సాక్షి ,హైదరాబాద్ : సుందిళ్ల బ్యారేజీల నిర్మాణల కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగం(సీడీవో) ఇంజినీర్లపై కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్‌లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా ఇంజినీర్లు సమాధానాలు చెప్పడంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది.
మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజి సహా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో జరిపిన రెండు రోజుల పాటు జరిపిన బహిరంగ విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ తొలిరోజైన సోమవారం మేడిగడ్డ, రెండో రోజైన మంగళవారం సుందిళ్ళ బ్యారేజి నిర్మాణాలపై విచారణ చేపట్టింది.
ఈ విచారణలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగాని(సీడీవో)కి చెందిన ఏఈఈ,డీఈ,ఈఈ,డీసీఈ’ 16మంది ఇంజినీర్లను కమిషన్ సుందిళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు ఇంజినీర్లు తప్పుడు సమాధానాలు చెప్పిటన్లు తెలుస్తోంది. అఫిడవిట్‌లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు మార్చి చెప్పడంపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుందిళ్ళ బ్యారేజి బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే నిర్మాణం చేశామని ఇంజినీర్లు కమిషన్‌కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు? ఎలా సాధ్యమైంది? అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నకు.. ఒకటో బ్లాక్,మూడు బ్లాక్‌ల మధ్య 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని ఒకసారి..రెండు,మూడు బ్లాక్‌ల మధ్య నిర్మాణం చేశామని బదులిచ్చారు. మధ్యలో రెండో బ్లాక్ తర్వాతే 2ఏ బ్లాక్ కట్టామని కమిషన్‌కు ఓ ఇంజినీర్ వివరించారు. 2ఏ బ్లాక్‌కు డిజైన్ లేకపోవడంతో రెండో డిజైన్ ఆధారంగా 2ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే డిజైన్ లేకపోయినా 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్‌కు వివరించారు.
ఇలా ఇంజినీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. 16 మంది ఇంజినీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డ్‌లను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్ తన విచారణను ముగించింది.
తొలిరోజు మేడిగడ్డ నిర్మాణాలపై ప్రశ్నల వర్షం
తొలిరోజు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగుబాటుకు కారణాలతో పాటు ఇతర నిర్మాణలపై కమిషన్ ఇంజినీర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముందే సిద్ధం చేసుకుని వచ్చిన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణలకు సంబంధించిన ఇంజినీర్లు సమర్పించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్.. వారితో సంతకాలు చేయించుకుని విచారణను నిలిపివేసింది
ఇవాళ (మంగళవారం) సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపై ఇంజినీర్లను కమిషన్ బహిరంగంగా విచారించింది. విచారణలో ఇంజినీర్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment