దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మల్కన్‌గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు.
మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ పరిధిలోని బయపదర్ ఘాట్ రోడ్డులోని తుంబపదర్ గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్‌గిరి, కోరాపుట్‌లోని లమటాపుట్, నందాపూర్ ప్రాంతా నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. ఉత్తర ఒడిశాలోని గంగా మైదానాల్లో అల్పపీడనం ప్రభావంతో జూలై 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం(నేడు) మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, బోలంగీర్, నువాపాడా, సోన్‌పూర్, ఝర్సుగూడ, సుందర్‌ఘర్, సంబల్‌పూర్, కియోంజర్, అంగుల్, డియోగర్, కలహండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.
ఆదివారం బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. బార్‌గఢ్, జార్సుగూడ, సుందర్‌ఘర్, నుపాడా, నబరంగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment