సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేస్తున్న విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డు జోక్యం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు తేల్చిచెప్పారు. బచావత్ ట్రిబ్యునల్‌లో పేర్కొన్న మేరకే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో తమను నిలువరించాలని చూడటం చట్టవిరుద్ధమే అవుతుందని వెల్లడించారు.
ఏ ప్రాతిపదికన విద్యుదుత్పత్తి ఆపమంటున్నారో తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. సోమవారం షెకావత్‌తో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.. గంటపాటు కృష్ణా జలాల అంశాలనే చర్చించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని, విద్యు దుత్పత్తి ద్వారా నీటిని దిగువ సాగర్ అవసరాలకు విడుదల చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
శ్రీశైలం నుంచి కేవలం 38 టీఎంసీల నీటిని మాత్రమే ఏపీ మళ్లించుకునే అవకాశం ఉందని, కానీ అందుకు భిన్నంగా ఏటా వందల టీఎంసీల నీటిని బేసిన్ అవతలికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అదీగాక రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నడిచేందుకు విద్యుత్ అవసరాలు గణనీయంగా ఉన్నాయని, అందువల్ల శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయడం మినహా తమకు మరో దారిలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డుల జోక్యం తగదని, బచావత్ అవార్డు తీర్పు అమలయ్యేలా మాత్రమే బోర్డు చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని తాము మరోమారు పరిశీలిస్తామని షెకావత్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
డీపీఆర్‌లపై సీడబ్ల్యూసీ వద్దకు ఇంజనీర్లు
ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్ర ఇంజనీర్లు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులకు సమర్పించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను సమర్పించడంతోపాటు అందులోని కొన్ని అంశాలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం అదనపు టీఎంసీలో అదనంగా నీటిని వినియోగించడం లేదని, తమకిచ్చిన 240 టీఎంసీల కేటాయింపుల్లోంచే వాడుకుంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment