Gajendrasing
-
విద్యుదుత్పత్తిలో బోర్డుల జోక్యం తగదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చేస్తున్న విద్యుదుత్పత్తిపై కృష్ణా బోర్డు జోక్యం ఏమాత్రం సరికాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు తేల్చిచెప్పారు. బచావత్ ట్రిబ్యునల్‌లో పేర్కొన్న మేరకే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో తమను నిలువరించాలని చూడటం చట్టవిరుద్ధమే అవుతుందని వెల్లడించారు. ఏ ప్రాతిపదికన విద్యుదుత్పత్తి ఆపమంటున్నారో తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. సోమవారం షెకావత్‌తో కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలు, గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.. గంటపాటు కృష్ణా జలాల అంశాలనే చర్చించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టేనని, విద్యు దుత్పత్తి ద్వారా నీటిని దిగువ సాగర్ అవసరాలకు విడుదల చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. శ్రీశైలం నుంచి కేవలం 38 టీఎంసీల నీటిని మాత్రమే ఏపీ మళ్లించుకునే అవకాశం ఉందని, కానీ అందుకు భిన్నంగా ఏటా వందల టీఎంసీల నీటిని బేసిన్ అవతలికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. అదీగాక రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలు నడిచేందుకు విద్యుత్ అవసరాలు గణనీయంగా ఉన్నాయని, అందువల్ల శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయడం మినహా తమకు మరో దారిలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డుల జోక్యం తగదని, బచావత్ అవార్డు తీర్పు అమలయ్యేలా మాత్రమే బోర్డు చూడాలని కోరినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని తాము మరోమారు పరిశీలిస్తామని షెకావత్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం. డీపీఆర్‌లపై సీడబ్ల్యూసీ వద్దకు ఇంజనీర్లు ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్ర ఇంజనీర్లు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులకు సమర్పించారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను సమర్పించడంతోపాటు అందులోని కొన్ని అంశాలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం అదనపు టీఎంసీలో అదనంగా నీటిని వినియోగించడం లేదని, తమకిచ్చిన 240 టీఎంసీల కేటాయింపుల్లోంచే వాడుకుంటామని స్పష్టం చేశారు. -
గోదావరిలో జల సిరులు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి వరప్రదాయిని అయిన గోదావరి నదిలో నీటి లభ్యత భారీగా పెరిగిందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. మొదటి ఇరిగేషన్ కమిషన్, సీడబ్ల్యూసీ మొదటి అధ్యయనం, బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే నీటి లభ్యత అధికంగా ఉన్నట్లుగా నిర్ధారించింది. 1965–84 మధ్య కాలంనాటి నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం, ప్రవాహాలు, ఆవిరి నష్టాలను పరిగణనలోకి తీసుకుని 1993లో మొదటిసారిగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ గోదావరిలో 3,902.062 టీఎంసీల (శతకోటి ఘనపుటడుగులు) నీటి లభ్యత ఉన్నట్లు తేల్చింది. తాజాగా 1985–2015 మధ్య కాలంలో నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం, ప్రవాహాలు, ఆవిరి నష్టాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ గోదావరిలో నీటి లభ్యత 4,156.22 టీఎంసీలకు పెరిగినట్లు గుర్తించింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే 3,094.751 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని నిర్ధారించింది. తొలిసారి అధ్యయనంలో తేల్చిన దానికంటే తాజాగా చేసిన అధ్యయనంలో 6.51 శాతం అధికంగా నీటి లభ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధ్యయన నివేదికను సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ హుస్సేన్ ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు అందజేశారు. సాగుకు వినియోగిస్తోంది 13.7 శాతమే దేశంలో గంగా నది తర్వాత అతి పెద్ద నది గోదావరి. అపారమైన జలసిరికి నెలవైన గోదావరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో 1964–65 నుంచి 1984–85 వరకూ అంటే 20 ఏళ్ల పరిధిలో వర్షపాతం, ప్రవాహాలు, నీటి ఆవిరిలను పరిగణనలోకి తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తొలిసారిగా అధ్యయనం చేసింది. తాజాగా 1985–2015 మధ్య కాలంలో అంటే 30 ఏళ్ల పరిధిని తీసుకుని నీటి లభ్యతపై విస్తృతంగా అధ్యయనం చేసింది. ఏడాదికి సగటున 4,156.22 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు తేల్చింది. ఇందులో కేవలం 569.689 టీఎంసీలను మాత్రమే సాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. అంటే.. లభ్యమయ్యే నీటిలో కేవలం 13.70 శాతం జలాలను మాత్రమే సాగు కోసం వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో గోదావరి డెల్టాలోనే సింహభాగం నీటిని వినియోగిస్తున్నారు. గృహ, పారిశ్రామిక తదితర అవసరాల కోసం 40.595 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు సీడబ్ల్యూసీ వివరించింది. నీటి లభ్యతలో అధిక భాగం.. అంటే ప్రతిఏటా ఏకంగా 3,408.921 టీఎంసీలు సముద్రంలో, ప్రవాహ నష్టాల రూపంలో పోతున్నాయని పేర్కొంది. గోదావరిలో విస్తారంగా లభిస్తున్న జలాలను నీటి కొరత ఉన్న కృష్ణా, పెన్నా నదీ పరీవాహక ప్రాంతాలకు మళ్లించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు రచించారు. సీడబ్ల్యూసీ అధ్యయనంలోని ముఖ్యాంశాలు - గోదావరి నదీ పరీవాహక ప్రాంతం 1993 నాటికి 3,12,812 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అది తాజాగా 3,12,150 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. గతంతో పోల్చితే 662 చదరపు కిలోమీటర్లు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. నదీ పరీవాహక ప్రాంతం మహారాష్ట్రలో 48.5 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23.30, ఛత్తీస్‌గఢ్‌లో 12.5, మధ్యప్రదేశ్‌లో 8.6, ఒడిశాలో 5.7, కర్ణాటకలో 1.4 శాతం విస్తరించి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతం. - గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో సగటున 877 నుంచి 1,493 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. 1965–84 మధ్య కాలంలో సగటున 1,062 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా.. 1985–2015 మధ్య కాలంలో సగటున 1,177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే గతంతో పోల్చితే 10.82 శాతం అధిక వర్షపాతం నమోదైంది. - 1985–2015 మధ్య కాలంలో, 2013–14లో నదీ పరీవాహక ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాని పరిమాణం 17,047.787 టీఎంసీలు. గోదావరిలో 2013–14లో గరిష్టంగా 6,935.391 టీఎంసీల నీటి లభ్యత నమోదైంది. 2009–10లో నదీ పరివాహక ప్రాంతంతో కనిష్ట వర్షపాతం నమోదైంది. దాని పరిమాణం 10,178.049 టీఎంసీలు. ఆ ఏడాది గోదావరిలో నీటి లభ్యత కనిష్టంగా 2,587.137 టీఎంసీలుగా నమోదైంది. - 1993లో నిర్వహించిన అధ్యయనంలో గోదావరిలో 3,902.062 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన సీడబ్ల్యూసీ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో నీటి లభ్యత 4,156.22 టీఎంసీలకు పెరిగినట్లు తేల్చింది. గతంతో పోల్చితే తాజాగా 254.158 టీఎంసీలు(6.51 శాతం) పెరిగినట్లు పేర్కొంది. - గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఏటా సగటున 156.379 టీఎంసీల నీరు ఆవిరవుతోంది. మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు.. తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి ఆవిరి నష్టం అధికంగా ఉంది. - గోదావరి పరీవాహక ప్రాంతంలో 1985 నాటికి 45,38,418 హెక్టార్ల ఆయకట్టు ఉండగా.. 2014–15 నాటికి 52,57,004 హెక్టార్లకు చేరింది. 30 ఏళ్లలో ఆయకట్టు 7,18,586 హెక్టార్లు మాత్రమే పెరిగింది. -
రూ.30 వేల కోట్లు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఇంటింటికీ నల్లా నీరు’ పథకానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, దీనిలో రూ. 30 వేల కోట్ల మేర సాయం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రాన్ని కోరారు. ‘జల్ జీవన్ మిషన్’ అమలుపై కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్ని రాష్ట్రాలతో కేంద్ర మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. ఆగస్టు 15న ప్రధాని ఈ మిషన్‌కు సంబంధించి చేసిన ప్రకటనకు ముందే ఏపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రోజుకు 100 లీటర్ల చొప్పున నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు రూపొందించింది. గ్రామాలు, పట్టణాల్లోనూ నీరు సరఫరా చేస్తాం. ఈ ప్రాజెక్టుకు వచ్చే నెలలో టెండర్లు కూడా పిలవబోతున్నాం. మొదటి విడతలో కొన్ని జిల్లాలకు, రెండో విడతలో మిగిలిన జిల్లాలకు ఇచ్చే విధంగా ఈ పథకం రూపొందిస్తున్నాం. జల్ జీవన్ మిషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరగా మా పథకాన్ని అమలుచేయాలన్న సంకల్పంతో పనిచేస్తాం’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో పోలవరం సందర్శనకు షెకావత్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తాజా స్థితిగతులపై కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేంద్రం సహకరిస్తుందని భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘పోలవరం అంశం నా పరిధిలో లేదు. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు పోలవరం రావాలని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఆహ్వానించాను. సెప్టెంబర్‌లో వస్తామన్నారు. కేంద్రం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మేం టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియ పూర్తయి రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుంది’ అని తెలిపారు. ఈ ఏడాదికి రూ. 300 కోట్లు మంజూరు జల్ జీవన్ మిషన్ కార్యక్రమం అమలుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ. 300 కోట్లు నిధులను మంజూరు చేసినట్టు అధికారులు చెప్పారు. మంచి నీటి పథకాల నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం నిధులు కేంద్రం విడుదల చేస్తే, మిగిలిన 50 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు కలిపి మొత్తం రూ. 600 కోట్లు ఈ పథకంలో ఖర్చు పెడితే, అందులో రూ. 120 కోట్ల మేర ఇళ్లకు మంచి నీటి కొళాయిల ఏర్పాటుకే ఖర్చు పెట్టాల్సి ఉంది. జల్ జీవన్ మిషన్ ప్రారంభం.. జాతీయ గ్రామీణ మంచి నీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసి కొత్తగా ‘జల్ జీవన్ మిషన్’ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచి నీటి వసతి కల్పించడమే జల్ జీవన్ మిషన్ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేసే నిధుల్లో 20 శాతం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు మంచినీటి కొళాయిల ఏర్పాటుకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అనంతరం వాటి నిర్వహణ వ్యయాలను సంబంధిత గ్రామ పంచాయతీనే భరించాల్సి ఉంటుంది. అవసరమైతే కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకునే వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
తీరని ఆవేదనతో..
రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో నంగల్ ఝామర్వాడా గ్రామానికి చెందిన గజేంద్రసింగ్.. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని సూసైడ్ నోట్లో రాసిపెట్టాడు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తమ పంట మొత్తం దెబ్బతిన్నదని, దాంతో తన తండ్రి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితంలో ఇక భవిష్యత్తు అంటూ ఏమీ లేదని, తాను జీవించి ఉండి లాభమేమీ లేదని ఆక్రోశం వెలిబుచ్చాడు. తాను మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలియజేయాలంటూ వారి ఫోన్ నంబర్లను కూడా రాసిపెట్టాడు. కింద జైజవాన్, జైకిసాన్, జై రాజస్థాన్ అని రాశాడు. పంట నష్టంతో ఒత్తిడికి లోనై..: పంట నష్టంతో రైతు గజేంద్ర తీవ్ర ఒత్తిడికి, ఆవేదనకు లోనయ్యాడని ఆ రైతు బంధువు గోపాల్‌సింగ్ తెలిపారు. దౌసా జిల్లాధికారులు మాత్రం దాన్ని ఖండించారు. గజేంద్ర కుటుంబం ఆర్థికంగా బాగుందని, వారికి ఫాం హౌజ్ కూడా ఉందని, గజేంద్ర మామ ఆ గ్రామ సర్పంచ్ అని దౌసా జిల్లా అదనపు కలెక్టర్ కైలాశ్ శర్మ వివరించారు. ఆ ప్రాంతంలో పంట నష్టం కూడా తీవ్రంగా లేదని, పరిహారానికి అర్హత లభించే 33% పంటనష్టం అక్కడ ఎవరికీ జరగలేదని తెలిపారు. పరిహారం కోరుతూ గజేంద్ర ఎన్నడూ అధికారుల వద్దకు రాలేదని మరో అధికారి దయానంద్ వెల్లడించారు.