![Farmers fires over land acquisition for Amaravati railway line](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/14-ap.jpg.webp?itok=eBrAtKxt)
అమరావతి రైల్వే లైన్ భూసేకరణపై రైతులు ఆగ్రహం
భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని డిమాండ్
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంపు
అమరావతి పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచని ప్రభుత్వం
దీనివల్ల రైల్వే ఇచ్చే పరిహారం చాలా తక్కువవొస్తుందని ఆందోళన
రైతుల అభ్యంతరాలు స్వీకరించకుండానే పెగ్‌మార్కింగ్‌కు సిద్ధం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
రైల్వే లైన్‌కు ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, గుంటూరు : అమరావతి రైల్వే ప్రాజెక్టు( Amaravati railway line) భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించ రైల్వే లైన్‌కు భూమి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. భూ సేకరణ కాకుండా సమీకరణ చేయాలని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. బలవంతంగా భూసేకరణకు సిద్ధమైతే కోర్టును ఆశ్రయించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.అమరావతి రైల్వే లైన్ కోసం గుంటూరు జిల్లాలో 1,753 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
అమరావతి మండలం కర్లపూడి గ్రామంలోనే 232 ఎకరాలు సేకరించనున్నారు. ఇదే గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 153 ఎకరాలు, ఈ7, ఈ8, ఈ9 రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్డు కోసం 900 ఎకరాలు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే లైన్‌కు భూమి ఇవ్వాలని, దీనికి కేంద్రం ఇచ్చే ప్యాకేజి సరిపోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం కోసం ఎక్కడో ఉన్న గన్నవరంలో భూములిచ్చిన వారికి రాజ«దానిలో 1,450 గజాలు ల్యాండ్‌పూలింగ్ ప్యాకేజి కింద ఇచ్చారని, తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
పెగ్ మార్కింగ్ ఎలా చేస్తారు?
ప్రభుత్వం రైతులతో సమావేశాలు పెట్టినా, వారి అభ్యంతరాలు స్వీకరించకుండానే రైల్వే లైన్ భూసేకరణకు పెగ్‌మార్కింగ్‌కు సిద్ధపడుతోంది. ఇలా ఇష్టానుసారం పెగ్ మార్కింగ్‌కు షెడ్యూల్ ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అమరావతి తహసీల్దార్‌తో జరిగిన సమావేశంలో కర్లపూడి రైతులు ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసు బందోబస్తుతో పెగ్‌మార్కింగ్‌కు రావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రాజధాని పరిసర ప్రాంతాల్లోని కంతేరు, కొప్పురావూరు, తాడికొండ, మోతడక గ్రామాల రైతులు రైల్వే లైన్ భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు కూడా చేశారు. రైల్వేలైన్ వల్ల పక్కన ఉన్న భూముల ధరలు కూడా పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పక్కనే 500 మీటర్ల వరకూ భూమిని సేకరించి, రైల్వే లైన్‌కు రెండువైపులా సర్వీస్‌రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇంత అన్యాయమా?
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూముల ప్రభుత్వ విలువ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని, పరిసర ప్రాంతాల్లో మాత్రం పెంచలేదు. ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల రైల్వే లైన్ భూ సేకరణలో తాము తీవ్రంగా నష్టపోతామని చెబుతునానరు. తమ గ్రామంలో భూమి ప్రభుత్వ విలువ రూ. 16 లక్షలు ఉంటే దాన్ని కేవలం రూ. 4 లక్షలు పెంచి రూ. 20 లక్షలు చేశారని, మిగిలిన చోట్ల అసలు పెంచలేదని కర్లపూడి రైతులు చెబుతున్నారు.
బహిరంగ మార్కెట్‌లో తమ భూముల ఎకరా దాదాపు రూ. 4 కోట్లు ఉండగా, ఇప్పుడు రైల్వే నుంచి రూ. 50 లక్షలు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రైల్వే ప్యాకేజికి అదనంగా ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చే ప్యాకేజిలో 33 శాతం అంటే 410 గజాల స్థలం ఇప్పిస్తామని మంత్రి నారాయణ ఇటీవల రైతులకు సర్దిచెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 650 గజాల వరకు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే దీనికి కూడా రైతులు అంగీకరించడంలేదు. పూర్తిగా పూలింగ్ ప్యాకేజి ఇవ్వాలని కోరుతున్నారు.
రాజధాని రైతులకు ఇచ్చినట్లుగా ఫారం.9.14 ఇవ్వాలని, అందులో ఎంత భూమి ఇస్తారు, ఇళ్ల స్థలం ఎంత, వాణిజ్య స్థలం ఎంత? కౌలు ఎన్ని సంవత్సరాలు ఇస్తారన్న విషయాలను స్పష్టం చేయకుండా భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. అసలు రైల్వే లైన్ అలైన్‌మెంటే తప్పు అని రైతులు అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ చేసిన గ్రామాల నుంచి కాకుండా బయట నుంచి రైల్వే లైన్ వెళ్లడం వల్ల 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వాదిస్తున్నారు. గతంలో ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌ను కదపకుండా బయట నుంచి అలైన్‌మెంట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment