రూ.30 వేల కోట్లు ఇవ్వండి | Peddi Reddy Ramachandra Reddy Asked the Central Govt For Intintiki Nalla Scheme | Sakshi
Sakshi News home page

రూ.30 వేల కోట్లు ఇవ్వండి

Published Tue, Aug 27 2019 4:59 AM | Last Updated on Tue, Aug 27 2019 5:14 AM

Peddi Reddy Ramachandra Reddy Asked the Central Govt For Intintiki Nalla Scheme - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఇంటింటికీ నల్లా నీరు’ పథకానికి రూ. 60 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామని, దీనిలో రూ. 30 వేల కోట్ల మేర సాయం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్రాన్ని కోరారు. ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ అమలుపై కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్ని రాష్ట్రాలతో కేంద్ర మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. ఆగస్టు 15న ప్రధాని ఈ మిషన్‌కు సంబంధించి చేసిన ప్రకటనకు ముందే ఏపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రోజుకు 100 లీటర్ల చొప్పున నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలు రూపొందించింది. గ్రామాలు, పట్టణాల్లోనూ నీరు సరఫరా చేస్తాం. ఈ ప్రాజెక్టుకు వచ్చే నెలలో టెండర్లు కూడా పిలవబోతున్నాం. మొదటి విడతలో కొన్ని జిల్లాలకు, రెండో విడతలో మిగిలిన జిల్లాలకు ఇచ్చే విధంగా ఈ పథకం రూపొందిస్తున్నాం. జల్‌ జీవన్‌ మిషన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రంలో త్వరగా మా పథకాన్ని అమలుచేయాలన్న సంకల్పంతో పనిచేస్తాం’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

సెప్టెంబర్‌లో పోలవరం సందర్శనకు షెకావత్‌
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తాజా స్థితిగతులపై కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో కేంద్రం సహకరిస్తుందని భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ‘పోలవరం అంశం నా పరిధిలో లేదు. అయితే ముఖ్యమంత్రి సూచన మేరకు పోలవరం రావాలని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఆహ్వానించాను. సెప్టెంబర్‌లో వస్తామన్నారు. కేంద్రం ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. మేం టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియ పూర్తయి రికార్డు సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుంది’ అని తెలిపారు.

ఈ ఏడాదికి రూ. 300 కోట్లు మంజూరు
జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం అమలుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాదికి రాష్ట్రానికి రూ. 300 కోట్లు నిధులను మంజూరు చేసినట్టు అధికారులు చెప్పారు. మంచి నీటి పథకాల నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం నిధులు కేంద్రం విడుదల చేస్తే, మిగిలిన 50 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు కలిపి మొత్తం రూ. 600 కోట్లు ఈ పథకంలో ఖర్చు పెడితే, అందులో రూ. 120 కోట్ల మేర ఇళ్లకు మంచి నీటి కొళాయిల ఏర్పాటుకే ఖర్చు పెట్టాల్సి ఉంది. 

జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రారంభం..
జాతీయ గ్రామీణ మంచి నీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసి కొత్తగా ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికీ మంచి నీటి వసతి కల్పించడమే జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు మంజూరు చేసే నిధుల్లో 20 శాతం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు మంచినీటి కొళాయిల ఏర్పాటుకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అనంతరం వాటి నిర్వహణ వ్యయాలను సంబంధిత గ్రామ పంచాయతీనే భరించాల్సి ఉంటుంది. అవసరమైతే కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకునే వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement