12 నుంచి ఐఏఎస్‌ల విచారణ! | PC Ghosh Commission to revive cross examination | Sakshi
Sakshi News home page

12 నుంచి ఐఏఎస్‌ల విచారణ!

Published Tue, Nov 5 2024 5:00 AM | Last Updated on Tue, Nov 5 2024 5:00 AM

PC Ghosh Commission to revive cross examination

క్రాస్‌ ఎగ్జామినేషన్‌ను పునరుద్ధరించనున్న పీసీ ఘోష్‌ కమిషన్‌ 

ఇప్పటికే రెండు విడతల్లో ఇంజనీర్లు, అధికారుల విచారణ 

మూడో విడతలో ఐఏఎస్, రిటైర్డ్‌ ఐఏఎస్‌లను ప్రశ్నించాలని నిర్ణయం 

చివరగా వచ్చే నెలలో మాజీ ప్రజాప్రతినిధుల విచారణ! 

డిసెంబర్‌ నెలాఖరు నాటికి సర్కారుకు నివేదిక సమర్పించే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లపై విచారణ చేస్తున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఈ నెల 12 నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ హైదరాబాద్‌కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో నీటిపారుదల శాఖ రిటైర్డ్‌ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్‌ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్‌ ప్రశ్నంచింది. 

మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు ఎస్‌కే జోషి, రజత్‌కుమార్, ఇన్‌చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్‌కుమార్, వికాస్‌రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్‌ తదితరులను కమిషన్‌ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. 

ఇప్పటికే ఓసారి కమిషన్‌ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్‌ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్‌ ముగించే అవకాశాలు ఉన్నాయి. 

డిసెంబర్‌ చివరి నాటికి నివేదిక! 
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్‌ కమిషన్‌ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావులను విచారించాలని కమిషన్‌ భావిస్తున్నట్టు తెలిసింది. 

వచ్చే నెల లో వారికి కమిషన్‌ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్‌ డిసెంబర్‌ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ కమిషన్‌ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 

ఇంకా గడువు పొడిగించని సర్కారు! 
వాస్తవానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్‌ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్‌కు వస్తానని జస్టిస్‌ పీసీ ఘోష్‌ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement