- హుద్‌హుద్ తుపాను బాధితులకు అందని సాయం
సాక్షి, విశాఖపట్నం: హుద్‌హుద్ తుపాను నాలుగు జిల్లాల్లో విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. దేశమంతా అయ్యో పాపం అనుకుంది. కేంద్రమూ సాయం ప్రకటిం చింది. వెల్లువలా వచ్చిన విరాళాలతో సీఎం సహాయ నిధి నిండిపోయింది. కానీ బాధితులకు అందిన సాయం నామమాత్రమేననటానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి.
విశాఖలో హుద్‌హుద్ తుపాను బాధితులకు కారప్పొడి పంపిణీ చేసేం దుకు 942 మెట్రిక్ టన్నులు తీసుకురాగా 687 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు. 255 మెట్రిక్ టన్నులు కారప్పొడి మర్రిపాలెంలోని పౌరసరఫరాల శాఖ గోడౌన్‌లో ముక్కిపోయింది. ఈ కారం పాడైపోయి వాడకానికి పనికిరాదని తేలింది.
దీనిపై పౌరసరఫరాల శాఖ డిపో మేనేజర్ ప్రకాశరావును వివరణ కోరగా కారం నిల్వలపై ప్రభుత్వానికి లేక రాశామని, సమాధానం రాగానే పంపిణీ చేయడం లేదా వెనక్కు తిరిగి పంపించడం చేస్తామని బదులిచ్చారు. అక్టోబర్ 12న తుపాను వస్తే నిత్యావసరాలు నాలుగైదు రోజుల్లోనే దాతల సాయంతో జిల్లాకు తరలివచ్చాయి. రెండు నెలలు గడిచిపోయినా వాటిని పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా గోదాములో వదిలేయటంతో ఈ దుస్థితి దాపురించింది.