Prakash Rao
-
అవి ఇంజనీర్లకు వదిలేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలతో మీకు సంబంధం లేదు. వాటిని ఇంజనీర్లకు వదిలేయండి..’అంటూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వ్యాఖ్యానించింది. ‘మేడిగడ్డ బరాజ్‌లో కుంగిపోయిన 7వ బ్లాక్‌కు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలి. అది సాధ్యం కూడా..’అని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఐడీసీ) మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత వి.ప్రకాశ్‌రావు చెబుతుండగా.. జస్టిస్ ఘోష్ ఆయ న్ను మధ్యలోనే అడ్డుకున్నారు. ‘అంతే చాలు..టెక్నికల్ అంశాలతో మీకు సంబంధం లేదు..’అని అన్నారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై కమిషన్ విచారణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు గత ప్రభుత్వం తరఫున ప్రకాశ్‌రావు ‘సాక్షి’గా హాజరై సమాధానాలిచ్చారు. రాజకీయాలు చేయొద్దు తుమ్మిడిహెట్టి నుంచి బరాజ్ నిర్మాణాన్ని మేడిగడ్డకు ఎందుకు తరలించారు? అని కమిషన్ప్రశ్నించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా..‘రికార్డుల్లో ఏం ఉందో అదే అంతిమం. దానిని ఎవరూ మార్చలేరు..’అని కమిషన్ స్పష్టం చేసింది. ప్రజల సాగునీటి డిమాండ్లను నెరవేర్చడానికి 200 టీఎంసీలు అవసరం కాగా, తుమ్మిడిహెట్టి వద్ద తగిన నీటి లభ్యత లేకపోవడంతోనే బరాజ్‌ను తరలించాల్సి వచ్చిందని ఆ తర్వాత ప్రకాశ్ వివరణ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 165 టీఎంసీల జలాల లభ్యతే ఉందని కేంద్ర జలసంఘం పేర్కొందని, అందులోనూ ఇతర రాష్ట్రాల వాటా 63 టీఎంసీలు పోగా తెలంగాణకు 102 టీఎంసీలే మిగులుతాయని చెప్పారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలు పలు జలాశయాలను నిర్మించి నీటిని తరలించుకుంటుండడంతో గత 50 ఏళ్లుగా తెలంగాణకు వచ్చే ప్రవాహాలు తగ్గిపోయాయన్నారు. సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని ప్రకాశ్‌రావు చెప్పగా.. రాజకీయాలు చేయవద్దని, ఉద్యమంతో తమకు ఏం సంబంధం అంటూ కమిషన్ అభ్యంతరం తెలిపింది. రిటైర్డు ఇంజనీర్లు వద్దన్నా .. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌తో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించడమే ఉత్తమమని, దీనిని ఎలాగైనా సాధ్యం చేయాలని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 2015 ఏప్రిల్‌లో సిఫారసు చేసిన విషయాన్ని కమిషన్ గుర్తు చేసింది.ప్రతిపాదిత మేడిగడ్డ బరాజ్ అనవసరమని, అధిక వ్యయంతో కూడినది కావడంతో పాటు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందని కమిటీ చెప్పిందని తెలిపింది. దీనిపై ప్రకాశ్‌రావు మాట్లాడేందుకు ప్రయత్నించగా, టీఎస్ఐడీసీ చైర్మన్‌గా నాటికి మీరు నియామకం కానందున మీ సమాధా నం అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. నీటి లభ్యత లేకపోవడంతో పాటు ముంపును తగ్గించడం కోసం తుమ్మిడిహెట్టికి బదులుగా వెన్‌గంగా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో వార్ధా బరాజ్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. -
కూతురు సాయంతో భర్తను చంపేసింది
సిరిసిల్ల క్రైం: మద్యానికి బానిసైన ఇంటిపెద్ద, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి.. ఇంట్లోవారిని కొట్టడం, దుర్భాషలాడటంతో భరించలేకపోయిన భార్య, కూతురు కలిసి అతన్ని పాశవికంగా హత్య చేశారు. సిరిసిల్లలో వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్‌కు చెందిన లేచర్ల ప్రకాశ్‌రావు (44) జల్సాలకు అలవాటు పడటంతోపాటు, ఇంట్లో వారిపై తరచూ భౌతిక దాడులకు దిగేవాడు. వేధింపులు తాళలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని, ఇందుకు చంపడమే మార్గమని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 1న రాత్రి ప్రకాశ్‌రావు మెడపై కూరగాయలు కోసే కత్తితో భార్య దాడి చేయగా, కూతురు తండ్రి ముఖం మీద దిండుతో ఒత్తిపట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలంకావడంతో మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఆలోచనతో ఇంట్లోనే గుంత తవ్వి పాతిపెడదామనుకున్నారు. కానీ అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి బయటకు విషయం తెలుస్తుందని భావించారు. తదుపరి పెట్రోలు పోసి కాల్చేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న ఈనెల 3న తన తమ్ముడితో మరింత పెట్రోలు తెప్పించి శవానికి నిప్పటించారు. మంటలు ఎగిసిపడడంతో బయటకు తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆరి్పవేశారు. ఇలా కుదరదని నిర్ణయించుకుని ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహన సంస్కారాలు చేయాలని ప్రణాళిక చేశారు. దీనిలో భాగంగా ఈనెల 4న నిందితురాలు తన చిన్నాన్నను వేకువజామున పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈక్రమంలో ప్రకాశ్‌రావు నిద్రలో చనిపోయినట్లు కథ సృష్టించి దహనసంస్కారాలు చేసేందుకు దగ్గరి బంధువులకు సమాచారం అందించారు. చివరిచూపునకు కొద్ది మంది బంధువులు రాగానే హుటాహుటిన విద్యానగర్‌లోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఇలా వెలుగులోకి.. ప్రకాశ్‌రావు నిద్రలో మృతిచెందాడని బంధువులకు సమాచారం ఇచ్చిన నిందితులు, బంధువులందరూ వచ్చే వరకు ఎదురుచూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మృతుడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. దీంతో ప్రకాశ్‌రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన టౌన్ సీఐ ఉపేందర్ హత్య ఉదంతాన్ని ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని రిమాండ్‌కు తరలించగా, హత్యకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ప్రకాశ్‌రావు (ఫైల్) -
MRPS: సభలో ప్రసంగిస్తూ ఎమ్మార్పీఎస్ నేత మృతి
చోడవరం: మాదిగ రిజర్వేషన్ పోరాట మితి (ఎమ్మార్పీఎస్) పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాశరావు గుండెపోటుకు గురై మరణించారు. విశాఖ జిల్లా చోడవరం అంబేద్కర్ భవనంలో శనివారం రాత్రి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సభ నిర్వహించారు. దీనికి హాజరైన ప్రకాశరావు ప్రసంగిస్తూ సభావేదికపై కుప్పకూలిపోయారు. నాయకులు, కార్యకర్తలు అతనిని అంబులెన్స్‌లో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం కంచరపాలేనికి తరలించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని లోబరచుకుని..) -
స్నేహం విలువ!
‘‘మీకందరికీ శుభవార్త. కొన్ని రోజుల కిందట మన కుందేలును చంపిన ఆ సింహానికి తగిన శాస్తి జరిగింది. ఆవును చంపి తింటున్నప్పుడు ఒక పెద్ద ఎముక నోటిలో గుచ్చుకొంది. తన కాళ్లతో తీయలేక చాలా ఇబ్బంది పడుతోంది. చూస్తుంటే అలాగే చనిపోయేలా ఉంది’’ గట్టిగా అంటూ ఆ చిట్టి కుందేలు సంతోషంతో అటూ ఇటూ పరుగెత్తసాగింది. ‘‘అయ్యో పాపం’’ అంది వయసు మళ్లిన కుందేలు. ‘‘ఏమిటి జాలి చూపిస్తున్నావు’’. ‘‘ఆపదలో ఉన్న జంతువుకు సహాయం చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది’’ ‘‘మార్పు రావడం కాదు నిన్ను మింగుతుంది’’ కోపంగా అంది మరో కుందేలు. ‘‘ఆ సింహాన్ని కాపాడి, ఆ సింహంతో స్నేహం చేసుకొని స్నేహం విలువలను మీకు చూపిస్తాను’’ అంటూ వెళ్ళింది వయసు మళ్లిన కుందేలు. బాధతో మూలుగుతున్న ఆ సింహంవైపు చూస్తూ ‘‘సింహం మిత్రమా, నిన్ను కాపాడాలంటే నీ నోటిలో దూరి ఎముక తీయాలి. ఆ తరువాత నన్ను చంపి తినవుగా...’’ అంది కుందేలు. కన్నీళ్ళతో లేదన్నట్టుగా తల ఆడించింది. కుందేలు సింహం నోటిలోనికి వెళ్లి ఆ ఎముకను తీసి ఒక్కసారిగా బయటకు దుమికి చెట్టు పైకి ఎక్కింది. ‘‘కుందేలు మిత్రమా ఎందుకు భయపడతావు. నా ప్రాణాన్ని కాపాడిన నీకు నేను ఆపద కలిగించితే మా సింహం జాతికే అవమానం. ఇక మీదట నీవు నా ప్రాణ స్నేహితుడివి నీవేమి చెప్పినా చేస్తాను’’ అంది సింహం. ‘‘నేను నిన్ను కాపాడటానికి వెళ్తుంటే మా కుందేళ్లు అన్నీ కోపడ్డాయి.’’ ‘‘ఎందుకు కోప్పడ్డాయి. నేను ఇంత వరకు కుందేలును వేటాడలేదు’’ ‘‘కుందేలును వేటాడలేదా?’’ అనుమానంగా అడిగింది కుందేలు. ‘‘తెలివైన కుందేలు వల్ల మా తాత బావిలో దూకి చనిపోయాడంట. ‘కుందేళ్లు చాలా తెలివైనవి. వాటిని మాత్రం వేటాడవద్దు. వాటితో స్నేహంగా ఉండు’ అని మా అమ్మ చెప్పింది. మా అమ్మకిచ్చిన మాట ప్రకారం కుందేలును వేటాడటం మానుకున్నాను. కానీ కుందేళ్లు నాతో స్నేçహానికి ముందుకు రాలేదు’’ ‘‘మిత్రమా, నీవు అప్పుడప్పుడు మా కుందేళ్ళను చంపి తింటున్నందుకు అందరూ నీపైన కోపంగా ఉన్నారు.’’ ‘‘కుందేలు మిత్రమా అప్పుడప్పుడు నాకు ఆ నక్క కుందేలు మాంసం తెచ్చిస్తుంది. ఇంతవరకు నేను ఒక్కటీ వేటాడలేదు. ఒట్టు’’ అంది ‘‘మా కుందేళ్లతో నీవు చంపినట్లు నక్క చెప్పింది.’’ ‘‘ఈ సాయంత్రం వస్తే అడుగుతాను’’ అంది సింహం. సాయంత్రం నక్క రాగానే అక్కడున్న జింక మాంసం చూసి లొట్టలేసింది. ‘‘ఏంటి నక్కా, జింక మాంసం ఏమీ రుచిగా లేదు. నీవు తెచ్చే కుందేలు మాంసం చాలా బాగుంది. దొరికితే తీసుకునిరా. కావాలంటే ఈ మాంసం అంతా నీవు తీసుకో’’ అంది సింహం. ‘‘ఎలాగైనా తీసుకొని వస్తాను’’ అంటూ జింక మాంసం తినడానికి వెళ్తున్న సమయాన చెట్టు చాటున ఉండి జరిగిందంతా విన్న కుందేళ్ల గుంపు ఒక్కసారిగా బయటకు వచ్చి సింహం ముందు నిలబడగానే, నక్కకు తాను ఆడిన నాటకం తెలిసిపోయిందనుకొంది. ‘‘సింహం గారూ! నన్ను క్షమించండి. కుందేలును నేను చంపినా వీళ్లతో నీవు చంపినట్లు చెప్పాను. అప్పుడే మీరు చంపిన పెద్ద జంతువుల మాంసాన్ని నాకు ఇస్తారన్న ఆశతో అలా చేశాను’’ అంది. సింహం కోపంతో ఆ నక్కను ఒక్క దెబ్బతో చంపింది. కుందేళ్లు అన్నీ ఆ సింహంతో స్నేహితులుగా కలిసి పోయాయి. సింహంలాంటి స్నేహితుడు అండగా ఉండటం వల్ల కుందేళ్ళకు అడవిలోని జంతువుల వల్ల ఎటువంటి ఆపద కలుగలేదు. సింహం కుందేళ్ళ స్నేహాన్ని చూసిన జంతువులు స్నేహానికి ఎల్లలు లేవన్న నిజాన్ని గ్రహించాయి. -
వరంగల్ మేయర్‌గా ప్రకాశ్‌రావు
సాక్షి, వరంగల్ అర్బన్: వరంగల్ నగర మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు ప్రకాశ్‌రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకాశ్‌రావును అభినందించారు. అనంతరం ప్రకాశ్‌రావు మాట్లాడుతూ.. తన అభ్యర్థిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ, హృదయ్ పథకం ద్వారా వస్తున్న నిధులతో పాటు, కేసీఆర్ ప్రత్యేకంగా ఇస్తున్నబడ్జెట్‌తో వరంగల్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. నగరాన్ని టూరిజం హబ్‌గా మార్చడం కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. వరంగల్ నగర మేయర్ స్థానాన్ని దక్కించుకోవడాని కొద్ది నెలలుగా ఆశావహులు అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచన మేరకు అందరు ఐక్యతారాగం వినిపించారు. ఎవరిని మేయర్‌గా ఎంపిక చేసినా కట్టుబడి ఉంటామని తెలుపుతూ.. ఆ బాధ్యతను పార్టీ అధినేత కేసీఆర్ అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో మేయర్ ఎన్నిక నేడు సాఫీగా సాగింది. కాగా, ప్రకాశ్‌రావు 26వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రకాశ్‌రావు పార్టీ లో కొనసాగుతున్నారు. ప్రముఖ వ్యాపార వేత్త, భవితశ్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయిన ప్రకాశ్‌రావు బీఎస్సీ వరకు చదువుకున్నారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా నగరపాలక సంస్థ కార్పరేటర్‌గా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండు సార్లు పనిచేశారు. -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కౌలాలంపూర్ : మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మలేషియా కౌలాలంపూర్‌లోని పీపీపీఎమ్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు భారీగా తరలి వచ్చారు. సాంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరమళ్ళ ప్రకాష్ రావు, ఇండియన్ కౌన్సిలర్ అఫ్ మలేషియా నిషిత్ కుమార్ ఉజ్వల్‌తోపాటూ పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదినం కావున భారత ప్రభుత్వం వారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పొడుగునా గాంధీ జన్మదిన వేడుకల్ని జరపాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్, ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సంయుక్తంగా గాంధీపైన వీడియో ప్రెజెంటేషన్, పిల్లలకు వ్యాస పోటీలు, క్విజ్‌లలో పాల్గొన్న వారికి, విజేతలకు బహుమతులను అందజేశారు. లక్కీ డ్రా విజేతలకు, అందంగా అలంకరించిన బతుకమ్మలను ఎంపిక చేసి ముఖ్య అతిథు చేతుల మీదుగా 6 గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ, తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ మొట్టమొదట మలేసియా వచ్చినపుడు ఏర్పాటు చేసిన మొదటి సమావేశం తరువాత మొదటి బతుకమ్మ వేడుకలతో మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ఈ సంబరాలను ప్రతి ఏటా ఘనంగానిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అభినందించారు. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ మలేషియా తెలంగాణ అసోసియేషన్ ప్రారంభం కావడానికి కృషిచేసిన వ్యక్తి ప్రకాష్ అని అన్నారు. ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు తెలుగు వారు ఉండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన స్పేస్ విజన్ గ్రూప్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కో స్పాన్సర్స్ జాస్ బెలూన్ అండ్ డెకొరేటర్స్, సంక్రాంతి ఇండియన్ క్యూసిన్, ప్రబలీ రెస్టారెంట్, మై 81రెస్టారెంట్, తడ్కా, ఎమ్టీఆర్ స్పైసెస్‌లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మసంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు. మలేషియా తెలంగాణ అసోసియేషన్ 2018-2020 కి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నికయింది. బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రకాష్ రావు ప్రకటించారు. నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు ప్రెసిడెంట్ - సైదం తిరుపతి డిప్యూటీ ప్రెసిడెంట్ - చొప్పరి సత్య వైస్ ప్రెసిడెంట్ - బూరెడ్డి మోహన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ - నరేంద్రనాథ్ జనరల్ సెక్రటరీ - రవి చంద్ర జాయింట్ సెక్రటరీ - సందీప్ ట్రేసరర్- మారుతీ జాయింట్ ట్రేసరర్ - రవీందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ -రవి వర్మ,కృష్ణ వర్మ,కిరణ్ గాజంగి,హరి ప్రసాద్,వివేక్,రాములు,సుందర్,కృష్ణ రెడ్డి ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ - కిరణ్మయి వైస్ ప్రెసిడెంట్ - స్వప్న వైస్ ప్రెసిడెంట్ - అశ్విత యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ - కార్తీక్ యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్ యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ కల్చరల్ వింగ్ మెంబర్స్ -విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్ , రంజిత్ , సంతోష్ , ఓం ప్రకాష్, అనూష ,దివ్య , సాహితి , సాయిచరని, ఇందు. మైగ్రంట్ వింగ్ మెంబర్స్ -ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ -
పొలిటికల్ బదిలీలు
► రూరల్ జిల్లాలో పోలీస్ బదిలీలు ప్రారంభం ► ఆరుగురు ఎస్సైలకు స్థాన చలనం ► భారీగా చేతులు మారిన వైనం ► ఆరోపణలు ఉన్న ఎస్సైలకు అధిక ప్రాధాన్యం ► యువనేత జోక్యంతో బదిలీలు సాక్షి, గుంటూరు : జిల్లాలో పొలిటికల్ బదిలీలు మొదలయ్యాయి. రాజకీయ సిఫార్సు, డబ్బే కొలమానంగా రూరల్ పోలీసు జిల్లాలో బదిలీలకు తెర లేచింది. మరికొద్ది రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరగనున్న నేపథ్యంలో కింది స్థాయి బదిలీలు అధిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో అధికారుల అండగానే బదిలీల ప్రక్రియ అంతా పూర్తి చేసే కసరత్తు నడుస్తోంది. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఎస్సైల బదిలీలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో రాజకీయ సిఫార్సులతో బదిలీలు కొనసాగుతుండటం గమనార్హం. మార్పు రెండు నియోజకవర్గాల్లోనే... రూరల్ జిల్లాలో ఆరుగురు సీఐలకు బదిలీలు జరిగాయి. అదీ నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని సీఐలు. కేవలం బదిలీ పేరుతో పక్క నియోజకవర్గానికి పంపారు. సత్తెనపల్లిలోని ఎస్సైలను నరసరావుపేటకు, నరసరావుపేటలోని ఎస్సైలను సత్తెనపల్లి నియోజకవర్గానికి బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్తెనపల్లి అర్బన్‌కి ఇద్దరు ఎస్సైలు ఉండగా ప్రకాష్‌రావును రొంపిచర్లకు, భుజంగరావును ముప్పాళ్ళకు, ముప్పాళ్ళ ఎస్సై శ్రీహరిని సత్తెనపల్లికి, రాజుపాలెం ఎస్సైగా ఉన్న అనిల్‌కుమార్‌ను నకరికల్లుకు, నకరికల్లు ఎస్సైగా ఉన్న రమేష్‌ను రాజుపాలేనికి, వీఆర్‌లో ఉన్న శివాజిని సత్తెనపల్లి టౌన్‌కు బదిలీ చేశారు. మొదటి విడతగా ఈ బదిలీలు జరిగాయి. మరో వారం రోజుల వ్యవధిలో మరో పది మంది ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సీఐల బదిలీలు జరిగే అవకాశం ఉంది. రెండేళ్ళ కాలపరిమితి పూర్తయిన వారికి బదిలీలు అనివార్యం కావడంతో అధికార పార్టీ యువనేత ముందస్తు చర్యల్లో భాగంగా తమ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సైల స్టేషన్లు మార్చారు. అయితే బదిలీ అయిన వారిలో పలువురు ఎస్సైలపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నవారికి మళ్లీ కీలక ప్రాధాన్యం ఉన్న స్టేషన్లను కట్టబెట్టడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలున్నా.. పోస్టింగ్‌లో ప్రాధాన్యం.. ఏసీబీ నుంచి తప్పించుకుని బదిలీ అయిన వారిలో ముగ్గురిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తూ ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న ఓ ఎస్సై గతంలో ఏసీబీ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఏసీబీ అధికారులు పూర్తి సమాచారంతో దాడి చేయడానికి వస్తే అక్కడి నుంచి ఎవరికీ చిక్కకుండా పరారయ్యాడు. తదనంతరం తనకున్న అధికార పార్టీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏసీబీ కేసు లేకుండా చేసుకున్నాడు. ఈ క్రమంలో గతనెలలో రొంపిచర్ల ఎస్సైపై ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. ఈ క్రమంలో సదరు ఎస్సై పేరు కూడా ఏసీబీ జాబితాలో ఉండటంతో ఉన్నతాధికారులు అతన్ని వారం రోజులు సెలవుపై పంపి బదిలీల్లో భాగంగా పక్క మండలానికి బదిలీ చేశారు. ఈ బదిలీలన్నింటా రాజకీయ సిఫార్సుతో పాటు, లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మరో ఎస్సైదీ ఇదే తరహా. సదరు ఎస్సై తాడికొండ నియోజకవర్గంలో ఓ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకున్నాడని వీఆర్‌కు పంపారు. ఆ తరువాత రాజకీయ పరపతితో నరసరావుపేటలో పోస్టింగ్ దక్కించుకున్నాడు. అక్కడ కూడా సివిల్ వివాదంలో తలదూర్చాడనే కారణంతో మళ్లీ వీఆర్‌కు పంపారు. ఆ తరువాత కీలక స్టేషన్ దక్కించుకుని యువనేత అండదండలతో, ఆర్థిక సహకారంతో మళ్లీ కీలక ప్రాధాన్యం ఉన్న స్టేషన్‌ను బదిలీల్లో దక్కించుకున్నాడు. మరో ఇద్దరు ఎస్సైలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో ఎస్సై పూర్తి స్థాయిలో వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టి వేధించి యువనేత మెప్పు పొంది మంచి స్టేషన్ దక్కించుకోవడం గమనార్హం. -
నీటివనరులపై పట్టున్న వ్యక్తి ప్రకాశ్
మంత్రి హరీశ్‌రావు కితాబు ⇒ రాష్ట్ర నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాశ్‌రావుకు టీటా ఘన సన్మానం ⇒ తెలంగాణ ఉద్యమంలో ప్రకాశ్ పాత్రను కొనియాడిన వక్తలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి వన రుల గురించి సమగ్ర పట్టున్న వ్యక్తి వి. ప్రకాశ్‌రావు అని రాష్ట్ర నీటిపారుదల, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి టి. హరీశ్ రావు కొనియాడారు. తెలంగాణ ఐటీ అసోసియేషన్ (టీఐటీఏ) ఆధ్వ ర్యంలో శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ రావుకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ నీటివనరుల గురించి ఉద్యమ సమయంలో ప్రకాశ్‌రావు విశ్లేషించిన అంశాలు తమకు ఎంతో సమాచారాన్ని అందించాయన్నారు. మ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల జలదోపిడీ గుట్టు విప్పి విడమరచి చెప్పార న్నారు. సీఎం కేసీఆర్ స్వప్నమైన కోటి ఎకరాలకు సాగునీరు సాకారానికి ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో జలవనరుల అభివృద్ధి సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. స్పీకర్ మధుసూదనా చారి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ శిష్యులుగా ప్రకాశ్‌రావుతో కలసి తాను తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుకు నడిచానని, తెలంగాణ సాధనలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని ప్రశంసించారు. టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాలా మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ సాధనలో ప్రకాశ్ రావు క్రియాకీల పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ప్రకాశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలని, స్వయం సమృద్ధిగల రాష్ట్రంగా ఎదగాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ కలలుగంటున్న కోటి ఎకరాల సాగుభూమిని ఆచరణాత్మకంగా చూపడంలో కీలక భాగస్వామినవుతానన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు సాగుభూమి 25 వేల ఎకరాలే ఉండేదన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా తెలంగాణలోని సాగుభూమి విస్తీర్ణం పెద్ద ఎత్తున పెరిగిందని ఆయన విశ్లేషించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రావును టీటా సభ్యులతోపాటు పలువురు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, అసెంబ్లీ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సి.లక్ష్మారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, బుర్రా నర్సయ్యగౌడ్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్, సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి, సీఎం సీపీఆర్వో జ్వాలా నరసింహారావు పాల్గొన్నారు. -
ఆ ఛాయ్ వాలా ఓ చదువుల తండ్రి
కటక్: లక్ష్యమంటేనే ఎక్కాలనిపించే ఎవరెస్టు.. శిఖరాన్ని అధిరోహించడం ఎంత సరదానో లక్ష్యం కోసం పనిచేయడం కూడా అంతే సరదాగా ఉంటుంది. కష్టాన్ని దూరం చేసే ఇష్టం అందులో ఇమిడి ఉంటుంది. అలాంటి లక్ష్యంకోసం ఎవరైనా కృషిచేయొచ్చని, విజయం సాధించి ఆ ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చని నిరూపించాడు ప్రకాశ్ రావు అనే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి. ఆయన ఓ చాయ్ వాలా.. నిరక్షరాస్యుడు. అయితేనేం.. అక్షరాస్యుడు కూడా ఒక్కోసారి చేయలేని సాహసం. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 70మందికిపైగా మురికివాడల్లో నివసించే చిన్నారులను దత్తత తీసుకున్నాడు. తను చాయ్ అమ్మగా వచ్చిన కొద్ది సొమ్ముతో వారికి తన శక్తిమేర అక్షరాభ్యాసం నుంచి మూడో తరగతి వరకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాడు. అతడి సేవలను గుర్తించి ఇదే నెలలో మానవహక్కుల దినోత్సవం రోజు(డిసెంబర్ 10న) ఒడిశా మానవ హక్కుల కమిషన్ ఆయనకు సన్మానం కూడా చేసింది. తన తండ్రి చదువుకోవాలని ఏనాడు చెప్పలేదని, ఫలితంగా తాను 1976 నుంచి చాయ్ అమ్మే వృత్తిలో కొనసాగుతున్నానని ప్రకాశ్ రావు తెలిపాడు. -
హాహా‘కారం’ కనిపించలేదా?
హుద్‌హుద్ తుపాను బాధితులకు అందని సాయం సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను నాలుగు జిల్లాల్లో విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. దేశమంతా అయ్యో పాపం అనుకుంది. కేంద్రమూ సాయం ప్రకటిం చింది. వెల్లువలా వచ్చిన విరాళాలతో సీఎం సహాయ నిధి నిండిపోయింది. కానీ బాధితులకు అందిన సాయం నామమాత్రమేననటానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి. విశాఖలో హుద్‌హుద్ తుపాను బాధితులకు కారప్పొడి పంపిణీ చేసేం దుకు 942 మెట్రిక్ టన్నులు తీసుకురాగా 687 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. 255 మెట్రిక్ టన్నులు కారప్పొడి మర్రిపాలెంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్లో ముక్కిపోయింది. ఈ కారం పాడైపోయి వాడకానికి పనికిరాదని తేలింది. దీనిపై పౌరసరఫరాల శాఖ డిపో మేనేజర్ ప్రకాశరావును వివరణ కోరగా కారం నిల్వలపై ప్రభుత్వానికి లేక రాశామని, సమాధానం రాగానే పంపిణీ చేయడం లేదా వెనక్కు తిరిగి పంపించడం చేస్తామని బదులిచ్చారు. అక్టోబర్ 12న తుపాను వస్తే నిత్యావసరాలు నాలుగైదు రోజుల్లోనే దాతల సాయంతో జిల్లాకు తరలివచ్చాయి. రెండు నెలలు గడిచిపోయినా వాటిని పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా గోదాములో వదిలేయటంతో ఈ దుస్థితి దాపురించింది. -
ప్రయత్నం ప్రకాశించింది!
ప్రభుత్వం తన విధికి ఆమడ దూరంలో నిలిచిన చోట కొంతమంది వ్యక్తులు బాధ్యతలను తీసుకొంటుంటారు. తమదైన శైలిలో వాటిని నిర్వర్తిస్తుంటారు. కటక్‌కు చెందిన ప్రకాశ్‌రావు కూడా ఇలాంటివారే. కటక్‌లోని ఒక మురికివాడను ఈయన సంస్కరిస్తున్న విధానం అభినందనీయం. కటక్‌లోని బక్సీబజార్ అసాంఘిక శక్తులకు ఆటపట్టులాంటిది. ఇక్కడ ఉండే వారిలో ఎక్కువమంది తాగుబోతులు, మత్తుపదార్థాలకు బానిసలుగా మారినవారే! అక్కడ యువత వక్రమార్గంలో నడుస్తుంటాన్ని గమనించి.. వారిని మొక్కగా ఉండగానే సరిచేయాల్సిందన్న విషయాన్ని గ్రహించి... రేపటి పౌరులైన బాలలపై దృష్టిపెట్టారు ప్రకాశ్‌రావు. మరి వారిని స్కూల్లో చేర్పిద్దామంటే తల్లిదండ్రుల సహకారం, దగ్గర్లో స్కూలు రెండూ లేవు. దీంతో తనే స్వయంగా ఒక స్కూల్‌ను ఏర్పాటు చేశారీయన. 2002లో ‘ఆశా ఆశావర’ అనే స్కూల్‌ను స్థాపించారు. రెండు గదులున్న తన ఇంటిలో ఒక గదిలో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. స్థానికంగా ఒక టీస్టాల్ నడిపే ప్రకాశ్‌రావు ప్రయత్నానికి మొదట్లో నలుగురు పిల్లలు కలిసి వచ్చారు. కొద్దికాలంలోనే మరో 25 మంది పిల్లలు తోడయ్యారు. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పాఠశాలను నడపడానికి నిధుల అవసరం పెరిగింది. ఆ సమయంలో ప్రకాశ్‌రావు తన టీ స్టాల్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని స్కూల్ కోసమే వెచ్చించేవారట. దీంతో ఈయన ప్రయత్నానికి మంచి గుర్తింపు వచ్చింది. స్థానికంగా ఉండే ఒక ట్రస్ట్ వాళ్లు స్కూల్‌కోసం ఒక బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు ప్రకాశ్‌రావు స్కూల్లోని స్ట్రెంగ్త్ 60 మంది. ప్రస్తుతం నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్‌కు గుర్తింపును ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ కింద ప్రకాశ్‌రావు స్కూల్‌కు ప్రభుత్వం తరఫున ఫండ్స్ ఇస్తున్నారు. ఈ పాఠశాల స్లమ్‌లో చాలా మార్పులు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆ మురికివాడలో వక్రమార్గంలో నడిచే పిల్లల కన్నా... బడి బాట పట్టిన పిల్లలే ఎక్కువమంది ఉన్నారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిరుదివ్వెను వెలిగించడం మిన్న అన్న మహాకవి మాటలను ప్రకాశ్రావులా అందరూ ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సామాజిక అభివృద్ధి.