సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు మరో రెండేళ్లు అయితే కానీ పూర్తయ్యేలా లేవు. ఈ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టిన 18 ప్యాకేజీల పనుల గడువు మరో రెండేళ్లు పెంచక తప్పేలా లేదు. పూర్తికాని భూసేకరణ, సహాయ, పునరావాసంలో ఇబ్బందులు, ఎన్జీటీ, కోర్టు కేసులు ప్రాజెక్టుల ముందరి కాళ్లకు బంధమేయడంతో 2022 జూన్ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామంటూ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ త్వరలో సమీక్షించనున్నారు.
భూసేకరణే అసలు సవాల్..
శ్రీశైలం నుంచి రోజుకి 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని తరలించి సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. 2015లో ఈ ప్రాజెక్టుకు 35,200 కోట్లతో పరిపాలనా అనుమతులు చేపట్టగా, 2016 జూన్‌లో ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను రూ.29,312 కోట్లతో చేపట్టారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఒప్పంద సమయంలో నిర్ణయించారు. అయితే భూసేకరణ సమస్యతో తొలి రెండేళ్లలో పనులు ముందుకు కదల్లేదు. దీనికితోడు ఎన్జీటీ కేసులు సైతం అవాంతరం సృష్టించాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 27 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇంతవరకు 23,500 ఎకరాలు సేకరించారు. మరో 3,500 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో 2018 నుంచి మరో రెండేళ్లు అంటే 2020 జూన్ వరకు ప్యాకేజీల గడువు పొడిగించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అన్ని ప్యాకేజీల్లో 28 శాతం పనులు, అంటే రూ.8వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టులోని తొలి ప్యాకేజీ అయిన నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. దీన్ని భూగర్భంలో నిర్మించాలా లేక భూఉపరితలం మీదా అన్న అంశం తేలకపోవడంతో ఇక్కడ కేవలం 4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పాటే భూసేకరణ సమస్యలతో ప్యాకేజీ–5, 7, 8, 16, 17, 18 పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కేవలం 15–30 శాతం పనులే పూర్తయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని ప్యాకేజీలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు, మరికొన్ని ప్యాకేజీల గడువును 2022 మే చివరి వరకు పొడిగించాల్సి వస్తోంది. అప్పటికి ప్రాజెక్టు పనులు నూటికి నూరుశాతం పూర్తి చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌కు ప్రాజెక్టు ఇంజనీర్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్యాకేజీల గడువు పొడిగింపులపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం చేశాక తుది ఆమోదం తీసుకోనున్నారు. ఇక ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు గతంలోనే రూ.4,268 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినా పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఈ పనులకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల ప్రకారం కొత్త అంచనాలు సిద్ధంచేసి ఇవ్వాలని ప్రభు త్వం సూచించింది. ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త రేట్ల ప్రకారం ఈ అంచనా రూ.7వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటికి ఆమోదం రాగానే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు.
‘పాలమూరు’ గడువు.. మరో రెండేళ్లు!
Published Thu, Jun 11 2020 5:29 AM | Last Updated on Thu, Jun 11 2020 5:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment