‘పేట’తోనే మామ, అల్లుళ్లకు మహర్దశ !
సిద్దిపేట జోన్,న్యూస్‌లైన్: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమానికి బీజం నాటిన సిద్దిపేట పట్టణమే నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయన మేనల్లుడు హరీష్‌రావును నియోజకవర్గం అక్కున చేర్చుకొని కోటగా నిలిచింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా, కొంతకాలం కరువు సహాయక మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగిన అనవాయితీని నేడు ఆయన మేనల్లుడు హరీష్‌రావు కొనసాగిస్తున్నారు.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్‌రావు నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన నీటి పారుదల శాఖతో పాటు శాసన సభ వ్యవహరాల శాఖను పర్యవేక్షించనున్నారు. 2004 ఉప ఎన్నికల ద్వారా సిద్దిపేట నుంచి రాజకీయ ప్రవేశం చేసిన హరీష్‌రావు 2004లో ఉప ఎన్నికతో తన విజయ పరంపరను కొనసాగిస్తూ ఐదుసార్లు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2010 ఉప ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలోనే 95.858 ఓట్లతో అత్యధిక మెజార్టీ సాధించిన హరీష్‌రావు, మొన్నటి ఎన్నికల్లో 93.354 ఓట్లతో తెలంగాణలో ద్వితీయ స్థానంలో నిలిచారు.
2004 ఉప ఎన్నికల్లో గెలుపొందిన హరీష్‌రావు అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో యువజన సర్వీసుల శాఖను నిర్వర్తించారు. ఈ క్రమంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, హరీష్‌రావు తొలివిడత మంత్రి వర్గంలో చోటు సంపాదించుకొనిని నీటి పారుదల శాఖ పగ్గాలు చేపట్డం ఆయన పనితనానికి నిదర్శనం. టీఆర్‌ఎస్ బలోపేతానికి పుష్కరకాలంగా కృషి చేస్తున్న హరీష్‌రావు 1996 నుంచి మామ కేసీఆర్‌కు సహాయకారిగా ఉంటూ సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు.
తనకిష్టమైన నీటి పారుదల శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను పర్యవేక్షించనున్న హరీష్‌రావు తెలంగాణ ప్రాంతంలో జలవనరుల అభివృద్ధికి కృషి చేయగలరనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. 2004లోనే యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఆయన నియోజకవర్గంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి పుష్కలంగా నిధులను మంజూరు చేయించుకున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ముందు రూపొందించిన పార్టీ మేనిపెస్టోకు అనుగుణంగా తెలంగాణ ప్రాంతాన్ని జలవనరులతో సస్యశ్యామలం చేసేందుకు హరీష్‌రావుకు నీటి పారుదల శాఖను కేటాయించినట్లు సమాచారం.