‘రియల్’ దగా
16 బాధితుల ఫిర్యాదు...
బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు భవానీపురం స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఐ.గోపాలకృష్ణ తెలిపారు. ఇప్పటివరకు 16 మంది బాధితులు వచ్చారని, వారికి రూ.60 లక్షల మేర ఇవ్వాల్సి ఉందని చెప్పారు. బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉండొచ్చని ఆయన తెలిపారు. కొనుగోలు చేసిన స్థలాలను అధిక రేటుకు విక్రయించుకొని వీరికి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఉండొచ్చనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. అది కూడా అవకాశం లేక కొందరికి చేసి ఉండకపోవచ్చన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
‘‘రాజధాని పరిసర ప్రాంతాల్లో.. సీఆర్‌డీఏ పారిశ్రామిక కారిడార్‌కు చేరువలో.. విమానాశ్రయానికి దగ్గరలో.. కేవలం రూ.లక్షకే 100 చదరపు గజాల స్థలం.. అన్ని అనుమతులతో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు..’’ అంటూ ప్రచారం చేసిన విజయవాడకు చెందిన మేఘాలయ ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్ సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది. రూ.10 కోట్ల మేరకు జనానికి టోపీ పెట్టింది. విజయవాడలోని భవానీపురం క్రాంబ్వే రోడ్డులో గల మేఘాలయ ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. డబ్బులు కట్టించుకునే వరకు తియ్యని మాటలతో మభ్యపెట్టిన ఈ సంస్థ నిర్వాహకులు ఇప్పుడు ముఖం చాటేశారు. గట్టిగా నిలదీసినవారికి ఇతరులకు విక్రయించిన ప్లాటును రీ రిజిస్ట్రేషన్ చేశారు. చేసిన మోసం గుర్తించిన బాధితులు సంస్థ నిర్వాహకులను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే కార్యాలయం మూసేసి పరారైన నిర్వాహకుల మొబైల్ ఫోన్లు కూడా మూగబోయాయి. దీంతో జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు హర్షవర్థన్‌ని పోలీసులు సోమవారం రాత్రే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
ఏజెంట్ నుంచి ఎండీ దాకా...
నందిగామ ప్రాంతానికి చెందిన బొడా హర్షవర్థనరావు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేసేవాడని పోలీసులు చెపుతున్నారు. ఐదేళ్ల కిందట నగరానికి వచ్చి భార్య, స్నేహితుణ్ణి వ్యాపార భాగస్వాములుగా చేసుకొని మేఘాలయ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే నూజివీడు సమీపంలోని యనమదల, ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామాల్లో రెండు వెంచర్లు వేశాడు. రూ.లక్షకే 100 గజాల స్థలమని చెప్పడంతో నగరంలోని గులాబితోట పరిస ర ప్రాంతాలకు చెందిన వందమందికి పైగా అతని వద్ద ప్లాట్లు కొనుగోలు చేశారు. తక్కువ రేటుకు వస్తోందని భావించిన పలువురు రెండు మూడు ప్లాట్ల వరకు డబ్బులు చెల్లించారు. తెలిసినవారితో కూడా కొనుగోలు చేయించారు. ఈ విధంగా రూ.10 కోట్ల వరకు ప్లాట్ల కొనుగోలు నిమిత్తం పలువురు సొమ్ము చెల్లించినట్లు పోలీసులు చెబుతున్నారు. డబ్బులు చెల్లించిన వారిలో కొందరికి రేపు మాపంటూ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పుకొంటున్నాడు. గట్టిగా నిలదీసిన వారిలో కొందరికి రీ రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం.
నెపం రైతులపై...
రైతులపై నెపం నెట్టి తప్పించుకునే యత్నాల్లో హర్షవర్థన్ ఉన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు చే సిన భూమికంటే అదనంగా చూపించి విక్రయించాడని బాధితులు చెపుతున్నారు. అదేమంటే రైతులు తాను డ బ్బులు చెల్లించినా ఇవ్వడం లేదనే కా రణం చెపుతున్నట్టు పేర్కొంటున్నారు.