baraj
-
బరాజ్‌లు ఎందుకు ఫెయిలయ్యాయి?
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిజైన్లకు సాంకేతిక అనుమతులిచ్చాక మళ్లీ అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను ఎందుకు మార్చారు? మారిన ప్రదేశాలకు అనుగుణంగా డిజైన్లలో మార్పులు చేశారా?’అని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో)లో పనిచేసిన, రిటైరైన ఇంజనీర్లను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భా గంగా కమిషన్ మంగళవారం పలువురు ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అన్నారం బరాజ్ డిజైన్లను ఎవరు సిద్ధం చేశారని మాజీ ఈఈ కె. నరేందర్‌ను ప్రశ్నించగా డిజైన్లను ఏఈఈలు తయారు చేస్తే.. వాటికి డీఈఈ, ఆపై ఈఈ అనుమతిస్తారని ఆయన తెలిపారు. భూభౌగోళిక, సైట్ సర్వే ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్లను సిద్ధం చేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కమిషన్‌కు ఎదురు ప్రశ్నలు వేయగా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిజైన్లలో లోపాల్లేవు: బస్వరాజ్, ఎస్ఈ, కాళేశ్వరం మేడిగడ్డ బరాజ్ డిజైన్లలో లోపాల్లేవని.. ఐఎస్ కోడ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) నిబంధనలకు లోబడి ఎల్ అండ్ టీ ఆధునిక సాఫ్ట్వేర్ ద్వారా తయా రు చేసిందని కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ హెచ్.బస్వరాజ్ తెలిపారు. డిజైన్లు ప్రమాణాలకు లోబడి ఉన్నాయని నిర్ధారించాకే ఆమోదించామన్నారు. బరాజ్ నిర్మిత స్థలాన్ని పరిశీలించలేదని.. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని ఓ ప్రశ్నకు బస్వరాజ్ బదులిచ్చారు. అన్నారం, సుందిళ్ల నిర్మాణ స్థలాలను మార్చినప్పటికీ ప్రతిపాదిత నిర్మాణ ప్రదేశంలోనే మేడిగడ్డను కట్టారని తెలిపారు. మేడిగడ్డ బరాజ్ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే బరాజ్ కుంగిందని సీడీవో ఎస్ఈ ఎం. సత్యనారాయణరెడ్డి వివరించారు. బరాజ్‌లను నీటి మళ్లింపు కోసం కట్టాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా నిల్వ చేయడంతోనే విఫలమైనట్లు సీడీఓ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ దయాకర్‌రెడ్డి ఇంతకుముందు కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్‌లో కమిషన్ దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేశారు. దీంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రామగుండం ఈఎన్సీ ఇచ్చిన డేటా ఆధారంగా డిజైన్లు చేశామని సీడీవో మాజీ ఎస్ఈ రాజశేఖర్ అన్నారు. అన్యాయాన్ని సరిచేయడానికే రీ ఇంజనీరింగ్పీసీ ఘోష్ కమిషన్‌కు తెలిపిన వి.ప్రకాశ్సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ ను పునర్నిర్మించేందుకు.. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను నాటి సీఎం కేసీఆర్ చేపట్టారని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్ తెలిపా రు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు మంగళవారం అఫిడవిట్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య పాలనలో గోదావరి పరీవాహక ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతుల ఆత్మహత్యలు సహా వివిధ ఘటనల్లో 50 వేల మంది చనిపోయా రని కమిషన్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు లక్షిత ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలుకాగా రీ ఇంజనీరింగ్ ద్వారా 37 లక్షల ఎకరాల ఆయకట్టు కు సాగునీరు అందించడానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత గురించి కేంద్ర జలసంఘం రాసిన లేఖల్లోని వాస్తవాలను కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్, విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘు వక్రీకరించారని ఆధారాలతో సహా వివరించినట్లు ప్రకాశ్ చెప్పారు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో తుమ్మిడిహెట్టి బరాజ్ సాధ్యం కాదన్నారు. -
తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ సాధ్యం కాదు
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తుమ్మిడిహెట్టి కోణంలో కాకుండా మూడు తరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేశారనే కోణంలో నిర్వహించాలని కోరారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట శనివారం ఆయన స్వచ్ఛందంగా హాజరై తన వాదనలను వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ కడితే 5 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోవచ్చని, అయితే మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుతో కట్టడానికి మాత్రమే అంగీకారం తెలపడంతో 1.8 టీఎంసీలకు మించి నిల్వ చేసుకోవడానికి వీలు ఉండదని ప్రకాశ్ చెప్పారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో ఎగువ రాష్ట్రాలు వాడుకోని 63 టీఎంసీలూ ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ కమిషన్‌ను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ‘వీ’ఆకృతిలో బరాజ్ ఎక్కడా లేదు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తే వార్దా–వెన్‌గంగా నదులు కలిసే చోట ‘వీ’ఆకృతిలో బరాజ్ వస్తుందని, ప్రపంచంలో ఎక్కడా ‘వీ’ఆకృతిలో బరాజ్ లేదని స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతం ఉందని, రూ.7,500 కోట్లు వెచ్చించినా తుమ్మిడిహెట్టితో ఆశించిన ప్రయోజనం ఉండదని చెప్పారు. నిజాం హయాంలో తెలంగాణ ప్రాంతంలో 9 ప్రాజెక్టులు ప్రతిపాదించగా, అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి చొరవతో అందులో సాగర్, శ్రీరాంసాగర్లను మాత్రమే నిర్మాణం చేపట్టారని, అవి కూడా అసంపూర్తిగా కట్టారని తెలిపారు. 57 ఏళ్లలో తెలంగాణ నాశనం అయిందని, ఈ కారణంగానే జలయజ్ఞం ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టినట్టు వివరించారు. కాగా బరాజ్ కుంగడానికి కారణాలను తెలుపుతూ ఈ నెల 26లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించగా 28న సాక్ష్యాధారాలతో సహా నివేదిక ఇస్తానని ప్రకాశ్ వెల్లడించారు. -
విద్యుదాఘాతానికి యువకుడు బలి
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన నగరంలోని ఏఎస్ రావు నగర్లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న బరాజ్(25) అనే యువకుడు ఈ రోజు ఉదయం ఇంట్లో విద్యత్ తీగలు సరిచేస్తుండగా.. షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిజమే!
- పొడవు 1,170 మీటర్లు... గేట్ల సంఖ్య 194 - ప్రభుత్వానికి నిజనిర్ధారణ కమిటీ నివేదిక - కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని - అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం - కేంద్రమంత్రి ఉమాభారతికి - వివరించాలంటూ ఎంపీ జితేందర్‌కు ఫోన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై రాయచూర్ జిల్లాలో గిరిజాపూర్ గ్రామం వద్ద కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా బ్యారేజీ చేపట్టడం నిజమేనని పేర్కొంటూ నిజ నిర్ధారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదిక అందగానే శనివారం సాగునీటి శాఖ మంత్రి మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై వెంటనే కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేయాలని ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషిని, ఇంటర్ స్టేట్ చీఫ్ ఇంజనీర్ నాగేందర్‌ను మంత్రి ఆదేశించారు. సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు, న్యాయ నిపుణులను సంప్రదించి ఫిర్యాదును తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత జితేందర్‌రెడ్డికి ఫోన్లో సూచించారు. ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపేయడానికి చర్యలు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. జూరాలకు వరద కష్టమే! కృష్ణాపై కర్ణాటక బ్యారేజీ నిర్మాణానికి సమాయత్తమవుతుందన్న సమాచారంపై మంత్రి హరీశ్‌రావు నిజ నిర్ధారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారుల కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి ఫోటోలతో సహా నివేదికను సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం బ్యారేజీని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌పీటీఎస్) నిర్మిస్తోంది. ‘‘బ్యారేజీ పొడవు 1,170 మీటర్లు. గేట్ల సంఖ్య-194. 24 నెలల కాల పరిమితితో రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ ఏడాది జూలై 28న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బ్యారేజీలో సుమారు రెండు టీఎంసీల నీరు నిలువ చేసే అవకాశం ఉంది’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల జూరాల ప్రాజెక్టుకు వరద నీరు రావడం కష్టంగా మారుతుందని అభిప్రాయపడింది. దానికి తోడు నారాయణపూర్ నుంచి రావాల్సిన రీజనరేటెడ్ ఫ్లో కూడా రాకుండా పోతుందని తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దిగువ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలుపలేదు. కేంద్ర జల సంఘానికి, కేంద్ర విద్యుత్ అథారిటీకి అయినా తెలిపిందా, వారి నుంచి సూత్రప్రాయమైన అనుమతులైనా ఉన్నాయా అన్న విషయం తెలియరాలేదని కమిటీ పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ప్రొక్లైన్లు, టిప్పర్లు కనిపించాయని, పనులు చురుగ్గా జరుగుతున్నట్లు తెలిపింది.