Department of Irrigation
-
‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యాం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్మాణసంస్థ ఎల్అండ్టీ మళ్లీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 17న రామగుండం సీఈకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను చుట్టుముట్టాయని, దీంతో తాము చేసిన పనులు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంతో తాము చేసిన పనులు వృథా అయ్యాయని చెప్పింది. ఇందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లు (పిల్లర్లు), రాఫ్ట్ ఫౌండేషన్, కటాఫ్ వాల్స్, ససికెంట్ పైల్స్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందని, పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్‌తోపాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లో కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉందని ఈ లేఖలో స్పష్టం చేసింది. ఈ పనులు వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ప్రభుత్వం వాటికి మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొంది. గోదావరినదిలో కాపర్‌డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, వర్క్అగ్రిమెంట్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మళ్లీ మొదటికొచ్చిన మేడిగడ్డ పనులు అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికొచ్చాయని ఎల్అండ్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్‌లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లు, వాటి రాఫ్ట్ ఫౌండేషన్‌తో సహా తొలగించేందుకు డైమండ్ కట్టింగ్ విధానం అనుసరించాలని నిర్ణయించారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్అండ్టీ అధికారులు తామే పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్ 2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ బాంబు పేల్చింది. ఈమేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్ డ్యాం నిర్మాణానికికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్అండ్టీని బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ఘాటుగా హెచ్చరించిన తర్వాత కూడా ఎల్అండ్టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని మరో లేఖ రాశారు. మళ్లీ ఒప్పందం చేసుకోండి మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాంతోపాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్29నపూర్తయ్యిందని, దీంతో దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానేకాదని అందులో పేర్కొన్నారు. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్అగ్రిమెంట్లో లేని పనులను తాము చేపట్టలేమని స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్డిపార్ట్మెంట్నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత జరిగిన లోపాలను తాము సరి చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్చేసుకుంటే తప్ప తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు. -
పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): టీడీపీ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంట కాలువను అడ్డగోలుగా కబ్జాచేశారు. అంతటితో ఆగకుండా ఆ స్థలంలో ఆయన ఇల్లు నిర్మించుకుని తన ఆగడాలకు అంతేలేదని చాటిచెప్పారు. జిల్లాలోని రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ అయిన నీలంపేట చానల్‌కు నర్సీపట్నం పరిధిలోని శివపురం వద్ద నీటిపారుదల శాఖ గోడ నిర్మించింది. దానిపైనే అయ్యన్నపాత్రుడు యథేచ్ఛగా ఇంటికి బేస్మెంట్ నిర్మించారు. ఈ చానల్ ఒడ్డున నదిలో 10 అడుగుల వరకు (సర్వే నెంబరు 276లో 2 సెంట్ల మేర) ఆయన ఆక్రమించారని ఇరిగేషన్ శాఖతోపాటు రెవెన్యూ శాఖ తేల్చింది. కాలువ కుచించుకుపోయి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు సమీపంలోని పొలాలు ముంపునకు గురవుతాయి. ఈనెల 2న నోటీసులు జారీ అక్రమ నిర్మాణం తొలగించాలని ఈనెల 2న అధికారులు అయ్యన్నకు నోటీసులు జారీచేశారు. అయినా.. ఆయన స్పందించకపోవడంతో ఆర్డీఓ గోవిందరావు, ఏఎస్పీ విజయ మణికంఠ చందోలు, మున్సిపల్ కమిషనర్ కనకారావు, తహసీల్దార్ కె. జయ రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో ఆదివారం వేకువజామున జేసీబీలతో అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. గోడను పాక్షికంగా కూల్చివేశారు. ఇది జరుగుతుండగా అయ్యన్న సతీమణి పద్మావతి, తనయుడు రాజేష్ వారిపై దౌర్జన్యంచేస్తూ అడ్డుకున్నారు. రాజేష్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు అయ్యన్న నివాసానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకుంటూ తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తల రాకతో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులను బెదిరిస్తున్న అయ్యన్న కుమారుడు రాజేష్ అయ్యన్న తనయుడి అభ్యర్థన మన్నించినా.. ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించాలని, ఆక్రమణ జరిగినట్లు అందులో రుజువైతే తామే తొలగిస్తామని అయ్యన్న తనయుడు రాజేష్ ఆర్డీఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన అభ్యర్థన మేరకు ఆర్డీఓ అప్పటికప్పుడు సర్వేకు ఏర్పాట్లు చేశారు. కానీ, సర్వే చేయమని కోరిన టీడీపీ నేతలే మళ్లీ సర్వేను అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సిబ్బంది నుంచి బలవంతంగా చెయిన్లు లాక్కుని, రెవెన్యూ రికార్డులు ఎత్తుకుపోయారు. ఈ తతంగాన్ని సెల్ఫోన్లో రికార్డు చేస్తున్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేయిచేసుకుని సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఈ దశలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. అయ్యన్న నివాసంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, వంగలపూడి అనిత, కేఎస్ఎన్ఎస్ రాజు, అయ్యన్న మరో కుమారుడు చింతకాయల విజయ్ బరితెగించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వ్యాన్ తీసుకొచ్చి అయ్యన్న ఇంటి ముందుపెట్టారు. కానీ.. సర్వేను అడ్డుకుని కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న టీడీపీ కార్యకర్తలను తరలిస్తారని భావించిన ఆ పార్టీ నేతలు రోడ్డుపై ఉన్న కార్యకర్తలను లోపలకు తీసుకుపోయి గేట్లు మూసేశారు. అయితే, టౌన్ సీఐ మోహన్‌రావు టీడీపీ నేతల వద్దకు వెళ్లి రెవెన్యూ రికార్డులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రికార్డులు ఇచ్చేశారు. అనంతరం మళ్లీ సర్వే ప్రారంభించగా టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తూ అడ్డుకున్నారు. రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా టీడీపీ కార్యకర్తలు, పోలీసులు అయ్యన్న ఇంటి వద్దే మోహరించి ఉండడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ నిర్మాణాలు తొలగించకుండా ఉత్తర్వులివ్వాలని అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ వేసినట్లు సమాచారం. కాలువను కబ్జాచేసి కట్టేశారు ఇక మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ నీలంపేట చానల్‌ను ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టారని నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టంచేశారు. కాలువను 10 అడుగుల మేర ఆక్రమించారని.. ఇంటి ప్రహరీ గోడతోపాటు వంట షెడ్డు నిర్మించారని వారు తెలిపారు. -
త్వరలో 704 ఏఈ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెకానికల్ (84), సివిల్ (320), అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (100), ఎలక్ట్రికల్ (200) విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆయా విభా గాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హుల వుతారు. ఇందులో 259 పోస్టులు మల్టీ జోన్–1కు, 445 పోస్టులు మల్టీ జోన్–2 కు కేటాయించారు. వీటితో పాటు మరో 227 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో సివిల్ (182), మెకానికల్ (45) పోస్టులు ఉన్నాయి. 112 పోస్టులు మల్టీ జోన్–1కు, 115 పోస్టులు మల్టీజోన్–2 కు కేటాయించారు. బీటెక్ పట్టభద్రుల తో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
‘కృష్ణా’లో మా వాటా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటాను ఖరారు చేసే అంశాన్ని తక్షణమే కృష్ణా ట్రిబ్యునల్–2కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84 (3) (4) కింద జల వివాదాలను నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌కు అప్పగించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకు న్న నిర్ణయమే అంతిమమని స్పష్టం చేసింది. ఈ విషయంలో విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడానికి కేంద్రంతో సహా ఏ అథారిటీకి అధికారం లేదంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) 1956లోని సెక్షన్–3 కింద 2014 జూలై 14న ఏపీపై చేసిన ఫిర్యాదును దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంచడం.. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా హక్కులను తెలంగాణకు నిరాకరించడమేనని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. 574.6 టీఎంసీలు కేటాయించాలి కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయిస్తూ 2015లో తీసుకున్న తాత్కాలిక నిర్ణయం ఆధారంగానే ఇప్పటికీ కృష్ణా బోర్డు రెండు రాష్ట్రా లకు కేటాయింపులు చేయడంపై రాష్ట్రం అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్లో సాగు విస్తీర్ణం, కరువు ప్రభావిత ప్రాంతాలు, జనాభాను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి 574.6 టీఎంసీలను కేటాయించాలని కోరినా బోర్డు పట్టించుకోవడం లేదంది. ఈ అంశం తమ పరిధిలో లేదని, ట్రిబ్యునల్ మాత్రమే సమీక్షించగలదని బోర్డు పేర్కొందని వెల్లడించింది. ట్రిబ్యునల్‌కు అప్పగించండి: సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు అప్పగించాలని 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేసును ఉపసం హరించుకున్నామని తెలంగాణ తెలిపింది. న్యాయ సల హా మేరకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలా లేదా కృష్ణా ట్రిబ్యునల్–2కు బాధ్యత అప్పగించాలా అనే అం శంపై నిర్ణయిస్తామని అప్పట్లో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిందని గుర్తు చేసింది. కృష్ణా ట్రిబ్యునల్–2 రద్దు కానందున తెలంగాణ ఫిర్యాదును దీనికే అప్పగించడం సముచితమని అభిప్రాయపడింది. కృష్ణా జలాల్లో తమ చట్ట బద్ధ హక్కులనే కోరామని.. ఇతర రాష్ట్రాల హక్కులు, ప్ర యోజనాలకు భంగం కలుగుతుందని భావించొద్దని స్ప ష్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి పరిమితులుండటంతోనే ఐఎస్ఆర్డబ్ల్యూడీ–1956 చట్టం కింద ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాలు జరుపుతూ కృష్ణా ట్రిబ్యునల్–2 జారీ చేసిన మధ్యంతర నివేదికలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, కర్ణాటక, మహారాష్ట్రల ప్రయోజనాలకు ఈ కేసుతో నష్టం ఉండదని అభిప్రాయపడింది. -
డీపీఆర్‌లపై కాలయాపన వద్దు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్‌లోని అయిదు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కాలయాపన లేకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి పంపాలని తెలంగాణ మరోమారు గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల, మోదికుంటవాగు ప్రాజెక్టులు కొత్తవి కావని.. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించి, ప్రారంభించిన ప్రాజెక్టులని లేఖలో తెలిపారు. ఈ దృష్ట్యా అయిదు ప్రాజెక్టులు విభజన చట్టం క్లాజు 85 (8) పరిధిలోకి రావని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీలో భాగంగా ఉన్నాయన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు ఏవిధమైన ప్రభావాన్ని కలిగించవని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే పరిధి చట్టం ప్రకారం బోర్డులకు లేదని స్పష్టం చేశారు. ఈ అంశాలను పరిశీలించేందుకు కేంద్ర జల సంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయని వివరించారు. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జల శక్తి మంత్రి సైతం డీపీఆర్‌లను త్వరితగతిన పరిశీలించి ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ దృష్ట్యా గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరారు. -
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించడాన్ని తక్షణమే ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు గురువారం మరో లేఖ రాసింది. నీటి తరలింపు కేడబ్లు్యడీటీ–1 (కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్) తీర్పునకు వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ మురళీధర్, కేఆర్ఎంబీ చైర్మన్‌కు రాసిన లేఖలో వివరించారు. 1976–77 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే జూలై నుంచి అక్టోబర్ వరకు మద్రాసు (చెన్నై)కు తాగునీటి కోసం మళ్లించాలని పేర్కొన్నారు. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం మించకుండా చెన్నైకి నీటిని తరలించాలని ఒప్పందంలో పేర్కొన్న విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. ఈఎన్సీ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.. ►సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్‌కు మాత్రమే అనుమతించింది. ►ఎస్కేప్ రెగ్యులేటర్‌ను తరువాతి కాలంలో అనుమతి లేకుండా నిర్మించారు. ►అనుమతి లేకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో నీటి తరలింపు ఆపేయాలి. ►గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2లో అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ కాలువ, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగా ప్రాజెక్టు రెగ్యులేటర్లను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనాలి. ►శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగానే కృష్ణా ట్రిబ్యునల్ పరిగణించింది. ►19 టీఎంసీలను శ్రీశైలం కుడి కాలువకు, 15 టీఎంసీలు చెన్నై తాగునీటికి మొత్తం 34 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుం చి మళ్లించడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించింది. అంతకు మించి నీటి తరలింపును అనుమతించరాదని ఆ లేఖలో పేర్కొన్నారు. -
విద్యుదుత్పత్తిలో బోర్డుల జోక్యం తగదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేస్తున్న విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డు జోక్యం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు తేల్చిచెప్పారు. బచావత్ ట్రిబ్యునల్‌లో పేర్కొన్న మేరకే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో తమను నిలువరించాలని చూడటం చట్టవిరుద్ధమే అవుతుందని వెల్లడించారు. ఏ ప్రాతిపదికన విద్యుదుత్పత్తి ఆపమంటున్నారో తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. సోమవారం షెకావత్‌తో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.. గంటపాటు కృష్ణా జలాల అంశాలనే చర్చించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని, విద్యు దుత్పత్తి ద్వారా నీటిని దిగువ సాగర్ అవసరాలకు విడుదల చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీశైలం నుంచి కేవలం 38 టీఎంసీల నీటిని మాత్రమే ఏపీ మళ్లించుకునే అవకాశం ఉందని, కానీ అందుకు భిన్నంగా ఏటా వందల టీఎంసీల నీటిని బేసిన్ అవతలికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అదీగాక రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నడిచేందుకు విద్యుత్ అవసరాలు గణనీయంగా ఉన్నాయని, అందువల్ల శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయడం మినహా తమకు మరో దారిలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డుల జోక్యం తగదని, బచావత్ అవార్డు తీర్పు అమలయ్యేలా మాత్రమే బోర్డు చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని తాము మరోమారు పరిశీలిస్తామని షెకావత్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. డీపీఆర్‌లపై సీడబ్ల్యూసీ వద్దకు ఇంజనీర్లు ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్ర ఇంజనీర్లు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులకు సమర్పించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను సమర్పించడంతోపాటు అందులోని కొన్ని అంశాలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం అదనపు టీఎంసీలో అదనంగా నీటిని వినియోగించడం లేదని, తమకిచ్చిన 240 టీఎంసీల కేటాయింపుల్లోంచే వాడుకుంటామని స్పష్టం చేశారు. -
‘ర్యాలంపాడు’కి బీటలు
గద్వాల రూరల్: ‘ర్యాలంపాడు జలాశయం ప్రమాదపుటంచుల్లోకి వెళ్లింది. కట్ట తెగితే ఏకంగా 20గ్రామాలు పూర్తిగా ఊడ్చుపెట్టుకుని పోవడం ఖాయం.’ ఇదేదో స్థానికులు చెబుతున్న మాట కాదు.. సాగు నీటిపారుదల శాఖ అధికారులే ప్రభుత్వానికి పంపిన హెచ్చరికలు. ఈ క్రమంలో ఇద్దరు సీఈలతో కూడిన ఇంజనీర్ల బృందం శనివారం ర్యాలంపాడు జలాశయాన్ని సందర్శించింది. ఎక్కడ్కెడ లీకేజీలున్నాయో తెలుసుకునేందుకు డ్యాం చుట్టూ ఇంజనీర్లు కలియదిరిగారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. ►జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ధరూరు మండలం ర్యాలంపాడు వద్ద రూ.192 కోట్ల వ్యయంతో జలాశయాన్ని నిర్మించారు. 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం నుంచి 1.36లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా లక్ష్యంగా నిర్మాణం చేపట్టారు. 2014లో అందుబాటులోకి వచ్చిన ఈ జలాశయంలో మొదటి నాలుగేళ్లు రెండు టీఎంసీల కంటే తక్కువగానే నీటిని నిల్వ చేశారు. 2018, 2019, 2020లో వరుసగా జలాశయంలో పూర్తిస్థాయి 4 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. అయితే ఈ ఏడాది కూడా భారీగా వరద నీరు జూరాలకు వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలోనే నీటిని ర్యాలంపాడు జలాయంలోకి ఎత్తిపోశారు. ఈ క్రమంలోనే జలాశయం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున నీరు లీకేజీ కావడం మొదలైంది. ఈ విషయాన్ని 25 రోజుల కిందట అధికారులు గురించి.. పొంచి ఉన్న ముప్పును రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలియజేశారు. 3 కిలోమీటర్ల మేర నీరు లీకేజీ.. జలాశయం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర రాళ్లకట్ట నిర్మించారు. సహజంగా జలాశయాల్లో లీకేజీలు ఎర్త్స్లోపుల నుంచి విడుదలవుతాయి. కానీ ర్యాలంపాడులో మాత్రం 3 కిలోమీటర్ల మేర ఉన్న రాక్‌టోల్ నుంచి భారీగా నీరు లీకేజీ అవుతుంది. జలాశయంలో పూర్తిస్థాయిలో అంటే 4 టీఎంసీల మేర నీటిని నిల్వ చేస్తే కట్టకు గండి పడి దాని కింద ఉన్న 20 గ్రామాలు పూర్తిగా నీటిలో కొట్టుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో గద్వాల పట్టణం, అయిజ, మల్దకల్‌తో పాటు ధరూరు, గద్వాల, మల్దకల్, అయిజ మండలాల్లోని 17 గ్రామాల వరకు పూర్తిగా నీటమునుగుతాయి. ప్రమాదకరమే.. ర్యాలంపాడు కట్ట చుట్టూ రాక్పోల్ ద్వారా నీరు లీకేజీ అవుతున్న విషయాన్ని 25 రోజుల క్రితం గుర్తించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. శనివారం ప్రత్యేక బృందం జలాశయాన్ని పరిశీలించింది. ర్యాలంపాడు నుంచి వెలువడు తున్న లీకేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని, 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేయవద్దంటూ సూచించింది. కట్ట తెగితే దాని కింద ఉన్న గ్రామాలు ముంపునకు గురవుతాయని పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం లేదు. వానాకాలం పంటకు ఇబ్బంది లేకుండా ఆయకట్టుకు నీటిని అందిస్తాం. యాసంగికి మాత్రం కష్టం. – శ్రీనివాస్‌రావు, ఎస్ఈ, జిల్లా సాగునీటిపారుదల శాఖ -
‘మల్లన్న’ చెంతకు గోదారి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతలు పథకంలో భాగంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి భారీ సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 18 లేదా 20న వేదపండితుల పూజలు, ఆశీర్వచనాల మధ్య తుక్కాపూర్ పంప్‌హౌస్‌లోని మోటార్లను ఆన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎత్తిపోతలు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాథమిక సమాచారం అందించింది. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. రంగనాయక్‌సాగర్ టు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఈ ఏడాది జూన్ నాటికే సిద్ధంచేయాలని భావించినా కరోనా లాక్డౌన్, తొలకరి వర్షాల కారణంగా పనులు కాస్త ఆలస్యమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ చేసేలా పనులు పూర్తయిన నేపథ్యంలో, ఈ ఏడాది మొదట 10 టీఎంసీలు నిల్వ చేయనున్నారు. ఆ తర్వాత ఐదేసి టీఎంసీల చొప్పున నిల్వ పెంచనున్నారు. రంగనాయక్‌సాగర్‌లోని నీటిని తుక్కాపూర్ వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌లోని 8 మోటార్ల ద్వారా మల్లన్నసాగర్‌కు తరలించేలా ఇప్పటికే పనులన్నీ మొదలయ్యాయి. ప్రస్తుతం రంగనాయక్‌సాగర్‌లో 3.5 టీఎంసీలకు గానూ 3 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇక్కడి నిల్వలు ఖాళీ అయితే మిడ్‌మానేరు నుంచి నీటిని తరలిస్తూ మల్లన్నసాగర్ నింపనున్నారు. మిడ్‌మానేరులో ప్రస్తుతం 27.50 టీఎంసీలకు గానూ 25 టీఎంసీల మేర నిల్వలున్నాయి. అత్యంత ఎత్తున.. భారీ సామర్థ్యంతో.. ►కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఒడిసి పట్టుకొని రెండు సీజన్లలోనూ ఆయకట్టుకు నీటి లభ్యత పెంచే లక్ష్యంతో మొత్తం 141 టీఎంసీల సామర్థ్యంతో 18 రిజర్వాయర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో అత్యంత భారీగా ఏకంగా 50 టీఎంసీల సామర్థ్యంతో, సముద్ర మట్టానికి 555 మీటర్ల ఎత్తున.. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను రూ.6,805 కోట్లతో చేపట్టారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఏకంగా 22.60 కిలోమీటర్ల పొడవైన కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, కట్ట గరిష్ట ఎత్తు 58.5 మీటర్లుగా ఉంది. ►కట్ట నిర్మాణానికి 13.58 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 2.77 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే 96 శాతం పనులు పూర్తి చేశారు. ►ఈ రిజర్వాయర్ నుంచే కొండపోచమ్మ సాగర్, గంధమల, బస్వాపూర్‌లతో పా టు, సింగూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ స్టేజ్–1 ఆయకట్టుకు నీళ్లు చేరనున్నాయి. ►మొత్తంగా ఈ రిజర్వాయర్‌పై ఆధారపడిన కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఉండగా, స్థిరీకరణ ఆయకట్టు మరో 7.37 లక్షల ఎకరాలు ఉంది. ►ఈ ప్రాజెక్టుకు అవసరమైన 17,871 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించారు. ►ఈ రిజర్వాయర్ నిర్మాణంతో రాంపూర్, బ్రాహ్మణబంజేరుపల్లి, లక్ష్యాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, సింగారం, ఎర్రవెల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతుండగా, 4,298 కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ►మట్టి పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు తలెత్తకుండా ప్రతి రీచ్‌కు ఐదుగురు ఇంజనీర్లతో పర్యవేక్షణ ఉండేలా గజ్వేల్ కేంద్రంగా ప్రత్యేక క్వాలిటీ కంట్రోల్ డివిజన్ ఏర్పాటు చేశారు. -
గోదావరిలో జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.. మొన్నటి వరకు కొనసాగిన కాళేశ్వరం ఎత్తిపోతల నేపథ్యంలో గోదావరిలో జల సవ్వడి నెలకొంది. మేడిగడ్డ మొదలు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి సైతం ప్రవాహాలు పెరిగాయి. ప్రస్తుత సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోయర్ మానేరు నుంచి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధమవుతోంది. అవసరాలకు తగ్గట్లు ఆయకట్టుకు.. జూన్ తొలి వారంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. జూన్ మూడో వారం నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. ప్రాణహితలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 12 టీఎంసీల మేర నీటిని మేడిగడ్డ నుంచి దిగువ కొండపోచమ్మ వరకు తరలించింది. ప్రస్తుతం పంపులను పూర్తిగా నిలిపివేయగా మేడిగడ్డ వద్ద 55 వేల క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 25 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారంలో 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.50 టీఎంసీల మేర నిల్వ ఉండగా సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 6 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను సోమవారం 17.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండగా 15 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతోపాటు కాళేశ్వరం ద్వారా ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్ మానేరును నింపారు. లోయర్ మానేరులో 24 టీఎంసీలకుగాను 21.10 టీఎంసీలు నిల్వ ఉండగా 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇక్క డి నుంచి సూర్యాపేట వరకు ఎస్సారెస్పీ కాల్వల కింద నీటిని అందించేందుకు గేట్లు ఎత్తాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. మిడ్‌మానేరులో సైతం 25.87 టీఎంసీలకుగాను 23.34 టీఎంసీల నిల్వ ఉంది. ఇక మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయ డంతో మలక్‌పేట, రంగనాయక్సాగర్లలో మూడే సీ టీఎంసీల నిల్వలు ఉండగా 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌లో సైతం 6.80 టీఎంసీల నిల్వ ఉం ది. బ్యారేజీలు, రిజర్వాయర్లలో ఉన్న నీటితో అవసరాలకు తగ్గట్లుగా ఆయకట్టు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్‌ఫ్లో సోమవారం రాత్రి 9 గంటలకు 90 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి మట్టం 1075.20 (40.203 టీఎంసీలు) అడుగులకు చేరింది. సమ్మక్క బ్యారేజీ నుంచి 1.35 లక్షల క్యూసెక్కులు విడుదల ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ గేట్లను ఇరిగేషన్ అధికారులు సోమవారం తెరిచారు. 59 గేట్లలో 36 గేట్లను తెరిచి లక్షా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 6.9 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.3 టీఎంసీలను నిల్వ చేశారు. -
ఏపీ: సాగుపై సాధికారత దిశగా ముందడుగు
సాక్షి ప్రతినిధి కడప: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి అన్నదాతను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంటల సాగు మొదలుకుని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ తదితర అన్ని విషయాల్లోనూ రైతుకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. దిగుబడులు పెంచడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలనూ మరింత మెరుగుపరిచి అన్నదాతకు అండగా నిలిచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకోసం రైతులతో పాటు సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లకూ రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించతలపెట్టింది. దీనిలో భాగంగా కడప కేంద్రంగా నీరు, భూమి నిర్వహణ శిక్షణ, పరిశోధన కేంద్రం (వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.150 కోట్లతో 37 ఎకరాల్లో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ శిక్షణ కేంద్రాన్ని ఇప్పుడు కడపలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరో మూడు చోట్ల.. డీపీఆర్ సిద్ధం చేసే పనులను త్వరలోనే ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించనున్నారు. ఇప్పటికే తొలి దశలో అద్దె భవనాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. డీపీఆర్ సిద్ధమైన మరుక్షణమే మొదట మామిళ్లపల్లె ప్రాంతంలోని కొన్ని ప్రభుత్వ భవనాలతో పాటు మరికొన్ని అద్దె భవనాల్లో శిక్షణ కార్యాలయాలను ప్రారంభిస్తామని కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(కడ) కమిషనర్, ఈ శిక్షణ, పరిశోధన కేంద్రం ఇన్చార్జి రాఘవయ్య ‘సాక్షి’తో చెప్పారు. ఈ ఆరి్థక సంవత్సరంలోనే వీటిని ప్రారంభిస్తామన్నారు. కడపలో ప్రధాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా నెల్లూరు, అమరావతి, విశాఖపట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తారు. అన్నిచోట్లా సొంత భవనాలు నిర్మిస్తారు. అన్నదాతలకు ఫీల్డ్ విజిట్ ► శిక్షణ, పరిశోధన కేంద్రం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం. ► పంటల సాగు మొదలుకుని ఉత్పత్తి, మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పిస్తారు. ► ఆధునిక పంటల సాగుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ► అధిక దిగుబడులిచ్చే పంటలు సాగవుతున్న ప్రాంతాలకు రైతులను ఫీల్డ్ విజిట్‌కు తీసుకెళ్లి వారికి మరింత అవగాహన కల్పిస్తారు. ► ఈ కేంద్రాల్లో రైతులకు భోజనం, వసతి సమకూరుస్తారు. సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లకూ ఇక్కడే శిక్షణ రైతులతో పాటు సాగునీటి పారుదల శాఖ పరిధిలోని ఇంజినీర్లకు సైతం ఇక్కడే శిక్షణ ఇస్తారు. ఎం.బుక్‌ల నిర్వహణ, చెక్ మెజర్‌మెంట్‌తో పాటు అన్ని అంశాలపై ఇంజినీర్లతో పాటు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లకూ శిక్షణ కార్యక్రమాలుంటాయి. ప్రధానంగా సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఇందుకోసం నిపుణులైన టీచింగ్ స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు ప్రిన్సిపాల్‌ను కూడా ఈ శిక్షణ కేంద్రంలో నియమిస్తారు. టీచింగ్ స్టాఫ్‌కు వసతి గృహాలు, రైతులకు హాస్టల్ వసతి సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తారు. రైతులను ఫీల్డ్ విజిట్‌కు తీసుకెళ్లేందుకు వాహనాలను సైతం సిద్ధం చేయనున్నారు. -
రూ.150 కోట్లతో కృష్ణా కరకట్ట అభివృద్ధి
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): కృష్ణా నది ఎగువ ప్రాంతంలోని ఉండవల్లి జీరో పాయింట్ నుంచి వైకుంఠపురం వరకు ఉన్న కరకట్టను మరింత పటిష్టం చేసి రహదారి నిర్మించేందుకు నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఈ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి జీరో పాయింట్ వద్ద ఏర్పాటు చేస్తున్న పైలాన్ పనులను ఇరిగేషన్ ఈఈ రాజ్ సంపత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉండవల్లి – అమరావతి కరకట్ట వైకుంఠపురం వరకు 23 కిలోమీటర్ల పొడవు ఉందని, ఇందులో 15.25 కిలోమీటర్ల వరకు 10 మీటర్ల మేర వెడల్పు చేస్తున్నామని చెప్పారు. కాగా, ఈ రహదారి ప్రకాశం బ్యారేజీని కలపడంతోపాటు రాజధాని పరిధిలోని ఎన్ఎ–1 (ఉండవల్లి) నుంచి ఎన్ఎ–13 (ఉద్దండరాయుడిపాలెం) వరకు రోడ్డును కలుపుకుంటూ సచివాలయం వరకు వెళుతుంది. అంతేకాకుండా కృష్ణానది మీద ఇబ్రహీంపట్నం –వెంకటపాలెం మధ్య నిర్మించనున్న ఐకాన్ బ్రిడ్జి, కాజ టోల్ గేట్ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించనున్న రహదారికి కూడా ఇది అనుసంధానమయ్యేలా అధికారులు డిజైన్ చేశారు. -
ప్రమాద హెచ్చరికలు మూడే మూడు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి వరదల సీజన్ ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వరద ఉధృతిని అంచనా వేసి, అప్రమత్తం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు 3 ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తుంటారు. మొదటి ప్రమాద హెచ్చరిక : 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. నీటిపారుదల, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేస్తారు. ఏటిగట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. రెండో హెచ్చరిక : 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ 13.75 అడుగులకు నీటిమట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వెంటనే వరదకు సంబంధించిన అధికారులు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులకు హాజరవుతారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలు చేపడతారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కలిసి ఇరిగేషన్ అధికారులు పనిచేస్తుంటారు. మూడో హెచ్చరిక : 18 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలు విడుదల చేస్తూ నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. వెంటనే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా లంక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన పటిష్ట చర్యలను చేపడతారు. గోదావరిలో అన్ని రకాల పడవలు, పంట్ల రాకపోకలపై పూర్తి నిషేధం ఉంటుంది. -
‘సాగునీటి’ ప్రక్షాళన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ శరవేగంగా పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో సాగునీటి శాఖ సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా శాఖను పునర్విభజన చేయనుంది. భారీ, మధ్య, చిన్నతరహా, ఐడీసీ ఎత్తిపోతల పథకాల విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు తేనుంది. ప్రతి చీఫ్ ఇంజనీర్ (సీఈ) పరిధిలో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయిస్తూ పని విభజన చేయనుంది. సీఎం ఆదేశాలతో చకచకా కసరత్తు సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకు నీటిపారుదల శాఖను పునర్విభజించాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న మాదిరి భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ విభాగాలు వేర్వేరుగా కాక ఒకే గొడుగు కిందకు తేవాలని సూచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ జోన్లు ఏర్పాటుచేసి, ప్రతి జోన్‌కు ఒక సీఈని నియమించి, అతని పరిధిలోనే భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, ఐడీసీ ఎత్తిపోతల పథకాలు ఉంచాలని చెబుతూ వస్తున్నారు. ఆ దిశగా శాఖ ప్రక్షాళన ఉండాలని ఇటీవల సమీక్ష సందర్భంగానూ సూచించారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ఈఎన్సీ, సీఈలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీలు, సీఈల పరిధిలో ఏయే ప్రాజెక్టులుంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉండాలన్న దానిపై కసరత్తు పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో, మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించాలని నిర్ణయించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల పనులు చూసేందుకు ప్రస్తుతం బేసిన్‌కు ఒకరు చొప్పున ఇద్దరు సీఈలు ఉండగా వారిని తొలగించనున్నారు. ప్రాజెక్టులు – పని విభజన ఇలా.. ప్రతి పూర్వ జిల్లాకు ఒక సీఈని నియమించి, వారికే భారీ, మధ్యతరహా, చెరువులు, ఐడీసీ పథకాలను కట్టబెట్టనున్నారు. ► ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఇద్దరు ఈఎన్సీలు ఉండగా, కరీంనగర్ డివిజన్లోని ఈఎన్సీ కింద మూడు బ్యారేజీలు, ఎల్లంపల్లితో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు ఉన్న పనులన్నీ ఉండనున్నాయి. మరో ఈఎన్సీ పరిధిలో మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ పనులతో పాటు మెదక్ జిల్లాలోని సింగూరు, ఘణపూర్ ప్రాజెక్టులను తేనున్నారు. ► ఎస్సారెస్పీ పరిధిలో లోయర్ మానేరు వరకు ఒక సీఈని, ఆ తర్వాత ఉన్న ఆ యకట్టుతోపాటు, ఎస్సారెస్పీ–2 ఆయకట్టుకు మరో సీఈని నియమిస్తారు. ► ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం సీఈ లేనందున కొత్త సీఈని నియమిస్తారు. ఆయన పరిధిలో సీతారామ, సీతారామసాగర్, పాలేరు దిగువనున్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాసతో పాటు మధ్యతరహా ఎత్తిపోతల పథకాలు ఉంటాయి. ► పాలమూరు–రంగారెడ్డికి ఉన్న సీఈని యథావిధిగా కొనసాగిస్తారు. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ ఒక సీఈ, మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు మరో సీఈ పరిధిలో ఉండనున్నాయి. ► నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు, డిండి, ఎస్ఎల్బీసీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. ► దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులకు వేర్వేరు సీఈలు ఉండగా, రెండింటికీ కలిపి ఒక సీఈని నియమిస్తారు. ► నిజామాబాద్ ప్రాజెక్టుల కింద కొత్తగా సీఈని నియమించనున్నారు. ► పరిపాలన ఈఎన్సీ పోస్టును రద్దుచేసే అవకాశాలున్నాయి. పరిపాలనతో పాటు ఈ ఈఎన్సీ చూసే కమిషనర్ ఆఫ్ టెండర్ (సీఓటీ) బాధ్యతలను ఇకపై ఇరిగేషన్ ఈఎన్సీ ఒక్కరే చూడనున్నారు. -
‘జూరాల’ పునరుజ్జీవానికి అడుగులు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో ఎగువ నుంచి వరద కొనసాగే రోజులు తగ్గుతుండటంతో వరదున్నప్పుడే ఆ నీటిని ఒడిసిపట్టేలా ప్రభుత్వం బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బేసిన్లో ఎగువన ఉన్న జూరాల నుంచే కృష్ణా వరద జలాలను మళ్లించి నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ల బృందం జూరాల ఫోర్‌షోర్‌లో 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను ప్రతిపాదించగా దీన్ని నీటిపారుదల శాఖ పరిశీలించి ఆమోదం తెలిపింది. భరోసా ఇచ్చేలా... జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజీ మాత్రం కేవలం 6.50 టీఎంసీలే. అయితే జూరాలపై దాని సొంత ఆయకట్టుకు అవసరమయ్యే 19.74 టీఎంసీల నీటితోపాటు నెట్టెంపాడుకు 21.42 టీఎంసీలు, భీమా 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్ 5.50 టీఎంసీలు, గట్టు 4 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం 4.14 టీఎంసీలు కలిపి మొత్తంగా 73.20 టీఎంసీల అవసరాలున్నాయి. వాటి కింద 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అయితే నెట్టెంపాడు పరిధిలో 11 టీఎంసీలు, భీమా పరిధిలో 8.57, కోయిల్‌సాగర్ కింద 2.27, జూరాల కింది రిజర్వాయర్లలోని నీటి నిల్వలతో కలిపి మొత్తం 28 టీఎంసీల మేర మాత్రమే నిల్వ చేయగలిగే రిజర్వాయర్లున్నాయి. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద కొనసాగుతున్న రోజులు తగ్గుతూ వస్తుండటంతో ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండట్లేదు. కొన్ని సంవత్సరాల్లో ప్రవాహాలు పూర్తిగా రానప్పుడు తాగునీటికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ దృష్ట్యా జూరాలకు నీటి లభ్యత పెంచడం, దానిపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి వీలుగా జూరాల పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్తం తెరపైకి తెచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, అనంతరాములు, ఖగేందర్, మహేందర్ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యటించి జూరాల ఫోర్‌షోర్‌లోని నాగర్‌దొడ్డి వద్ద 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించింది. వరదతో నింపి... ఆగగానే వదిలి జూరాలకు కుడిపక్క ఫోర్‌షోర్‌లో కేవలం కిలోమీటర్ దూరంలో ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. వరద ఉండే 20 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని తరలించేలా ఒక పంపుహౌస్ నిర్మించి దాని ద్వారా రిజర్వాయర్‌ను నింపేలా ప్రణాళిక వేశారు. దీనికి రూ. 5,200 కోట్లు అంచనా కట్టారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తే గతం లో రూ. 554 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన గట్టు ఎత్తిపోతల పథకం అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. వరద ఉండే రోజుల్లో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్ నింపుకొని, జూరాలలో నీటి నిల్వలు తగ్గితే మళ్లీ రిజర్వాయర్ నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ జూరాలకు నీటిని విడుదల చేసి నింపేలా ఈ ప్రతిపాదన సిద్ధమైంది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఈ ప్రతిపాదనపై ఎలా ముందుకెళ్లాలో తెలపాలని కోరుతూ ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రతిపాదనపై సమగ్ర సర్వే చేస్తామని ప్రతిపాదించారు. -
‘పాలమూరు’ గడువు.. మరో రెండేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు మరో రెండేళ్లు అయితే కానీ పూర్తయ్యేలా లేవు. ఈ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టిన 18 ప్యాకేజీల పనుల గడువు మరో రెండేళ్లు పెంచక తప్పేలా లేదు. పూర్తికాని భూసేకరణ, సహాయ, పునరావాసంలో ఇబ్బందులు, ఎన్జీటీ, కోర్టు కేసులు ప్రాజెక్టుల ముందరి కాళ్లకు బంధమేయడంతో 2022 జూన్ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామంటూ ఇరిగేషన్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ త్వరలో సమీక్షించనున్నారు. భూసేకరణే అసలు సవాల్.. శ్రీశైలం నుంచి రోజుకి 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల వరదనీటిని తరలించి సుమారు 12.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. 2015లో ఈ ప్రాజెక్టుకు 35,200 కోట్లతో పరిపాలనా అనుమతులు చేపట్టగా, 2016 జూన్‌లో ఉద్దండాపూర్ వరకు 18 ప్యాకేజీల పనులను రూ.29,312 కోట్లతో చేపట్టారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని ఒప్పంద సమయంలో నిర్ణయించారు. అయితే భూసేకరణ సమస్యతో తొలి రెండేళ్లలో పనులు ముందుకు కదల్లేదు. దీనికితోడు ఎన్జీటీ కేసులు సైతం అవాంతరం సృష్టించాయి. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 27 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇంతవరకు 23,500 ఎకరాలు సేకరించారు. మరో 3,500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2018 నుంచి మరో రెండేళ్లు అంటే 2020 జూన్ వరకు ప్యాకేజీల గడువు పొడిగించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అన్ని ప్యాకేజీల్లో 28 శాతం పనులు, అంటే రూ.8వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా ప్రాజెక్టులోని తొలి ప్యాకేజీ అయిన నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో పడ్డాయి. దీన్ని భూగర్భంలో నిర్మించాలా లేక భూఉపరితలం మీదా అన్న అంశం తేలకపోవడంతో ఇక్కడ కేవలం 4 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పాటే భూసేకరణ సమస్యలతో ప్యాకేజీ–5, 7, 8, 16, 17, 18 పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ప్యాకేజీల్లో కేవలం 15–30 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కొన్ని ప్యాకేజీలకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు, మరికొన్ని ప్యాకేజీల గడువును 2022 మే చివరి వరకు పొడిగించాల్సి వస్తోంది. అప్పటికి ప్రాజెక్టు పనులు నూటికి నూరుశాతం పూర్తి చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌కు ప్రాజెక్టు ఇంజనీర్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్యాకేజీల గడువు పొడిగింపులపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం చేశాక తుది ఆమోదం తీసుకోనున్నారు. ఇక ఉద్దండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు గతంలోనే రూ.4,268 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినా పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఈ పనులకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల ప్రకారం కొత్త అంచనాలు సిద్ధంచేసి ఇవ్వాలని ప్రభు త్వం సూచించింది. ఈ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త రేట్ల ప్రకారం ఈ అంచనా రూ.7వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటికి ఆమోదం రాగానే ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. -
సాగునీటి శాఖకు కొత్త రూపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి శాఖ పూర్తిగా కొత్త రూపును సంతరించుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ మార్పుచేర్పులతో కూడిన ప్రక్రియ ముగింపు దశకు రాగా దీనికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం దక్కనుంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి కావస్తుండటం.. కాల్వలు, పంపులు, పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణ కత్తిమీద సాములా మారనున్న తరుణంలో విప్లవాత్మక చర్యలు అత్యంత కీలకం కానున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్నతరహా అన్నింటినీ ఒకే గూటి కిందకు తేనున్నారు. ఈఎన్సీలు, సీఈల వారీగా ఏయే ప్రాజెక్టులు ఉంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉంటుందన్న దానిపై కసరత్తు పూర్తయింది. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించనున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల పనులు చూసేందుకు బేసిన్ల వారీ ఇద్దరు సీఈలు ఉండే అవకాశం ఉంది. ప్రక్షాళన ఇలా... - కరీంగనర్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో 3 బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పాటు ఎల్లంపల్లి బ్యారేజీతో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు నీటిని ఎత్తిపోసే ప్యాకేజీలన్నీ రానున్నాయి. ఈ బ్యారేజీల పరిధిలో కొత్తగా చేపట్టే ఎత్తిపోతలు దీని పరిధిలోనే ఉండనున్నాయి. ఈఎన్సీ కింద మొత్తం లక్ష ఎకరాల ఆయకట్టు ఉండనుంది. - శ్రీరాంసాగర్ సీఈ పరిధిలో లోయర్‌మానేరు వరకు మాత్రమే ఆయకట్టును పరిమితం చేయనున్నారు. దీంతోపాటుగా కడెం, సదర్‌మఠ్, ఆదిలాబాద్‌లోని కాళేశ్వరం ఆయకట్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ఉండనున్నాయి. మొత్తంగా 7.42లక్షల ఆయకట్టు ఉంటుంది. - కరీంనగర్‌లోని మరో ఈఎన్సీ పరిధిలో లోయర్‌మానేరు నుంచి దిగువన సూర్యాపేట వరకు ఉన్న ఆయకట్టును కొత్తగా చేర్చారు. దీంతో పాటే ఎల్లంపల్లి దిగువ ఆయకట్టు, మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్, దానికింద ఆయకట్టును తెచ్చారు. మధ్యతరహా ప్రాజెక్టులు ఈఎన్సీ కిందే ఉండనున్నాయి. మొత్తంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు ఈఎన్సీ పరిధిలో ఉండనుంది. - నిజామాబాద్ సీఈ పరిధిలోకి కాళేశ్వరంపై ఆధారపడ్డ నిజాంసాగర్ ఆయకట్టు, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి. సీఈ కింద 6.82 లక్షల ఆయకట్టు ఉంటుంది. - వరంగల్ సీఈ పరిధిలో దేవాదుల, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండగా కొత్తగా సమ్మక్క బ్యారేజీని చేర్చారు. ఆయకట్టు 6.07 లక్షల ఎకరాలు. - ఆదిలాబాద్ సీఈ పరిధిలో ప్రాణహిత, చనాకా–కోరటా, పెనుగంగ, కుప్టి, కొమరంభీంతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు. మహబూబ్‌నగర్ సీఈ పరిధిలో జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు, గట్టు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఉండ నుండగా, ఆయకట్టు 11.95 లక్షల ఎకరాలు. - పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు ఒక్క సీఈ పరిధిలో ఉండనుంది. ఆయకట్టు 12.30 లక్షల ఎకరాలు. - నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు పాలేరు వరకు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు, డిండి, మధ్యతరహా ప్రాజెక్టులు ఉండనున్నాయి. ఆయకట్టు 10.97 లక్షల ఎకరాలు. - ఖమ్మం సీఈ పరిధిలో సీతారామ, సీతమ్మసాగర్, పాలేరు దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాస, మధ్యతరహా పథకాలు ఉంటాయి. ఆయకట్టు 7.16 లక్షల ఎకరాలు. - హైదరాబాద్ డివిజన్ కాళేశ్వరం ఈఎన్సీ పరిధిలో మిడ్‌మానేరు నుంచి గంధమల వరకు ఉన్న ప్యాకేజీలతో పాటు, కొత్తగా సింగూరు, ఘణపూర్, మధ్యతరహా ప్రాజెక్టులను చేర్చారు. ఆయకట్టు 11.54 లక్షలు. -
నేడు ‘పోలవరం’పై సమీక్ష
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కేంద్ర నిపుణుల కమిటీ సోమవారం విజయవాడలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టు పనుల తీరును రెండ్రోజులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిటీ ఈ సీజన్లో పూర్తి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేయనుంది. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాక, 3 నెలలకు ఒకసారి పనులను పరిశీలించి, ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదికలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని ఇటీవల కేంద్రం పునర్ వ్యవస్థీకరించింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు హెచ్‌కే హల్దార్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ పీపీవో సీఈ ఆర్కే పచౌరీ కనీ్వనర్‌గా ఉన్న ఈ కమిటీలో సీఎస్‌ఆర్‌ఎంఎస్ డైరెక్టర్ ఎస్ఎల్ గుప్తా, కృష్ణా గోదావరి బేసిన్ విభాగం సీఈ డి.రంగారెడ్డి, పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సభ్య కార్యదర్శి బీపీ పాండే, ఎన్‌హెచ్‌పీసీ మాజీ డైరెక్టర్ డీపీ భార్గవ, జాతీయ ప్రాజెక్టుల విభాగం డైరెక్టర్ భూపేందర్‌సింగ్, డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రకుమార్, సీడబ్ల్యూసీ(హైదరాబాద్) డైరెక్టర్ దేవేంద్రకుమార్‌ను సభ్యులుగా నియమించింది. శనివారం విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడమ కాలువ పనులను పరిశీలించింది. ఆదివారం పోలవరం హెడ్ వర్క్స్‌లో స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఎడమ గట్టు, కుడి గట్టు, అనుసంధానాలు (కనెక్టివిటీస్), ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)లను తనిఖీ చేశారు. పనులపై పోలవరం సీఈ సుధాకర్‌బాబును ఆరా తీశారు. ఈ సీజన్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి చేయడంతోపాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను కొలిక్కి తెస్తామని పోలవరం అధికారులు తెలిపారు. తద్వారా వచ్చే సీజన్లో వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి ప్రధాన ఆనకట్ట ఈసీఆర్ఎఫ్ పనులను నిర్విఘ్నంగా చేయడం ద్వారా 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని వారు వివరించారు. పునరావాస పనులు వేగవంతం 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల్లోని 18,620 కుటుంబాలకుగానూ ఇప్పటిదాకా 3,922 కుటుంబాలకు పునరావాసం కల్పించామని పోలవరం అధికారులు కమిటీకి తెలిపారు. మిగతా 14,698 కుటుంబాలకు మేలోగా పునరావాసం కలి్పంచే పనులను వేగవంతం చేశామని వివరించారు. కార్యాచరణ ప్రణాళిక మేరకు పనులు పూర్తి చేయాలంటే నిధులు అవసరమని, సవరించిన అంచన వ్యయ ప్రతిపాదనల (రూ.55,548.87 కోట్లు)కు ఆమోదముద్ర వేసి నిధులు విడదలయ్యేలా చూడాలని కేంద్ర కమిటీని కోరారు. ఇప్పటివరకూ చేసిన పనులకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.5,103 కోట్లను విడుదల చేసేలా చూడాలని కోరారు. అనంతరం కేంద్ర నిపుణుల కమిటీ చైర్మన్ హెచ్‌కే హల్దార్ విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులతో పోల్చితే నిర్వాసితుల సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయమే అధికమని, నిర్వాసితులకు పునరావాసం కల్పించడమే ప్రధానమని చెప్పారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు ఫలాలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు. -
ప్రగతికి శ్రీకారం
-
మీ రుణం తీర్చుకుంటున్నా..
సాక్షి ప్రతినిధి కడప: ‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పలు గ్రామాల్లో కొత్త చెరువుల తవ్వకం.. ‘‘గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంజనీర్లు సర్వే చేశారు. రాబోయే రోజుల్లో ఈ డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తాం. దీంతో జిల్లాలో కరువు పరిస్థితిని అధిగమిస్తాం. ముద్దనూరు – కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల–బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తాం. పెండింగ్‌లో ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), లింగాల బ్రాంచ్ కెనాల్, గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో చెరువులు లేని గ్రామాల్లో కొత్త చెరువులు తవ్వుతాం. సర్వే చేయించి.. ఆ చెరువులకు దగ్గరలో ఉన్న కాలువలతో అనుసంధానం చేసి పూర్తిగా నింపే కార్యక్రమం చేస్తాం. ఆ చెరువులకు మైక్రో ఇరిగేషన్‌తో లింక్ చేసి ఆయకట్టుకు నీరందిస్తాం. మొత్తం పీబీసీ ఆయకట్టును మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. రాబోయే పర్యటనల్లో వాటికి శంకుస్థాపనలు చేస్తాను. ఇవాళ 24 పనులకు (జాబితా చదివారు) శంకుస్థాపన చేస్తున్నా’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్‌బాష, ఆళ్ల నాని, మంత్రులు శంకర నారాయణ, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మాజీ మేయర్, కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన పనుల వివరాలు.. ►పులివెందులలో రూ.347 కోట్లతో వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు. ►గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా వేముల, వేంపల్లె మండలాల్లోని 15 వేల ఎకరాల స్థిరీకరణ. రూ.58 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కొత్తగా అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) నుంచి నీళ్లందించడమే కాకుండా పీబీసీ ఆయకట్టు చివర ఉన్న వి.కొత్తపల్లె, గిడ్డంగివారిపల్లె, టి.వెలమవారిపల్లె, ముచ్చుకోన చెరువులకు నీరందుతుంది. (తర్వాత ఈ నీళ్లు పాపాగ్నిలో కలుస్తాయి) తద్వారా నందిపల్లి, ఉప్పాలపల్లె, ముసల్‌రెడ్డిపల్లె గ్రామాలకు సైతం ప్రయోజనం చేకూరుతుంది. ►చిత్రావతి నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపి, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వల్ల ప్రభావితమయ్యే ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం. రూ.350 కోట్లతో చేపట్టే ఈ పథకం ద్వారా కోమన్నూతల, ఎగువపల్లి, మురారిచింతల, అంబకపల్లె, ఎర్రబల్లి చెరువు, మోటూన్నూతలపల్లె వంక, తదితర గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. గిడ్డంగివారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్ నిర్మించి యూసీఐఎల్ పల్లెలకు నీటి సరఫరా చేయొచ్చు. ►పులివెందులలో రూ.100 కోట్లతో 55.36 కిలోమీటర్లు భూగర్బ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందులలో రూ. 65 కోట్లతో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్ నిర్మాణం. ►వేంపల్లె గ్రామ పంచాయతీలో రూ.63 కోట్లతో 85.50 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.114 కోట్ల పాడా నిధులతో సీసీ రోడ్లు, పులివెందుల పట్టణ సుందరీకరణ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, పీబీసీ, సీబీఆర్ పరిధిలో వివిధ చెరువులకు సాగునీటి సరఫరా, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. దీంతోపాటు పీబీసీ నుంచి దొండ్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువు నుంచి వనం బావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయనిచెరువు నుంచి బత్తెనగారి చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచ్ కెనాల్ కింద రామట్లపల్లె చెరువు, గుణకనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల్ కింద సోత్రియం ఎత్తిపోతల పథకం నుంచి నల్లపురెడ్డిపల్లె, కమ్మాయిగారిపల్లె కుంటకు నీళ్లందిస్తారు. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.13.21 కోట్లతో ఏడు మార్కెట్ గిడ్డంగులతోపాటు పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డులలో మౌలిక వసతుల కల్పన ►పులివెందులలో హార్టికల్చర్ పంటల కోసం రూ.13 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రీకూలర్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు. ►నల్లచెరువుపల్లె గ్రామంలో రూ.27 కోట్లతో 132 కేవీ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా 14 గ్రామాలకు లబ్ధి కలిగేలా పనులు. ►రూ.10 కోట్లతో ఐదు 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం.. 10 గ్రామాల్లోని 2,100 వ్యవసాయ, 10,200 గృహ విద్యుత్ సర్వీసులకు లబ్ధి. ►రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.19.60 కోట్లతో కడప – పులివెందుల రోడ్డులోని వేంపల్లె పట్టణం నుంచి నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డు పనులు. ►రూ.11.52 కోట్లతో పులివెందులలో ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధి. ►రూ.9.30 కోట్లతో 30 పడకల నుంచి 50 పడకలకు వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విస్తరణ. ►రూ.17.50 కోట్లతో పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి ఏర్పాటు. తద్వారా 14 రకాల స్పోర్ట్స్‌కు అన్ని రకాల వసతులతో శిక్షణ. ►రూ.20 కోట్లతో ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి. ►పులివెందుల నియోజకవర్గంలో రూ.16.85 కోట్లతో 51 దేవాలయాల పునరుద్ధరణ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలలో 18 కొత్త దేవాలయాల నిర్మాణం. ►పులివెందులలో రూ.10 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (మినీ సచివాలయం) ఏర్పాటు. ►రూ.11.20 కోట్లతో నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం. ►రూ.4.50 కోట్లతో వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణం. ►రూ.20 కోట్లతో వేంపల్లెలో కొత్తగా డిగ్రీ కళాశాల నిర్మాణం. ►పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో రూ.20 కోట్లతో లెక్చర్ కాంప్లెక్స్, నైపుణాభివృద్ది కేంద్రం ఏర్పాటు. ►రూ.4 కోట్లతో వేంపల్లెలో బీసీ బాలురు, బాలికల వసతి గృహాల నిర్మాణం. ►పులివెందులలో రూ.3.64 కోట్లతో మోడల్ పోలీసుస్టేషన్ నిర్మాణం. ►పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నాం. నాన్నగారి హయాంలో నిర్మించిన.. ప్రస్తుతం దైన్యస్థితిలో ఉన్న ఐజీ కార్ల్ భవనాల్లో ఈ కళాశాలలను ఏర్పాటు చేస్తాం. త్వరలో వీటికి పునాది రాయి వేస్తాం. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లిస్తాం. దేవుడి ఆశీర్వాదంతో మరిన్ని గొప్ప పనులు చేసేలా దీవించాలని పేరుపేరునా ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. – సీఎం వైఎస్ జగన్ -
‘సీతారామ’...పూడిక తీసేద్దామా..!
సాక్షి, హైదరాబాద్ : పూర్వ ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకానికి పూడికమట్టి సమస్య వెన్నాడుతోంది. ఈ ఎత్తిపోతలకు అవసరమయ్యే నీటిని తీసుకునే దుమ్ముగూడెం ఆనకట్ట ఎగువ ప్రాంతంలో భారీగా మట్టి, ఇసుక మేటలు వేయడంతో అది పంప్‌హౌస్‌లోకి చేరి, పంపులు, మోటార్లకు సమస్యలు తెచ్చే అవకాశం ఏర్పడనుంది. దీన్ని గుర్తించిన నీటి పారుదల శాఖ డ్రెడ్జింగ్ ద్వారా పూడికతీత తీయాలని నిర్ణయించింది. కేవలం 50 రోజుల వ్యవధిలో సుమారు 35వేల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక క్యూబిక్ మీటర్ పూడికను తీసేందుకు రూ.800 ఖర్చు కానుంది. ప్రస్తుతం నీటి పారుదల శాఖ ఫిబ్రవరి రెండో వారానికి మొదటి పంప్‌హౌస్‌లో 3 మోటార్లను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లే పనులు జరుగుతున్నాయి. -
ముగింపు ..తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా ముగింపు దశలోని ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు భారీగా తగ్గాయి. మరో రూ.వెయ్యికోట్లు కేటాయించినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ, ప్రభుత్వం కేవలం రూ.87 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు. కోయిల్సాగర్ల కింద మొత్తంగా 8.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 6.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తిచేయగా, మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన పనుల పూర్తికి, 12 శాతం మేర మిగిలిన భూసేకరణకు రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు కనిష్టంగా రూ.400 కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.4 కోట్లతో సరిపెట్టారు. ఈ ప్రాజెక్టు కింద పనులకు సంబంధించి రూ.70 కోట్లు, భూసేకరణకు సంబంధించి రూ.17 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 3 లక్షల ఎక రాల కు నీరిచ్చే అవకాశాలుండగా, మిగతా ఆయకట్టు ను వచ్చే ఏడాదికి సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నిధులతో అధి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక భీమా, నెట్టెంపాడుల పరిధిలోనూ పెండింగ్ బిల్లులు రూ.33 కోట్ల మేర ఉన్నాయి. భూసేకరణకు మరో రూ.17 కోట్లు అవసరం. వీటి కింద నిర్ణయించిన చెరో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే కనిష్టంగా రూ.400 కోట్లు అవసరంకాగా కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. ప్రాణహిత మూలకే.. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లోని టన్నెల్ పనులు గాడిన పడే అవకాశం కనబడటం లేదు. పనుల పూర్తికి నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడమే దీనికి కారణం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీ లకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు. కన్వేయర్ బెల్ట్, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీకి రూ.80 కోట్లను అడ్వాన్సు కింద చెల్లించాలని ప్రతిపాదన వచ్చినా తుది రూపం తీసుకోలేదు. పనులకు సంబంధించి రూ.80 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.22 కోట్లు, భూసేకరణకు రూ.270 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా ప్రాజెక్టుకు రూ.300 కోట్ల మేర కేటాయింపులు కోరినా రూ. 17.31 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ్మిడిహెట్టి కాకుండా దానికి ఎగువన వార్ధా నదిపై దీన్ని నిర్మించాలని భావిస్తుండ టంతో ప్రభుత్వం కేటాయింపులు తగ్గించింది. -
టీడీపీ వరద రాజకీయం
సాక్షి, అమరావతి: ‘డ్రోన్ల ద్వారా నాపై దాడికి కుట్ర పన్నారు. వరదల్ని కావాలని రప్పించి నా ఇంటిని ముంచేలా ప్లాన్ చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవల్ని అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచుతున్నారు. చంద్రబాబు ఇంటిపై బాంబులు వేసేందుకు ఇద్దరు వచ్చారు’.. కృష్ణా నది వరదల సాక్షిగా టీడీపీ బురద రాజకీయానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ఉండవల్లి కరకట్టపై ఉన్న తన ఇంటిని ముంచేందుకు ఉద్దేశపూర్వకంగా వరద సృష్టించారని చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న హంగామా చూసి అధికారులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తనను అంతమొందించేందుకు డ్రోన్లు ప్రయోగించారని చంద్రబాబు నెత్తీ నోరూ కొట్టుకోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ ఏజెన్సీ శుక్రవారం డ్రోన్ కెమెరాతో బ్యారేజీ ఎగువన వరద పరిస్థితిని చిత్రీకరించింది. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటి వద్ద చిత్రీకరిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకులు డ్రోన్ల ద్వారా చంద్రబాబు ఇంటిపై బాం బులేయడానికి వచ్చారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నీటి పారుదల శాఖ ఖండించింది. డ్రోన్ల ద్వారా చిత్రీక రణకు తామే ఒక ఏజెన్సీ ద్వారా ఇద్దరు వ్యక్తుల్ని పంపా మని చెప్పడంతో టీడీపీ నాయకులు వ్యూహం మార్చారు. బాబు ఇంటిని ముంచే ందుకు ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా బ్యారేజీలో వరదను సృష్టిం చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరదను ఆపారట! ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవలను అడ్డుగా పెట్టి ఉండవల్లిలోని నివాసాన్ని ముంచాలని చూస్తున్నారని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆరోపణలకు దిగడం చూసి ప్రజలు నివ్వెరపోయారు. కృష్ణా నది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసం ముంపునకు గురైన విషయాన్ని పక్కదారి పట్టించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు, ఆయన పరివారం ఈ రాద్ధాంతం సృష్టించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నదుల అనుసంధానంలో నవయుగకు నజరానాలు!
సాక్షి, అమరావతి: సాగునీటి పనుల చాటున గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలకు ఇది మరో తార్కాణం! గోదావరి–పెన్నా తొలి దశలో రెండో ప్యాకేజీ పనులు చేయకున్నా సరే నవయుగ–ఆర్వీఆర్ సంస్థకు రూ.26.55 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా రూ.351 కోట్లకుపైగా ఖజానాను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు శతవిధాలా ప్రయత్నించారు. చేయని పనులను చేసినట్లుగా చిత్రీకరించి కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా ప్రయత్నాలు సాగించారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన జలవనరుల శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా రూ.351,11,54,057 చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే ఖజానా నిండుకోవడంతో దీనికి బ్రేక్ పడింది. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ అంశం బహిర్గతమైంది. మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.26.55 కోట్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేందుకు రూ.6,020 కోట్లతో గోదావరి–పెన్నా తొలి దశ పనులను గత సర్కార్ చేపట్టింది. రెండు ప్యాకేజీల కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 2వ ప్యాకేజీ (45 కి.మీ. నుంచి 66.600 కి.మీ. వరకు ఏడు వేల క్యూసెక్కులను ఎత్తిపోయడం) పనులను 4.41 శాతం ఎక్సెస్ ధరలకు అంటే రూ.2,655.49 కోట్లకు నవయుగ–ఆర్వీఆర్ దక్కించుకుంది. ఒప్పందం చేసుకున్నాక సర్వే, ఇన్వెస్టిగేషన్ కోసం ఒక శాతం అంటే రూ.26.55 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద గుంటూరు జిల్లా ఎస్ఈ బాబూరావు చెల్లించారు. పెండింగ్ బిల్లులపై సమీక్షతో వెలుగులోకి.. నిబంధనల ప్రకారం సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు పూర్తయిన తర్వాత నాలుగు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించవచ్చు. అయితే సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులే ఇంతవరకూ పూర్తి కాకపోవడం గమనార్హం. లేబర్ కాంపొనెంట్ కింద నాలుగు శాతం (రూ.106,23,57,216), పనులు చేయకున్నా చేసినట్లు చూపిస్తూ మరో రూ.244,87,96,841 వెరసి మొత్తం రూ.351,11,54,057 మేరకు బిల్లులు చెల్లించాలంటూ గత మార్చి 20న ఆర్థిక శాఖకు జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిశీలించిన ఆర్థిక శాఖ ఉద్యోగులు నివ్వెరపోయారు. అసలు చేయని పనులకు బిల్లులు ఎలా చెల్లిస్తామంటూ నిలదీశారు. దీంతో రంగంలోకి దిగిన నాటి ప్రభుత్వ పెద్దలు ఆర్థికశాఖ ఉన్నతాధికారి ద్వారా బిల్లులు చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అప్పటికే ఖజానా ఖాళీ కావడంతో తెరచాటు యత్నాలు బెడిసికొట్టాయి. పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఇటీవల సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ విషయాన్ని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడైంది. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో కూడా తట్టెడు మట్టెత్తకుండానే నవయుగ సంస్థకు రూ.787.2 కోట్లు ఇచ్చారని నిపుణుల కమిటీ నిర్ధారించిన విషయం తెలిసిందే. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ పనుల్లోనూ ఇదే రీతిలో నవయుగకు ఖజానా నుంచి ధారపోయటాన్ని బట్టి గత సర్కారు పెద్దలకు ఆ సంస్థతో ఎంత ధృఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
తెలంగాణలో ఆర్థిక సంక్షోభం:రాకేశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిపోయిందని, ఈ విషయాన్ని చర్చించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం కట్టాల్సిన బకాయిలే రూ.35 వేల కోట్లకు అంటే రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. భగీరథలోనే రూ.10 వేల కోట్ల బకాయిలున్నాయని, ఇక ఇరిగేషన్ శాఖలో మరొక రూ.10 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి ఉన్నట్లు చెప్పారు. ‘ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్థిక పరిస్థితి మీద వివరణ ఇవ్వాలి. దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని రాకేశ్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిపై అఖిలపక్షం: చాడ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి చేసిన ప్రకటన వాస్తవాలను కప్పిపుచ్చేదిగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనను తమ పార్టీ ఖండిస్తోందని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థికస్థితి గురించి పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే ఆర్థిక నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు పనులను ఎందుకు నిలిపేశారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని చాడ డిమాండ్ చేశారు.