ఆయకట్టుకు ‘శ్రీరామ’రక్ష!
ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం నీటిని హల్దీవాగు ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని ఒక ప్రతిపాదన రాగా, ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరకు వరుసగా 11 బ్యారేజీలు నిర్మాంచాలని మరో ప్రతిపాదన వచ్చింది. అయితే దీనికి సుమారు రూ.30 వేల కోట్ల భారీ వ్యయం అయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తరలించే 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని ఎఫ్‌ఎఫ్‌సీ (ఇందిరమ్మ వరద కాల్వ) ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని నిర్ణయించింది. దీనికి రూ.1,067 కోట్లతో అనుమతులు ఇచ్చింది. ఈ పథకం అమల్లోకి వస్తే ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్ కింద 5.50 లక్షల ఎకరాలు, సరస్వతి కెనాల్ కింద 40 వేలు, లక్ష్మీ కెనాల్ కింద 20 వేలు, కాళేశ్వరం ప్యాకేజీ 27, 28 కింద లక్ష ఎకరాలు, ప్యాకేజీ 21, 22 కింద 3.50 లక్షలు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని వివిధ లిఫ్ట్ పథకాల కింద మిగతా ఆయకట్టును స్థిరీకరించవచ్చు.
ఇలా ఎఫ్‌ఎఫ్‌సీకి ఇరువైపులా దాదాపు లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉన్నది. ఇందిరమ్మ వరద కాల్వ తవ్వకాలు జరిపినపుడు చుట్టు పక్కలలో ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎండిపోయాయి. కాల్వల దగ్గర తలపెట్టిన తూముల నిర్మాణంతో నీటిని లిఫ్ట్ చేసుకొని రైతులు పంపుల ద్వారా నీటిని తరలించుకోవచ్చు. దీంతో పాటే మిషన్ భగీరథకు అవసరమైన 7.76 టీఎంసీల నీటి అవసరాలను సైతం ఈ పథకం తీర్చుతుంది. ఇక ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరిగి వరదలు వచ్చినా ముందున్న ప్రణాళికల ప్రకారం ఎఫ్‌ఎఫ్‌సీ నుంచి మిడ్ మానేరుకు నీటిని మళ్లించవచ్చు. నీళ్లున్నప్పుడు ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు కొనసాగనుండగా, నీళ్లు లేనప్పుడు దిగువ నుంచి ఎగువకు నీటిని తీసుకుంటారు.
► కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి వెళ్లే ప్రధాన కాల్వను 102వ కి.మీ. వద్ద వరద కాల్వ(ఎఫ్‌ఎఫ్‌సీ) క్రాస్ చేస్తుంది. ఇక్కడ్నుంచి ఒక టీఎంసీ నీటిని 68వ కి.మీ., 32వ కి.మీ. వద్ద రెండు దశల్లో 5 పంపుల ద్వారా 8828 క్యూసెక్కుల నీటిని 10 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తారు.
► ఈ మూడు స్జేజీల విధానం ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ జలాశయానికి చేరతాయి.