‘నాన్నను మీరు అమితంగా ప్రేమించారు.. నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరన్న సందర్భంలో మీ వెనుక మేమంతా ఉన్నామని కుటుంబంలా నాకు తోడుగా నిలబడ్డారు. మీ బిడ్డగా నన్ను దీవించారు.. ఆశీర్వదించారు. ఇవాళ మీ బిడ్డగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందున మీ రుణం తీర్చుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు బుధవారం ఉదయం ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున హాజరైన స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.