పీసీ ఘోష్ కమిషన్‌కు వి.ప్రకాశ్ వివరణ
వెదిరె శ్రీరామ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాంకేతికంగా సాధ్యం కాదని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తుమ్మిడిహెట్టి కోణంలో కాకుండా మూడు తరాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేశారనే కోణంలో నిర్వహించాలని కోరారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట శనివారం ఆయన స్వచ్ఛందంగా హాజరై తన వాదనలను వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ కడితే 5 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోవచ్చని, అయితే మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుతో కట్టడానికి మాత్రమే అంగీకారం తెలపడంతో 1.8 టీఎంసీలకు మించి నిల్వ చేసుకోవడానికి వీలు ఉండదని ప్రకాశ్ చెప్పారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో ఎగువ రాష్ట్రాలు వాడుకోని 63 టీఎంసీలూ ఉన్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ కమిషన్‌ను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు.
‘వీ’ఆకృతిలో బరాజ్ ఎక్కడా లేదు
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తే వార్దా–వెన్‌గంగా నదులు కలిసే చోట ‘వీ’ఆకృతిలో బరాజ్ వస్తుందని, ప్రపంచంలో ఎక్కడా ‘వీ’ఆకృతిలో బరాజ్ లేదని స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాంతం ఉందని, రూ.7,500 కోట్లు వెచ్చించినా తుమ్మిడిహెట్టితో ఆశించిన ప్రయోజనం ఉండదని చెప్పారు.
నిజాం హయాంలో తెలంగాణ ప్రాంతంలో 9 ప్రాజెక్టులు ప్రతిపాదించగా, అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి చొరవతో అందులో సాగర్, శ్రీరాంసాగర్‌లను మాత్రమే నిర్మాణం చేపట్టారని, అవి కూడా అసంపూర్తిగా కట్టారని తెలిపారు. 57 ఏళ్లలో తెలంగాణ నాశనం అయిందని, ఈ కారణంగానే జలయజ్ఞం ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టినట్టు వివరించారు. కాగా బరాజ్ కుంగడానికి కారణాలను తెలుపుతూ ఈ నెల 26లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించగా 28న సాక్ష్యాధారాలతో సహా నివేదిక ఇస్తానని ప్రకాశ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment