ప్రయత్నం ప్రకాశించింది! | Tea-stall owner Prakash Rao provides free education to slum children | Sakshi
Sakshi News home page

ప్రయత్నం ప్రకాశించింది!

Published Mon, Nov 11 2013 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

ప్రయత్నం ప్రకాశించింది!

ప్రయత్నం ప్రకాశించింది!

ప్రభుత్వం తన విధికి ఆమడ దూరంలో నిలిచిన చోట కొంతమంది వ్యక్తులు బాధ్యతలను తీసుకొంటుంటారు. తమదైన శైలిలో వాటిని నిర్వర్తిస్తుంటారు. కటక్‌కు చెందిన ప్రకాశ్‌రావు కూడా ఇలాంటివారే. కటక్‌లోని ఒక మురికివాడను ఈయన సంస్కరిస్తున్న విధానం అభినందనీయం. కటక్‌లోని బక్సీబజార్ అసాంఘిక శక్తులకు ఆటపట్టులాంటిది. ఇక్కడ ఉండే వారిలో ఎక్కువమంది తాగుబోతులు, మత్తుపదార్థాలకు బానిసలుగా మారినవారే! అక్కడ యువత వక్రమార్గంలో నడుస్తుంటాన్ని గమనించి.. వారిని మొక్కగా ఉండగానే సరిచేయాల్సిందన్న విషయాన్ని గ్రహించి... రేపటి పౌరులైన బాలలపై దృష్టిపెట్టారు ప్రకాశ్‌రావు.

మరి వారిని స్కూల్‌లో చేర్పిద్దామంటే తల్లిదండ్రుల సహకారం, దగ్గర్లో స్కూలు రెండూ లేవు. దీంతో తనే స్వయంగా ఒక స్కూల్‌ను ఏర్పాటు చేశారీయన. 2002లో ‘ఆశా ఆశావర’ అనే స్కూల్‌ను స్థాపించారు. రెండు గదులున్న తన ఇంటిలో ఒక గదిలో చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. స్థానికంగా ఒక టీస్టాల్ నడిపే ప్రకాశ్‌రావు ప్రయత్నానికి మొదట్లో నలుగురు పిల్లలు కలిసి వచ్చారు. కొద్దికాలంలోనే మరో 25 మంది పిల్లలు తోడయ్యారు. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పాఠశాలను నడపడానికి నిధుల అవసరం పెరిగింది.

ఆ సమయంలో ప్రకాశ్‌రావు తన టీ స్టాల్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని స్కూల్ కోసమే వెచ్చించేవారట. దీంతో ఈయన ప్రయత్నానికి మంచి గుర్తింపు వచ్చింది. స్థానికంగా ఉండే ఒక ట్రస్ట్ వాళ్లు స్కూల్‌కోసం ఒక బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు ప్రకాశ్‌రావు స్కూల్‌లోని స్ట్రెంగ్త్ 60 మంది. ప్రస్తుతం నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్‌కు గుర్తింపును ఇచ్చారు. సర్వశిక్ష అభియాన్ కింద ప్రకాశ్‌రావు స్కూల్‌కు ప్రభుత్వం తరఫున ఫండ్స్ ఇస్తున్నారు.
 
ఈ పాఠశాల స్లమ్‌లో చాలా మార్పులు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఆ మురికివాడలో వక్రమార్గంలో నడిచే పిల్లల కన్నా... బడి బాట పట్టిన పిల్లలే ఎక్కువమంది ఉన్నారు.  చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిరుదివ్వెను వెలిగించడం మిన్న అన్న మహాకవి మాటలను ప్రకాశ్‌రావులా అందరూ ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలి. అప్పుడే సామాజిక అభివృద్ధి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement