
మా ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే పనిచేస్తోంది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
స్త్రీ సమ్మిట్ 2.0కి ముఖ్యఅతిథిగా హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ దిశలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నగరంలో మహిళల భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్‌సీఎస్‌సీ) కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన ‘స్త్రీ’(షీ ట్రంప్స్ థ్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్‌మెంట్) సమ్మిట్ 2.0కు భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుశ్రీ వెల్పాండియన్, ప్రముఖ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన, రాజ్యాంగానికి రూపమిచ్చిన బీఆర్ అంబేడ్కర్ జయంతి మరుసటి రోజే ఈ సదస్సు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రకాలైన సాధికారత కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏటా రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. లక్ష్యాన్ని మించి రూ.21 వేల కోట్లు అందించాం. గ్రీన్ ఎనర్జీలో మహిళల్ని భాగస్వాముల్ని చేస్తున్నాం. సోలార్ రంగంలో 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మహిళా సంఘాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం.
మహిళల కోసం ప్రత్యేక చట్టాలు చేయడంతో పాటు వాటిని అమలు చేస్తేనే మహిళ సాధికారికత సాధ్యం. తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది’అని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ నేరాలు జరుగుతున్నాయి. గత ఏడాది నగరంలో 250 అత్యాచారం కేసులు, 713 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలకు న్యాయం చేయడానికి షీ–టీమ్స్‌తో పాటు భరోసా కేంద్రం పనిచేస్తోంది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 19 డీసీపీ పోస్టులు ఉండగా... వీటిలో ఎనిమిది మంది మహిళా అధికారులు ఉన్నారు’అని పేర్కొన్నారు. మహిళ సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుశ్రీ వెల్పాండియన్ అన్నారు. ఈ కోణంలో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉత్తమ విధానాలు అమలవుతున్నాయని కితాబిచ్చారు.