మంత్రి బొత్స సత్యనారాయణ( ఫైల్ ఫొటో)
సాక్షి, అమరావతి: ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం ఏపీ సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అమరావతి రైతులకు నష్టం జరగదని తెలిపారు. తమ ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే వికేంద్రీకణ చట్టాలు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఆక్రోషంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రాజధానిపై చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అని సూటిగా ప్రశ్నించారు. రాజధానిపై బయటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం పోయిందని చంద్రబాబుకు కడుపుమంటని దుయ్యబట్టారు. అంబేద్కర్ నిర్ణయించిన రాజ్యాంగ ప్రకారం చట్టాలు ఉండాలని తాము మొదటి నుంచి చెప్తున్నామని అన్నారు. దాన్ని అధిగమించి ఎవరూ ఏమీ చేయరని, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే నడుస్తున్నామని తెలిపారు.
ఎవరి పాత్ర ఎంతవరకు అనే దానిపై సభలో చర్చించామని, అభిప్రాయ బేధం ఉంటే చంద్రబాబు శాసనసభలో మాట్లాడవచ్చని అన్నారు. అందుకు భిన్నంగా బయట కూర్చుని ఎలా మాట్లాడతారు?అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ బద్దమైనవిగానే ఉంటాయని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల నిర్ణయం కోరుదామనుకుంటే.. తాము వద్దన్నామా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం చేసే చట్టాల్లోకి ఎవరూ జోక్యం చేసుకోకూడదని అన్నారు. కోర్టు చెప్పినట్టుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామనే ఇప్పటికీ అంటున్నాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment