహకరించడం లేదంటూ సభ్యులకు వివరించారు. త్వరలోనే అన్ని విభాగాలను గాడిలో పెట్టేందుకు తనవంతు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు, అదనపు కమిషనర్ జి.నాగరాజు, చీఫ్ ఇంజనీర్ ఎంఏ షుకూర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.