సాక్షి, అమరావతి: సీఆర్‌డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు.
విచారణ సందర్భంగా ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలను ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని, మంగళవారం విచారణకు అదనపు ఏజీ అందుబాటులో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అదనపు ఏజీ కార్యాలయం సైతం త్రిసభ్య ధర్మాసనం ముందు ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున, తాజా వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కార్యాలయం రాతపూర్వకంగా కోర్టు ముందు మెమో దాఖలు చేసింది. తాజా వ్యాజ్యాలను ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలతో జత చేయాలని అదనపు ఏజీ ఆ మెమోలో కోర్టును కోరారు.
ద్విసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలిచ్చిన సీజే
అటు ఏజీ వాదనలను, ఇటు ఏఏజీ మెమోను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాయ్ సైతం ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనమే విచారించడం మేలని అభిప్రాయపడ్డారు. అయితే, తమ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోరడంతో.. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు కేసు ఫైళ్లను (సీజే) ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాలను సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ముందుంచింది. వీటిని పరిశీలించిన సీజే మంగళవారం ద్విసభ్య ధర్మాసనం విచారణకు వేయాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment