టెక్నికల్ అంశాలపై గత ప్రభుత్వం తరఫు సాక్షి ప్రకాశ్‌రావుతో జస్టిస్ పీసీ ఘోష్
‘కాళేశ్వరం కమిషన్’ముందు హాజరైన టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్
మేడిగడ్డకు మరమ్మతులు చేసి పునరుద్ధరించవచ్చన్న ప్రకాశ్‌రావు
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేకనే ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించినట్టు వివరణ
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలతో మీకు సంబంధం లేదు. వాటిని ఇంజనీర్లకు వదిలేయండి..’అంటూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది.
‘మేడిగడ్డ బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌కు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలి. అది సాధ్యం కూడా..’అని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఐడీసీ) మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత వి.ప్రకాశ్‌రావు చెబుతుండగా.. జస్టిస్ ఘోష్ ఆయ న్ను మధ్యలోనే అడ్డుకున్నారు.
‘అంతే చాలు..టెక్నికల్ అంశాలతో మీకు సంబంధం లేదు..’అని అన్నారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కమిషన్ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు గత ప్రభుత్వం తరఫున ప్రకాశ్‌రావు ‘సాక్షి’గా హాజరై సమాధానాలిచ్చారు.
రాజకీయాలు చేయొద్దు
తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారు? అని కమిషన్‌ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా..‘రికార్డుల్లో ఏం ఉందో అదే అంతిమం. దానిని ఎవరూ మార్చలేరు..’అని కమిషన్ స్పష్టం చేసింది.
ప్రజల సాగునీటి డిమాండ్లను నెరవేర్చడానికి 200 టీఎంసీలు అవసరం కాగా, తుమ్మిడిహెట్టి వద్ద తగిన నీటి లభ్యత లేకపోవడంతోనే బరాజ్‌ను తరలించాల్సి వచ్చిందని ఆ తర్వాత ప్రకాశ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 165 టీఎంసీల జలాల లభ్యతే ఉందని కేంద్ర జలసంఘం పేర్కొందని, అందులోనూ ఇతర రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోగా తెలంగాణకు 102 టీఎంసీలే మిగులుతాయని చెప్పారు.
ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలు పలు జలాశయాలను నిర్మించి నీటిని తరలించుకుంటుండడంతో గత 50 ఏళ్లుగా తెలంగాణకు వచ్చే ప్రవాహాలు తగ్గిపోయాయన్నారు. సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రకాశ్‌రావు చెప్పగా.. రాజకీయాలు చేయవద్దని, ఉద్యమంతో తమకు ఏం సంబంధం అంటూ కమిషన్ అభ్యంతరం తెలిపింది.
రిటైర్డు ఇంజనీర్లు వద్దన్నా ..
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌తో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించడమే ఉత్తమమని, దీనిని ఎలాగైనా సాధ్యం చేయాలని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015 ఏప్రిల్‌లో సిఫారసు చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది.
ప్రతిపాదిత మేడిగడ్డ బరాజ్ అనవసరమని, అధిక వ్యయంతో కూడినది కావడంతో పాటు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని కమిటీ చెప్పిందని తెలిపింది. దీనిపై ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా, టీఎస్‌ఐడీసీ చైర్మన్‌గా నాటికి మీరు నియామకం కానందున మీ సమాధా నం అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది.
నీటి లభ్యత లేకపోవడంతో పాటు ముంపును తగ్గించడం కోసం తుమ్మిడిహెట్టికి బదులుగా వెన్‌గంగా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో వార్ధా బరాజ్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment