పొలిటికల్ బదిలీలు
Published Sat, Apr 15 2017 7:23 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
► రూరల్ జిల్లాలో పోలీస్ బదిలీలు ప్రారంభం
► ఆరుగురు ఎస్సైలకు స్థాన చలనం
► భారీగా చేతులు మారిన వైనం
► ఆరోపణలు ఉన్న ఎస్సైలకు అధిక ప్రాధాన్యం
► యువనేత జోక్యంతో బదిలీలు
సాక్షి, గుంటూరు : జిల్లాలో పొలిటికల్ బదిలీలు మొదలయ్యాయి. రాజకీయ సిఫార్సు, డబ్బే కొలమానంగా రూరల్ పోలీసు జిల్లాలో బదిలీలకు తెర లేచింది. మరికొద్ది రోజుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరగనున్న నేపథ్యంలో కింది స్థాయి బదిలీలు అధిక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో అధికారుల అండగానే బదిలీల ప్రక్రియ అంతా పూర్తి చేసే కసరత్తు నడుస్తోంది. ముఖ్యంగా రూరల్ జిల్లాలో ఎస్సైల బదిలీలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో రాజకీయ సిఫార్సులతో బదిలీలు కొనసాగుతుండటం గమనార్హం.
మార్పు రెండు నియోజకవర్గాల్లోనే...
రూరల్ జిల్లాలో ఆరుగురు సీఐలకు బదిలీలు జరిగాయి. అదీ నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని సీఐలు. కేవలం బదిలీ పేరుతో పక్క నియోజకవర్గానికి పంపారు. సత్తెనపల్లిలోని ఎస్సైలను నరసరావుపేటకు, నరసరావుపేటలోని ఎస్సైలను సత్తెనపల్లి నియోజకవర్గానికి బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు.
సత్తెనపల్లి అర్బన్‌కి ఇద్దరు ఎస్సైలు ఉండగా ప్రకాష్‌రావును రొంపిచర్లకు, భుజంగరావును ముప్పాళ్ళకు, ముప్పాళ్ళ ఎస్సై శ్రీహరిని సత్తెనపల్లికి, రాజుపాలెం ఎస్సైగా ఉన్న అనిల్‌కుమార్‌ను నకరికల్లుకు, నకరికల్లు ఎస్సైగా ఉన్న రమేష్‌ను రాజుపాలేనికి, వీఆర్‌లో ఉన్న శివాజిని సత్తెనపల్లి టౌన్‌కు బదిలీ చేశారు. మొదటి విడతగా ఈ బదిలీలు జరిగాయి. మరో వారం రోజుల వ్యవధిలో మరో పది మంది ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సీఐల బదిలీలు జరిగే అవకాశం ఉంది.
రెండేళ్ళ కాలపరిమితి పూర్తయిన వారికి బదిలీలు అనివార్యం కావడంతో అధికార పార్టీ యువనేత ముందస్తు చర్యల్లో భాగంగా తమ నియోజకవర్గాల పరిధిలోని ఎస్సైల స్టేషన్లు మార్చారు. అయితే బదిలీ అయిన వారిలో పలువురు ఎస్సైలపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నవారికి మళ్లీ కీలక ప్రాధాన్యం ఉన్న స్టేషన్‌లను కట్టబెట్టడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
ఆరోపణలున్నా.. పోస్టింగ్‌లో ప్రాధాన్యం..
ఏసీబీ నుంచి తప్పించుకుని బదిలీ అయిన వారిలో ముగ్గురిపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తూ ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న ఓ ఎస్సై గతంలో ఏసీబీ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఏసీబీ అధికారులు పూర్తి సమాచారంతో దాడి చేయడానికి వస్తే అక్కడి నుంచి ఎవరికీ చిక్కకుండా పరారయ్యాడు. తదనంతరం తనకున్న అధికార పార్టీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏసీబీ కేసు లేకుండా చేసుకున్నాడు. ఈ క్రమంలో గతనెలలో రొంపిచర్ల ఎస్సైపై ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.
ఈ క్రమంలో సదరు ఎస్సై పేరు కూడా ఏసీబీ జాబితాలో ఉండటంతో ఉన్నతాధికారులు అతన్ని వారం రోజులు సెలవుపై పంపి బదిలీల్లో భాగంగా పక్క మండలానికి బదిలీ చేశారు. ఈ బదిలీలన్నింటా రాజకీయ సిఫార్సుతో పాటు, లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మరో ఎస్సైదీ ఇదే తరహా. సదరు ఎస్సై తాడికొండ నియోజకవర్గంలో ఓ స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకున్నాడని వీఆర్‌కు పంపారు. ఆ తరువాత రాజకీయ పరపతితో నరసరావుపేటలో పోస్టింగ్ దక్కించుకున్నాడు. అక్కడ కూడా సివిల్ వివాదంలో తలదూర్చాడనే కారణంతో మళ్లీ వీఆర్‌కు పంపారు. ఆ తరువాత కీలక స్టేషన్ దక్కించుకుని యువనేత అండదండలతో, ఆర్థిక సహకారంతో మళ్లీ కీలక ప్రాధాన్యం ఉన్న స్టేషన్‌ను బదిలీల్లో దక్కించుకున్నాడు. మరో ఇద్దరు ఎస్సైలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో ఎస్సై పూర్తి స్థాయిలో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టి వేధించి యువనేత మెప్పు పొంది మంచి స్టేషన్ దక్కించుకోవడం గమనార్హం.
Advertisement