కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ కమిషన్
సీడీఓ ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిజైన్లకు సాంకేతిక అనుమతులిచ్చాక మళ్లీ అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను ఎందుకు మార్చారు? మారిన ప్రదేశాలకు అనుగుణంగా డిజైన్లలో మార్పులు చేశారా?’అని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, రిటైరైన ఇంజనీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భా గంగా కమిషన్ మంగళవారం పలువురు ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అన్నారం బరాజ్ డిజైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఈఈ కె. నరేందర్‌ను ప్రశ్నించగా డిజైన్లను ఏఈఈలు తయారు చేస్తే.. వాటికి డీఈఈ, ఆపై ఈఈ అనుమతిస్తారని ఆయన తెలిపారు. భూభౌగోళిక, సైట్ సర్వే ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్‌లను సిద్ధం చేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్‌కు ఎదురు ప్రశ్నలు వేయగా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
డిజైన్లలో లోపాల్లేవు: బస్వరాజ్, ఎస్‌ఈ, కాళేశ్వరం
మేడిగడ్డ బరాజ్ డిజైన్లలో లోపాల్లేవని.. ఐఎస్ కోడ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) నిబంధనలకు లోబడి ఎల్ అండ్ టీ ఆధునిక సాఫ్ట్‌వేర్ ద్వారా తయా రు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ హెచ్.బస్వరాజ్ తెలిపారు. డిజైన్లు ప్రమాణాలకు లోబడి ఉన్నాయని నిర్ధారించాకే ఆమోదించామన్నారు.
బరాజ్ నిర్మిత స్థలాన్ని పరిశీలించలేదని.. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని ఓ ప్రశ్నకు బస్వరాజ్ బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను మార్చినప్పటికీ ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే మేడిగడ్డను కట్టారని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బరాజ్ కుంగిందని సీడీవో ఎస్‌ఈ ఎం. సత్యనారాయణరెడ్డి వివరించారు.
బరాజ్‌లను నీటి మళ్లింపు కోసం కట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిల్వ చేయడంతోనే విఫలమైనట్లు సీడీఓ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ దయాకర్‌రెడ్డి ఇంతకుముందు కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో కమిషన్ దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేశారు. దీంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రామగుండం ఈఎన్‌సీ ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు చేశామని సీడీవో మాజీ ఎస్‌ఈ రాజశేఖర్ అన్నారు.
అన్యాయాన్ని సరిచేయడానికే రీ ఇంజనీరింగ్
పీసీ ఘోష్ కమిషన్‌కు తెలిపిన వి.ప్రకాశ్
సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ ను పునర్నిర్మించేందుకు.. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను నాటి సీఎం కేసీఆర్ చేపట్టారని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నేత వి.ప్రకాశ్ తెలిపా రు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు మంగళవారం అఫిడవిట్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సమైక్య పాలనలో గోదావరి పరీవాహక ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతుల ఆత్మహత్యలు సహా వివిధ ఘటనల్లో 50 వేల మంది చనిపోయా రని కమిషన్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలుకాగా రీ ఇంజనీరింగ్ ద్వారా 37 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత గురించి కేంద్ర జలసంఘం రాసిన లేఖల్లోని వాస్తవాలను కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘు వక్రీకరించారని ఆధారాలతో సహా వివరించినట్లు ప్రకాశ్ చెప్పారు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ సాధ్యం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment