ఆ ఛాయ్ వాలా ఓ చదువుల తండ్రి
కటక్: లక్ష్యమంటేనే ఎక్కాలనిపించే ఎవరెస్టు.. శిఖరాన్ని అధిరోహించడం ఎంత సరదానో లక్ష్యం కోసం పనిచేయడం కూడా అంతే సరదాగా ఉంటుంది. కష్టాన్ని దూరం చేసే ఇష్టం అందులో ఇమిడి ఉంటుంది. అలాంటి లక్ష్యంకోసం ఎవరైనా కృషిచేయొచ్చని, విజయం సాధించి ఆ ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చని నిరూపించాడు ప్రకాశ్ రావు అనే ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి. ఆయన ఓ చాయ్ వాలా.. నిరక్షరాస్యుడు. అయితేనేం.. అక్షరాస్యుడు కూడా ఒక్కోసారి చేయలేని సాహసం.
ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 70మందికిపైగా మురికివాడల్లో నివసించే చిన్నారులను దత్తత తీసుకున్నాడు. తను చాయ్ అమ్మగా వచ్చిన కొద్ది సొమ్ముతో వారికి తన శక్తిమేర అక్షరాభ్యాసం నుంచి మూడో తరగతి వరకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నాడు. అతడి సేవలను గుర్తించి ఇదే నెలలో మానవహక్కుల దినోత్సవం రోజు(డిసెంబర్ 10న) ఒడిశా మానవ హక్కుల కమిషన్ ఆయనకు సన్మానం కూడా చేసింది. తన తండ్రి చదువుకోవాలని ఏనాడు చెప్పలేదని, ఫలితంగా తాను 1976 నుంచి చాయ్ అమ్మే వృత్తిలో కొనసాగుతున్నానని ప్రకాశ్ రావు తెలిపాడు.