ఏపీ టౌన్ ప్లానింగ్ అధికారికి 25 కోట్ల ఆస్తి
‘సీఆర్‌డీఏ’ అధికారి రెహ్మాన్ ఆస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, విశాఖపట్నం / సాక్షి, విజయవాడ/ గుంటూరు (పట్నంబజారు): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి షేక్ ఫజలూర్ రెహమాన్ ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి ప్రాంతాల్లో 11 చోట్ల సోదాలు చేశారు. ఈ సోదాల్లో రెహ్మాన్‌కు చెందిన రూ.2 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి మార్కెట్ విలువ రూ.25 కోట్ల పైమాటేనంటున్నారు. ఆయన తన కుమారుడి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.