Land acquisition
-
ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి
కొడంగల్/ దుద్యాల్: సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు కన్నెర్ర జేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా అదనపు బలగాలను మోహరించారు. అసలేం జరిగింది? ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియలో భాగంగా సోమవారం గ్రామసభ నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. భూములు తీసుకునే లగచర్లలో కాకుండా రెండు కిలోమీటర్ల దూరంలో దుద్యాల– హకీంపేట మార్గంలో సభ ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకించిన నిర్వాసిత రైతులు.. తమ గ్రామంలోనే సభ నిర్వహించాలని అధికారులను కోరారు. రైతుల పక్షాన ఓ వ్యక్తి గ్రామసభ వేదిక వద్దకు వచ్చి కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు ఈ విషయాన్ని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గ్రామంలోనే సభ నిర్వహిద్దామంటూ లగచర్లకు బయలుదేరారు. అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి కలెక్టర్ వాహనాన్ని అనుసరించారు. అధికారులు లగచర్లకు చేరుకోగానే గ్రామస్తులు భూసేకరణకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను సముదాయించడానికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రయత్నించారు. కానీ కొందరు గ్రామస్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. పోలీసుల వైఫల్యం! గ్రామసభ కోసమని ఏర్పాటు చేసిన వేదిక వద్ద సుమారు 200 మంది వరకు పోలీసులు విధుల్లో ఉన్నారు. కలెక్టర్, ఇతర అధికారులు లగచర్ల గ్రామానికి వెళ్తున్నప్పుడు వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మినహా పోలీసులెవరూ వెంట వెళ్లలేదు. ఆగ్రహంతో దాడికి దిగిన గ్రామస్తులు, నిర్వాసిత రైతులను అదుపు చేయడం వీలుకాలేదు. నిఘా వ్యవస్థ, పోలీసుల వైఫల్యం కారణంగానే.. ఈ ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న రైతులు దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి, పులిచెర్లతండా, రోటిబండ తండాల్లో మొత్తం 1,358 ఎకరాల భూసేకరణ కోసం ఐదు నెలల క్రితం చర్యలు ప్రారంభించింది. ఇందులో 547 ఎకరాలు అసైన్డ్ భూమి, 90 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా.. 721 ఎకరాల పట్టా భూమి ఉంది. సుమారు 800 రైతులు భూములు కోల్పోనున్నారు. వారంతా పేద రైతులే. చాలా వరకు గిరిజనులే. ఈ భూముల్లో వ్యవసాయం తప్ప వేరే జీవనోపాధి లేదని వారు మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారని అధికారులు చెప్తున్నా... చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంట పొలాల్లో విషం చిమ్మే ఫార్మా కంపెనీలను అనుమతించేది లేదంటూ ఆందోళన చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం భూసేకరణపై ముందుకు వెళ్తుండటం, ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో.. జిల్లా అధికారులకు తలనొప్పిగా మారింది. రైతుల ఆగ్రహాన్ని గమనిస్తూనే భూసేకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నిర్వాసితులకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకరం సగటు ధర రూ.30 లక్షలకుపైగా ఉందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం రూ.10 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, కోల్పోయే ఒక్కో ఎకరానికి 125 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నా.. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులపై దాడి వరకు వెళ్లింది. అనుకోకుండా జరిగింది.. అందరూ మనవాళ్లే.. లగచర్ల ఘటనను కలెక్టర్ ప్రతీక్ జైన్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఘటనా స్థలం నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వారందరూ మన ప్రజలే, మన రైతులే.. మాట్లాడుదామని మమ్మల్ని పిలిస్తేనే వెళ్లాం.. కొందరు వ్యక్తులు అనుకోకుండా తోసుకుని ముందుకు వచ్చి అలా చేశారు. దయచేసి ఈ ఘటనకు దాడి అనే పదం వాడకండి..’’ అని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ కుట్రతోనే దాడి: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే అధికారులపై దాడి చేయడం హేయమైన చర్య అని.. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఫార్మా కోసం భూసేకరణపై అభిప్రాయ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై కొందరు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు ఫార్మా కంపెనీలు తీసుకువస్తున్నారన్నారు. పరిశ్రమలు స్థాపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే అక్కసుతోనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. -
కన్ను పడితే కబ్జా.. నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ భూములు మాయం
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు మాయమవుతున్నాయి. ప్రధానంగా మిర్యాలగూడ డివిజన్లోని రెండు మండలాల్లో వేల ఎకరాల అటవీ భూములను కాజేశారు. ప్రభుత్వ స్థలాలు, శిఖం, సీలింగ్ భూములను కూడా వదలడం లేదు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో కొందరు ప్రభుత్వ భూములను కాజేయగా.. మరికొందరు అక్రమంగా ధరణిలో పేర్లు నమోదు చేయించి.. సీలింగ్ భూములను సైతం కాజేశారు. భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.– సాక్షి ప్రతినిధి, నల్లగొండరాజకీయ పలుకుబడితో కబ్జాలు కృష్ణపట్టె పరిధిలోకి వచ్చే మిర్యాలగూడ డివిజన్లోని దామరచర్ల, మిర్యాలగూడ, అడవిదేవుల పల్లి మండలాల్లో కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని కొందరు ఈ దందాకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఈ కబ్జాల పర్వం కొనసాగగా, ఇ ప్పటికీ కబ్జాలు ఆగడం లేదు. కఠినంగా వ్యవహరించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. 5వేల హెక్టార్లకు పైగా అడవి మాయంఒక్క దామరచర్ల మండలంలోనే దాదాపు 9వేల హెక్టార్ల అటవీ భూమి ఉండగా.. అందులో దాదాపు 5వేల హెక్టార్లకు పైగా అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులే చెబుతున్నారు. అదే మండలంలోని వజీరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో 855.69 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూమి ఉండగా, అందులోనూ కబ్జాలు జరిగాయి. రాజగట్టు బ్లాక్ పరి«ధిలో 309.91 హెక్టార్ల భూమి ఉండగా, దానిని నాగార్జునసాగర్ రిజర్వాయర్ ముంపు బాధి తులకు పునరావాసం కింద కేటాయించారు.ఫార్మ్– డి పట్టాలు జారీ చేశారు. సాగునీటి సదుపాయం లేకపోవడంతో బాధితులు సాగు చేయకపోవడంతో అధికారులతో కుమ్మక్కైన కొందరు దొంగ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు తెలిసింది. వీర్లపాలెం బ్లాక్ పరిధిలో 2,389.72 హెక్టార్ల అటవీ భూమిలో దాదాపు 500 హెక్టార్ల భూమిని రాజకీయ పలుకు బడితో కొందరు ఆక్రమించుకున్నారు. దిలావర్పూర్ బ్లాక్ పరిధిలో 1,679.42 హెక్టార్ల అటవీ భూమి ఉండగా 200 హెక్టార్ల భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీ శాఖ యంత్రాంగం గుర్తించింది. మొల్కచర్ల బ్లాక్ పరిధిలో 2726.26 హెక్టార్ల భూమి ఉండగా 724.10 హెక్టార్ల భూమిని సాగర్ ముంపు బాధితులకు కేటాయించారు. ఆ భూములను కూడా కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండానే రోడ్లు కూడా వేసుకున్నట్లు తెలిసింది. కేజేఆర్ కాలనీ పరిధిలో దాదాపు వంద ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. 4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదామరచర్ల మండలంలోనే 4542 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. వాటిలో తప్పుడు పట్టాలను సృష్టించారు. స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో ఈభూములను కబ్జా చేయడం గమనార్హం. చట్ట విరుద్ధంగా ఇచ్చిన పట్టాలపై 2010లోనే ఆర్డీవో విచారణ జరిపి దొంగ పట్టాలను రద్దు చేశారు. అవి రద్దయి 15 ఏళ్లు కావస్తున్నా.. నేటికీ భూములు కబ్జాదారుల అధీనంలోనే ఉన్నాయి. దామరచర్ల పీఏసీఎస్‌లో 12 మంది 18 నకిలీ పట్టాలను సృష్టించి రూ.కోట్లు రుణంగా పొందారు. ఉల్సాయిపాలెం పరిధిలోని 145 సర్వే నంబర్లోని వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో అధికారులు అక్రమంగా పట్టాలు జారీ చేశారు.మిర్యాలగూడలోనూ భారీగా కబ్జాలుమిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామ రుద్రప్ప చెరువు 310 ఎకరాల్లో ఉండగా, అందులో 140 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. తాళ్లగడ్డ ఇందిరమ్మ కాలనీ వద్ద 66, 67 సర్వే నంబర్లలో 3.22 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నాయకులు ప్లాట్లుగా చేసి విక్రయించారు. ప్రస్తుతం ఆ భూమి కబ్జాపై విచారణ కొనసాగుతోంది. పట్టణ శివారు లోని చింతపల్లి, హైదలాపురంలో సర్వే నంబరు 5లో స్వాతంత్య్ర సమరయోధుల పేరిట సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు.నార్కట్‌పల్లి – అద్దంకి రహదారిపై 626 సర్వే నంబరులో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక ప్రజాప్రతినిధి ఆక్రమించినట్లు ఆరోపణలున్నాయి. పట్టణం నడి బొడ్డులోని పాత బస్టాండ్ ఎదురుగా రూ.కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూమిని నకిలీ దత్తత పత్రాలు సృష్టించి కాజేసినట్లు ఆరోపణలున్నాయి. పట్టణంలోని బస్టాండ్ పక్కనే 4 గుంటల ప్రభుత్వ భూమిని బడా వ్యాపారి ఆక్రమించుకున్నట్లు ఆరోప ణలున్నాయి. అడవిదేవులపల్లి మండలంలో 900.04 హెక్టార్ల భూమి ఉండగా అందులో దాదాపు 600 హెక్టార్లు కబ్జాకు గురైనట్లు అధికారులు భావిస్తున్నా రు. రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతి నిధుల అండదండలతో కొందరు ఆ భూముల్లో వరి, బత్తాయి తోటలు సాగు చేస్తున్నారు.తాత్కాలిక చర్యలతో ఆగని కబ్జాలు..దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌కు సమీపంలో తాళ్లవీరప్పగూడెం వద్ద 66వ సర్వే నంబరులో 15.08 ఎకరాలు, 67వ సర్వే నంబరులో 8.29 ఎకరాల భూమి జాబిశెట్టి శేషమ్మ పేరుతో ఉండగా 1997లో సీలింగ్ యాక్టు ప్రకారం పట్టాదారు నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ధరణిలో కొందరు ఆ భూములపై పట్టాలు పొందారు. అంబటి రామాంజనేయులు 6 ఎకరాలు, వింజం ముసలయ్య 5.29 ఎకరాలు, సాధినేని శ్రీనివాస్‌రావు 2.25 ఎకరాలు, రాయికింది దివ్య 3 ఎకరాలు, నాలావత్ కమిలి 3 ఎకరాలు, ఇండియా సిమెంట్స్ 1 ఎకరం పట్టా పొందారు. ఈ పట్టాలను రద్దు చేసి, ఇటీవల భూములను స్వాధీనం చేసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. మిర్యాలగూడ పట్టణ శివారు పందిళ్లపల్లి చెరువు 480 ఎకరాల్లో ఉంది. ఆ భూములను కబ్జా చేసేందుకు కొందరు కంచె నిర్మించగా అధికారులు దానిని తొలగించారు. అప్పుడప్పుడు అధికారులు చర్యలు చేపడుతున్నా కబ్జాలు మాత్రం ఆగడం లేదు. -
దొరా.. మా భూములు లాక్కోవద్దు
కొడంగల్, దుద్యాల్: ‘దొరా.. మీ కాళ్లు మొక్కుతాం. మమ్మల్ని బతకనీయండి. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఫార్మా కంపెనీల కోసం భూములు మాత్రం ఇవ్వం’అంటూ వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం లగచర్ల, రోటిబండతండా గిరిజన రైతులు అధికారులను వేడుకున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం దుద్యాల్ మండలంలో 1,358 ఎకరాల భూసేకరణలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారని... సంబంధిత రైతులు, స్థానికులకు ముందుగానే సమాచారం అందించారు. కానీ సమావేశం మొదలవకముందే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ప్రజాభియాప్రాయ సేకరణ భేటీ రద్దయింది. ఏం జరిగిందంటే.. కాంగ్రెస్ పార్టీ దుద్యాల్ మండల కమిటీ అధ్యక్షుడు ఆవుటి శేఖర్ హైదరాబాద్ నుంచి లగచర్లకు బయలుదేరగ రోటిబండ తండా వద్ద ప్రతిపాదిత ఫార్మా కంపెనీల వల్ల భూములు కోల్పోనున్న గిరిజన రైతులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులు, శేఖర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శేఖర్ తమను కులం పేరుతో దూషించారంటూ తండావాసులు ఆయనపై దాడికి యతి్నంచారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అప్రమత్తమై ఆయన్ను పక్కనే ఉన్న పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లారు. తమకు భూములు కోల్పోయే పరిస్థితి తలెత్తడానికి కూడా ఆయనే కారణమని ఆరోపిస్తూ తండావాసులు పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.కొందరు పంచాయతీ భవనంపైకి ఎక్కి బండరాళ్లతో రేకులను పగలగొట్టే ప్రయత్నం చేయగా మరికొందరు అక్కడే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాన్ని పెకిలించి దానితో తలుపులు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. ఇంకొందరు శేఖర్ కారుపై రాళ్లతో దాడిచేశారు. ఈ క్రమంలో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట చోటుచేసుకొని పలువురు మహిళలు కిందపడి గాయపడ్డారు. పరిస్థితి చేజారుతోందని గమనించిన పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కొంత వెనక్కి తగ్గిన ఆందోళనకారులు శేఖర్‌తో తమకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం శేఖర్‌ను అక్కడి నుంచి తరలించారు.ఫార్మా వద్దు.. పరిహారం వద్దుఎకరా, రెండెకరాల భూములను ఇచ్చేస్తే మేమెలా బతకాలని గిరిజనులు అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ ఎదుట విలపించారు. ప్రభుత్వం అందించే పరిహారం వద్దని.. తమ జోలికి రావొద్దని వేడుకున్నారు. దీనిపై లింగ్యానాయక్, ఎస్పీ నారాయణ స్పందిస్తూ ప్రభుత్వం దౌర్జన్యంగా ఎవరి భూములను లాక్కోదని స్పష్టం చేశారు. -
మహీంద్రా కొత్త ప్లాంటు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ప్లాంటు ఏర్పాటు యోచనలో ఉంది. ఇందుకోసం కంపెనీ మహారాష్ట్రలోని చకన్‌కు సమీపంలో స్థల సేకరణలో నిమగ్నమైనట్టు సమాచారం. మొత్తంగా ఆటోమోటివ్ పరిశ్రమకు సమీపంలో ఉండాలన్నది కంపెనీ భావన. మల్టీ ఎనర్జీ ప్లాట్‌ఫామ్ అయిన న్యూ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ (ఎన్ఎఫ్ఏ) ఆధారిత వాహనాలను ఇక్కడ తయారు చేస్తారు. చకన్, పుణే, నాసిక్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 8 లక్షల యూనిట్లు. ఎన్ఎఫ్ఏ మోడళ్ల కోసం మరింత సామర్థ్యం అవసరం అవుతుంది. ఎన్ఎఫ్ఏ ఆర్కిటెక్చర్ సుమారు 12 మోడళ్లను తయారు చేసే అవకాశం ఉంది. కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా తయారైన మోడళ్ల అమ్మకాలు ఏటా 3–5 లక్షల యూనిట్లు ఉండొచ్చని కంపెనీ భావిస్తోంది. కాగా, కంపెనీ తన లక్ష్యాన్ని చేరుకున్నట్టయితే ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అందుకుంటుంది. మహీంద్రా మార్కెట్ వాటా రెండంకెలకు చేరుకోవచ్చు. 2024–25లో ఎస్‌యూవీల టర్నోవర్ రూ.75,000 కోట్లు దాటనుంది. 2023–24లో కంపెనీ ఎస్‌యూవీల తయారీలో పరిమాణం పరంగా భారత్‌లో రెండవ స్థానంలో, ఆదాయం పరంగా తొలి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 4.59 లక్షల యూనిట్లను విక్రయించింది. ఆటోమోటివ్ బిజినెస్ కోసం రూ.27,000 కోట్ల పెట్టుబడులు చేయనున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ప్రకటించింది. -
హైవే.. ఇక హైస్పీడ్వే
ఎన్‌హెచ్–44.. దేశంలోనే అతి పెద్ద జాతీయ రహదారి. కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 3,745 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారి 11 రాష్రాల్లోని 30 ప్రధాన నగరాలను అనుసంధానిస్తోంది. జాతీయ రవాణా వ్యవస్థలో ఎన్‌హెచ్–44 అత్యంత కీలకమైంది. ఈ రహదారిలో బెంగళూరు–హైదరాబాద్ నగరాల మధ్య వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఇప్పుడున్న ‘ఫోర్ వే’ సౌలభ్యంగా ఉన్నా.. ఐదేళ్లలో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది.ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు సరిపోని పరిస్థితి. కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్గేట్ నుంచి బెంగళూరు–హైదరాబాద్ మధ్య నిత్యం 16 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే అమకతాడు టోల్గేట్ పరిధిలో 11 వేల వాహనాలు వెళ్లొస్తున్నాయి. దేశంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న నగరాల్లో బెంగళూరు–హైదరాబాద్ ప్రధానమైనవి. ఐటీతో పాటు పారిశ్రామికంగా రెండు నగరాలు అభివృద్ధి చెందాయి. రెండు నగరాల మధ్య 583 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం చేసేవారి సంఖ్య కూడాఎక్కువే. కొందరు రైళ్లు, విమానాల్లో వెళుతున్నా అధిక శాతం రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. దీంతో వాహనాల రద్దీ పెరిగింది. ముఖ్యంగా కార్ల వినియోగం అధికమైంది. ట్రాఫిక్ పెరగడాన్ని గుర్తించిన కేందప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయాలని అనంతపురం నేషనల్ హైవే అధికారులకు సూచించింది. పూర్తయిన భూసేకరణ.. నిర్మాణ ఖర్చులతోనే డీపీఆర్ ఎన్‌హెచ్–44ను డబుల్ లైన్ నుంచి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించే సమయంలోనే ఆరు లేన్లకు సంబంధించి భూసేకరణ జరిగింది. అప్పట్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6 లేన్ల కోసం భూసేకరణ చేశారు. 4 లేన్ల రహదారిని నిర్మించి తక్కిన భూమిని రిజర్వ్‌గా ఉంచారు. ఇప్పుడు కేవలం రహదారిని 6 లేన్లకు విస్తరించేందుకు అవసరమైన ఖర్చును మాత్రమే అంచనా వేసి డీపీఆర్ రూపొందిస్తున్నారు. కల్వర్టులు, వంతెనలు ఇతరత్రా ఖర్చులు లెక్కిస్తున్నారు. భూసేకరణలో సమస్యలు, కోర్టు వివాదాలు కూడా లేవు. దీంతో డీపీఆర్‌ను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తే ఆమోదముద్ర వేసి టెండర్లు పిలుస్తారు.‘సీమ’ వాసులకు ప్రయాణం మరింత సులభంఎన్హెచ్–44 విస్తరణతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు వైఎస్సార్ జిల్లా వాసులకు ప్రయాణం సులభం కానుంది. కర్నూలు–హైదరాబాద్ 217.7 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం 4గంటల సమయం పడుతోంది. అలాగే కర్నూలు–బెంగళూరు మధ్య 359.4 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రయాణానికి 7 గంటలు పడుతోంది. ఎన్‌హెచ్–44 విస్తరిస్తే సమయం తగ్గే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా వాసులకూ హైదరాబాద్, బెంగళూరుకు ప్రయాణ సమయం తగ్గనుంది. కడప, చిత్తూరు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకునే వారికి కర్నూలు నుంచి, బెంగళూరుకు ప్రయాణించే వైఎస్సార్ జిల్లా వాసులకు కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని కొండూరు నుంచి ప్రయాణం వేగవంతం కానుంది. హైదరాబాద్–బెంగళూరు ఇండ్రస్టియల్ కారిడార్‌లో నోడ్ పాయింట్‌గా కేంద్రం ఓర్వకల్లు మెగా ఇండ్రస్టియల్ హబ్‌ను గుర్తించింది. ఎన్‌హెచ్–44 విస్తరణ పారిశ్రామికంగానూ ఉపయోగపడనుంది.డీపీఆర్ సిద్ధమవుతోందిబెంగళూరు–హైదరాబాద్ నేషనల్ హైవేను 12 లేన్లుగా విస్తరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. 4 నుంచి 6 లేన్లకు విస్తరిస్తున్నాం. ఇందుకు సంబంధించి డీపీఆర్ రూపొందిస్తున్నాం. భూసేకరణ సమస్య లేదు. దీంతో 2, 3 నెలల్లో డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. దీని ఆధారంగా కేంద్రం విస్తరణపై నిర్ణయం తీసుకోనుంది. – రఘు, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవేస్ అథారిటీ, అనంతపురం -
రైతుల భవనాన్ని కూల్చేసిన టీడీపీ భూకబ్జాదారులు
హిందూపురం: సినీ హీరో, సీఎం చంద్రబాబు బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కబ్జాదారులు పేట్రేగిపోయారు. 30 ఏళ్ల క్రితం రైతులు హిందూపురం కోఆపరేటివ్ మిల్క్ డెయిరీ సొసైటీ ఏర్పాటు చేసుకొని, పట్టణం నడిబొడ్డున మెయిన్ బజారులో ఓ స్థలాన్ని కొనుక్కొని అందులో భవనాన్ని నిర్మించుకొన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంపై టీడీపీ కబ్జాదారుల కన్ను పడింది. వారు మూడురోజుల క్రితం రాత్రి వేళ ఆ భవనాన్ని కూల్చేశారు. స్థలాన్ని చదును చేసి, వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకొన్న రైతులు సోమవారం పెద్ద సంఖ్యలో పట్టణం నడిబొడ్డున ఉన్న ఆ స్థలం వద్దకు చేరుకొన్నారు. టీడీపీకి చెందిన భూ కబ్జాదారుల నుంచి రైతుల ఆస్తులను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. వారికి రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ర్యాలీగా టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, అక్కడ ధర్నా చేసి, ఫిర్యాదు చేశారు. సొసైటీ భవనాన్ని దౌర్జన్యంగా కూల్చివేసి, అందులోని సామగ్రి, విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన వారిని అరెస్టు చేయాలని సీఐ కరీంకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసానికి కూడా వెళ్లారు. ఆయన లేకపోవడంతో పీఏలకు వినతి పత్రాలు అందజేశారు. 177 మంది రైతులు కలిసి నిరి్మంచుకున్న సొసైటీ భవనాన్ని కూల్చివేసి.. ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయతి్నంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలోనే టీడీపీ నాయకులు ఇలా కబ్జాలకు పాల్పడుతున్నారంటే.. రాష్ట్రంలో ఇంకెన్ని కబ్జాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సినిమాల్లో రైతుల కోసం పోరాడే బాలయ్యా.. నీ నియోజకవర్గంలోని రైతులను కాపాడు’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవ తీసుకొని కూల్చివేసిన భవనం స్థానంలో కొత్తది నిరి్మంచి, సదుపాయాలు కలి్పంచాలని డిమాండ్ చేశారు.పచ్చ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారు పాడి రైతులందరం సొసైటీగా ఏర్పడి 30 ఏళ్ల క్రితం స్థలాన్ని కొని భవనం నిరి్మంచుకున్నాం. ఈ భవనం కేంద్రంగా చాలాకాలం పాల వ్యాపారం చేసుకొన్నాం. తర్వాత వ్యాపారం దెబ్బతినడంతో సొసైటీని మూసేశాం. అయినా అందులో సామగ్రి, డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడా స్థలం విలువ రూ.కోట్లలో ఉండడంతో టీడీపీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇటీవల నంజుడేశ్వర బిల్డింగ్లోనూ ఓ షాపును దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఇలాంటివి బాలకృష్ణ నియోజకవర్గంలోనే జరగడం శోచనీయం. – చంద్రశేఖర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడు, హిందూపురం -
అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై మరో కేసు నమోదైంది. కూకట్పల్లి ఏసీపీగా పనిచేసిన రోజుల్లో అక్కడ 340 ఎకరాల భూకబ్జాకు సహకరించారన్నది ప్రధాన ఆరోపణ. ఇన్నాళ్లు భయంతో మిన్నకుండిపోయి న బాధితుడు మీర్ అబ్బాస్ అలీఖాన్ ధైర్యం చేసి సైబరాబాద్ పోలీస్‌కమిషనర్ అవినాష్ మహంతికి తాజాగా ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నంబరు 1007లో ఉన్న 340 ఎకరాల భూమి అబ్బాస్‌అలీఖాన్ తండ్రి నవాబ్ మీర్ హషిమ్ అలీఖాన్‌కు వారసత్వంగా వచి్చంది.దీనిపై కొందరు కుటుంబీకుల మధ్య సివిల్ సూట్ నడుస్తోంది. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన అంశాల్లో పట్టులేని హషిమ్ వీటి కోసం ఎస్ఎస్.మొయినుద్దీన్, యాసీన్ షేక్ సహకారం తీసుకున్నాడు. దీనిని వారు తమకు అనుకూలంగా మార్చుకొని, ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించారు. ఇది తెలిసీ హషిమ్.. వీరిద్దరిపై కేపీహెచ్‌బీ ఠాణాలో 2014 మేలో ఫిర్యాదు చేశారు. దీంతో యాసీన్ కూకట్పల్లి ఏసీపీగా ఉన్న నాయిని భుజంగరావును సంప్రదించి భారీ మొత్తం ఆఫర్ చేశాడు. దీంతో కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ హషిమ్అలీని భుజంగరావు వేధించడంతో పాటు తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేయించారు.ఈ క్రమంలోనే గ్రీన్కో కంపెనీ నిర్వాహకులు సీహెచ్.అనిల్, శ్రీనివాసరావు.. యాసీన్, మొయినుద్దీన్‌తో కలిసి ఆ భూమి కాజేయడానికి ముందుకొచ్చారు. భుజంగరావు సలహా మేరకు వీరంతా గూండాలను పంపి హషిమ్ను కిడ్నాప్ చేసి నిర్బంధించి, భూమికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. మరోపక్క ఈ కేసులో అభియోగపత్రాలు దాఖలు చేయనివ్వకుండా భుజంగరావు దర్యాప్తు అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఈ పరిణామాలు, వేధింపులు భరించలేకపోయిన హషిమ్ తీవ్ర అనారోగ్యానికి గురై 2020 జూన్ 30న కన్నుమూశారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో భుజంగరావు అరెస్టు కావడంతో ధైర్యంచేసి బయటికొచి్చన అబ్బాస్ అలీఖాన్ ఆయనపై ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం కేసు నమోదు చేసుకున్న ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
వేగంగా భూసేకరణ.. ట్రిపుల్ ఆర్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ‘సంగారెడ్డి–ఆమన్‌గల్–షాద్‌నగర్–చౌటుప్పల్ (189.20 కి.మీ.) మీదుగా నిర్మించే రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించాలి. ఉత్తర భాగంలో ఇప్పటికే భూ సేకరణ చాలావరకు పూర్తయినందున, దక్షిణ భాగం కోసం కూడా ప్రారంభించాలి. భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ రోడ్డు విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి. పనుల్లో మాత్రం జాప్యం లేకుండా చూడాలి..’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ట్రిపుల్ ఆర్ పురోగతిపై సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ‘భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా దక్షిణ భాగం అలైన్మెంట్ ఉండాలి. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. (రోడ్డు అలైన్‌మెంటు మ్యాప్‌ను గూగుల్ మ్యాప్‌తో బేరీజు వేసుకుంటూ ముఖ్యమంత్రి పరిశీలించారు. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్మెంట్లో కొన్ని మార్పులను సూచించారు). నేను సూచించిన మార్పులపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోజువారీ సమీక్షలు నిర్వహించాలి ‘ఆర్ఆర్ఆర్ పురోగతిపై రోజువారీ సమీక్షలు నిర్వహించాలి. భూ సేకరణ సహా ఇతర అన్ని అంశాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని నాకు అందజేయాలి. ఉత్తర భాగం విషయంలో రోజువారీ పురోగతి, దక్షిణ భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు, ఇతర అంశాల వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలపాలి. సీఎస్‌తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలి. ఒక సమీక్ష సమావేశానికి, మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలి..’ అని రేవంత్ స్పష్టం చేశారు. రేడియల్ రోడ్లపై ప్లాన్ సిద్ధం చేయాలి ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ‘రేడియల్ రోడ్లు ప్రధాన రహదారులతో ఏయే ప్రాంతాల్లో అనుసంధానం చేస్తే మెరుగ్గా ఉంటుందో, సిగ్నలింగ్ సహా ఇతర సమస్యలు ఎదురు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్లాన్ సిద్ధం చేయాలి. అవి ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల అనుసంధానానికి అనువుగా ఉండాలి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలి..’ అని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు. 15 నాటికి ఉత్తర భాగం భూసేకరణ పూర్తి: మంత్రి కోమటిరెడ్డి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన మిగతా భూసేకరణ వచ్చేనెల 15 నాటికి పూర్తి చేసి కేంద్రానికి నివేదిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ వెంటనే టెండర్ నోటిఫికేషన్ జారీ అవుతుందని అన్నారు. ట్రిపుల్ ఆర్ పై సీఎం సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్–విజయవాడ (ఎన్.హెచ్–65) రోడ్డు పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపిందని, రెండు నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే మన్నెగూడ ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభించామని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడర్ పనులు త్వరలో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులను గొప్పగా రూపొందిస్తామని, అవసరమైన సాయం కోసం త్వరలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నట్టు తెలిపారు. -
ధరలు పెరిగేలోపే ‘దక్షిణం’ పనులు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగం పనుల టెండర్ల ప్రక్రియ ముగిసేలోపు దక్షిణ భాగం భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికొచ్చాయి. టెండర్లు కాగానే ఉత్తరభాగం పనులు మొదలవుతాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరుగుతాయి. దీని ప్రభావం దక్షిణ భాగంపై కూడా పడుతుంది. అక్కడా భూముల ధరలు పెరుగుతాయి. అప్పుడు, దక్షిణభాగంలో తమకు ఇచ్చే పరిహారం చాలదని, దానిని పెంచాలంటూ భూనిర్వాసితుల నుంచి డిమాండ్ వస్తుందన్న సంకేతాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో దక్షిణభాగంలో జరుగుతున్న జాప్యాన్ని నిలవరించి..అక్కడ భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని తొలుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనికి తాజాగా కేంద్రం కూడా సమ్మతించినట్టు తెలిసింది. పనులకు అడ్డంకిగా మారుతుందని.. ప్రస్తుతం ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేస్తారు. దీంతో భూనిర్వాసితుల ఖాతాలో పరిహారం జమ అవుతుంది. సంగారెడ్డి పట్టణ సమీపంలోని కొన్ని ప్రాంతాలు, యాదాద్రి ఆర్డీఓ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో నిర్వాసితుల నుంచి ప్రతిఘటన ఎదురుకాగా, మిగతా ప్రాంతాల్లో సాఫీగానే సాగుతోంది. ఉత్తర భాగానికి సంబంధించి రూ.5200 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం చొప్పున భరించాల్సి ఉంది. ఉత్తర భాగంతో పోలిస్తే, దక్షిణ భాగంలో భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. దాని నిడివి మాత్రం ఎక్కువ. దీంతో అక్కడ దాదాపు రూ.6000 కోట్ల వరకు పరిహారం రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అంచనా. మరో రెండు మూడునెలల్లో ఉత్తర భాగం టెండర్ల దశకు చేరుకుంటుంది. కానీ, దక్షిణభాగం విషయంలో ఇంకా అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. ఉత్తర భాగం టెండర్లు పూర్తయ్యేనాటికి స్థానికంగా భూముల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనా ఉంది. పనుల్లో జాప్యం జరుగుతున్నా.. దక్షిణ భాగంలో కూడా రింగ్ నిర్మాణం ఎలాగూ ఖరారైనందున, స్థానికంగా కూడా భూముల ధరలు అప్పటికి భారీగా పెరుగుతాయి. దీంతో అప్పటి భూముల ధరలకు తగ్గట్టుగా పరిహారం మొత్తం పెంచాలని దక్షిణ భాగం నిర్వాసితులు డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఉత్తర భాగంలో భూముల ధరలు పెరిగేలోపు దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ కొలిక్కి తేవాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. భూ పరిహార భారం పెరిగితే, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రూ.17 వేల కోట్లతో రెండు భాగాలు పూర్తి చేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పుడు నిర్మాణ వ్యయం రూ.35 వేల కోట్లకు చేరేలా కనిపిస్తోంది. పరిహారం మరింత పెంచాల్సి వస్తే నిర్మాణ వ్యయం మరింత పెరుగుతుంది. దీంతో మరో మూడు నెలల్లోగా దక్షిణభాగంలో కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
గరిష్ట పరిహారం దక్కేలా చూడాలి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు భూములిచ్చిన రైతుల విషయంలో మానవీయకోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం వచ్చే గరిష్ట పరిహారం రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్హెచ్ఏఐ(నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అధికారులు మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఆయా అంశాలను కొలిక్కి తెచ్చేందుకు, సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని అధికారులను సీఎం ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకురావడం లేదని కలెక్టర్లు ఆయన దృష్టికి తెచ్చారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను శాశ్వతంగా కోల్పోతున్నప్పుడు రైతుల్లో ఆవేదన ఉంటుందని, దానిని అధికారులు గుర్తించాలన్నారు. రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్‌రింగురోడ్డు దక్షిణభాగం, ఉత్తరభాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే ఎన్‌హెచ్ నంబర్ కేటాయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపారి్టయేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం భూసేకరణలో ఉన్న ఆటంకాలపై ఆయన ప్రశ్నించారు. అలైన్మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దీంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సూచించారు. అలాగే ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల, విజయవాడ–నాగ్‌పూర్ కారిడార్లకు సంబంధించి అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్–మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.రెండునెలల్లో హైదరాబాద్–విజయవాడ విస్తరణ పనులు హైదరాబాద్–విజయవాడ జాతీయరహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్‌హెæచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్చౌదరిని కోరారు. రెండునెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్ రాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీ‹Ù, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు పాల్గొన్నారు. సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి: భట్టి సాక్షిప్రతినిధి, ఖమ్మం: నాగపూర్–అమరావతి జాతీయ రహదారి నిర్మాణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జాతీయ రహదారుల భూసేకరణ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయం నుంచి సమీక్షించగా, ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పాల్గొన్నారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన సమీక్షలో చర్చకు వచ్చి0ది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌హెæచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్‌చౌదరి తెలిపారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వల్ల రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్‌లో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత భట్టి మాట్లాడుతూ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాగపూర్–అమరావతి రహదారిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం అందించాలని, ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఇవ్వాలని కోరారు. తల్లాడ–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. -
మీ ధ్యాసంతా భ్రమరావతేనా?
చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో రామోజీకి చెత్త రాతల ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే రోజుకో తప్పుడు కథనంతో ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికీ పనికి రాని చంద్రబాబు కలల రాజధాని భ్రమరావతిపై ఇంకా మోజు తీరక.. అక్కడేదో జరగరానిది జరిగిపోతున్నట్లు కల కంటున్నారు. అక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వివిధ గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పిస్తూ గెజిట్ జారీ చేస్తే.. అదంతా కుట్ర పూరితమంటూ వక్ర రాతలు రాశారు. చంద్రబాబు రైతులను వంచించి, అవసరానికి మించి భూములు లాక్కున్నప్పుడు మీరేం చేశారు రామోజీ? సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని పేరుతో తమ నుంచి బలవంతంగా భూములు సేకరించారని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలోనూ వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బలవంతంగా సేకరించిన భూమిని వెనక్కి ఇస్తామని చెప్పారు. ఈ హామీకి అనుగుణంగా న్యాయ అడ్డంకులను దాటి వారికి భూమిని వాపస్ చేయడానికి ఇటీవల గెజిట్ జారీ చేశారు. అంతే.. అమరావతిపై మరో విచ్చిన్నకర కుట్ర అంటూ ఈనాడు రామోజీ శోకాలు పెట్టారు. రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి గుట్టుగా గెజిట్ విడుదల చేశారంటూ గగ్గోలు పెట్టారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తమ అనుమతి లేకుండానే రాజధాని పేరిట తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పలువురు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి ప్రమేయం లేకుండానే తీసుకుని మాస్టర్ ప్లాన్‌లో పెట్టి రోడ్లకు కేటాయించేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆ రైతులందరూ సీఆర్డీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల ఇబ్బంది పడ్డ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏ సమావేశంలో వారి భూములను భూసేకరణ పరిధి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 11న తీర్మానం చేశారు. కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచ్చికల పాలెం, ఐనవోలు, రాయపూడి, కొండమారాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రామోజీకి ఆగ్రహం తెప్పించడంతో ఓ తప్పుడు కథనం వండిపడేశారు. అందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : గుట్టుగా గెజిట్ జారీ చేశారు వాస్తవం: రాజధాని నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం 34,281 ఎకరాలను సేకరించింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రానిచోట్ల భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. అలా 1,317.90 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి 274.86 ఎకరాలు పూలింగ్‌లో ఇచ్చేందుకు రైతులు ముందుకు రాగా, మిగిలిన భూమిని బలవంతంగా తీసుకున్నారు. అందులో 217.76 ఎకరాలు రోడ్లకు కేటాయించారు. కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే వారి స్థలాల్లో రోడ్లు వేయడమే కాకుండా రిటర్నబుల్ ప్లాట్ల కింద కొంత మందికి రిజి్రస్టేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 625.25 ఎకరాల భూమిపై ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తు చేసింది. సీఆర్డీఏకు చెందిన డిప్యూటీ కలెక్టర్లతో పలుమార్లు సమావేశమై రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గెజిట్ జారీ చేశారు. ఆయా రైతులకు ఈ మేరకు సమాచారం అందించారు. ఆయా గ్రామాల సచివాలయాల్లో గెజిట్‌ను అందుబాటులో ఉంచారు. గెజిట్‌కు పత్రికా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో దాన్ని ఇవ్వలేదు. ఆరోపణ : భూసేకరణ ఉపసంహరణ గెజిట్లను విడుదల చేసే ముందు రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేయాలి వాస్తవం: ఇప్పుడు గెజిట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు. అందువల్ల అసలు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపుల ప్రసక్తే రాదు. ఉండవల్లి గ్రామంలో 113.60 ఎకరాలు, పెనుమాక గ్రామంలో 458.45 ఎకరాలను భూసేకరణ నుంచి మినహాయించింది. ఈ రెండు గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్ కింద 117.18 ఎకరాలు కవర్ అయింది. ఇదిపోగా మిగిలిన 572.05 ఎకరాలను మాత్రమే మినహాయించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను రైతులు ఉపసంహరించుకుని, భవిష్యత్తులో ఎలాంటి నష్టపరిహారం అడగబోమన్న హామీ కింద మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల 21 గ్రామాల్లోని రైతులతో పాటు, ఉండవల్లి, పెనుమాక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది తట్టుకోలేని ఈనాడు కడుపుబ్బరంతో దిగజారి ప్రభుత్వంపై బురద జల్లే పనికి పూనుకుంది. ఆరోపణ: భూసేకరణ పరిధి నుంచి ఈ గ్రామాలను తప్పిస్తే మాస్టర్ ప్లాన్‌కు ఇబ్బందులు వస్తాయి వాస్తవం: ఈ అంశంపై అధికారులు భారీ కసరత్తు చేశారు. బాధిత రైతుల నుంచి కన్సెంట్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్‌లో వారి భూముల్లో నుంచి రోడ్లు వెళ్తుంటే వాటిని మినహాయించి మిగిలిన భూమికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఆ స్థలాల్లో దేనికైనా కేటాయింపులు జరిగి ఉంటే ఆ భూముల జోలికి వెళ్లలేదు. దేనికీ కేటాయించని భూములను మాత్రమే భూసేకరణ పరిధి నుంచి మినహాయించారు. -
సోలార్ ఇన్స్టలేషన్లు 44 శాతం డౌన్..
న్యూఢిల్లీ: స్థల సమీకరణ సమస్యల కారణంగా దేశీయంగా సౌర విద్యుత్ ఇన్స్టలేషన్లు 2023లో 7.5 గిగావాట్ల సామర్ధ్యానికి పరిమితమయ్యాయి. 2022లో నమోదైన 13.4 గిగావాట్ల (జీడబ్ల్యూ)తో పోలిస్తే 44 శాతం తగ్గాయి. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ మెర్కామ్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా మొత్తం స్థాపిత సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 72 జీడబ్ల్యూకి చేరింది. ఇందులో యుటిలిటీ స్థాయి ప్రాజెక్టుల వాటా 85.4 శాతంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల వాటా 14.6 శాతంగా ఉంది. 2022లో భారీ స్థాయి సోలార్ ఇన్స్టాలేషన్లు 11.7 గిగావాట్ల నుంచి 51 శాతం క్షీణించి 5.8 గిగావాట్లకు పరిమితమయ్యాయి. పలు భారీ ప్రాజెక్టులకు గడువు పొడిగించడం, స్థల సమీకరణ..కనెక్టివిటీ సమస్యలు మొదలైనవి ఇందుకు కారణమని నివేదిక వివరిచింది. కొత్తగా జోడించిన సౌర విద్యుదుత్పత్తి సామరŠాధ్యల్లో భారీ ప్రాజెక్టుల వాటా 77.2 శాతంగాను, రూఫ్‌టాప్ సోలార్ వాటా 22.8 శాతంగాను ఉన్నట్లు పేర్కొంది. భారీ స్థాయి సోలార్ విద్యుత్ సామరŠాధ్యలు అత్యధికంగా రాజస్థాన్‌కి ఉండగా, కర్ణాటక, గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
రైల్వే జోన్ పై కేంద్రందే కిరికిరి
-
కొన్నారు.. తిన్నారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడైనా, ఏదైనా భారీ ప్రాజెక్టు/ సంస్థ రాబోతుందంటే చాలు చకాచకా పావులు కదపడం, ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న భూముల్ని గుట్టుచప్పుడు కాకుండా తక్కువ ధరకు కుటుంబసభ్యులు, బినామీల పేరిట కొనేయడం, సదరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చగానే ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించేసి కోట్లకు పడగలెత్తడం.. విషయం తెలిసిన రైతులు లబోదిబోమనడం.. ఇదీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ విషయంలోనూ ఇదే జరిగింది. ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు. ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, ఇప్పటి ఓ మంత్రి సైతం ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం గమనార్హం. భూదాన్ భూములకూ కొందరు ఎసరు పెట్టడం కొసమెరుపు. కుటుంబసభ్యులు, బినామీల పేరిట దందా 2017లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. భూముల ధరలు తక్కువగా ఉండటం, ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించడంతో దేశవిదేశాలకు చెందిన 500కు పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమిని ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్నారనే విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు ముందే తెలియడంతో బినామీలను, కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. ఓ మాజీ ఐపీఎస్ రైతుల్ని బెదిరించి..! ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను బినామీల పేర్లపై కొనుగోలు చేశారు. 2012 నుంచి 2016 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఎకరా రూ.లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల లోపే కొనుగోలు చేశారు. ఆయా గ్రామాలకు ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూములను విక్రయించడానికి స్థానిక రైతులు కొందరు నిరాకరించినా, బినామీల ద్వారా రైతులను బెదిరింపులకు గురి చేసి భూములు అమ్మేలా ఒత్తిళ్లు తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఫార్మాసిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బినామీల పేరిట ఉన్న 200 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని ఎకరం రూ.12.50 లక్షల చొప్పున ఫార్మాసిటీకి ఇచ్చేయడం గమనార్హం. కురి్మద్ద, తాడిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో కూడా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని ఫార్మాసిటీకి ఇచ్చేసి నష్ట పరిహారం కింద రూ.కోట్లు సంపాదించారు. కేసీఆర్ సర్కార్‌లో చక్రం తిప్పిన కీలక అధికారులు కొందరు కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అప్పట్లో కొత్తపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని దాదాపు 300 ఎకరాలకు పైగా పట్టాభూమిని ఫార్మాసిటీకి తీసుకోవాలని రియల్ వ్యాపారులే స్వయంగా ప్రభుత్వాన్ని కోరుతూ లేఖలు ఇవ్వడం గమనార్హం. కాగా తక్కువ ధరలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, అధిక ధరలకు ఫార్మాసిటీకి అప్పగించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లపై మీర్ఖాన్పేటలోని హెచ్ఎండీఏ వెంచర్లో అదనంగా ఎకరాల కొద్దీ ప్లాట్లు మంజూరు అయ్యాయి. భూదాన్ భూమిని కొల్లగొట్టిన నేతలు తాడిపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 104లో 468.34 ఎకరాల భూమి ఉంది. దాని యజమానులు అప్పట్లో 250 ఎకరాలను భూదాన్ బోర్డుకు ఇచ్చారు. సదరు భూమిని తమ పేరున రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా 16/11/2005 లోనే భూదాన్‌బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మేరకు పహణీల్లోనూ నమోదు చేశారు. అయితే ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎంపీ ఈ భూములను తమ బినామీ పేరున కొట్టేశారు. అంతేకాదు కొండలు, గుట్టలతో కూడిన ఈ భూమి సాగులో ఉన్నట్లు చూపించారు. భూ సేకరణలో భాగంగా ఈ భూములను ఫార్మాసిటీకి అప్పగించి ఎకరానికి రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారం పొందారు. ఇలా ప్రభుత్వం నుంచి రూ.40 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతేకాదు మీర్ఖాన్పేటలో ఎకరానికి 121 గజాల ఇంటి స్థలాన్ని కూడా పొందారు. ఈ భూములకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన వారిలో స్థానికులు కాకుండా అంతా ఇతర ప్రాంతాలకు చెందిన నేతల బినామీలే ఉండటం గమనార్హం. ఈ అంశంపై తాడిపర్తి గ్రామస్తులు అప్పటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పట్లో ఇక్కడ ఆర్డీఓగా పని చేసిన ఓ అధికారి భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఖజానాను భారీగా కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి పరిధిలో మాజీ సీఎస్ కొనుగోళ్లు మాజీ సీఎస్ సోమేష్‌కుమార్ తన భార్య పేరున యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 249, 260లలో 25.19 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ పక్కనే సర్వే నంబర్ 244 నుంచి 269 వరకు ఉన్న 125 ఎకరాలు తన కుటుంబ సన్నిహితులకు సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరిట కొనుగోలు చేయించారు. ఈ సమయంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా (2016 నుంచి 2018 వరకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా, 2020 జనవరి నుంచి 2023 జనవరి వరకు సీఎస్‌గా పని చేశారు) ఉన్నారు. సాగుకు యోగ్యం లేని ఈ భూములకు రైతుబంధు పథకం కింద రూ.14 లక్షల వరకు లబ్ధి పొందినట్లు మాజీ సీఎస్‌పై ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఈ భూముల కొనుగోలుపై కొత్త ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డీఓ బుధవారం యాచారం తహశీల్దార్ కార్యా లయానికి చేరుకుని పలు రికార్డులను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా తాను నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ లేదని సోమేష్ చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ భూములు ఇచ్చింది వాస్తవమే ఓ మాజీ ఐపీఎస్ అధికారి నక్కర్తమేడిపల్లి, కొత్తపల్తి గ్రామాల్లో దాదాపు 300 ఎకరాలు కొనుగోలు చేశాడు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వెచ్చించాడు. ఫార్మాసిటీ ఏర్పాటు కావడంతో నక్కర్తమేడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన 200 ఎకరాలకు పైగా భూమిని ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ఇచ్చేశాడు. ఆ అధికారి కొత్తపల్లి గ్రామంలో కూడా వందలాది ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. – పాశ్ఛ భాషా, మాజీ సర్పంచ్ నక్కర్తమేడిపల్లి -
నిధుల పేచీతో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ఎంతో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత, పేచీల కారణంగా ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. రైతుల నుంచి నిరసన వ్యక్తమైనా వేగంగా అలైన్‌మెంట్‌ను ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ).. తీరా భూసేకరణ ప్రక్రియకు అవార్డులు పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసింది. దీనితో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజిట్ నోటిఫికేషన్లకు కాలదోషం పట్టి రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి ఆఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కేటాయింపులు సందిగ్ధంలో పడ్డాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ప్రాజెక్టుకు మరింత జాప్యం తప్పదు. కేంద్రంలో కొత్త సర్కారు కొలువుదీరేదాకా ఎదురుచూడక తప్పదు. అనుమతులకు దరఖాస్తే చేయలేదు పెద్ద రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కీలకం. అనుమతులొచ్చాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. భారతమాల పరియోజన–1లో కేంద్రం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని చేర్చింది. అలైన్‌మెంట్‌కు అనుమతులు రావటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు గత ఏడాదే భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ సభలు నిర్వహించారు. రైతులు అభ్యంతరాలు లేవనెత్తినా ఎలాగోలా సభలను పూర్తిచేశారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇది జరగాలంటే ముందు ఈ రోడ్డుకు జాతీయ రహదారి పేరిట కొత్త నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. భూపరిహార వాటా నిధులు అందనందుకే.. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పరిహారంలో రాష్ట్రప్రభుత్వం సగం ఖర్చును భరించాల్సి ఉంది. రాష్ట్ర వాటా రూ.2,600 కోట్లు అవుతుందని తాత్కాలికంగా నిర్ధారించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని ఎన్హెచ్ఏఐ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ అన్ని నిధులు ఒకేసారి ఇవ్వడం కుదరదని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించింది. దీంతో తొలివిడతగా కనీసం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ కోరింది. దీనిని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తెచి్చంది. కానీ నిధుల విడుదల కాలేదు. ఇలా నిధులు రాకుండా, అవార్డులు పాస్ చేయటం సరికాదని, ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కేంద్రం రీజనల్ రింగ్‌రోడ్డు పనిని పక్కన పెట్టేసింది. జాతీయ రహదారి నంబర్ కేటాయించలేదు. కీలక ప్రాజెక్టు కాస్తా పెండింగ్‌లో పడింది. -
మొత్తం ఒకేసారి చెల్లించక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని, ఈమేరకు ఇది వరకే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవివర లేఖ రాశారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చెల్లించాల్సిన భూపరిహారంలో 50 శాతంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2585 కోట్లను చెల్లించాలంటూ ఇటీవల కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం విడుదల చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.100 కోట్లు చెల్లించటంతోపాటు, భూసేకరణకు సంబంధించి అవార్డు వారీగా, అవార్డు జారీ అయిన పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది వరకు అంగీకారం కుదిరిందని అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను మేమే చెల్లిస్తామన్నాం కదా..: యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను చెల్లించే పరిస్థితి లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొన్నా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి లేఖ రాసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు యుటిలిటీ చార్జీలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు లేనట్టేనని స్పష్టం చేశారు. భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న 11 జాతీయ రహదారులకు సంబంధించి 284 హెక్టార్లు మినహా భూసేకరణ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారని కోమటిరెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు రీజినల్ రింగ్‌రోడ్డు మినహా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి 2377 హెక్టార్లకు గానూ 1531 హెక్టార్ల భూమిని సేకరించినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరిగేలా తెలంగాణ బిడ్డగా సహకరించాలని ఆయన కిషన్‌రెడ్డికి సూచించారు. -
సిరిసిల్లకు ఇప్పట్లో రైలు కూత లేనట్టే
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు ఇప్పట్లో రైలుకూత వినిపించే పరిస్థితి లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ వరకు రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్చి నాటికి సిరిసిల్ల స్టేషన్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీలునుబట్టి రైలు సర్వీసులను సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పొడిగించాలని అనుకుంది. డిమాండ్ సర్వేలో, ప్రయాణికుల సంఖ్య ఉంటుందని తేలితే సిరిసిల్ల నుంచి రైలు సర్విసులు నడిపే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు సిద్దిపేట–సిరిసిల్ల మధ్య కీలక ప్రాంతంలో పనులే జరగటం లేదు. ఫలితంగా రైలు సర్విసు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ సంగతి..: భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ రైల్వే అధికా రులు పనులు చేస్తూ వెళ్లారు. ఇలా సిద్దిపేట వరకు వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయంలో రైలు సర్విసులు ప్రారంభించా రు. ఆ తర్వాత సిద్దిపేట –సిరిసిల్ల సెక్షన్ల మధ్య పనులు ప్రారంభించారు. కానీ, మధ్యలో 80 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులొచ్చాయి. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతు ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడివరకు వదిలి ఆపై భాగంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగించారు. తర్వా త సిద్దిపేట సమీపంలోని భూముల వివాదం పరిష్కారమైంది. భూయజమానులకు పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే సమ యంలో ఎన్ని కల కోడ్ రావడంతో ఆ చెల్లింపులు నిలిచిపోయా యి. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వం ఏర్పడ గానే ఆ డబ్బులు చెల్లింపు కోసం రైల్వే అధికారు లు ఒత్తిడి ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వర కు చెల్లింపు జాడే లేదు. దీంతో పెద్ద కోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. రైతులకు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ భూములను రైల్వే స్వాదీనం చేసుకునే వీలు లేదు. సిరిసిల్ల సమీపంలో మాత్రం పనులు కొనసాగుతున్నా యి. అక్కడ పూర్తయినా, సిద్దిపేట సమీపంలో పెండింగ్‌లో ఉంటే రైల్వేలైన్ వేసే వీలుండదు. రాష్ట్రప్రభుత్వం పరిహారం చెల్లిస్తేనే పనులు మొదలవుతాయి. దీంతో పనులు కనీసం 4నెలలు వెనక బడ్డట్టు అయ్యిందని ఓ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే అన్నిరకాల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. పరిహారం చెల్లింపే కాకుండా ప్రాజెక్టు వ్యయంలోనూ మూడో వంతు ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించి కూడా కొంత పేరుకుపోయిందని తెలుస్తోంది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య 30 కిలోమీటర్ల మేర పనులకు రూ.480 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆ మార్గంలో కొంత గుట్టభూమి కూడా ఉండటంతో దాన్ని కట్ చేసి పనులు చేయాల్సి ఉంది. ఇది స్వతహాగానే ఆలస్యమయ్యే పని. భూపరిహారం పంపిణీలో జాప్యం, ఇతర పనులూ నెమ్మదించటం వెరసి.. ఈ 30 కిలోమీటర్ల పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం తప్పేలా కనిపించటం లేదు. -
బాలినేని కుటుంబానికి సంబంధం లేదు
ఒంగోలు అర్బన్/సబర్బన్: ‘నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపు పేపర్లు, ఫోర్జరీలతో ఒంగోలులో జరిగిన భూ అక్రమాలతో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగర్గ్ స్పష్టంచేశారు. బాలినేనిపైన, ప్రభుత్వంపైన చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఒంగోలు భూదందాపై సిట్ దర్యాప్తును బాలినేని కుటుంబం ముందుకు సాగనివ్వడంలేదంటూ కథనాలు ప్రచురించటం సరికాదని చెప్పారు. బాలినేని కుటుంబం దర్యాప్తును ఎప్పుడూ అడ్డుకోలేదని అన్నారు. అవాస్తవాలను, అసత్య కథనాలను ప్రచురిస్తే అవి రాజకీయ జీవితంలో ఉండేవారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఇలాంటి కథనాలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు సరైన వివరణ తీసుకోవాలని చెప్పారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కబ్జాలపై సిట్ దర్యాప్తు వివరాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం ఇక్కడ మీడియాకు వివరించారు. భూ కబ్జాలపై ఒంగోలు జెడ్పీటీసీ, మేయర్ గంగాడ సుజాత, మరికొందరు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు సిట్ ద్వారా నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఎమ్మెల్యే బాలినేని సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి భూమి వివాదంలో ఉందని, దాన్ని భూ కబ్జా కోవలోకి తేవటం çసరికాదని అన్నారు. ఆ భూమి 40 ఏళ్లుగా బ్యాంకు లావాదేవీల ప్రక్రియలో ఉందన్నారు. సివిల్ పంచాయితీలను కూడా భూ కబ్జాల కింద కథనాలుగా ఇవ్వడం వల్ల సిట్ దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు, భూకబ్జాల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపి, బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే స్వయంగా చెప్పారన్నారు. సిట్‌లో ఇద్దరు ఏఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్సైలు ఇతర పోలీస్ సిబ్బంది ముమ్మరంగా పని చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ విభాగం తరఫున జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శాఖ, మార్కాపురం, కనిగిరి సబ్ డివిజన్ల పరిధిలోని ఆర్డీవోలు సిట్ సబ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఫోర్జరీ, నకిలీ స్టాంపులు, నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణంపై ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ఒకరు సెప్టెంబర్ 28న ఫిర్యాదు ఇవ్వడంతో భూ కబ్జాల వ్యవహారం వెలుగు చూసిందని కలెక్టర్ చెప్పారు. దీనిపై విచారణ చేపట్టగా లాయర్‌పేటలోని ఒక ఇంట్లో పూర్ణచంద్రరావు, మరికొందరితో కూడిన బృందం ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆ ఇంట్లో మీ సేవ బ్లాంక్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, పలు ప్రభుత్వ అధికారులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు లభించాయన్నారు. ఇటువంటి అనేక ఫిర్యాదులు రావడంతో సిట్ ఏర్పాటు చేసి లోతైన విచారణ చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు 572 డాక్యుమెంట్లు, 60 రబ్బర్ స్టాంప్‌లు, 1,224 జ్యుడిషియల్ స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మార్కాపురం, కనిగిరి పరిధిలో కూడా 5 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూములతో పాటు ప్రభుత్వ భూముల డీకే పట్టాల విషయంలోనూ నకిలీ వ్యవహారాలు జరిగాయని తెలిపారు. ఈ దందా పన్నెండేళ్లకు పైగా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. ఎక్కువ కాలం ఎటువంటి లావాదేవీలు జరగని ఖాళీ స్థలాలకు నకిలీ వీలునామా, జీపీఏ వంటివి సృష్టించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఎటువంటి సమస్యలు లేని స్థలాలకు సైతం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని గొడవల్లోకి తెచ్చి, కోర్టుల్లో స్టే ఆర్డర్ వంటివి పొందినట్లు కూడా తెలిసిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లతో భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసి కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం లేకుండా పూర్తి స్వేచ్ఛగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వాలపై ఆరోపణలు చేయడం వారిని వ్యక్తిగతంగా బాధించడమే అవుతుందని చెప్పారు. విషయాలను పూర్తిగా తెలుసుకుని వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు వార్తలను ప్రచురించడం, ప్రసారం చేయడం చేయాలన్నారు. ఎస్పీ మలికాగర్గ్ మాట్లాడుతూ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, సిట్ బృందం వేగంగా, నిరంతరాయంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. దీనిపై ఇప్పటివరకు 54 కేసులు నమోదయ్యాయన్నారు. పూర్ణచంద్రరావు బృందంలో 72 మంది ఉన్నారని, వారిలో 38 మందిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. సిట్ దర్యాప్తుపై బాలినేని ప్రభావం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. -
ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు
సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయటపెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరాలను సమీకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూముల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన వారికి మేలుచేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది. అందుకు అనుగుణంగానే పూలింగ్‌కు భూములిచ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటాయించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
బుల్లెట్ రైలులో కదలిక
(ముంబై నుంచి సాక్షి ప్రతినిధి) : దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల్లో కొన్ని పరిష్కారం కావడంతో నిర్మాణ సంస్థ పనులు పునరుద్ధరించింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టును 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్. అయితే భూసేకరణలో జాప్యం కారణంగా ఏడాదిన్నర ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో కలిసి హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయ బృందం పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే కార్యాలయాలు, మ్యూజియం సందర్శించి రైల్వే కార్యకలాపాలు సహా వివిధ కార్యక్రమాలను అధ్యయనం చేసింది. ఇవీ ముంబై హెచ్ఎస్ఆర్ స్టేషన్ ప్రత్యేకతలు ముంబై–అహ్మదాబాద్–హెచ్ఎస్ఆర్ కారిడార్‌లో ఉన్న ఏకైక భూగర్భస్టేషన్ ముంబై హెచ్ఎస్ఆర్ స్టేషన్. ఈ స్టేషన్లో 6 ప్లాట్‌ఫారాలు ఉంటాయి. ప్రతీ ప్లాట్ఫారం పొడవు సుమారు 415 మీటర్లు. గ్రౌండ్ లెవల్ నుంచి 24 మీటర్ల లోతులో ఈ ప్లాట్ ఫారం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో ప్లాట్‌ఫాం, కాన్కోర్స్, సర్విస్ ఫ్లోర్ సహా మూడు అంతస్తులు ఉంటాయి. ♦ స్టేషనుకు రెండు ప్రవేశ ద్వారాలు/నిష్క్రమణ గేట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒకటి మెట్రో లైన్ 2బీ సమీపంలో మెట్రో స్టేషన్‌కు, మరొకటి ఎంటీఎన్ఎల్ నిర్మాణం వైపు ప్రయాణికుల రాకపోకలకు తగినంత స్థలం, కాన్కోర్స్, ప్లాట్‌ఫాం స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ఎగ్జిట్ గేట్లు రూపొందించారు. ♦ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి, సహజ లైటింగ్ వ్యవస్థకు ప్రత్యేక స్కైలైట్ ఏర్పాటు చేశారు. ♦ స్టేషన్లో ప్రయాణికుల కోసం సెక్యూరిటీ, టికెటింగ్, వెయిటింగ్ ఏరియా, బిజినెస్ క్లాస్ లాంజ్, నర్సరీ, రెస్ట్రూమ్, స్మోకింగ్ రూమ్, ఇన్ఫర్మేషన్ కియోస్‌్క, రిటైల్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్ సిస్టమ్, సీసీటీవీ నిఘా తదితర సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా : సీపీఆర్ఓ సుమిత్ ఠాకూర్ రైల్వేకు చెందిన పలు ప్రాజెక్టులు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని పశ్చిమరైల్వే చీఫ్ పబ్లిక్‌రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ఠాకూర్ చెప్పారు.రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులు ప్రోత్సాహకరంగా సాగుతున్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిత్యం 80 లక్షల మంది ముంబై రైల్వే పరిధిలో ప్రయాణిస్తున్నారని, భారత్‌లో సెమీ స్పీడ్ రైళ్ల ప్రవేశానికి మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా హైస్పీడ్ రైళ్ల శకం కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. ముంబైలో బుల్లెట్ ట్రైన్ పనులు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుష్మ తెలిపారు. -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. -
‘మల్లన్నసాగర్’ గెజిట్ ప్రింటింగ్‌కు రాసిన లేఖ సమర్పించండి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా ముట్రాజ్‌పల్లిలో భూసేకర ణకు సంబంధించి గెజిట్ జారీ కోసం ప్రింటింగ్‌కు రాసిన లేఖను సమర్పించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టును తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. చేసిన పనులను సమర్థించుకునేందుకు తప్పులు చేస్తే సహించేది లేదని చెప్పింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ నిమిత్తం 2021, జనవరి 31న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ బాలాజీ స్పిన్నర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో అప్పీల్ వేసింది. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. గతంలో గెజిట్ జారీకి సంబంధించి రిజిస్టర్లో ఎంట్రీలు నమోదు చేసిన వారి వివరాలను ప్రభుత్వ న్యాయవాది సంజీవ్‌కుమార్ అందజేశారు. -
ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం మధ్యసయోధ్య!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. భూసేకరణకు సంబంధించి పరిహార మొత్తంలో రాష్ట్రప్రభుత్వం తన వంతు సగం వాటా డబ్బులు డిపాజిట్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్హెచ్ఏఐ లేఖ రాయటంతో వివాదం మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకేసారి తన వాటా మొత్తం కాకుండా, అవార్డులు పాస్ చేసిన కొద్దీ విడతల వారీగా వాటా చెల్లిస్తానంటూ తాజాగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. దీంతో భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. వారం రోజుల్లో అందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్హెచ్ఏఐ ప్రారంభించబోతోంది. త్వరలోనే భూసేకరణ ప్రాధికార సంస్థ (కాలా)ల వారీగా పరిహారం పంపిణీ ప్రారంభం కానుంది. దీంతో రీజనల్ రింగురోడ్డు పనులు ప్రారంభించేందుకు వీలుగా టెండర్లు పిలిచేందుకు అవకాశం కలగనుంది. రూ.100 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ప్రధాన గెజిట్లు జారీ అయిన విషయం తెలిసిందే. భూ పరిహారం పంపిణీకి సంబంధించిన 3డీ గెజిట్ నోటిఫికేషన్లు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే వివరాలు గల్లంతైన భూములకు సంబంధించి మాత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. 3డీ గెజిట్లు విడుదలైన భూములకు సంబంధించి పట్టాదారులకు పరిహారం అందజేసేందుకు ఎన్హెచ్ఏఐ కేంద్ర కార్యాలయం అనుమతి మంజూరు చేయటంతో స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 162 కి.మీ. ఉత్తర భాగానికి సంబంధించి 2 వేల హెక్టార్ల భూమిని సమీకరించాల్సి ఉంది. ఇందుకు పరిహారంగా రూ.5,170 కోట్లు అవసరమవుతాయని ఎన్హెచ్ఏఐ బడ్జెట్లో ఖరారు చేసింది. ఈ మొత్తంలో 50 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి. అంటే రూ.2,585 కోట్లు, స్తంభాల వంటి వాటి తరలింపునకు అయ్యే వ్యయానికి సంబంధించి మరో రూ.363.43 కోట్లు.. మొత్తం 2,948.43 కోట్లు చెల్లించాలంటూ ఎన్హెచ్ఏఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే అవార్డ్ పాస్ చేసే 3డీ గెజిట్లు కూడా విడుదల కాకుండానే పరిహారం జమ చేయాలనటం సరికాదంటూ ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై ఎన్హెచ్ఏఐ మూడు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించకపోవటంతో ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత అధికారులు చర్చించటంతో సయోధ్య కుదిరింది. ఇందులో భాగంగా తొలుత రూ.100 కోట్లు డిపాజిట్ చేసిన ప్రభుత్వం, పరిహారం చెల్లించే ప్రాంతాలకు అవార్డులు పాస్ చేసినప్పుడల్లా తన వాటా చెల్లిస్తాననడంతో ఎన్హెచ్ఏఐ అంగీకరించింది. తాజాగా 8 కాలాలకు సంబంధించి 3డీ గెజిట్లు విడుదల కావటంతో పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. యాజమాన్య పత్రాలు అందజేయాల్సిందిగా ఆదేశం.. ఏయే ప్రాంతాల్లో పరిహారం పంపిణీ చేయాలో గుర్తించిన ఎన్హెచ్ఏఐ తాజాగా, సంబంధిత భూముల యజమానులు వారేనని రూఢీ చేసే ఆధారాలు సమర్పించాల్సిందిగా పట్టాదారులకు సమాచారం పంపింది. వాటితోపాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా కోరింది. డాక్యుమెంట్లను ఆన్లైన్లో దాఖలు చేశాక, రికార్డులతో సరిచూసుకుని పరిహారాన్ని డిపాజిట్ చేయనున్నారు. పూర్తి వివరాలు సిద్ధమయ్యాక కాలాల వారీగా పత్రికాముఖంగా ప్రకటనలను కూడా వెల్లడించనుంది. భూములకు.. నిర్మాణాలకు.. చెట్లకు.. పట్టాదారుల భూములు, వాటిల్లో ఉన్న నిర్మా ణాలు, తోటలు, విలువైన చెట్లకు లెక్కకట్టి పరిహారం ఇస్తారు. ఆ ప్రాంతంలో మూడేళ్ల రిజి్రస్టేషన్ల విలువలను గుర్తించి వాటి సరాసరి లెక్కగట్టి.. దానికి మూడు రెట్లను గుణించి పరిహారంగా ఖాయం చేయనున్నారు. ఆస్తులు, చెట్లకు వాటి విలువ ఆధారంగా లెక్కగడతారు. -
గబ్బు మాటలెందుకు?.. ‘దిబ్బలు’ సేఫ్
సాక్షి, విశాఖపట్నం: తాను చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పు అనడం చంద్రబాబుకు రివాజు. చంద్రబాబు పాడే ప్రతి పాటకు డ్యాన్స్ చేయడం పవన్ అలవాటు. ఇదే విధానాన్ని విశాఖలోని ఎర్రమట్టి దిబ్బల పైనా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఇదే తప్పాట ఆడుతున్నారు. భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలకు ప్రస్తుతం, భవిష్యత్తులోనూ ఎటువంటి నష్టం కలగకుండా, రక్షణగా బఫర్ జోన్ పెట్టి, వాటికి దూరంగా అభివృద్ధి పనులు చేపట్టడం వీరిద్దరికీ కంటగింపుగా మారింది. ఎర్రమట్టి దిబ్బలకు నష్టం జరిగిపోతోందంటూ ఇద్దరూ వీరంగాలు వేస్తున్నారు. అసలు ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న కొత్తవలసలో భూసమీకరణ చేపట్టిందే చంద్రబాబు సర్కారు. ఆ విషయాన్ని దాచిపెట్టి, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఎర్రమట్టి దిబ్బలకు నష్టం చేస్తున్నారంటూ నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. దశాబ్దాలుగా జీడితోటలు సాగు చేసుకుంటూ 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి డీ–పట్టాలు పొందిన రైతుల భూములనే ప్రభుత్వం సమీకరించింది. ఈ భూములు ఎర్రమట్టి దిబ్బలైతే వాటికి డీ–పట్టాల్ని ప్రభుత్వం ఎలా ఇస్తుందన్న కనీస అవగాహన టీడీపీ నేతలకు, పవన్‌కు లేదు. వీరి తీరును టీడీపీకి చెందిన రైతులే ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రభుత్వం మంచి పరిహారం ఇస్తోందని, అది రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బఫర్ జోన్ ఆవలే అభివృద్ధి సర్వే నం.49లో నేరెళ్లవలస గ్రామం ఉంది. సర్వే నం.49/1లో మొత్తం 1067 ఎకరాలు ఉంది. ఇందులో 525 ఎకరాల్లో ఐఎన్ఎస్ కళింగ విస్తరించి ఉంది. మరో 287 ఎకరాలు ఓ బిల్డింగ్ సొసైటీకి చెందినవి. ఈ రెండింటి మధ్యలో ఎర్ర మట్టి దిబ్బలు విస్తరించి ఉన్న 262.92 ఎకరాలను జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. నేరెళ్లవలసను ఆనుకొనే ఉన్న కొత్తవలస గ్రామం సర్వే నం 75, 86, 87లో సుమారు 80 ఎకరాల్లో 80 ఏళ్లుగా రైతులు జీడితోటలు, తాటిచెట్లు పెంచుకుంటూ జీవిస్తున్నారు. వీరికి 1982లో అప్పటి ప్రభుత్వం డీ–పట్టాలిచ్చింది. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం అభివృద్ధి జరుగుతోంది. ఇందు కోసం సర్వే నంబర్ 86ని ప్రభుత్వం సబ్ డివిజన్ చేసింది. 86/3ని ఎర్రమట్టి దిబ్బల రక్షణ కోసం బఫర్ జోన్‌గా ఏర్పాటు చేసింది. 148 అడుగుల మేర ఉన్న ఈ బఫర్ జోన్‌కు అవతల అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి చేస్తున్న ప్రాంతానికి, ఎర్రమట్టి దిబ్బలకు ఎలాంటి సంబంధం లేదు. ఎర్రమట్టి దిబ్బలకు ఎటువంటి నష్టం కలిగించడంలేదన్నది 100 శాతం వాస్తవం. 2016లోనే జీవో ఇచ్చిన టీడీపీ.. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా వుడా (ప్రస్తుతం వీఎంఆర్డీఏ) ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల కోసం 2016 నవంబర్ 25న జీవో ఎంఎస్ నం.304ని జారీ చేసింది. తొలుత పెందుర్తి మండలం సౌభాగ్య రాయపురంలో 128.94 ఎకరాలు, దబ్బందలో 114.23 ఎకరాలు, కొమ్మాదిలో 116.64 ఎకరాలి్న, ఆ తర్వాత నేరెళ్లవలసలో సర్వే నం.49/1పీలో 114.34 ఎకరాల అసైన్డ్ భూములు, గండిగుండంలో 69 ఎకరాలు లాండ్ పూలింగ్‌కు ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత కొత్తవలసలోని సర్వే నం.75లో భూముల వివరాలు కోరింది. అప్పటి వుడా ప్రత్యేక తహశీల్దార్ సర్వే నం.75, 85, 86లో ఉన్న అసైన్డ్ భూములు, సరిహద్దులతో నోట్ పంపారు. వీటిని పూలింగ్‌లోకి తెచ్చింది. ఇలా భూ సమీకరణ కీలక ప్రక్రియ మొత్తం టీడీపీ హయాంలోనే జరిగింది. ఇప్పుడు అవే భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే టీడీపీ, పవన్ గగ్గోలు పెడుతున్నారు. టీడీపీకి చెందిన రైతు ఏమంటున్నారంటే.. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసమంటూ టీడీపీ, జనసేన చేస్తున్న ఆందోళనల్ని టీడీపీకి చెందిన రైతులే ఖండిస్తున్నారు. అసలు ఈ ప్రక్రియ మొత్తం టీడీపీ హాయాంలో జరిగితే.. ఏదో కొత్తగా చేస్తున్నట్లు మాట్లాడటంపై టీడీపీకి చెందిన పాసి నర్సింగరావు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘మా టీడీపీ హయాంలోనే దీనిపై జీవో వచ్చింది. అప్పుడే మేము పూలింగ్‌కి భూములు ఇచ్చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మాకు కొత్తవలస దగ్గర 5 ఎకరాలు ఉంది. 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం మా పేరుతో డీ–పట్టాలిచ్చింది. రైతులంతా కూర్చొని పూలింగ్‌లో భూములిస్తే ఎంత పరిహారం అడగాలో మాట్లాడుకున్నాం. గ్రామ సభలకు రైతులందరం హాజరయ్యాం. అందరికీ మంచి పరిహారం ఇస్తామన్నారు. అప్పట్లో ప్రక్రియ ఆలస్యమైంది. దాని ప్రకారమే పరిహారం ఇస్తున్నారు. ఇదంతా అప్పుడే జరిగింది. ఇప్పుడు పవన్ వచ్చి విధ్వంసం చేస్తున్నారని మాట్లాడటం సరికాదు’ అని అన్నారు. -
ఫార్మాసిటీ కోసం ఆలయ భూములా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్ఐఐసీ గత నవంబర్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు. ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు. ఇతర అవసరాలకు సేకరించవచ్చు... ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు.