
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి 9 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న వరద నీరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాలన్నీ శరవేగంగా పూర్తి కావస్తుండటం.. అదే సమయంలో కాల్వలు, పంపులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో సాగునీటి శాఖ సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా శాఖను పునర్విభజన చేయనుంది. భారీ, మధ్య, చిన్నతరహా, ఐడీసీ ఎత్తిపోతల పథకాల విభాగాలన్నీ ఒకే గొడుగు కిందకు తేనుంది. ప్రతి చీఫ్ ఇంజనీర్ (సీఈ) పరిధిలో సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయిస్తూ పని విభజన చేయనుంది.
సీఎం ఆదేశాలతో చకచకా కసరత్తు
సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణకు నీటిపారుదల శాఖను పునర్విభజించాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న మాదిరి భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ విభాగాలు వేర్వేరుగా కాక ఒకే గొడుగు కిందకు తేవాలని సూచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ జోన్లు ఏర్పాటుచేసి, ప్రతి జోన్‌కు ఒక సీఈని నియమించి, అతని పరిధిలోనే భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెరువులు, ఐడీసీ ఎత్తిపోతల పథకాలు ఉంచాలని చెబుతూ వస్తున్నారు. ఆ దిశగా శాఖ ప్రక్షాళన ఉండాలని ఇటీవల సమీక్ష సందర్భంగానూ సూచించారు.
ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ ఈఎన్‌సీ, సీఈలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈఎన్‌సీలు, సీఈల పరిధిలో ఏయే ప్రాజెక్టులుంచాలి, ఎంత ఆయకట్టు వారి పరిధిలో ఉండాలన్న దానిపై కసరత్తు పూర్తి చేశారు. ఎత్తిపోతల పథకాల్లో ఎలక్ట్రో, మెకానికల్, ప్రెషర్ మెయిన్స్, పంప్‌హౌస్‌ల నిర్వహణను చూసేందుకు గోదావరి, కృష్ణా బేసిన్ల వారీగా ఇద్దరు సీఈలను నియమించాలని నిర్ణయించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల పనులు చూసేందుకు ప్రస్తుతం బేసిన్‌కు ఒకరు చొప్పున ఇద్దరు సీఈలు ఉండగా వారిని తొలగించనున్నారు.
ప్రాజెక్టులు – పని విభజన ఇలా..
ప్రతి పూర్వ జిల్లాకు ఒక సీఈని నియమించి, వారికే భారీ, మధ్యతరహా, చెరువులు, ఐడీసీ పథకాలను కట్టబెట్టనున్నారు.
► ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఇద్దరు ఈఎన్‌సీలు ఉండగా, కరీంనగర్ డివిజన్‌లోని ఈఎన్‌సీ కింద మూడు బ్యారేజీలు, ఎల్లంపల్లితో పాటు దానికింద మిడ్‌మానేరు వరకు ఉన్న పనులన్నీ ఉండనున్నాయి. మరో ఈఎన్‌సీ పరిధిలో మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీ పనులతో పాటు మెదక్ జిల్లాలోని సింగూరు, ఘణపూర్ ప్రాజెక్టులను తేనున్నారు.
► ఎస్సారెస్పీ పరిధిలో లోయర్ మానేరు వరకు ఒక సీఈని, ఆ తర్వాత ఉన్న ఆ యకట్టుతోపాటు, ఎస్సారెస్పీ–2 ఆయకట్టుకు మరో సీఈని నియమిస్తారు.
► ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం సీఈ లేనందున కొత్త సీఈని నియమిస్తారు. ఆయన పరిధిలో సీతారామ, సీతారామసాగర్, పాలేరు దిగువనున్న నాగార్జునసాగర్ ఆయకట్టు, భక్తరామదాసతో పాటు మధ్యతరహా ఎత్తిపోతల పథకాలు ఉంటాయి.
► పాలమూరు–రంగారెడ్డికి ఉన్న సీఈని యథావిధిగా కొనసాగిస్తారు.
► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ ఒక సీఈ, మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు మరో సీఈ పరిధిలో ఉండనున్నాయి.
► నల్లగొండ సీఈ పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉంటాయి.
► దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులకు వేర్వేరు సీఈలు ఉండగా, రెండింటికీ కలిపి ఒక సీఈని నియమిస్తారు.
► నిజామాబాద్ ప్రాజెక్టుల కింద కొత్తగా సీఈని నియమించనున్నారు.
► పరిపాలన ఈఎన్‌సీ పోస్టును రద్దుచేసే అవకాశాలున్నాయి. పరిపాలనతో పాటు ఈ ఈఎన్‌సీ చూసే కమిషనర్ ఆఫ్ టెండర్ (సీఓటీ) బాధ్యతలను ఇకపై ఇరిగేషన్ ఈఎన్‌సీ ఒక్కరే చూడనున్నారు.